Monday, October 29, 2018

క్యాన్సర్ వ్యాధి – కనకల్ చికిత్స



దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన. ఎచంకుడి గణేశ అయ్యర్ పరమాచార్య స్వామి వారికి పరమ భక్తుడు.

వారి భార్య కడుపులో క్యాన్సర్ కారణంగా చాలా బాధ పడేవారు. ఆపరేషన్ చేయించుకోవాలని, లేదంటే ఈ వ్యాధితో బ్రతకడం చాలా కష్టం అని చెప్పేవారు వైద్యులు.

గణేశ అయ్యర్ మహాస్వామి వారి దర్శనానికి వచ్చి వారితో తన బాధను విన్నవించుకున్నారు.

మహాస్వామి వారు అతనితో "ఆపరేషన్ చేయవలసిన అవసరం లేదు. తిరుతురైపూంది సమీపములో తిరునెల్లిక్కావల్ అనే రైల్వేస్టేషన్ ఉంది. ఆ స్టేషనులో దిగి అక్కడి నుండి పడమర వైపు ఒక కిలోమీటర్ వెళ్తే ఒక నీటి కాలువ వస్తుంది. ఆ కాలువ ఒడ్డున ఒక పెద్ద చెట్టు ఉంది. దాని పేరు "కనకల్" (తమిళంలో). ఆ చెట్టు ఆకుల యొక్క కాడలను స్వీకరిస్తే కాన్సర్ నయం అవుతుంది” అని చెప్పారు.

పరమాచార్య వారి సలహా ప్రకారం తన భార్య చేత ఆ చెట్టు ఆకుల కాడలు తినిపించారు. ఆశ్చర్యముగా కొన్ని రోజులలో ఆమె పొట్టలో ఉన్న క్యాన్సర్ వ్యాధి తగ్గుముఖం పట్టి, కేవలం కొద్ది రోజులలలోనే పూర్తి ఆరోగ్యవంతురాలు అయ్యింది.

ఎప్పుడూ స్వామి వారిని ధ్యానించే ఆవిడ 80 సంవత్సరాలు పైగా జీవించారు. అంతే కాకుండా మహాస్వామి వారు బృందావన ప్రవేశం ముందు జరిగిన వారి కనకాభిషేకం చూసి ధన్యులు అయ్యారు.

--- శ్రీమఠం బాలు మామ, మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్ 2

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Monday, October 22, 2018

చెన్నై - కంచి




ఒక ఆటోమొబైల్ ఇంజనీర్ తన జీవితంలో జరిగిన అనుభవాన్ని ఇలా పంచుకున్నాడు..

నేను చెన్నైలోని ఒక ప్రైవేటు కంపెనీలో ఆటోమొబైల్ ఇంజనీర్ గా పని చేస్తున్నాను. ఈ సంఘటన 2005లో నేను కుంబకోణం నుండి చెన్నైకు తిరుగుప్రయాణం చేస్తున్నప్పుడు జరిగింది. నేను నా కుటుంబంతో సహా వేసవి సెలవుల కొసం అక్కడికి వెళ్ళాము. మా బంధువుల ఇళ్ళకు వెళ్ళాము మరియు కుంబకోణంలో ఉన్న అన్ని దేవాలయాలను సందర్శించడం కూడా మా ప్రణాళికలో భాగమే.

మా తిరుగు ప్రయాణం కోసం మే 24వ తేది ఉదయం 8 గంటలకు టికెట్స్ బుక్ చేసుకున్నాము. తమిళనాడులో ఉన్న పుణ్యక్షేత్రాలను సందర్శించడం చాలా సంతోషం కలిగించే విషయం. తమిళనాడులో ఆలయ నగరముగా పేరుగాంచిన కుంబకోణంలోని దేవాలయాలు దర్శించడం నా చిరకాల వాంఛ.

