Monday, June 16, 2014

మూడు శేర్ల వినాయకుడు



మనం గణపతి యొక్క అనేక రూపాలని పూజిస్తూ ఉంటాం. లక్ష్మీ గణపతి, మహాగణపతి, సిద్ధి బుద్ధి తో ఉన్న గణపతి, బాల గణపతి ఇలా అనేకానేక రూపాలతో ఉన్న గణపతిని మనం పూజిస్తూ ఉంటాం. మధురైలోని మీనాక్షి అమ్మ గుడిలో ఓ వినాయకుడి సన్నిధి ఉంది. ఆయన్ని అక్కడవారు అరవంలో "ముక్కురుని పిల్లయార్" అనిపిలుస్తుంటారు. ముక్కురుని అంటే మూడు శేర్లు (శేరు అనేది ఒక కొలత). పిల్లయార్ అంటే పిల్లవాడు అని. ముక్కురుని పిల్లయార్ గుడి మీనాక్షి అమ్మ గుడిలోనే కాక, చిదంబరంలోనూ, నాగపట్టణంలోనూ ఉంది. ఈ గణపతి అవతారానికి సంబంధించి ఒక చిత్రమైన కధ ఉంది

గణపతి రూపమే చాలా విచిత్రమైనది. ఎంతో పెద్ద దేహంతో చాటంత చెవులతో, పేద్ద తొండంతో, చిన్ని కళ్ళతో, పెద్ద ఏనుగు ముహంతో ఉంటాడు. కొద్దిగా మరగుజ్జు  రూపంలో ఉండి పెద్ద బొజ్జతో కూర్చొని ఉంటాడు. ఆయన చేతిలో కుడుములూ, ఉండ్రాళ్ళూ మొదలైనవి కనిపిస్తుంటాయి. ఈ అవతారాన్ని చూసి పూర్వం వినాయకుడిని అందరూ గేలిచేసి ఆటపట్టిస్తూ ఉండేవారుట. ఏమంటే "నువ్వు ఎప్పుడూ అంత బొజ్జతో ఉండి ఏ పనీ చెయ్యక మీ అమ్మగారిచ్చిన కుడుములు తింటూ ఉంటావ్ కదా?" అని. అలా అందరూ గేలిచేసేసరికి వినాయకుడికి బాధ కలిగిందిట. ఇహ లాభం లేదు ఏదన్నా పనిచేసి ఈ ఆటపట్టించే వారికందరికీ తగిన సమాధానం చెప్పాల్సిందే అనిపించి తన భక్తుడైన ఒక రైతు దగ్గర చిన్న పాటి ఉద్యోగం చేద్దామని వెళ్ళాడుట. 

    ఆ రైతు యొక్క వరిపంట ఏపుగా పెరిగి కోతకి సిద్ధంగా ఉందిట. ఓ బాలుడి రూపంలో వినాయకుడు వెళ్ళి రైతుకి సహాయం చేద్దామనుకొంటున్నట్టు చెప్పాడు. అందుకు రైతు కొంత ఆలోచించి జీతం ఎంతకావాలని అడిగాడుట. అందుకు వినాయకుడు "నీ చేతికి పంట వచ్చాకా మూడు శేర్ల ధాన్యాన్ని ఇయ్యమని" చెప్పాట్ట. అందుకు సరే అని రైతు వినాయకుడికి పొలంలో పిట్టలని తోలి తన ధాన్యపు పంటని కాపుగాసే పని ఇచ్చాట్ట. వినాయకుడు అలా రోజూ మంచె ఎక్కి పక్షులని పంట తినకుండా కాపుకాసాడుట. ఆఖరులో పంట చేతికొచ్చాకా రైతు సంతోషించి అన్న ప్రకారం మూడు శేర్ల ధాన్యాన్ని ఇచ్చాడుట. తన తొలి సంపాదనని తీసుకెళ్ళి అమ్మైన పార్వతీ దేవికి చూపించాట్ట గణపతి. అది చూసి పార్వతీదేవి " ఏ పిల్లాడైనా కష్టపడితే అమ్మ సంతోషించదు నాయనా. పుత్రుడు ప్రయోజకుడైతే అది తండ్రికే ఎక్కువ ఆనందాన్నిస్తుంది. నీ కష్టార్జితాన్ని మీ నాన్నగారికి చూపించు" అందిట. వినాయకుడు పరమేశ్వరుడి దగ్గరకు తీసుకెళ్ళి ఆ ధాన్యాన్ని చూపించి "నాన్నగారూ ఇంగోండి నా తొలి సంపాదన" అని చెప్పాడుట. పరమేశ్వరుడి చేష్టలు అర్ధం ఎవరు చెప్పగలరు ఆయనొక పిచ్చివాడిలా ఆనందంగా నవ్వుతూ ఆ మొత్తం ధాన్యాన్ని తన నెత్తిమీద వొంపేసుకొన్నాట్ట. ఒక విధంగా అంతా శివార్పణం అయ్యింది.

ఈ లీలకి గుర్తుగా ఈ రోజుకీ ముక్కూరుని పిల్లయార్ గుళ్ళలో వినాయకుడికి మూడు శేర్ల సరిపడా బియ్యంతో ఉండ్రాళ్ళు చేసి నైవేద్యం పెడుతుంటారు. మీరు ఈ టపాలో చూస్తున్నది మీనాక్షి అమ్మవారి గుడిలోని ముక్కురుని వినాయకుడి గుడి.

Courtesy : Chibi Vijayan
Photo : Danda pani

Tuesday, June 10, 2014

దాన మహిమ


దానం చెయ్యాలని మనలో ఏ కొద్ది మందికో ఉంటుంది. చాలా మందికి దానం చెయ్యడం వల్ల వచ్చే ఫలితం తెలియక దానధర్మాలు చేయకుండా జీవితం సాగిస్తుంటారు. మన వాంగ్మయ సర్వస్వం చేసిన ధర్మం వల్లే మనకు కామితార్ధాలు అన్నీ సమకూరతాయని తెలియజేస్తోంది. ఈ విషయాన్ని తెలుసుకొన్న ఒక వ్యక్తి జీవితం ఎంతగా మారిపోయిందో తెలిపే కధే ఇది

బలి చక్రవర్తి గతజన్మ వృత్తాంతం:

బలి చక్రవర్తి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన సాక్షాత్ శ్రీమహావిష్ణువుకే మూడు అడుగుల భూమిని దానం చేసిన మహనీయుడిగా, గొప్ప దాతగా చరిత్రలో నిలిచిపోయాడు. అతనికి అంతటి గొప్ప అవకాశం రావటానికి కారణం తను గతజన్మలో చేసుకొన్న పుణ్యమే. బలి గతజన్మలో ఒక దరిదృడు. అతను నాస్తికంగా ఉంటూ వేదపండితులనూ దేవతలనూ నిత్యం దూషిస్తూ తిరుగుతుండేవాడు. అతను దరిదృడే ఐనా వేశ్య లోలుడు. ఒక సారి వేశ్యా సంగమానికి సిద్ధమై ఎలాగో తను సంపాదించిన తాంబూలం, సుగంధ ద్రవ్యాలూ, శ్రీ చందనం, కర్పూరం, మల్లె పూలూ ఇత్యాది  భోగవస్తువులను ఒక సంచీలో పెట్టుకొని వేశ్యావాటిక కి బయల్దేరాడు. మార్గమధ్యంలో కాలుజారి నేలమీద పడ్డాడు. అలా పడేటప్పుడు తన తలకి బలంగా గాయమయ్యి మూర్చపోయాడు. ఆ సమయంలో తనకి విచిత్రమైన ఒక ఊహ కలిగింది. తన దగ్గరున్న ఈ పరిమళద్రవ్యాలన్నీ శివుడికి నివేదనచేస్తున్నట్టు. ఆ ఊహలో ఉండగానే తను ప్రాణాలు విడిచాడు. తన దగరున్న సర్వస్వాన్నీ భగవంతుడికి నివేదించినందుకు గానూ ఆ పరమేశ్వరుడి దయవల్ల అతనికి గొప్ప పుణ్యఫలం లభించింది.

