అనగనగా ఓ గొప్ప చిత్రకారుడుండేవాడుట. అతను ఎంత గొప్ప చిత్రాన్నైనా ఇట్టే తన కుంచెతో చిత్రీకరించి రంగులు వేసి అందరినీ ఆశ్చర్యపరచేవాడుట. ప్రకృతిలో ఎంతో అందమైన సూర్యోదయం, పండు వెన్నెలా, నెమలి నాట్యం, రామచిలుకలూ, కుందేళ్ళూ, అందమైన అడవులూ, సెలయేళ్ళూ, మేఘాలూ ఇలా ప్రపంచంలో ఏ అందమైన దృశ్యం కనపడ్డా దాన్ని తన కుంచెతో పఠమ్మీద బంధించనిదే వదిలేవాడు కాదు. తన కళాకౌశలాన్నిజునులందరూ మెచ్చుకొన్నారు, పురాధికారులూ, రాజులు సైతం బహుమానాలిచ్చి అభినందించారు. అలాంటి ఆ చిత్రకారుడికి ఒక సారి ఎవరొ కనబడి... "ఫలానా రేపల్లె అనే ఊరులో ముద్దులొకిలే ఓ అందమైన పిల్లాడున్నాడూ, అతని అందం అంతా ఇంతా కాదు. చూసినకొద్దీ చూడాలనిపించే అందం ఆ పిల్లాడిది. ఎంతటి అందమో అంతటి తెలివి. ఎంతటి తెలివో అంతటి అల్లరి, ఎంతటి అల్లరో అంతటి అమాయకత్వం కనబరుస్తూ ....ఎవ్వరికీ అందక అందరినీ ఆనందింపజేస్తూ ఆడుకొనే ఓ పిల్లాడు ఉన్నాడూ, అతని పేరు కృష్ణుడు.. అతనిని కనుక నువ్వు చిత్రీకరిచగలిగితే అదే నీకు నిజమైన గొప్పదనం" అన్నారుట.
ఆ మాటలకి ఆ కళాకారుడిలో పట్టుదల పెరిగింది. ఆ పిల్లాడెలా ఉంటాడో వెంఠనే చూడాలనిపించింది. ఎంతో వ్యయప్రయాసలకోర్చి అందరినీ వాకబుచేస్తూ ఊరులెన్నో దాటుకొని చివరకి రేపల్లె చేరాడు. రేపల్లెలో కన్నయ్యని తెలీనివాళ్ళుండరు కదా ? వాకబు చేయగానే కన్నయ్య ఇంటికి దారి చూపించారు. అక్కడికి చిత్రకారుడు చేరే సరికి సాయంత్రమయ్యింది. అప్పుడు చిన్ని కృష్ణుడు గోపబాలురితో కలిసి ఆనందంగా ఆడుకొంటున్నాడు. రాశీభూతమైన ఆ సౌందర్యలావణ్య ముగ్ధమోహన మూర్తిని చూడగానే ఆ కళాకారుడికి తను విన్నది నిజమే సుమా ! అనిపించింది. ఆ ముద్దులొలికే అందాలబాలుడిని చిత్రీకరిస్తేనే తన కళకి ఓ పరిపూర్ణత వస్తుందనిపించింది. ఆలస్యం చేయక ఆ చిత్రకారుడు కన్నయ్యని సమీపించాడు.
తను మునుపు చిత్రించిన అందమైన చిత్రాలనన్నీ తన సంచీలోంచి తీసి చూపించాడు. చిన్నికృష్ణుడు అన్నీ మురిపంగా చూడసాగాడు. "ఇంగో నువ్వూ కదలకుండా కాసేపు నుంచొంటే.. నీ బొమ్మనీ ఇలా గీస్తాను..సరేనా !" అన్నాడు చిత్రకారుడు అనునయంగా. పిల్లాడికి బొమ్మలంటే సరదా కదా? నవ్వుతూ "ఓ !అలాగే !" అన్నాడు కన్నయ్య.
కాలికి సిరిమువ్వగజ్జెలూ, చక్కని దోవతీ, మెడలో పూలమాలా, నుదుటన కస్తూరి, గాలికి అందంగా ఊగే ముంగురులూ, తలపై నెమలిపించం, చేత పిల్లన గ్రోవితో అందానికే అందమై నిలుచున్నాడా గోపబాలుడు. చిత్రకారుడుకి ఆపాదమస్తకం కన్నులపండువగా ఉంది, ఎంతో శ్రద్ధగా ఎంతో అద్భుతంగా తన ప్రతిభనంతా వెచ్చిస్తూ ఆ చిత్రాన్ని గీయటం పూర్తిచేసాడు.
కొంతసేపటికి కన్నయ్యని తోటి పిల్లలు పిలుస్తుంటే కదలక తప్పింది కాదు. చిత్రకారుడు పిల్లాడిని కదలకుండా నించున్నందుకు మెచ్చుకొని, మరునాడు ఆ చిత్రానికి రంగులు వేసి తీసుకొస్తానని చెప్పి శెలవుతీసుకొన్నాడు.
రాత్రంతా ఆ చిత్రానికి రంగులు వేసి మరీంత మనోహరంగా ఆ చిత్రాన్ని పూర్తిచేసాడు. తను జీవితం మొత్తంలో అంత అందంగా వేసిన బొమ్మ ఆ చిన్నికృష్ణుడిదే అనిపించింది చిత్రకారుడికి. అది ఆ బాలుడికి చూపిస్తే తప్పక సంతోషిస్తాడనిపించింది అతనికి.
మరునాడు ఆ చిత్రపఠాన్ని తీసుకొని వెళ్ళి కన్నయ్యకి చూపించాడు. అప్పుడే చిన్ని కన్నయ్య స్నానానికి ఉపక్రమిస్తూ ఉన్నాడు. యశోదా దేవి కన్నయ్య ఒంటి నిండా వెన్న పట్టించి బాగా మర్దనా చేసింది. అందువల్లా బాలకుడు చక్కగా మెరుస్తున్నాడు. జుత్తును దువ్వి పీలకవేసినట్టు ఉంది. మెడలో ముత్యాలహారాలతో, మొలలో బంగారు మొలతాడు తో చేతిలో కొద్దిగా వెన్నతో ఉన్నాడు ఆ బుజ్జిబాలుడు. కన్నయ్యకి ఆ చిత్రపఠాన్నిచ్చాడు కళాకారుడు. ఎంతో ఆత్రంగా బాలుడి ఆనందాన్ని చూద్దామని వేచి చూస్తున్నాడు చిత్రకారుడు.
కన్నయ్య ఆ చిత్రపఠాన్ని కళ్ళు పెద్దవి చేసి, ఒక్క నిమిషం పాటూ తేరిపారా చూసాడు. "ఈ బొమ్మ నాది కాదుగా !" అన్నాడు. వెంఠనే చిత్రకారుడు ఆశ్చర్యపోయాడు. "ఇంగో చూడు నేనెలా ఉన్నానో? ఈ బొమ్మ చూడెలా ఉందో? " కొంత అసంతృప్తి ద్వ్హనించగా కుండబద్దలుకొట్టినట్టూ చెప్పేసాడు కన్నయ్య. దాంతో చిత్రకారుడు దిగాలు పడిపోయాడు. తన శ్రమంతా వృధా ఐపోయిందనిపించింది. ఆ చిన్నిపిల్లాడిని మెప్పించలేని ఆ ప్రయత్నం వృధా అనిపించింది. వెంఠనే ఇంకో గట్టి ప్రయత్నం చేద్దామని కుంచె, పఠమూ అందుకొన్నాడు. చిత్రించడం పూర్తిచేసాడు. మరునాడు యధావిధిగా రంగులద్ది తీసుకొచ్చాడు. అప్పుడు కన్నయ్య ఉదయాన్నే ఆలకాపరిలా ముస్తాబయ్యి ఆవులని మేపడానికి బయల్దేరుతున్నాడు. చిత్రకారుడు తాను తెచ్చిన చిత్రపఠాన్ని చూపించాడు. అప్పుడు కన్నయ్య తలకి చిన్న తలపాగా చుట్టుకొనీ, చేత చిన్ని కర్ర పుచ్చుకొనీ, బొడ్డులో వేణువు దోపుకొనీ, భుజాన చద్దిమూట తగిలించుకొనీ ఉన్నాడు. మళ్ళీ కన్నయ్య "ఇంగో చూడు నేనెలా ఉన్నానో? ఈ బొమ్మ చూడెలా ఉందో?... ఊహు ! ఇది నేను కాదు" అనేసాడు. ఇలా కొన్ని పర్యాయాలయ్యాకా చిత్రకారుడికి ఆత్మనూన్యత ఆవరించింది. ఎన్ని బహుమానాలందుకొంటే ఏమి ? ఎంత కీర్తి ఘడిస్తే ఏమి ? ఈ చిన్నారి పసి మనసుని ఆనందింపజేయలేకపోయాకా తన కళకి ఏమి విలువ ? అని చింతించి. ఈ జన్మ వృధా కనుక ఆత్మహత్యే శరణ్యం అని తలచి అందుకు ఉపక్రమించాడు.