మేము కుంబేశ్వర ఆలయం, సారంగపాణి ఆలయం మరియు శ్రీ ఒప్పిలిఅప్పన్ ఆలయాలు దర్శించాము. ఈ యాత్రలో చివరిగా కంచి మఠంను దర్శించటం మా ప్రణాలిక. మఠంలో ఉండగా నేను పొందిన అనుభూతి అనిర్వచనీయమైనది. మేము అక్కడ ఉండగా పరమాచార్య స్వామి వారి గురించి మఠం ధర్మకర్తలతో కొద్దిగా మాట్లాడాము. దాంతో నాకు వారి గురించి తెలుసుకోవాలని ఉత్సాహము మరియు ఆసక్తి కలిగి కొన్ని పుస్తకాలు తీసుకొన్నాను. తిరుగుప్రయాణంలో చదువుటకు నిశ్చయించుకున్నాను.

ఆ రోజు రాత్రి నా కలలో మహాస్వామి వారు స్వప్న దర్శనమిచ్చారు. వారు నాతో "నా వద్దకు రండి" అని చెప్పారు. నేను మధ్యలోనే నిద్రలేచి సమయము చుస్తే ఉదయం 4 గంటలు. ఆ తరువాత నేను నిద్రపోలేదు స్వామి వారు నిద్రలో చెప్పిన దానిగురించే ఆలోచిస్తున్నాను. సుమారు ఉదయం 5:30 అప్పుడు నేను నా పిల్లలను భార్యను నిద్ర లేపి, సామాను సర్దుకొని తయారు అవ్వమన్నాను. ఎనిమిది గంటలకు మా తిరుగు ప్రయాణం కాబట్టి. అందరం అల్పాహారం ముగించుకొని మా అమ్మ, నాన్న మరియు బంధువులందరికి విడ్కోలు పలికి కారులో బస్సు ప్రాంగణానికి బయలుదేరాము.

కారులో కూర్చున్న తరువాత నా భార్యతో, చెన్నైకి వెళ్ళేముందు కంచి వెళ్ళి కామకోటి మఠాన్ని దర్శించాలని ఉంది అని చెప్పాను. మరునిమిషములో మా ప్రణాలికను మార్చుకుని కంచి వెళ్ళాలని నిర్ణయించుకున్నాము. ఉదయం 7:30 ప్రాంతములో టికెట్ కౌంటరుకి వచ్చి కాంచీపురం వెళ్ళడానికి బస్సుల గురించి అడుగగా, 8:30కి ఉంది అని చెప్పారు.

మేము చెన్నైకి పోయే బస్సు టికెట్స్ రద్దు చేసుకోవడం కుదరలేదు. కాంచీపురం బస్సు రావడంతో వెళ్ళి కంచి కామకోటి మఠంను సందర్శించాము. అక్కడకు వెళ్లగానే నా మనస్సుకు ఏదో తెలియని పులకరింతకలిగింది. అక్కడ చాలా ఆహ్లాదంగా ప్రశాంతంగా అనిపించింది. ఒక గంటసేపు అక్కడ ఉండి మేము చెన్నైకి తిరుగు ప్రయాణం అయ్యాము.

మేము ఇంటికి వెళ్ళాక T.V చూస్తే ఒక వార్తవిని చాలా ఆర్చర్యానికి లోనయ్యాము. మేము చెన్నై రావడానికి టికెట్స్ తీసుకున్న బస్సుకి ప్రమాదం జరిగి, దానిలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. ఇది చాలా విషాదకరమైన సంఘటన.

కానీ నాకు ఇప్పటికి అర్థం కాని విషయం “హఠాత్తుగా ఎందుకు మా ప్రణాళిక మార్చుకున్నాము?” అని. ఆనాటినుండి నేను మహాస్వామి వారికి లొంగిపొయాను. నా జీవితాన్ని వారి పాదపద్మముల సేవకు అంకితం చెసాను. ఈరోజు వరకు లేవగానే నేను చేసే మొదటి పని పరమాచార్య స్వామి వారి పాద పద్మములు చూసి నమస్కరించడం.

--- మూలం : స్వస్తిక్ టివి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

https://t.me/paramacharyavaibhavam

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Monday, October 15, 2018

మహాస్వామి - మట్టి వైద్యం



ఒకసారి ఒక భక్తుడు పరమాచార్య స్వామి వద్దకు వచ్చి తన బంధువు ఒకరు ఆసుపత్రిలో కోమాలో ఉన్నాడని, వైద్యులు ఇక ఏమీ చెయ్యలేమని తేల్చేశారని బావురుమన్నాడు. తమ అసలు స్వరూపం ఎంటో తెలియడానికి ఇష్టపడని మహాస్వామి వారు తేనంబాక్కం దేవాలయానికి వెళ్ళమన్నారు.

“తేనంబాక్కం దేవాలయానికి వెళ్లి, విభూతి ప్రసాదాన్ని తీసుకుని మరలా ఇక్కడకు రా” అని ఆదేశించారు. అతను ఆలయానికి వెళ్ళగా, అప్పటికే ఆలయం తలుపులు వేసి ఉండటంతో, విభూది ప్రసాదం ఇవ్వడానికి అర్చకులు ఎవ్వరూ లేకపోవడంతో అతను నిరాశ పడ్డాడు. దిగాలుగా తిరిగొచ్చి నిలబడ్డాడు.

“సరే! చుట్టూ ఉన్న ప్రాకారంలో ఎవరైనా భక్తులు ఉంచిన విభూతి గాని, కుంకుమ గాని తీసుకుని రా” అని చెప్పారు స్వామివారు. ఆ భక్తుడు మరలా దేవాలయానికి వెళ్ళాడు కాని, ప్రకారం మొత్తం చూసినా ఎక్కడా ప్రసాదం కనపడలేదు ఆరోజు. ఇదే ఆశ్చర్యకరమైన విషయం అనుకుంటే, పరమాచార్య స్వామివారు మాకు కలిగించబోయే ఆశ్చర్యం ఇంకా పెద్దది.

ఆ భక్తుడు మరలా తిరిగిరావడంతో, “సరే వదిలేయ్. వెళ్లి ఆ దేవాలయ ప్రాకారం నుండి మట్టిని తీసుకుని రా” అని ఆదేశించారు. అతను మట్టిని తెచ్చి మహాస్వామివారి ముందు ఉంచాడు. ఇప్పుడు స్వామివారి అద్వితీయ శక్తులు బహిర్గతం అయ్యాయి.

శ్రీవారు ఆ మట్టిని దగ్గరకు తీసుకుని, మహిమాన్వితమైన వారి చేతివేళ్ళతో తాకుతూ ఆ మట్టికి మహత్వాన్ని ఇచ్చారు. కొద్దిసేపటి తరువాత దాన్ని బాలు మామకు ఇచ్చి, “వెళ్ళు. వెళ్లి దీన్ని అతనికి (రోగికి) ఇవ్వు” అని ఆదేశించారు.

స్వామివారి ఆదేశానుసారం బాలు మామ ఆసుపత్రికి బయలుదేరారు. కాని ఐసియులో కోమాలో ఉన్న రోగి వద్దకు తనను వదులుతారా, అతని వద్ద ఈ ఇసుకను ఉంచడానికి ఒప్పుకుంటారా అన్న ప్రశ్నలతో ఆసుపత్రికి చేరుకున్నారు. కాని అక్కడకు చేరుకున్న తరువాత ఏ సమస్య లేకుండా లోపలకు వెళ్ళగలిగారు. లోపలి గదిలోకి వెళ్లి ఆ రోగి దగ్గరకు వెళ్ళగానే, ఈ అద్భుతం జరిగింది. లోపలకు వెళ్ళగానే, అతని వద్దకు వెళ్లి అతనికి దగ్గరగా ఆ మట్టిని ఉంచి రావాలని బాలు మామ ఆలోచన. కాని అక్కడ జరిగింది వేరు.

బాలు మామ లోపలికి వెళ్ళగానే, కోమాలో ఉన్న రోగి కొద్దిగా కదలికలను చూపించాడు. పరమాచార్య స్వామివారి ప్రసాదం అడుగుతున్నట్టుగా హఠాత్తుగా చేతులను బయటపెట్టాడు. అ స్థితి చూస్తే అతనే లేచి “అది పరమాచార్య స్వామి ప్రసాదమా? దయచేసి ఇవ్వండి” అని అడుగుతాడేమో అనుకున్నారు బాలు మామ.

