అలల సవ్వడిలో
సప్తస్వర స్వనాలను సమ్మిళితం చేస్తూ రాజమహేంద్రి కాంతకు మణిమేఖలలా భాసిల్లుతూ
పరవళ్ళు తొక్కుతూ పరవశించి పోతూ, ఉరవళ్ళు తొక్కుతూ
ఉత్సాహంతో సాగుతూ సాగర సంగమం చేస్తున్న గోదారితల్లి పుట్టిల్లు మహారాష్ట్రలోని
నాసిక్ దగ్గర ఉన్న త్య్రంబకం. తన పుట్టుకలోనే ఓ పవిత్రతను, ఓ సామాజిక ప్రయోజనాన్ని నింపుకుని అవతరించిన
గౌతమీ మాత రాజమహేంద్రి దాకా సాగి మధ్య మధ్యలో ఎన్నెన్నో తీర్ధాలను ఉపనదులను
కలుపుకుని సప్తరుషుల పేర్ల మీద ఏడు పాయలుగా ఎగసి పడుతున్న ఆనందంలా సాగర సంగమానికి
ఉరుకులెత్తటం చూస్తుంటూనే గుండెనిండా ఆనందం గంతులేస్తుంటుంది. గోహత్య మహాపాపాన్ని
ప్రక్షాళన చెయ్యటానికి పరమేశ్వరుడి శిరస్సునుండి దూకి వచ్చిన ఈ గంగను(గౌతమి) తాకిన
వారందరికీ తరతరాల పాపం నశించి పుణ్యం ఒకటికి పది రెట్లు చేకూరుతుందన్నది ఆస్థిక జన
భావన. ఈ గౌతమి ఆవిర్భావానికి, అక్కడే
పరమేశ్వరుడు త్య్రంబకేశ్వరుడై జ్కోతిర్లింగ రూపంలో వెలుగొందటానికి కారణమైన ఓ కథ
స్థల పురాణంగా ప్రచారంలో వుంది.
(త్రయంబకేశ్వర ఆలయం)
అంతేకాక అష్టాదశ పురాణాలలో ఒకటైన శ్రీ
శివమహాపురాణంలో త్య్రంబకేశ్వర మహత్యం అనే పేరున కూడా ఒక కథ కనిపిస్తుంది. కొందరు
రుషులు గౌతమ మహర్షికి గోహత్యా పాపం సంక్రమించేలా చేసి ఆ పాపం పోవటానికి
పరమేశ్వరుడిని గురించి తపస్సు చేసి ఆయన అనుగ్రహంతో గంగను భూమి మీదకు తీసుకు
రమ్మనమని చెప్పారు. గౌతముడు అలాగే చేశాడు. పరమేశ్వరుడి అనుగ్రహంతో ఆయన శిరస్సు
నుండి నేల మీదకు వచ్చిన గంగ వెంటనే ఒక స్త్రీ రూపాన్ని ధరించి అక్కడ
ప్రత్యక్షమైంది. అప్పుడు గౌతముడు ఆమెకు నమస్కరించి తన వెంట వచ్చి పాపప్రక్షాళన
చేయమని కోరాడు. పరమేశ్వరుడు కూడా ఆమెను అలాగే చెయ్యమని ఆజ్ఞాపించాడు. కానీ గంగ
కేవలం గౌతమ ముని పాపాన్ని ప్రక్షాళన చేసి మళ్ళీ వెంటనే తిరిగి తన స్థానానికి తాను
చేరుకుంటానని చెప్పింది. కానీ భక్తవత్సలుడైన మహేశ్వరుడు మానవలోకానకి ఉపకారం
చెయ్యాలని అనుకుని సూర్యుడి కుమారుడు ఇరవై ఎనిమిదవ మనువుగా పాలనలోకి వచ్చేంత వరకూ
భూమి మీదే వుండమని ఆజ్ఞాపించాడు. అందుకు గంగ భూలోకంలో తనకు అందరి కన్నా, అన్నిటికన్నా విశేషశక్తిని కలిగించటం
దానితోపాటు పరమేశ్వరుడు కూడా పార్వతితోనూ, శివగణాలతోనూ కూడి తన సమీపంలోనే ఉన్నట్లైతే తాను భూలోకంలో వుండటానికి ఎటువంటి
అభ్యంతరం లేదని, తనకు ఆ వరాన్ని
ప్రసాదించమని వేడుకుంది. ఆమె మాటలను పరమేశ్వరుడు కాదనలేకపోయాడు. గంగను ఈశ్వరుడు
అలా అనుగ్రహించిన వెను వెంటనే అక్కడికి దేవతలు, రుషులు అనేక తీర్ధాల సమూహాలు వచ్చి చేరాయి.
వారంతా పరమేశ్వరుడికి గంగకు, గౌతముడికి జయ
ధ్వానాలు పలికారు. ఆ తర్వాత బ్రహ్మ, విష్ణు తదితర దేవతలంతా ముక్త కంఠంతో పరమేశ్వరుడిని స్తుతించారు. ఈశ్వరుడప్పుడు
ప్రసన్నుడై ఏదైనా వరం కోరుకోమని అన్నాడు. ఆ మాటలకు సంతోషించి ఆ దేవతలంతా కూడా
భూమి మీద అవతరించిన గంగను భూమి మీదే వుండేలాగా చెయ్యమని ప్రార్ధించారు. అయితే
అంతలోనే గంగాదేవి కల్పించుకుని ఆ దేవతలంతా కూడా ఎందుకు భూమి మీదే వుండకూడదని
అన్నది. అయితే వారు ఆమెకు సమాధానమిస్తూ ‘‘ సింహరాశౌ యదా స్యాద్వై గురుస్సర్వ
సుహృత్తమఃతదావయం చ సర్వే త్యాగ మిష్యామో న సంశయంఏకాదశ చ వర్షాణి లోకానాం పాతకం
త్విహంక్షాలితం యద్భవేదేవం మలి నాస్స్మ గురి ద్వరే’’గురువు ఎప్పుడు సింహరాశిలో
వుంటాడో అప్పుడు తామంతా నిశ్శంసయంగా గంగలోకే వచ్చి వసిస్తామని చెప్పారు. పదకొండు
సంవత్సరాలపాటు తామంతా మానవుల పాపాలను ప్రక్షాళనం చేసే పనిలో నిమగ్నమై ఉండి
పన్నెండవ సంవత్సరంలో తమ మాలిన్యాన్ని పోగొట్టుకునేందుకే ఇలా వస్తున్నట్లు కూడా
చెప్పారు. సింహంలో గురుడు వున్నంతవరకు తాము గంగలో వుంటామని, అప్పుడు శంకురుడిని దర్శించి తమ పాపాలను
కడిగేసుకుంటామని ఆ తరువాత కూడా గంగ అనుమతిని పొంది మాత్రమే తమ తమ నెలవులకు
వెళ్తామని దేవతలంతా గంగాదేవికి చెప్పారు. ఆ మాటలకు గంగ ఎంతో సంతోషించింది.
ఆనాటినుండి ఆ ప్రదేశంలో పరమేశ్వరుడు తన గణాలతోనూ, పార్వతితోనూ త్య్రంబకేశ్వరుడుగా అవతరించాడు.
సంస్కృత భాషలో అంబకము అనే పదానికి కన్ను అనే అర్ధం ఉంది. మూడు కన్నులు గలవాడు కనుక
ఆయన త్య్రంబకుడయ్యాడు. గంగ కూడా ఆనాటినుండే గౌతమిగా మారిపోయింది. అంటే గౌతమ మహర్షి
తపస్సు చేయగా అవతరించిన కారణంగా ఆ పేరు స్థిరపడింది. ఆనాటినుండే గురువు సింహరాశిలో
వుండగా సర్వతీర్ధాలు, దేవతలు అక్కడకు
రావటం ప్రారంభించారు. అదే పుష్కర సుమయమైంది. అలా గౌతమీనది అవతరణ, త్య్రంబకేశ్వర జ్యోతిర్లింగ ఆవిర్భావం
జరిగినట్లుగా శివపురాణంలోని గౌతమి మహాత్యం అనే కథ వివరిస్తుంది. త్య్రంబకేశ్వర
జ్యోతిర్లింగ మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో ఉంది. ఈ నాసిక్‌కు కూడా స్థల
పురాణముంది. సీతారామలక్ష్మణులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో బ్రహ్మగిరికి సమీపంలో
వుండగా శూర్పణఖ తారసిల్లింది. ఆమె ఆగడాలను సహించలేని లక్ష్మణుడు ఆమె నాసికను,
చెవులను ఇక్కడే
ఖండించాడని ఆ కారణంగానే ఈ ప్రదేశానికి నాసిక్ అని పేరు వచ్చిందని పెద్దలు
పేర్కొంటున్నారు.
- శ్రీ యల్లాప్రగడ మల్లికార్జున రావు గారు
- సేకరణ ఈనాడు దినపత్రిక నుంచీ