సమయానికి నారదమునీందృల వారు ఆపి విషయం ఏంటని? వాకబుచేయగా, చిత్రకారుడు తన గోడంతా వెళ్ళబోసుకొన్నాడు. అప్పుడు నారదులవారు అతనికి ధైర్యం చెప్పీ. "ఆ పిల్లాడి బొమ్మని నేను గీసిస్తాలే, నువ్వు నేని చెప్పిన పని చెయ్యి చాలు.." అన్నారుట. " నేనే గీయలేని ఆ అందమైన రూపాన్ని మీరెలా గీయగలరు స్వామీ ? .. అసమభవం !!!! "అన్నాట్ట చిత్రకారుడు. "అవన్నీ నే చూసుకొంటాను నాయనా. నువ్వు రేపుదయానే నేనిచ్చిన చిత్రపఠాన్ని తీసుకెళ్ళు ఆ బాలుడికి చూపించు. అతను అసమాన్యుడు.. వెంఠనే అతనికి సాష్టాంగ పడి నమస్కరించు.. " అన్నారుట.
నారదులవారు ఒక గుడ్డలో చుట్టిన ఒక చిత్రపఠాన్ని చిత్రకారుడికిచ్చారుట. ఆ చిత్రపఠాన్ని చిత్రకారుడు తీసుకొని కన్నయ్య దగ్గరికెళ్ళాడుట. అది కన్నయ్య చేతిలో పెట్టి అమాంతం కాళ్ళమీదపడ్డాడుట. లేచి చూసే సరికి ఆ చిన్నికన్నయ్య ఆ గుడ్డను తొలగించి ఆ చిత్రపటాన్ని విప్పి చూసి, అందులో తన అందాన్ని చూసి తెగ మురిసిపోతున్నాట్ట. ఎట్ట్కేలకూ ఆ చిన్నారికన్నయ్య కళ్ళల్లో ఆనందం చూడగలిగినందుకు చిత్రకారుడి మనసుప్పొంగిపోయింది. నారదుడికి తానెంతో రుణపడ్డట్టనిపించిని. కానీ ఇంతలో ఒక సందేహం కలిగింది..ఎంతో ప్రతిభాశాలి ఐన తనే చిత్రీకరించలేని ఆ బొమ్మని నారదులవారెలా గీసారా అని? వెంఠనే ఆ బొమ్మని తనూ చూడాలనిపించి కన్నయ్య చేతిలో పఠానికేసి తొంగిచూశాడు.
అదేంటో తెలుసా? ... అద్దం :)
మిగింపు భలే గమ్మత్తుగా ఉంది కదూ ? శ్రీహరి లీలలు నారదుడికి కొత్తా ? ....
నీతి: మానవ ప్రయత్నం దాని ఫలితం చాలా గొప్పవే ఐనా ఆ ప్రయత్నం వల్ల వచ్చే ప్రయోజనం అంతా మన ప్రతిభే అనుకోకూడదు. దైవానుగ్రహం ఉండడం వల్లే అవన్నీ సమకూరతాయి. "అంతా నీదే భారం" అని అంతా ఆ దేవుడికే వదిలేస్తే ఆయనే మనకి మన విజయాలకి తగిన శక్తీ యుక్తీ ఇచ్చి రక్షిస్తాడు.
హరే రామ హరే రామ || రామ రామ హరే హరే !
హరే కృష్ణ హరే కృష్ణ || కృష్ణ కృష్ణ హరే హరే !