మరణించిన తనను యమభటులు నరకానికి తీసుకుపోయారు. అక్కడ యముడు అతని పాపపుణ్యాలని విచారించగా అతనికి చేసిన పాపాలకి గానూ ఘోరమైన నరక శిక్షలు విధించాల్సి ఉందని చిత్రగుప్తుడు చెప్పాడు. కానీ అతను చివరలో తనయావత్తూ ఆ పరమేశ్వరుడికి నివేదిస్తున్నట్టూ భావించినందుకు మూడు ఘడియలపాటూ ఇంద్ర పదవిని చేపట్టాల్సి ఉందంది అలా మూడు ఘడియలూ పూర్తయ్యాకా అతనిని నరకంలో శిక్షించవచ్చని చెప్పాడు. ఇదంతా విన్న ఆ పాపికి తను ఇన్నాళ్ళూ చేసినపనులెంత ఘోరమైనవో తెలిసింది.  జన్మ చివరలో దేవుడికే అన్నీ దానం చేస్తున్నా అని అనుకోగానే ఇంత ఫలితం వచ్చింది, అలాంటిది తను నిజంగానే దానం చేస్తే ఎంత బాగుంటుందీ ? అనిపించింది.  ఇంతలో ఇందృడు, ఇంద్రగణాలు, అప్సరాగణాలూ మొత్తం అక్కడికి వచ్చి ఆ వేశ్యాలోలుడిని ఐరావతం మీద ఎక్కించుకొని సకల లాంచనాలతో సదరంగా స్వర్గానికి తోడుకొని వెళ్ళారు. 

తను ఇంద్ర సిమ్హాసనమ్మీద కూర్చొన్న వెంఠనే అగస్త్యుడికి ఐరావతాన్నీ, విశ్వామిత్రుడికి ఉచ్చైశ్రవాన్నీ, వశిష్టుడికి కామధేనువునూ, గాలవుడికి చింతామణినీ, కౌండిణ్యుడికి కల్పతరువునూ ఇలా ఇంద్రలోకంలోని గొప్ప గొప్ప మహర్షులకి విలువైన సంపదనంతా దానం చేసేసాడు. వారంతా ఎంతగానో సంతోషించి అతన్ని ఆశీర్వదించారు.

మూడు ఘడియల కాలం ఐపోయిన వెంఠనే ఇందృడక్కడకి వచ్చాడు. ఐరావతం మొదలు పారిజాత వృక్షం వరకూ అన్నిటినీ ఆ వేశ్యాలోలుడు దానం చెయ్యడం తెలుసుకొని కోపగించుకొన్నాడు. ఇంతలో యముడూ అక్కడికి వచ్చాడు ఆ పాపిని మళ్ళీ నరకానికి వెళ్ళడానికి సిద్ధంకమ్మన్నాడు. ఐతే మరలా చిత్రగుప్తుడు అడ్డుచెప్పి అతను ఈ మూడు ఘడియలకాలంలో చేసిన పుణ్య ఫలితంవల్ల తను ఇక మీదట నరకానికి రానవసరం లేదనీ, మరు జన్మలో మహా చక్రవర్తిగా భూమి మీద జన్మిస్తాడనీ చెప్పాడు. తను మునుపు చేసిన పనులకి గానూ అసుర వంశానికి రాజౌతాడని చెప్పాడు. ఆ దాన ఫలితంగనే బలి చక్రవర్తిగా అవతరించి సాక్షాత్ శ్రీ మహా విష్ణువుకే మూడు అడుగుల రూపేణా మూడు లోకాలను దానం చేసిన పుణ్యాన్ని పొందాడు. చిరంజీవిగా పాతాళానికి రాజై నిలిచిపోయాడు

