Wednesday, July 17, 2019

అత్యవసర చికిత్స

Image result

కుంభకోణ మఠంలో చంద్రమౌళీశ్వర పూజ పూర్తైన తరువాత, పరమాచార్య స్వామివారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు.

శ్రీమఠంతో సంబంధం ఉన్న ఒక రైతు ఆత్రుతగా స్వామివారి వద్దకు పరిగెత్తుకుని వచ్చి, స్వామివారి పాదాలపై పడి విలపించసాగాడు, “నా కుమారుణ్ణి కాపాడండి దేవుడా!” అని.

ఏమి జరిగిందో కనుక్కోమని సహాయకునికి చెప్పారు స్వామివారు.

ఆ రైతుకి ఉన్నది ఒక్కడే కొడుకు. ఆ పిల్లవాడు ఆహారం తింటున్నప్పుడు, ఒక పాము అతని శరీరంపై పాకి వెళ్లిపోవడం వల్ల భయంతో మూర్చిల్లాడు. పాము కరిచిందో లేదో తెలియడంలేదు. సాధారణంగా పాము కాటుని మంత్రంతో పోగొట్టే ఒక పధ్ధతి ఉంది. కాని ఆ మంత్రం తెలిసిన వారు దగ్గరలో ఎవరూ లేరు.
“సామి మాత్రమే వాణ్ణి కాపాడాలి . . .”

మహాస్వామివారు విభూతి ప్రసాదాన్ని ఇచ్చారు. “ఆ పిల్లవాని నుదురుపై పూయండి”.

“సరే సామి”

“మీ ఇంట్లో శీకాయ పుడి ఉందా?”

“ఉంది సామి” అని తలూపాడు.

“పిల్లవాని పెదాలు వేరుచేసి, కొద్దిగా శీకాయ పొడి వేసి చిన్నగా రుద్దండి. చేదుగా ఉందని పిల్లవాడు ఉమ్మివేస్తే, పాము కరవలేదని అర్థం. తీయగా ఉన్నదని లోపలి తీసుకుంటే, పాము కరచిందని అర్థం. దాని ప్రకారంగా చికిత్స చెయ్యాలి. వెళ్లి పిల్లవాడికి శేకాయ పొడి ఇవ్వు”

ఆ రైతు పరుగున ఇంటికి వెళ్లి స్వామివారు చెప్పినట్టుగా చేశాడు. శీకాయ పొడిని నోటిలో వెయ్యగానే, “చేదు, చేదు” అని ఉమ్మేశాడు. పాము కరవలేదని ఆ రైతు చాలా సంతోషపడ్డాడు.

పరిస్థితి చక్కబడిన తరువాత ఆ రైతు కుటుంబంతో సహా స్వామివారి దర్శనానికి వచ్చారు. ఆ రితు భార్యతో స్వామివారు, “ప్రతి రోజూ ఇంటిలో నువ్వుల నూనె దీపాన్ని వెలిగించు” అని చెప్పారు.

--- శ్రీమఠం బాలు మామ. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 2

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/paramacharyavaibhavam

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం