Sunday, March 15, 2020

మోహినీ అవతారం

Image result for mohini rahu ketu



భారతీయ పురాణాలలో దేవతలను ఎప్పటికప్పుడు కాపాడుతూ వారితో ధర్మరక్షణ నిర్వహించే సర్వదేవతా సంరక్షుడిగా శ్రీ మహా విష్ణువు ప్రతి కథలోనూ కనిపిస్తాడు. క్షీరసాగర మధనం సమయంలో అమృతం ఉద్భవించింది.


ఆ అమృతాన్ని శ్రీ మహా విష్ణువు చేజిక్కించుకొని దేవతలకు ప్రసాదిద్దామని అనుకునేంతలోనే రాక్షసులు అమృత భాండాన్ని అపహరించుకు పోయారు. దేవతలంతా తెల్ల మొఖం వేసుకొని నీరుగారిన సమయంలో శ్రీ మహా విష్ణువు ఆ ప్రదేశం నుంచి అంతర్ధానమయ్యాడు. రాక్షసులు అమృతాన్ని ఎలా పంచుకోవాలో తెలియక వాదులాడుకుంటున్న సమయంలో వారి మధ్యకు అతిలోక సౌందర్యాన్ని ప్రదర్శిస్తూ ముగ్ధమనోహర మోహినీ రూపంలో శ్రీ మహా విష్ణువు రాక్షసులను సమ్మోహపరుస్తూ అక్కడ ప్రత్యక్షమయ్యాడు. రాక్షసులంతా అమృతం కోసం అప్పటి వరకు వాదులాడుకుంటున్న వారంతా మెరుపు తీగలాంటి మోహినీ రూపాన్ని చూసి నిశ్చేష్టులయ్యారు.

             ఆ అందం తమకు దక్కాలంటే తమకు దక్కాలని ఎవరికి వారు మదన తాపంతో వ్యాకులత చెందుతున్న సమయంలో అరమోడ్పు కన్నులతో మోహిని వారి వైపు చూసింది. మోహావేశపరులైన వారు ఆమె చెంతకు చేరారు. అమృతాన్ని అందరికి సమానంగా పంచమని అమృతభాండాన్ని ఆమె చేతికిచ్చారు. ఆ రాక్షసులను నమ్మించాలన్న నిశ్చయంతో తాను వారకాంతనని తన మీద వారికి నమ్మకం కలగడం విచిత్రంగా ఉందని చెప్పింది. కానీ వారంతా ఆమె మాటలనే పూర్తిగా విశ్వసిస్తామని, అమృతాన్ని సమంగా పంచమని ఆమె మీద విశ్వాసాన్ని ప్రకటించారు. రాక్షసులంతా సంబరపడుతూ అమృతభాండాన్ని తెచ్చి మోహినికి అందించగానే హొయలొలుకుతూ తీయ తియ్యటి మాటలతో అమృతాన్ని పంచే విషయంలో తాను ఏమాత్రం పొరపాటు పడినా సహించాలని గోముగా అడిగింది. వారంతా ఆమెను పూర్తిగా నమ్ముతున్నట్లు మరీ మరీ చెప్పడంతో అమృతాన్ని పంచడానికి సిద్ధపడింది. మోహినీ దేవతలను రాక్షసులను రెండు వరుసలుగా కూర్చోబెట్టి విలాసంగా వయ్యారంగా అమృతాన్ని పంచడం ప్రారంభించింది. ముందుగా అమృతాన్నంతటినీ దేవతల వరుసలోని వారికే పూర్తిగా ఇచ్చేసింది. ఈ విషయాన్ని గమనిస్తున్న రాహువు మాయా రూపంలో దేవతల వరుసలో కూర్చొని అమృతాన్ని అందుకున్నాడు. వెంటనే మోహిని తన అసలు రూపాన్ని ప్రదర్శించి శ్రీ మహా విష్ణువుగా అందరికీ సాక్షాత్కరించింది. మాయ రూపంలో ఉన్న రాహువు శిరస్సును శ్రీ విష్ణువు చక్రాయుధంతో ఖండించాడు. రాక్షసుల పక్షంలోని వారందరికీ ఇది మరీ మరీ బాధను కలిగించింది. బలి తన మాయతో దేవతలందరినీ మూర్చ పోయేలా చేశాడు. అయితే మహా విష్ణువు ఆ కష్టం నుంచి కూడా దేవతలను గట్టెక్కించాడు. కాలనేమి, మాలిలాంటి రాక్షసులను ఎందరినో విష్ణువు సంహరించాడు. దేవేంద్రుడు బలి, జంభబలులనే రాక్షసులను వధించాడు. గొప్ప వరం పొంది సామాన్యంగా మృత్యువు వాత పడలేనటువంటి నముచి అనే రాక్షసుడిని నురుగుతో విష్ణువు సంహరించాడు. ఇలా యుద్ధం కొనసాగుతుండగా బ్రహ్మదేవుడు విష్ణువును శాంతింపదలచి నారద మహర్షిని ఆయన వద్దకు పంపి యుద్ధాన్ని విరమింప చేశాడు.

         రాక్షసులను మోహపెట్టడానికి దేవతలను రక్షించడానికి, దుష్టశిక్షణ శిష్ట రక్షణ లక్ష్యాన్ని నెరవేర్చడానికి శ్రీ మహా విష్ణువు మోహినీ అవతారం ధరించాడని తెలుసుకున్న దేవతాగణాలలోని వారంతా అక్కడకు చేరడానికి బయలుదేరారు. గౌరి సమేతుడై శివుడు కూడా మోహినీ రూప సందర్శన కోసం అక్కడకు వచ్చి మోహిని మోహజాలంలో ఇరుక్కున్నాడు. మోహినీ అవతారం ఇలా ఓ కీలకమైన కార్యం కోసం ఆవిర్భవించినట్లు తెలుస్తోంది.