Tuesday, June 3, 2014

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం

(అగస్త్యులవారూ లోపాముద్రా దేవీ)

పూర్వం అగస్త్య మహాముని బ్రహ్మచారిగా ఉంటూ తప్పస్సు చేసుకొంటూ కాలం గడుపుతున్నాడు. అందువల్ల ఆయనకు ధర్మబద్ధంగా సంతానయోగం లేకుండా పోయింది. ఇది చూసి వారి పితృదేవతలు చాలా బాధపడ్డారు. ఎలాగైనా అగస్త్యుడు పెళ్ళిచేసుకొని సంతానాన్ని పొందితే గానీ వారికి ఉత్తమలోకాలు ప్రాప్తించవని తలచి ఒక రోజు అగస్త్యుడికి తలకిందులుగా వేళ్ళాడుతూ దర్శనమిచ్చారు. అప్పుడు వారిని చూసి అగస్త్యుడు " ఎవరు మీరు ? ఎందుకిలా తలక్రిందులుగా వేళాడుతున్నారు ?" అని ప్రశ్నించాడు. అందుకు బదులుగా వారు "మేము నీ పితరులము నీవు వివాహం చేసుకోనందున మాకు ఉత్తమలోకాలు లేక ఇలా ఉండవలసి వచ్చిందని" చెప్పారు. ఎంతో బాధపడిన అగస్త్యుడు వెంఠనే తగిన జీవితభాగస్వామి కోసం అన్వేషణ మొదలుపెట్టాడు. 

ఆయనకి కొంతకాలానికి విదర్భరాజు కూతురైన లోపాముద్ర తగిన కన్యగా తోచింది. వెంఠనే విదర్భరాజుని  తన కూతురునిచ్చి పెళ్ళిచేయమన్నాడు. అందుకు ఆ రాజు సంతోషించి ఆనందంగా పెళ్ళిచేసాడు

అగస్త్యుడు లోపాముద్రతో సహా తన ఆశ్రమంలో నివసిస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలానికి తనకు సంతానం పొందాలని కోరిక కలిగి అదే భార్యతో చెప్పాడు. లోపాముద్ర రాచకన్యే ఐనా పెళ్ళయ్యాకా నారవస్త్రాలతో ఉంటూ పతిసేవలో నిరాడంబరంగా జీవించసాగేది. అగస్త్యుడు తన కోరిక చెప్పగానే తనకి ఈ ఆశ్రమంలో కూడా సకలసౌకర్యాలూ కలిగేలా చేసి అలాగే సంతానాన్నీ పొందవచ్చునని చెప్పింది. తన తపశ్శక్తితో ధనాన్నిపొందడం సరికాదనుకొన్నాడు అగస్త్యుడు.ధర్మబద్ధంగా ఎవరినైనా అడిగి పొందాలని భావించి సమీప రాజ్యాలకు రాజులైన వారిలో ఎవరి దగ్గర మిగులుధనం ఉంటే వారిని మాత్రమే అడగాలని నిర్ణయించుకొన్నాడు.  వెంఠనే శృతర్వుడు అనే రాజు దగ్గరికెళ్ళి అడిగాడు. ఆ రాజు లెక్కించి మిగులు ధనం లేదని చెప్పాడు. శృతర్వుడిని కూడా వెంటపెట్టుకొని బ్రద్నశ్వుడు అనే రాజు దగ్గరికెళ్ళాడు. అతనూ ధనాగారం లెక్కచూసి మిగులుధనం లేదని చెప్పడంతో శృతర్వుడినీ,బ్రద్నశ్వుడినీ వెంటపెట్టుకొని త్రసదస్యుడనే రాజు దగ్గరికెళ్ళాడు. ఆ రాజు దగ్గరా మిగులు ధనం లేకపోడంతో శృతర్వుడూ, బ్రద్నశ్వుడూ,త్రసదస్యుడినీ తనతో తీసుకొని ఇల్వలుడనే దానవ రాజు దగ్గరికెళ్ళాడు. 