బాలు మామకు చాలా ఆశ్చర్యం వేసింది. పరమాచార్య స్వామివారి అనుగ్రహం వల్ల ఇలాంటి అద్భుతాల జరుగుతాయని తనకు తెలుసు కాబట్టి కొద్దిసేపటి తరువాత తేరుకున్నారు. ప్రసాదాన్ని ఇచ్చి తిరిగొచ్చారు. మొత్తం జరిగిన విషయం మహాస్వామివారికి తెలిపారు. తమ శక్తిని తెలపడానికి ఇష్టపడని స్వామివారు, “సరే! మరో రెండు మూడు రోజులు ఆసుపత్రికి వెళ్లి, అతనికి ప్రసాదం ఇచ్చి రా” అని ఆదేశించారు.

స్వామివారి ఆజ్ఞానుసారం బాలు మామ మూడు రోజులపాటు ఆసుపత్రికి వెళ్లి, అతనికి ప్రాసాదం ఇచ్చారు. అక్కడి డాక్టర్లందరూ ఆశ్చర్యానికి లోనయ్యేటట్టుగా, ఆ రోగి కోమా నుండి బయటపడి మామూలు మనిషి అయ్యాడు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

పరమాచార్య స్వామివారి వైభవాన్ని, మహిమలను వర్ణించడం ఎవ్వరి తరమూ కాదు.

--- ‘శ్రీ పెరియవ మహిమై’ పత్రిక నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

https://t.me/paramacharyavaibhavam

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Saturday, October 13, 2018

వినాయకుడు - విరుగుడు



నేను ఒకసారి కంచి మఠం వెళ్ళినప్పుడు ఒక అర్చకులు నాకు ఈ కింది విషయం చెప్పారు.

దాదాపు 45 సంవత్సరాల కిందట పరమాచార్య స్వామి వారు తిరుచిరాపల్లికి దగ్గర్లోని ఒక పల్లెటూరిలో మకాం చేస్తున్నారు. ఒకరోజు వారు చంద్రమౌళీశ్వర పూజకు ఉపక్రమిస్తూ, మఠం మేనేజరుతో “ఇంక కొద్దిసేపట్లో అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయ అర్చకులు ఇక్కడికి వస్తారు. వారికి భోజనాలు పెట్టించి, 2 గంటలకు నా వద్దకు తీసుకుని రా” అని చెప్పారు.

అక్కడే నిలబడి ఉన్న ఒక శిష్యుడితో, “మఠం స్థపతితో చెప్పి రెండు అడుగుల వినాయకుని విగ్రహం తయారు చెయ్యమని చెప్పు” అని ఆజ్ఞాపించారు.

మహాస్వామి వారి ఆజ్ఞ ప్రకారం మేనేజరు అర్చకులను మఠం సంప్రదాయం ప్రకారం స్వాగతించి, మద్యాహ్న సమయం కావడం వల్ల వారికి భోజన సదుపాయం ఏర్పాటు చేసి వారి భోజనం తరువాత స్వామి వారి వద్దకు తీసుకుని వెళ్ళాడు.

పరమాచార్య స్వామి వారు అందరినీ పేరుపేరునా వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ప్రధాన అర్చకులు పరమాచార్యస్వామి వారితో, “పెరియవ రోజూ ఉదయం అర్చకులు ఎవరైతే అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయ గర్భగృహం తలుపులు తీసి లోపలికి వెళ్తున్నారో, ఆ వెళ్ళినవారు వెంటనే కళ్ళు తిరిగి పడిపోతున్నారు. మళ్ళా పది నిముషములు ఉపచారము చేసిన తరువాతనే స్వస్థత పొందుతున్నారు. కావున మిగిలిన అర్చకులు ఎవరూ లోపలికి వెళ్ళడానికి సాహసించడం లేదు” అని తమ బాధను చెప్పుకున్నారు.

