ఎంత ఆత్మీయత అనురాగాలతో ఉన్న సోదరులైనా ఒక కాంత కారణంగా కక్షలకు, కార్పణ్యాలతో రగిలి జీవితాలను నాశనం చేసుకునే పరిస్థితులేర్పడుతుంటాయని, అలా జరగకుండా ఉండాలంటే తగిన విధంగా ధర్మమార్గంలో ప్రవర్తించాలని చెప్పే కథ ఇది. అలాగే పాండవులయిదుగురు ద్రౌపదిని వివాహం చేసుకున్న తరువాత ద్రౌపదితో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరు ఆమెకు భర్తగా ఉండేలాగా, నిర్ణయాన్ని అతిక్రమించిన వారు సంవత్సర కాలంపాటు తీర్థయాత్రలకు వెళ్లి వచ్చేలాగా ఎవరి సమక్షంలో నిర్ణయం తీసుకున్నారనే విషయం కూడా ఈ కథలోనే తెలుస్తుంది. వీటన్నిటితోపాటు అప్సరస కన్యలలో అతిలోక సౌందర్యవతి అయిన తిలోత్తమ జన్మకు, ఆ జన్మ కారణానికి ఉన్న సంబంధాన్ని కూడా ఈ కథలో చూడవచ్చు.
నారదుడు పాండువులకు ఈ సుందోపసుందుల కథలో వివరించి చెప్పాడు. ద్రౌపది స్వయంవరం తరువాత పాండవులు కుంతితో కలిసి హస్తినకు వచ్చారు. దృతరాష్ట్రుడిచ్చిన అర్ధరాజ్యంతో ఖాండవప్రస్థంలో ఇంద్రప్రస్థపురాన్ని నిర్మించుకుని పాండవులు రాజ్యమేలుతుండగా ఒక రోజున నారుదుడు అక్కడికి వచ్చాడు.
ధర్మరాజాదులు చేసిన అతిథి పూజలు స్వీకరించిన తరువాత ఆ అయిదుగురు సోదరులకు ద్రౌపది లేని సమయంలో ఈ కథను వివరించాడు. పూర్వం నికుంభుడు అనే రాక్షసుడికి సుందుడు, ఉపసుందుడు అనే ఇద్దరు కుమారులు జన్మించారు. ఆ ఇద్దరూ ఒకరి మీద ఒకరు ప్రాణప్రదమైన ఆత్మీయత అనురాగాలతో జీవిస్తుండేవారు. రాక్షసులైనా బ్రహ్మ గురించి కఠోర దీక్షతో తపస్సు చేయడానికి వింధ్యపర్వత ప్రాంతాలకు ఆ ఇద్దరూ వెళ్ళారు. ఆ సోదరుల తపోదీక్షకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. కామరూపం, కామగమనం, అమరత్వం, ఇతరులెవరితో మరణం లేకుండా ఉండేస్థితి, సకలమాయలు తామిద్దరికీ కావాలని బ్రహ్మను వారు కోరుకున్నారు. వారు కోరిన వరాలలో అమరత్వం తప్ప మిగిలిన కోరికలన్నింటినీ బ్రహ్మ అనుగ్రహించాడు. బ్రహ్మ దగ్గర పొందిన ఆ వరాలతో ఆ ఇద్దరూ లోకాలన్నింటినీ హింసాప్రవృత్తితో అతలాకుతలం చేయసాగారు. వారికున్న మాయారూపాలను ధరించే శక్తి వల్ల పులులుగా, ఏనుగులుగా మారి మునులు రుషులు ఉండే ఆశ్రమాలను చిందరవందర చేయసాగారు. దేవతలను కూడా తీవ్రంగా భయపెట్టడం వారికి పరిపాటైంది. ఈ కష్టానికి చింతిస్తూ దేవతలు, రుషులంతా బ్రహ్మ దగ్గరకు వెళ్లి తమను రక్షించమని ప్రార్థించారు.
బ్రహ్మ వారంరికీ అభయమిచ్చి సుందోపసుందులు ఇద్దరూ ఇతరులెవరితోనూ తమకు మరణం ప్రాప్తించకూడదని కోరుకున్నారు. కానీ తామిద్దరిలో ఒకరి వల్ల ఒకరు మరణం పొందకుండా ఉండే కోరికను కోరుకోలేదని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసి మునులను దేవతలను రక్షించాలని బ్రహ్మదేవుడు అనుకున్నాడు. వెంటనే విశ్వకర్మను పిలిపించి సృష్టి మొత్తంలోకి సౌందర్యవతి అయిన ఒక కన్యను సృష్టించమని చెప్పాడు. విశ్వకర్మ బ్రహ్మ ఆజ్ఞను శిరసా వహించి సృష్టి మొత్తంలో ఉన్న అన్ని అందమైన వస్తువులలో ఒక్కొక్క దాని నుంచి నువ్వుగింజంత ప్రమాణంలో అందాన్ని స్వీకరించి ఒక అద్భుత సౌందర్యరాశి వంటి యువతిని సృష్టించాడు. సంస్కృతంలో నువ్వుగింజను ‘తిల’ అని అంటారు. తిల ప్రమాణంలో అన్ని సౌందర్యాల నుంచి తీసిన సౌందర్యంతో రూపొందినది కనుక ఆ సౌందర్యవతి పేరు తిలోత్తమ అయింది.
తిలోత్తమ వెంటనే మద్యం మత్తులో మదిరాక్షుల నడుమ భోగాలను అనుభవిస్తున్న సుందోపసుందుల ఎదుట నిలిచి వయ్యారాలు ఒలకపోసింది. ఆ ఇద్దరిని అమితంగా ఆకట్టుకుంది. వారిద్దరూ ఆమె కోసం పోటీ పడసాగారు. అప్పుడు తిలోత్తమ ఇద్దరూ ఒకరితో ఒకరు యుద్ధానికి దిగి ఎవరు బలాఢ్యులని నిరూపించుకుంటే తాను వారి సొంతమవుతానని పలికింది. అప్పటి దాకా అపూర్వమైన అనురాగం, ఆత్మీయతానుబంధాలతో ఉన్న సోదరులైన సుందోపసుందులు ఇద్దరూ ఒకరి మీదకు ఒకరు కాలుదువ్వుకున్నారు. భీకరంగా పోరాడుకుని చివరకు ఇద్దరూ మరణించారు.
ఇలా తిలోత్తమ అనే స్త్రీ కారణంగా అంతకు ముందు ఎప్పుడూ ఏ సందర్భంలోనూ విరోధులుగా కనిపించని సుందోపసుందులు బద్ధవిరోధులై మరణించారని పాండవులు కూడా ద్రౌపది కారణంగా అలా నాశనం కావడం మంచిది కాదని నారదుడు చెప్పాడు. అప్పుడు నారదుడి సమక్షంలోనే ధర్మరాజు తన సోదరులతో కలిసి ద్రౌపదితో ఒక్కొక్కరు ఒక సంవత్సరంపాటు భర్తగా ఉండేలాగా, ఈ నిర్ణయాన్ని అతిక్రమించినవారు ఒక సంవత్సరం పాటు తీర్ధయాత్రలకు వెళ్ళేలాగా ఏర్పాటుచేసుకున్నారు.
- శ్రీ యల్లాప్రగడ మల్లికార్జున రావు గారు
- సేకరణ ఆనంద్
ఈనాడు దినపత్రిక నుంచీ