ఆ దానవరాజుకి వాతాపి అనే సోదరుడుండే వాడు. వారిద్దరికీ ఓ వరం ఉంది. అదేంటంటే వాతాపి ప్రాకామ్య విద్య వల్ల అనుకొన్న రూపాన్ని పొందేవాడు. వాతాపిని మేకగా చేసి అతిధులకు వండి పెట్టి తిరిగి ఇల్వలుడు పిలవగానే  తాను యధా రూపం పొంది రాక్షసుడిగా రూపుదాల్చగలడు. ఈ వరగర్వంతో ఇద్దరూ ఆహార ధానం చేసినట్టే చేసి అకారణంగా ఎంతో మంది  ప్రాణాలూ, ధనాన్నీ హరించారు. ముందుగా వాతాపి మేక రూపం దాలుస్తాడు, ఆ మేకను చంపి కూరగా వండి ఆ వండిన కూరని అతిధులుగా వచ్చిన వారికి వడ్డిస్తారు. వాళ్ళు భోజనం చేసాకా ఇల్వలుడు " వాతాపీ బయటకు రా" అని పిలవగానే వాతాపి వారి కడుపును చీల్చుకొంటూ బయటికొచ్చేవాడు. ఈ విధంగా అనేకుల ప్రాణాలు బలిగొనారిద్దరు రాక్షసులూ.

శృతర్వుడూ, బ్రద్నశ్వుడూ,త్రసదస్యుడినీ తనతో తీసుకొని వచ్చిన అగస్త్యుడిని చూసి వారిద్దరూ ఇదే పన్నాగం పన్నుదామనుకొన్నారు. వాతాపి ఒక మామిడి పండు రూపంగా మారిపోయాడు. భోజనానంతరం  వడ్డించిన మామిడిపండు వాతాపే అని తపోమహిమతో  గ్రహించాడు అగస్త్యుడు. 

   తాను మామిడి పండును తిన్న వెంఠనే " జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం" అనుకో గానే తన కడుపులోని రాక్షసుడైన వాతాపి సుజీర్ణమైపోయాడు. ఇల్వలుడు ఎంత పిలిచినా వాతాపి బయటకి రాలేదు. ఇంకెక్కడి వాతాపి ? జీర్ణమైపోయాడని అగస్త్యులవారు చెప్పగానే భయబ్రాంతులకి లోనై అగస్త్యులవారి కాళ్ళ మీద పడ్డాడు. అగస్త్యుడు వచ్చిన పనిని నివేదించగగా లోభత్వం చేత మిగులు ధనం లేదని అగస్త్యుడికి  అబద్ధం చెప్పాడు. దివ్యదృష్టితో ఉన్న ధనాన్ని లెక్క కట్టి చెప్పిన అగస్త్యుడి మహిమకి అచ్చెరువొంది,  ఐనా బుద్ధి మార్చుకోక, వారికి ఎంత ధనాన్ని ఇద్దామని తాను మనసులో అనుకొంటున్నాడో ఆ మొత్తాన్ని సరిగ్గా చెబితే అప్పుడే ఇస్తానన్నాడు. ఇల్వలుడి మనసులో ఉన్న మొత్తాన్ని మళ్ళీ సరిగ్గా చెప్పాడు అగస్త్యుడు. అప్పుడు బుద్ధి తెచ్చుకొని ఆ మొత్తం ధనాన్ని అగస్త్యుడికే కాక కూడా వచ్చిన రాజులకీ ఇచ్చి పంపించాడు ఇల్వలుడు.

ఈ రోజుల్లోనూ చిన్న పిల్లలకు అజీర్తి చేస్తే పెద్దవాళ్ళు కడుపుమీద నూనెను మర్దనా చేస్తూ "జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం.." అనటం కనిపిస్తుంది. ఈ ఆచారానికి వెనుక గల కధ ఇదే !