వెంటనే మహాస్వామి వారు వారితో, “రేపు నేనే స్వయంగా దేవాలయానికి వస్తాను. నేను వచ్చిన తరువాతనే మీరు ఆలయ తలుపులు తెరవండి” అని చెప్పి వారికి ప్రసాదాన్ని ఇచ్చి పంపించారు.

మరుసటి రోజు తెల్లవారుఝామున 5:30 గంటలకు పరమాచార్య స్వామి వారు అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయానికి వచ్చారు. ఒక అర్చకుడు అమ్మవారి గర్భగృహం తలుపులు తెరిచాడు. వెంటనే కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. పది నిముషముల తరువాత లేచి తన పనులకు వెళ్ళిపోయాడు. అది చూసి మహాస్వామి వారు కొద్దిసేపు ధ్యానంలోకి వెళ్ళారు. తరువాత ఆలయ ప్రధాన అర్చకుణ్ణి పిలిచి, “రేపటినుండి అతణ్ణి గర్భగృహం పక్క ద్వారం నుండి లోపలికి వెళ్ళమని చెప్పండి” అని ఎల్ల వెళ్ళాలో చెప్పి, తలుపులు తీసిన రెండు నిముషముల తరువాత లోపలికి వెళ్ళండి అని చెప్పారు.

సాయంత్రం స్థపతి వినాయకుని విగ్రహం తీసుకుని పరమాచార్య స్వామి వారి వద్దకు వచ్చాడు. స్వామి వారు ఒక మంటప నిర్మాణం చేసి, దాని పైన ఈ వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించమని చెప్పారు. అది ఎలా ఉండాలి అంటే “అమ్మవారి దృష్టి కాంతి, వినాకుడి దృష్టి కాంతి సమాంతరంగా ఒకటికొకటి కలవాలి” అలా నిర్మాణం చెయ్యవలసిందని చెప్పారు. స్వామి వారు చెప్పినట్టుగానే ఆలయంలో వినాయకుణ్ణి వారి అమ్మగారైన అఖిలాండేశ్వరి ఎదురుగా ప్రతిష్టించారు. ఆగమోక్తంగా ప్రతిష్ట పూజలు నిర్వహించారు. అప్పటి నుండి అర్చకులకు కళ్ళుతిరిగి పడిపోవడం జరుగలేదు.

ఇప్పటికీ, అష్టమూర్తి క్షేత్రములలో ఒకటైన, జల లింగ క్షేత్రమైన జంబుకేశ్వరం(తిరువణైకావల్) లోని అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయానికి ఎదురుగా వినాయకుడు ఉంటాడు. తల్లి తొలి చూపు తన తొలి బిడ్దడిపై ప్రసరించేట్టుగా పరమాచార్య స్వామి వారు సుముఖుడైన వినాయకుని ప్రతిష్ట చేయించారు.

[సాక్షాత్ పరమశివ అవతారులైన ఆదిశంకరాచార్యుల వారు, రాబోవు కాలాములలో ప్రజలు అనుష్టానము లేక, తపశ్శక్తి లేక దేవతా మూర్తుల ఎదురుగుండా నిలబడలేరని గ్రహించి, ఎక్కువగా ఉన్న తేజస్సును లెక్కకట్టి దాన్ని శ్రీచక్రంలోకి తీసి అక్కడే శ్రీచక్ర ప్రతిష్ట చేసారు. జంబుకేశ్వరం జల క్షేత్రం కావటం చేత అమ్మవారి సువర్ణ తాటంకాలలో శ్రీచక్రం వేసి అమ్మవారికి ధరింపచేసారు]

--- ఎ. త్యాగరాజన్, చెన్నై - శక్తి వికటన్ ప్రచురణ

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Friday, October 5, 2018

వేద స్వరం - శిక్ష




మహా పెరియవర్ సాక్షాత్ పరమాత్మ స్వరూపులు, శివావతారులు. ఈ శతాబ్ధపు ఆది శంకరాచార్యులు. అప్పుడు స్వామి వారు కుంబకోణంలోని కంచి మఠంలో మకాం చేస్తున్నారు. వ్యాస పూర్ణిమ చాలా ఘనంగా జరిగింది. చంద్రమౌళీశ్వర పూజ పూర్తి అయిన తరువాత భక్తులందరూ పరమాచార్య స్వామి స్వహస్తాలతో ఇచ్చే అభిషేక తీర్థం కోసం ఆత్రుతగా వచ్చారు. వరుసగా నిలబడి వస్తున్న వాళ్ళలో ఒక భక్తుణ్ణి మహాస్వామి వారు తలెత్తి చూసారు.

