భారతీయ పురాణ సాహిత్యంలో తారసపడే ప్రతి కథ, పాత్ర మానవాళికి ఒక మంచి మార్గాన్నో, నడవడికనో నేర్పడానికే అవతరించినట్లు అనిపిస్తూ ఉంటుంది. అందరికీ సుపరిచితమైన నారదుడు వంటి పాత్రల ప్రవర్తన ద్వారా కూడా సందేశం అందుతూ ఉంటుంది. నారదుడు, తుంబురుడు ఇద్దరూ సహాధ్యాయులు (ఒకచోట విద్యనేర్చుకున్నారు), గానవిద్యలో తనను మించిన వారు ఎవరూ ఉండవోరనేది నారదముని పెంచుకున్న భావం. ఆ గర్వఫలమే ‘తాడితన్నే వాడు ఉంటే వాడితల తన్నేవాడు మరొకరు ఎప్పుడూ ఉండే ఉంటాడనే నగ్నసత్యాన్ని చవిచూడాల్సి వచ్చింది నారదుడు. తన గర్వభంగ కథనంతా మణికంఠరుడు అనే ఓ గంధర్వుడికి వివరించి విచారం పొందాడు. నారదుడి నోవేదనంతా ఇలా ఉంది.
వైకుంఠంలో ఒకనాడు శ్రీమహావిష్ణువు నిండుకొలువు తీరి ఉన్నాడు. ఆ కొలువు కూటానికి దేవతలు, మినగణాలు, గంధర్వులు, తదితరులంతా విచ్చేశారు. సభా ప్రాంగణానికి ముందు ఉన్న అందమైన తోట నుంచి లక్ష్మీదేవి నల్లని మబ్బుల మధ్యన మెరుపు తీగలాగా మెరుస్తూ చెలికత్తెలు అటూ ఇటూ నడుస్తుండగా శ్రీమహావిష్ణువు కొలువుతీరిన ప్రదేశానికి బయలుదేరి వస్తోంది. ఆమెను చూడాలనే తపన అక్కడ ఉన్న వారందరిలోనూ బయలుదేరింది. ఈ లోగా విష్వక్సేనుడు తన పరివారంతో అక్కడికి వచ్చాడు. వారంతా చేతిలో బెత్తాలు ధరించి లక్ష్మీదేవి నడిచే దారికి అడ్డంగా ఉన్న వారందరినీ చెదరగొట్టి కకావికలు చేశారు. బ్రహ్మలాంటి దేవతలు కూడా ఆ ధాటికి దూరంగా పారిపోవాల్సి వచ్చింది. ఇంకా నారదుడు వంటి వారి పరిస్థితి చెప్పనవసరం లేదు. అలా లక్ష్మీదేవి కొలువు కూటంలోకి వెళ్లిన వెంటనే ద్వారపాలకులు తలుపులు మూసివేశారు. కొద్దిసేపైన తరువాత లోపలి నుంచి ఎవరో వచ్చి ఓహో తుంబురుడా అంటూ గట్టిగా పిలిచి తుంబురుడిని లోపలకు తీసుకువెళ్లారు. లోపల ఏం జరుగుతుందోనని బయట ఉన్న వారందరికీ ఆతృత హెచ్చింది. కొద్ది సమయం అయిన తరువాత చిరునవ్వులు నవ్వుతూ గంధపు పూతలతో మెడలో దగాదగా మెరిసే పతకంతో సన్మానితుడైన తుంఉబురుడు బయటకు రాగానే అందరూ ఏమిటి విశేషమని అడిగారు. తుంబురుడు సంతోషంతో శ్రీమహాలక్ష్మి చెంత ఉండగా మహావిష్ణువు తన గానాన్ని విని ఆనందించి ఇలా సత్కరించాడని చెప్పాడు. ఆ మాటలు నారదుడి మనసును ఎంతో నొప్పించాయి. అసూయతో అతని హృదయం రగిలిపోయింది. ఇంతకు ముందు ఎక్కడ గానకళను ప్రదర్శించినా తామిద్దరూ కలసి ప్రదర్శించటం అలవాటుగా వస్తోంది. గానకళలో తనకు ఎన్నోమార్లు ప్రశంసలు వచ్చాయి. ఇప్పుడు తుంబురుడు తగుదనమ్మా అంటూ తానొక్కడే వెళ్లి శ్రీహరి ఎదుట గానాన్ని ఆలపించటం అతని హృదయాన్ని భగభగలాడించింది. ఎలాగయినా తుంబురుడిని మించిన గానకళా విద్వాంసుడిగా ఇప్పుడు అందరిచేత మెప్పు పొందాలని అనుకున్నాడు. దీనితోపాటుగా తుంబురుడి గాన విద్యలోని దోషాలను పసిగట్టి వాటిని బయటపెట్టేందుకు స్నేహాన్ని నటిస్తూనే కార్యాన్ని సాధించాలని అనుకున్నాడు. ఒకనాడు తుంఉబురుడి ఇంటికి వెళ్లిన నారదుడికి పాటకు సిద్ధంగా ఉంచిన వీణ కనిపించింది. అక్కడ ఉన్న పరిచారికలను తుంబురుడెక్కడ అని అడుగగా లోపల ఉన్నాడని పిలుచుకొస్తామని వెళ్లారు. ఈలోగా అక్కడ పెట్టి ఉంచిన వీణను నారదుడు తాకాడు. తుంఉబురుడు శ్రుతి చేసి పెట్టిన వీణ అద్భుతమైన రాగాలను ఆలపించింది. శ్రుతి చేసిన వీణే అంత అద్భుతంగా ఆలాపన చేస్తే తుంబురుడు స్వయంగా గానమాలపిస్తే ఇంక ఎంత గొప్పగా ఉంటుందోనని హించుకొని సిగ్గుపడి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తరువాత ఎంతో మంది గురువులను అతడు ఆశ్రయించి గానవిద్యలో తనను తుంఉబురుడి కంటే గొప్పవాడిని చేయమని అడిగాడు. వారంతా అది తమకు సాధ్యపడదని చెప్పారు. చివరకు చేసేది లేక శ్రీమహావిష్ణువు గురించి చాలా కాలం తపస్సు చేశాడు. ఆయన ప్రత్యక్షమై నారదుడి కోరిక విని ఈ అవతారంలో అది సాధ్యపడదని తరువాత వచ్చే అవతారంలో వీలు కల్పిస్తానని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఇలా తానొక్కడే గానకళలో గొప్పవాడని భావించుకున్న నారదుడు భంగపాటుకు గురై పండితులు ఎప్పుడూ నీటికొద్దీ తామరలాగా ఉంటారని, చెవిటివాడి ముందు శంఖం దినట్లుగా తమకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారి ఎదుట తమ విద్యను ప్రదర్శించరని గ్రహించాడు. తుంబురుడు తన సహాధ్యాయి అయినప్పటికీ ఎంతో కృషి చేసి గాన కళాప్రపూర్ణుడు అయ్యాడని, అది తెలియని తాను గానే గొప్ప అనుకుని గర్వపడి చివరకు గర్వభంగపాటుకు గురికావాల్సి వచ్చిందనుకున్నాడు. విద్యావంతులు, గుణవంతులు, వినయ సంపన్నులు సమయాన్ని సందర్భాన్ని పురస్కరించుకుని మాత్రమే తమలోని గొప్పతనాన్ని ప్రదర్శిస్తారని తెలుసుకోలేని వారు నారదుడిలాగే గర్వభంగం పొందాల్సి వస్తుందని ఈ కథ సారాంశం.
మూలం డాక్టర్ యల్లాప్రగడ మల్లికార్జునరావు