మహాభాగవతంలో వ్యాసుడు చెప్పిన కథ ఇది. ఈనాటికీ మానవాళికి ఎంతోగొప్ప సందేశాన్ని ఈ పురాణ కథ అందిస్తోంది. వివాహ సమయంలో వధూవరులకు ఈడూజోడూ కుదిరిందో లేదో చూసి పెళ్లి చేయటం తప్పనిసరని అని ఈడూ, జోడూ లేని వివాహాల వల్ల ఎన్నో అనర్ధాలు కలుగుతాయని తారాశశాంకం అనే ఈ కథ తెలియజేస్తోంది. దేవతల గురువైన బృహస్పతి భార్య తార. బృహస్పతి వృద్ధుడు. తార వయస్సులో ఉంది. బృహస్పతి నిత్యం యజ్ఞయాగాది క్రతువుల్లో నిమగ్నమై ఉండేవాడు. తార తన భర్తకు సేవలందిస్తూ ఉండేది. కానీ ఆమె యవ్వనంలో ఉండటంతో శారీరకంగా ఆమెకు కలిగిన కోరికలు తీరటానికి వీలుకలిగేది కాదు. వయస్సుతో వచ్చిన కోరికలను అణుచుకోవటానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తూనే ఆమె భర్తసేవలో నిమగ్నమై ఉండేది. ఇలా కాలం గడుస్తుండగా బృహస్పతి దగ్గర విద్య నేర్చుకోవటం కోసం అత్రి మహామునికి, అనసూయకు బ్రహ్మదేవుడి అంశ వల్ల జన్మించిన చంద్రుడు వచ్చాడు. చంద్రుడు ఎంతో అందంగా ఉండేవాడు. నవమోహనాకారుడు, సుందరుడు అయిన చంద్రుడిని చూసి తార మోహంతో వివశురాలైంది. ఎంతో కాలంగా తీరకుండా ఉన్న కోరికలను తీర్చుకోవటానికి తార చంద్రుడికి దగ్గరైంది. బృహస్పతి తరచూ యజ్ఞయాగాల కోసం దేశాంతరానికి వెళ్లడం వీరికి వీలు కలిగించింది. ఇలా ఉండగా తార గర్భవతి అయింది. అప్పుడు చంద్రుడు తారను తన వెంట తీసుకొని వెళ్లిపోయాడు. ఎక్కడికో వెళ్లి తిరిగి వచ్చిన బృహస్పతి విషయమంతా తెలుసుకొని తనభార్యను తనకు ఇవ్వమని చంద్రుడిని అడిగాడు. కానీ చంద్రుడు అందుకు ఒప్పుకోలేదు. ఆ కారణంగా చంద్రుడికి బృహస్పతికి ఘోరయుద్ధం జరిగింది. బృహస్పతికి బద్ధశత్రువైన రాక్షస గురువు శుక్రాచార్యుడు వచ్చి చంద్రుడి పక్షాన చేరాడు. దాంతో గురుశిష్యుల మధ్యన జరుగుతున్న ఆ యుద్ధం దేవదానవ యుద్ధంగా మారింది. ఇలా దేవతలకు, రాక్షసులకు సాగుతున్న పోరు విరామం లేకుండా ఉండటంతో లోకాలన్నీ తల్లడిల్లాయి. ఈ విషయాన్ని బ్రహ్మ గమనించి దేవదానవులకు యుద్ధం తగదని వివరించి యుద్ధాన్ని విరమింపజేసి శాంతింపచేశాడు. తారను బృహస్పతికి ఇచ్చి పంపివేశాడు. ఆ తరువాత కొంతకాలానికి తారకు ఒక కుమారుడు కలిగాడు. మళ్లీ చంద్రుడు వెళ్లి ఆ కుమారుడు తనవాడేనని తనకు అప్పగించమని కోరాడు. ఆ సమయలో బ్రహ్మ, రుషులు వచ్చి తారనే స్వయంగా అడిగి ఆమెకు పుట్టిన బాలుడు చంద్రుడి కుమారుడేనని తార వల్ల తెలుసుకొని ఆ శిశువును చంద్రుడికి అప్పగించారు. ఆ చంద్రుడి కుమారుడే బుధుడు. అందంలో చంద్రుడిలాగా, బుద్ధిలో బృహస్పతిలాగా భాసిల్లే బుధుడు నవగ్రహాలలో ఒకడయ్యాడు. ఈ బుధుడు నిత్య యౌవ్వనుడు. |
Tuesday, August 27, 2019
తారాశశాంకం
Subscribe to:
Posts (Atom)