వారు అతనితో, ”రేపు తెల్లవారుఝామున జరిగే వేదపారాయణానికి రా” అని అన్నారు. మహాస్వామి వారి ఆజ్ఞకి తిరుగేముంది?

స్వామి వారి ఆదేశం మేరకు మరుసటిరోజు ఉదయాన్నే వచ్చి, వేదపారాయణంలో పాల్గొన్నాడు. పారాయణం జరుగుతూ ఉండగా ఆశ్చర్యకరంగా మహాస్వామి వారు వచ్చారు. వారు చాలా అరుదుగా వస్తారు.

నిన్న తాము రమ్మన్న భక్తుడు చాలా శ్రద్ధగా భక్తితో వేదాలను ఆమ్నాయం చెయ్యడం గమనించారు. వేదపారాయణం తరువాత అందరికి తీర్థప్రసాదాలు ఇచ్చు సమయంలో అతన్ని పిలిచి కొద్దిసేపు వేచియుండమన్నారు.

ఆ భక్తుడు భయంతో మనసులో నేను వేదమంత్రాలు సరిగ్గా ఉచ్ఛరింలేదేమో అందుకే మహాస్వామి వారు ఉండమన్నారు అని అనుకున్నాడు. కొద్దిసేపటి తరువాత, మహాస్వామి వారు ఆజ్ఞాపించారు అని ఒక వైద్యుడు వచ్చి, అతన్ని పూర్తిగా పరీక్ష చేసారు. తరువాత అతని వైద్యశాలకు తీసుకుని వెళ్ళీ ఇంకొన్ని పరీక్షలు చేసిన తరువాత ఆ భక్తుడికి హృదయ సంబధమైన జబ్బు ఉందని తెలుసుకున్నారు.

పరమాచార్య స్వామి వారి ఆదేశానుసారం ఆ వైద్యుడు, ఏ శస్తచికిత్స అవసరం లేకుండానే ఆ భక్తుని జబ్బు నివారించాడు.

పది రోజుల తరువాత ఆ భక్తుడు మహాస్వామి వారి దర్శనానికి వచ్చాడు. అతని మనస్సులో ఉన్న ప్రశ్నలకు సమాధానంగా మహాస్వామి వారు అతనితో,



“నువ్వు వేదం చాలా శ్రద్ధతో పఠిస్తున్నావు కాని, మంత్రాలను ఉచ్ఛరిస్తున్నప్పుడు నీకుగల శ్వాస సంబంధమైన రుగ్మత చేత, చాలా ఇబ్బందిగా పలకడం వల్ల అక్కడక్కడ స్వరం తప్పుతున్నది. నేను దాన్ని గుర్తించి బహుశా నీకు ఊపిరితిత్తులు లేక గొంతు సమస్య ఏదో ఉన్నదని గ్రహించి వైద్యుణ్ణి రప్పించాను” అని అన్నారు.

తరువాత “కొద్దిసేపు వేదం పారాయణం చెయ్యి” అని ఆజ్ఞాపించారు.
అతను స్వరం తప్పకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా వేదం చెప్పాడు. మహాస్వామి వారు చాలా సంతోషించి అతణ్ణి ఆశీర్వదించారు.అలా ఆ భక్తుడికి ముందు జరగబోయే ఉపద్రవాన్ని మహాస్వామి వారు తప్పించారు.

ఎప్పుడైతే మనం భక్తితో పరమాత్ముణ్ణి ప్రార్థించి, సేవిస్తామో మనకు రాబోయే బాధలు కష్టాలు మన దరిచేరకనే కరిగిపోతాయి.

--- రా. వెంకటసామి, శక్తి వికటన్ ప్రచురణ

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం