Showing posts with label పురాణాలు. Show all posts
Showing posts with label పురాణాలు. Show all posts

Wednesday, August 19, 2020

సాల్వ వధ

 Ancient Aircraft (Vimana) and Parachute by King Salwa in Bhagavata ...


 ఈ కథ మహాభారతం అరణ్యపర్వం ప్రథమాశ్వాసంలో ఉంది. అన్ని కథల కన్నా ఈ కథకు ఒక ప్రత్యేకత ఉంది. దుర్యోధనుడు నిండుసభలో ద్రౌపదిని, పాండవులను అవమానించటం, అంతకంటే ముందు పాండవులు, కౌరవులు జూదం ఆడటం, ఆ జూదంలో అన్యాయంగా కౌరవులు పాండవులను ఓడించి ద్రౌపది వస్త్రాపహరణం, పాండవుల అరణ్యవాసం ఇలాంటి దుష్కృత్యాలు ఎన్నెన్నో సంభవించాయి. అయితే పాండవుల పక్షపాతిగా నిరంతరం వారిని వెన్నంటి ఉన్న శ్రీకృష్ణుడు పాండవులను జూదం ఆడకుండా ఎందుకు నివారించలేకపోయాడు అనే ప్రశ్నకు శ్రీకృష్ణుడే సమాధానం చెప్పిన సందర్భం ఈ కథలో ఉంది.

జూదంలో ఓడిపోయి అరణ్యాల పాలైన పాండవులు కామ్యకవనానికి చేరుకున్నారు. అక్కడకి శ్రీకృష్ణుడు వచ్చి పాండవుల యోగక్షేమాలను విచారించాడు. తాను సాల్వుడు అనే శిశుపాలుడి సోదరుడితో పదినెలల పాటు యుద్ధం చేస్తున్న కారణంగా తనకు పాండవులు జూదానికి వెళ్ళిన సంగతికానీ మరి ఏ ఇతర విషయాలు కానీ తెలియలేదని, సాల్వుడిని సంహరించిన తర్వాత యుధానుడు తనకు ఈ విషయమంతా చెప్పాడని వెంటనే తనకు పాండవులను చూడాలనిపించి కామ్యకవనానికి వచ్చానని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు.

శ్రీకృష్ణుడు చెప్పిన మాటలను విని ఎంతో ఆశ్చర్యానికి లోనైన ధర్మరాజు తనకు సాల్వవధ ఇతివృత్తాన్ని వివరించి చెప్పమన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ యుద్ధానికి సంబంధించిన పూర్వాపరాలన్నింటినీ ధర్మరాజుకు వివరిస్తూ శిశుపాలుడి తమ్ముడైన సాల్వుడు తాను శిశుపాలుడిని సంహరించినందుకు తనమీద ఎంతో క్రోధాన్ని పెంచుకున్నాడని కృష్ణుడు చెప్పాడు. సాల్వుడికి సౌంభకం అనే కామగమనం గల ఒక నగరం ఉండేదని ఆ నగరంతో సహా సాల్వుడు ఎదురువచ్చి ద్వారకా నగర పరిసరాలలో శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని కృష్ణుడిని సంహరిస్తానని పెద్దపెద్దగా కేకలు పెడుతుండగా యాదవ కుమారులు సాల్వుడి మీదకు దండెత్తి వెళ్ళారు. వారిలో చారుధేష్ణుడు, ప్రద్యుమ్నుడు, సాంబుడు తదితరులను సాల్వుడి సేనాపతి అయిన క్షేమవృద్ధి ఎదిరించాడు. సాంబుడు వాడిని తన బాణపు దెబ్బలతో ఏడిపించాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక క్షేమవృద్ధి పారిపోగా వేగవంతుడు అనే మరొకడు వచ్చి సాంబుడి మీద విరుచుకుపడ్డాడు. అప్పుడు చారుదేష్ణుడు వేగవంతుడిని ఎదిరించి వధించాడు. ఆ తర్వాత విలంత్యుడు అనే వాడిని కూడా చారుదేష్ణుడు వధించటంతో సాల్వుడు ఉగ్రుడై తన మహాసేనతో అక్కడికి వచ్చాడు. అప్పుడు ప్రద్యుమ్నుడికి సాల్వుడికి ఘోరయుద్ధం జరిగింది. ప్రద్యుమ్నుడు దివ్యాస్త్రంతో వాడిని సంహరించబోగా నారదుడు తదితర మునులు అక్కడికి వచ్చి తొందర పడవద్దని సాల్వుడి మరణం శ్రీకృష్ణుడి చేతిలోనే ఉందని చెప్పటంతో ప్రద్యుమ్నుడు వాడిని వదిలివేశాడు. యాదవ కుమారులను సాల్వుడు ఇలా ఎదురిస్తూ ద్వారకానగరాన్ని ముట్టడిస్తున్నాడన్న సంగతి ధర్మరాజు చేస్తున్న రాజసూయయాగంలో ఉన్న శ్రీకృష్ణుడికి తెలిసింది. యాగం పరిసమాప్తి అయిన తర్వాత సాల్వుడి వధకు కృష్ణుడు పూనుకున్నాడు. అంతేగాక వాడిని సంహరించి కానీ ద్వారకలో అడుగుపెట్టనని కృష్ణుడు శపథం చేసి తన పాంచజన్యాన్ని పూరించి శిశుపాలుడి తమ్ముడైన సాల్వుడు ఉన్న మూర్తికావత దేశం మీదకు అసంఖ్యాక చతురంగ బలాలతో వెళ్ళాడు. అయితే సాల్వుడు తన కామగమనం గల నగరం సౌంభకంతో సహా సముద్రకుక్షి దేశానికి వెళ్ళాడు. కృష్ణుడు కూడా అక్కడికే వెళ్ళి వారితో ఘోరయుద్ధానికి తలపడ్డాడు. సాల్వుడు తన సౌంభకాన్ని ఎక్కి శ్రీకృష్ణుడితో ఎన్నోరకాలుగా మాయాయుద్ధం చేశాడు. కృష్ణుడి మీద శిలావర్షాన్ని కురిపిస్తుండటంతో కృష్ణుడు తన వజ్రబాణాల చేత ఆ శిలావర్షాన్ని నిరోధించాడు. వాడు తన నగరంతో సహా ఆకాశంలో మాయమై దొంగచాటుగా యుద్ధం చేస్తుండటంతో చివరకు ఇక సహించలేక కృష్ణుడు తన చక్రాయుధాన్ని వాడిమీదకు సంధించాడు. అది ఆకాశంలో ఉన్న సౌంభకంలోని సాల్వుడిని సంహరించింది. వెంటనే సౌంభక నగరంతో సహా సాల్వుడు నేలకూలాడు.

* * *

పదినెలల పాటు శ్రీకృష్ణుడు తాను ఇలా ఘోరాతి ఘోరంగా సాల్వుడితో యుద్ధం చేసి వాడిని సంహరించి కానీ ద్వారకకు చేరుకోలేదని ఈ కారణంగానే పాండవుల విషయాలు ఏవీ తనకు తెలియకుండా పోయాయని చెప్పాడు. ఆ తర్వాత కృష్ణుడు పాండవులందరికీ ధైర్యవచనాలు చెప్పి తన చెల్లెలైన సుభద్రను, మేనల్లుడైన అభిమన్యుడిని రధం మీద ఎక్కించుకొని ద్వారకా నగరానికి తీసుకువెళ్ళాడు. అలాగే ద్రౌపది సోదరుడైన దృష్టద్యుమ్నుడు ద్రౌపదికి పాండవుల అయిదుగురి వల్ల కలిగిన ఉపపాండవులను తీసుకొని ద్రుపది నగరానికి వెళ్ళిపోయాడు. ఈ కారంణంగానే మిగిలిన అరణ్య, అజ్ఞాతవాస సమయాలలో సభద్ర, అభిమన్యుడు, ఉపపాండవుల ప్రస్తావన మనకు కనిపించదు.

Friday, August 14, 2020

భాగవతంలో వానరం

 Hindu Blog - The Story of Balarama and Monkey Dvividha... | Facebook

రామాయణంలో వానర సేనా వాహని శ్రీరామచంద్రుడికి సహాయం చేసి రామ కార్యాన్ని నెరవేర్చింది. భారతంలో భీమసేనుడు సౌగంధికా పుష్పాన్ని తెచ్చే సందర్భంలో ఆంజనేయుడు భీముడికి ప్రత్యక్షమై ఆ తర్వాత అర్జునుడి రథానికి ‘జెండాపై కపిరాజు’గా నిలిచాడు. ఇలా రామాయణ, భారతాల్లో వానర ప్రస్తావన కనిపిస్తుంది. కానీ భాగవతంలో దైవానికి సహాయకారిగా కాక అపకారిగా పరిణమించబోయి ప్రాణాలను కోల్పోయిన మరో వానరం కథ ఉంది. భాగవత మహాపురాణంలో బలరాముడి బలపరాక్రమాల విజృంభణను వివరించే కథలలో ఇది ప్రధానమైనది.

శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించి లోక కళ్యాణ కారకుడయ్యాడు. నరకాసురుడి స్నేహితులకు, బంధువర్గానికి మాత్రం ఇది ప్రాణాంతకంగా పగను రగిల్చిన సంఘటనగానే గుర్తుండిపోయింది. నరకుడి స్నేహితులలో ప్రధానుడు, మహాబలశాలి అయిన వానరుడు ఒకడుండేవాడు. అతడి పేరు ద్వివిదుడు. వాడు చాలా గర్విష్టి. శరీరబలంలో తనను మించినవాడు ఇంకొకడు ఎవడూ లేదన్నది వాడి భావన. తన స్నేహితుడైన నరకుడ్ని చంపినందుకు కృష్ణుడి మీద పగతీర్చుకోవాలని అనుకుని ద్వారకా నగరంలో ఒక రోజున ప్రవేశించాడు. పల్లెలను తగలబెట్టడం, నదులన్నింటినీ ఇంకిపోయేలా చెయ్యటం, పశువుల మందలను నాశనం చెయ్యటం, అగడ్తలను పూడ్చివేయటం ఇలా ఎన్నెన్నో అకృత్యాలు అక్కడ చేయసాగాడు. వాడి చేష్టలు సామాన్య ప్రజలకు కూడా అతి భయంకరంగా మారాయి. చేతికి దొరికిన మనుషులందరినీ చావబాది కాళ్ళూ చేతులు కట్టివేసి గుహలలో తోసి పెద్దపెద్ద బండరాళ్ళు అడ్డుపెడుతూ ఉండేవాడు. ఇలా శ్రీకృష్ణుడు పరిపాలిస్తున్న ప్రాంతమంతా వాడి చేష్టలకు అల్లకల్లోలమయింది. ఒకరోజున వనంలో తన స్త్రీజన పరివారంతో విలాసంగా కాలం గడుపుతున్న బలరాముడి దగ్గరకు ద్వివిదుడు వచ్చాడు. తన కోతి చేష్టలతో ఎన్నెన్నో రకాలుగా అక్కడ ఉన్నవారిని ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. కోతి చేష్టలు మరీ విపరీతం కావడంతో బలరాముడు తనకు సమీపంలో ఉన్న ఒక పెద్దరాయిని తీసి ద్వివిదుడి మీదకు విసిరికొట్టాడు. అయితే వాడు ఆ రాయి దెబ్బను తప్పించుకోవటమే కాక బలరాముడి పక్కనే ఉన్న మద్యంతో నిండివున్న భాండాన్ని తీసుకుని చెట్టుమీదకు ఎగిరి కూర్చుని దాన్ని నేలమీదకు విసిరికొట్టాడు. బలరాముడికి ఎంతో ప్రియమైన మద్యం నేలపాలయింది. అంతలోనే ఆ వానరుడు అక్కడ ఉన్న స్త్రీజనం చీరలను చింపటం, మెడలో హారాలను తెంచటం లాంటి పనులను చేసి బలరాముడి కోపం ప్రజ్వరిల్లేలా ఎన్నెన్నో కోతి చేష్టలను ప్రదర్శించాడు. ఇక బలరాముడు ఆగలేక తన ఆయుధాలైన నాగలి, రోకలిని చేతపట్టుకుని ఆ కోతి వెంటపడ్డాడు. ఆ దెబ్బతో ద్వివిదుడికి మరింత కోపం వచ్చి అక్కడ ఉన్న ఒక చెట్టును ­డపెరికి బలరాముడి మీదకు విసిరాడు. బలరాముడు దెబ్బతిన్న రేచులాగా ఒక్క ఉదుటున లేచి తన చేతిలో ఉన్న రోకలిని గిరగిరాతిప్పి ఆ వానరుడి మీదకు విసిరాడు. ఆ దెబ్బతో వాడు కిందపడి మూర్ఛిల్లాడు. మరికొద్దిసేపటికి తెప్పరిల్లుకున్న వాడు మరొక చెట్టును పీకి బలరాముడి మీదకు విసిరాడు. అయితే బలరాముడు దాన్ని తన నాగిలిని అడ్డంపెట్టి ముక్కలు ముక్కలు చేశాడు. వానరుడు విసురుతున్న రాళ్ళన్నీ బలరాముడి రోకలి దెబ్బలకు నుగ్గునుగ్గు అయ్యాయి. ఇలా కొద్దిసేపు గడిచిన తర్వాత బలరాముడు ముందుకు ఉరికి బిగించిన తన పిడికిలితో ఆ వానరుడి మెడమీద ఒక్క పోటు పొడిచాడు. ఆ దెబ్బతో వాడి ప్రాణాలు గాలిలో కలిశాయి. రైవతక పర్వత ప్రాంతమంతా వాడు పెట్టిన చావుకేకకు దద్దరిల్లింది. ఇలా భాగవతంలో శ్రీకృష్ణుడి అన్న బలరాముడి చేతిలో ద్వివిదుడు అనే దుష్టబుద్ధిగల వానరుడు హతుడయ్యాడు.

Wednesday, June 24, 2020

వామనావతారం

Story of Vamana Avatar - Hinduism for Kids



భాగవతమంటే భగవత్‌ భక్తుల కథ. భగవత్‌ భక్తులకు సద్గుణాలే అలంకారం. అలాంటి మంచి గుణాలలో దానగుణం మరీ శ్రేష్ఠమైనది. ముక్తిమార్గాన్ని అనుసరించడానికి అది ఎంతగానో దోహదం చేస్తుందని బలిచక్రవర్తి కథ వివరిస్తోంది. బలి చక్రవర్తి దానగుణంలో అద్వితీయుడు. శ్రీమహావిష్ణువు దేవతల కోరికలను అనుసరించి బలిచక్రవర్తి వద్దకు వామనావతారంలో వెళ్ళడానికి బలిచక్రవర్తి దానగుణమే ప్రధానమైంది. మంచి ముఖవర్ఛస్సుతో పొట్టిగా ఉన్న బ్రాహ్మణ బాలుడు తన కోసం నడుస్తూ వచ్చేసరికి బలిచక్రవర్తికి ఎంతో ఆనందం వేసింది. ఎదురు వెళ్ళి నమస్కరించి తన సింహాసనం మీద కూర్చోబెట్టి అతిథిపూజ చేసి యోగక్షేమాలను అడిగాడు. ఆ తరువాత ఏమి కావాలో కోరుకోమని, విలువైన ఆభరణాలు, వస్త్రాలు, భూములేకాక చివరకు తన రాజ్యాన్నయినా ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు. అప్పుడు ఓ చక్కటి చిరునవ్వు నవ్వి తనలాంటి వాడికి అవేవీ అక్కర్లేదని, తనకు కేవలం మూడడుగుల నేల మాత్రం చాలని, దాన్ని ఇస్తే తనకు బ్రహ్మానందం కలుగుతుందని వామనుడు చెప్పాడు. బలిచక్రవర్తికి కొంత ఆశ్చర్యమేసింది. తనలాంటి రాజు దగ్గరకు వచ్చి తన అంతస్తుకు తగిన విధంగా ఏవైనా కోరుకోమని మళ్ళీ వేడుకున్నాడు. ఆశ మనిషికి చాలా చేటు తెస్తుందని, ఆశ పొడవైన తాడులాంటిదని, ఆ ఆశాపాశానికి చిక్కుకోవడం మనిషికి మంచిదికాదని వామనుడు వివరించాడు. తనకు కావాల్సింది కేవలం మూడు అడుగుల నేల మాత్రమేనని, దానిని ఇవ్వమని కోరాడు. బలిచక్రవర్తి ఒక స్థిర నిర్ణయానికి వచ్చి వామనుడికి మూడడుగుల నేల దానం ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ఇంతలో రాక్షస గురువైన శుక్రాచార్యుడు అక్కడికి వచ్చి, వచ్చినవాడు సామాన్యుడు కాడని, మూడడుగుల నేలను దానంగా తీసుకుని త్రివిక్రముడై బలిని అణచివేస్తాడని, దానితో వంశము, కులము, రాజ్యము అన్నీ నాశనమవుతాయని, దానము ఇవ్వవద్దని హెచ్చరిక చేశాడు. బలిచక్రవర్తి క్షణకాలం ఆలోచించి తన గురువుకు సమాధానం చెప్పాడు. పూర్వం తనకంటే అధికంగా రాజ్యాన్ని సముపార్జించిన రాజులు ఎందరెందరో ఉన్నారు. కానీ వారు మరణించిన తరువాత వారి పేరు ఎవరూ తలుచుకోలేదు. అదే శిబి చక్రవర్తి వంటివారుమంచి దానాలు చేసి ఇప్పటికీ కీర్తి అనే శరీరంతో వెలుగొందుతున్నారు. తాను కూడా దానం ఇవ్వటానికి సిద్ధమయ్యానని చెప్పాడు. వచ్చినవాడు హరి అయినా మరి ఎవరయినా తనకు లెక్కలేదని, అంతటివాడి చేయి కింద ఉండి తన చేయి పైన ఉండటమే తనకు ఆనందదాయకమని అన్నాడు. దానం ఇచ్చినందు వల్ల కులము, రాజ్యము, వంశము ఏవి నాశనమయినా తనకు లెక్కలేదని, ఒక్కసారి ఇచ్చినమాట వెనుకకు తీసుకోబోనని చెప్పాడు. ఆ తరువాత స్థిర నిర్ణయంతో వామనుడికి ఆనందంగా మూడడుగుల నేలను దానం చేశాడు. వామనుడు త్రివిక్రముడై, విశ్వమంతా వ్యాపించి బలిచక్రవర్తిని పాతాశ సామ్రాజ్యానికి అధిపతిని చేశాడు. బలిచక్రవర్తి పాత్ర ద్వారా భారతీయ సనాతన సంప్రదాయంలో దానగుణానికి ఉన్న విలువ ఎంతటిదో తెలుస్తోంది.

Monday, June 22, 2020

సావిత్రి

Savitri – Vyasa Mahabharata




మద్రదేశాధిపతి అయిన అశ్వపతికి ఆయన భార్య మాళవికి సావిత్రీ దేవత వరప్రసాదం వల్ల సావిత్రి జన్మించింది. 18 సంవత్సరాల నిరీక్షణ అనంతరం ఆ దంపతులకు అందం, తేలివితేటలు, అదృష్టం ఉన్న బాలిక జన్మించింది. సావిత్రి యుక్తవయసుకు వచ్చేసరికి అందాలరాశిగా, అతిలోక సౌందర్యవతిగా ఎదిగింది. ఆమెకు ఆశ్వపతి వివాహ ప్రయత్నాలు చేయడం ప్రారంభించాడు. చాలాకాలం పాటు ప్రయత్నాలు కొనసాగాయి. సాళ్వ రాజ్యాధిపతైన ద్యుమత్సేనుడి కుమారుడు సత్యవంతుడు. సత్యవంతుడి రూప, గుణ, విలాసాలను తెలుసుకొని ఆకర్షితురాలైంది. సావిత్రి. కానీ ద్యుమత్సేనుడి రాజ్యభ్రష్ఠుడై అడవులపాలై ఉన్నాడు. ఒకనాడు నారదమహర్షి మద్రదేశాధిపతైన ఆశ్వపతి దగ్గరకు వచ్చిన సందర్భంలో సావిత్రి పెళ్ళి ప్రస్తావన వచ్చింది. సావిత్రి దృఢ నిశ్చయంతో తన మనసులోని మాటను చెప్పి సత్యవంతుడిని వివాహమాడుతానని చెప్పింది. అందుకు నారదుడు సంతోషించాడు. అశ్వపతి ద్యుమత్సేనుండి వివరాలను అడుగగా నారదుడు తన దివ్యదృష్టితో చూసి సత్యవంతుడు రూపంలోనూ, గుణంలోనూ గొప్పవాడే అయినప్పటికీ ఒక సంవత్సర కాలంలోపు మరణించే అల్పాయిష్కుడని చెప్పాడు. అంతేకాక ఆశ్వపతి, నారదులు ఇద్దరూ సావిత్రిని ఈ కారణంతో మనసు మార్చుకొని వేరొక వరుడిని వివాహమాడమని చెప్పారు. అయినా ఆమె తన పట్టుదలను వదలలేదు. చేసేదిలేక ఆమె తండ్రి అడవికి వెళ్ళి ద్యుమత్సేనుడికి విషయమంతా వివరించి సావిత్రీ సత్యవంతుల వివాహానికి ఒప్పించాడు. ఒక శుభముహూర్తంలో మంచి కానుకలిచ్చి వివాహం జరిపించాడు. వివాహమైన తరువాత రత్నాభరణాలను, విలువైన వస్త్రాలను ధరించక కేవలం నార చీరలనే ధరించి సావిత్రి అత్తమామలకు, భర్తకు సపర్యలు చేస్తూ గడుపుతోంది. ఇంతలో నారదమహర్షి సత్యవంతుడి ఆయుస్షుకు సంబంధించి చేసిన హెచ్చరిక గుర్తుకు వచ్చింది. మరి నాలుగు రోజుల్లో సత్యవంతుడికి ఆయువు తీరుతుందని గ్రహించిన ఆమె కఠోరమైన త్రిరాత్రవ్రతానికి సిద్ధమైంది. మూడురోజుల వ్రతం ముగిసి నాలుగోరోజు ఉదయం సత్యవంతుడు అడవికి పూవులు, ఫలాల కోసం బయలుదేరాడు.
సావిత్రి కూడా అతడి వెంట బయలుదేరగా వద్దని వారించాడు. అయినా ఆమె భర్తను బతిమాలి, అత్తమామల దగ్గర సెలవు తీసుకొని అడవికి బయలుదేరింది. ఆ ఇద్దరూ అడవిలో పువ్వులు, పండ్లు కోసిన తరవాత కట్టెలను కొట్టిన అనంతరం సత్యవంతుడికి బాగా అలసటగా అనిపించి సావిత్రి ఒడిలో తలపెట్టుకొని పడుకున్నాడు. అలా పడుకున్న కొద్దిసేపటికి అతడు నిస్తేజుడు కావటం, కొద్దిదూరంలో తేజోవంతుడైన ఒక దివ్యపురుషుడు నిలబడి ఉండటం సావిత్రి గమనించింది. సత్యవంతుడిని తన ఒడి నుంచి దింపి ఆ దివ్యపురుషుడికి ఎదురుగా వెళ్ళి ఆయనయమధర్మరాజని తెలుసుకుని, యముడు తన భర్త ప్రాణాలను బంధించి తీసుకువెళ్ళడం చూసి వెంబడించింది. తనను వెంబడించి వస్తున్న సావిత్రి పాతివ్రత్య మహిమకు యముడు ముగ్ధుడై పతి ప్రాణం తప్ప ఏమైనా కోరుకోమన్నాడు. అప్పుడు ఆమె తన మామగారికి చూపును ప్రసాదించమని కోరింది. ఆ వరమిచ్చిన తరువాత మళ్ళీ వెంబడిస్తున్న సావిత్రిని చూసి ఇంకొక వరం కోరుకోమ్మనగా తన మామకు రాజ్యప్రాప్తి కలగాలని కోరుకుంది. యముడు అనుగ్రహించాడు. అయినా వదలక వెంబడిస్తున్న సావిత్రిని పతిప్రాణం తప్ప వేరొకటి కోరుకొమ్మనగా తన తండ్రికి పుత్రప్రాప్తి కలగాలని వేడుకుంది. అయినా మళ్ళీ వెంబడిస్తూ తన వాక్‌ చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్న సావిత్రి పాతివ్రత్యానికి ముచ్చటపడి యముడు సత్యవంతుడి ప్రాణాలను తిరిగి ఇచ్చేశాడు. ఇలా సావిత్రి తన మనోనిబ్బరంతో, దృఢ సంకల్పంతో అత్తమామలకు రాజ్యాన్ని, తండ్రికి పుత్రసంతానాన్ని, తనకు అయిదోతనాన్ని సంపాదించుకోగలిగింది. ఆడది అబలకాదు సబల అని సావిత్రి కథ వివరిస్తోంది.

Sunday, May 31, 2020

వింధ్యాద్రి గర్వభంగం - అగస్త్య మహాముని

Agastya and Lopamudra. - Mahabharat - A Story Retold | Facebook



                                                 
                     అసూయాపరులకు, గర్వపోతులకు ఎప్పటికైనా గర్వభంగం తప్పదన్న సత్యాన్ని ఈ కథ నిరూపిస్తుంది. స్కాందపురాణంలో ఈ కథ కనిపిస్తుంది.


                   భూమండలం మీద ఉన్న కులపర్వతాలన్నింటికీ హిమవంతుడు రాజు. అలాగే మిగిలిన పర్వతాలలో ఒక్కొక్క పర్వతానికి ఉన్న విశేషాన్ని అనుసరించి సప్తకుల పర్వతాలకు ఒక్కొక్క ప్రత్యేకతను బ్రహ్మ ఏర్పాటు చేశాడు. అవికాక మిగిలిన ఇతర పర్వతాలకు కూడా స్థల ప్రభావాన్ని అనుసరించి ఒక్కొక్క పర్వతానికి ఒక్కొక్క గుర్తింపు ఇచ్చాడు. మిగిలిన పర్వాతాల గొప్పతనాన్ని చూసి వింధ్యపర్వతం మాత్రం నిరంతరం అసూయ పడుతుండేది. తాను కూడా తలచుకుంటే ఎంతో ఎత్తుకు ఎదగగల శక్తి కలిగిన పర్వతాన్నేనని గర్వపడుతుండేది. ఇలా గర్వపడటమే ఆ పర్వతం ఇప్పటికీ అణిగి మణిగి ఉండటానికి కారణమైంది. నిరంతర అసూయాగుణం కలిగిన ఆ వింధ్యపర్వతం ఒక రోజున నారదుడు దోవలో వెళుతుండగా ఆయనకు స్వాగతం పలికి అతిథి పూజలు చేసి సత్కరించి తన గోడంతా వెళ్లబోసుకుంది. మేరు పర్వతం, హిమాలయ పర్వతం, మందర పర్వతం, ఇలాంటి పర్వతాలు ఏవీ తగిన సామర్థ్యం కలిగి ఉండకపోయినా వాటిని అందరూ గౌరవిస్తున్నారని, పూజిస్తున్నారని వాస్తవానికి ఆ పర్వతాలన్నింటికంటే తానే అధిక శక్తి కలిగిన దానినని చెప్పుకుంది. నారదుడు వింధ్యపర్వతం గర్వం చూసి మనసులో నవ్వుకున్నాడు. కానీ కలహాభోజుడు అప్పటికి ఏదో ఒక విధంగా వింధ్యపర్వతం దగ్గర నుంచి బయటపడి వింధ్య పర్వతాన్ని సమర్ధిస్తున్నట్లుగా మిగిలిన పర్వతాలను తక్కువగా చూస్తున్నట్లుగా భావం కలిగేలా పూర్తిగా తన ప్రవర్తనను ప్రకటించకుండా వింధ్యాద్రి నుంచి ముందుకు కదిలాడు. వింధ్యపర్వతం ఆనాటి నుంచి ఎలాగైనా తన గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలని అనుకుంది. వెంటనే ఆకాశం వరకు పెరిగింది.  వింధ్యపర్వతం అలా ఆకాశం వరకు పెరిగే సరికి సూర్యగమనానికి అడ్డంకి ఏర్పడింది. సూర్యుడు పర్వతానికి ఆ వైపు నిలిచిపోయాడు. నక్షత్ర, గ్రహ సంచారాలు కూడా ఆగిపోయాయి. ఇటువైపు, అటువైపు పగలు, రాత్రుల్లో మార్పులు జరగడం లేదు. దాంతో లోకవాసుల జీవితాలన్నీ అయోమయంలో పడ్డాయి.

                                              సూర్యోదయ సూర్యాస్తమయాలు లేక మునులు సంధ్యావందనం, యజ్ఞయాగాలు చేసుకోలేకపోయారు. ఈ విపరీత పరిస్థితి దేవతలను సైతం బాగా కలచివేసింది. దేవతలంతా కలసి బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లి మొర పెట్టుకున్నారు. బ్రహ్మ సమయ స్ఫూర్తితో ఆలోచించి వింధ్యపర్వతం గర్వం అణచటానికి అగస్త్య మహాముని ఒక్కడే తగిన వాడని భావించాడు. గతంలో ఇంద్రపదవి చేపట్టి లోకాలను బాధించిన నహుషుడి గర్వాన్ని అణించింది, సముద్రాల జలాలను ఔపోశన పట్టింది ఆ మునేనని చెప్పి దేవతలందరినీ తీసుకుని అగస్త్య మహాముని ఆశ్రమానికి వెళ్లాడు. ఆయనకు విషయమంతా వివరించి ఎలాగైనా వింధ్యపర్వతం గర్వం అణచి ప్రపంచానికి మేలు చేయమని ప్రార్ధించాడు. అగస్త్యుడు కాశీ మహానగరాన్ని, కాశీ విశ్వేశ్వరుడిని, అన్నపూర్ణను విడిచిపెట్టి వెళ్లడం ఇష్టం లేకపోయినా లోకకల్యాణం కోసం దేవతల కోరికను తీర్చడం కోసం తన భార్య అయిన లోపాముద్రను వెంటపెట్టుకుని బయలుదేరాడు.  వింధ్యపర్వతాన్ని ఆ దంపతులిద్దరూ సమీపించగానే వింధ్యుడు వారికి నమస్కరించి ఎటు వెళుతున్నారని అడిగాడు. అప్పుడు అగస్త్యుడు తాను భార్యా సమేతంగా దక్షిణ భారత యాత్రకు బయలుదేరినట్లు తమకు దోవ ఇస్తే అవతల వైపునకు వెళ్లగలమని చెప్పాడు. వింధ్యుడు అందుకు ఒప్పుకున్నాడు. అయితే అగస్త్యుడు తాను మళ్లీ తిరిగి వచ్చే వరకు అలాగే ఎత్తు తగ్గించుకుని అణిగి మణిగి ఉండాలని వింధ్యుడికి చెప్పాడు. అగస్త్యుడి మాటల్లోని ఆంతర్యాన్ని గమనించలేని వింధ్యపర్వతం ఆకాశానికి పెంచిన తన దేహాన్ని తగ్గించుకుని ముని దంపతులకు దారి ఇచ్చింది. లోపాముద్రతో కలసి ఆ పర్వతాన్ని దాటి ముందుకు వెళ్లాడు. సూర్యచంద్రాదులకు, నక్షత్ర గ్రహాలకు అడ్డు తొలగిపోవడంతో మళ్లీ ప్రపంచమంతా హాయిగా యథావిథిగా గడపగలిగింది.

                  అగస్త్యుడు కాశీ మహానగరం నుంచి అలా దక్షిణ భారతదేశంలో దాక్షారామం, శ్రీశైలం తదితర ప్రాంతాలను సందర్శించి అక్కడే ఉండిపోయి వెనక్కు తిరిగిరాలేదు. దాంతో వింధ్యుడు అలాగే ఉండిపోయాడు. 

Thursday, May 28, 2020

హయగ్రీవావతారం

14 Best Lord Hayagreeva images | Gods, goddesses, Lord vishnu ...



సకల చరాచర సృష్ఠికి కర్త అయిన బ్రహ్మకు శక్తిని ఇచ్చేవి వేదాలే, ఆ వేదాల సంరక్షణలో నిరంతరం మహావిష్ణువు నిమగ్నమై ఉంటాడని, విష్ణుతత్వ మహత్యాన్ని, వేద విజ్ఞాన ఔన్నత్యాన్ని గురించి ఈ కథ తెలియజేస్తుంది.

                      శ్రీ మహావిష్ణువు దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం ఎన్నో విధాలుగా ఎన్నెన్నో సందర్భాల్లో అవతరించాడు. తేజోవంతమైన రూపంతో ఆయన హయగ్రీవావతారం పొంది వేదాలను రక్షించాడు. కేవలం వేదోద్ధరణ లక్ష్యంగా హయగ్రీవావతారం కనిపిస్తుంది. పూర్వం శ్రీ మహావిష్ణువు నాభికమలంలో ఆసీనుడై ఉన్న సృష్ఠికర్త బ్రహ్మ తన పనిలో తాను నిమగ్నమై ఉండగా రజస్తమోగుణాలకు ప్రతీకలుగా ఉన్న మధుకైటభులు అనే ఇద్దరు రాక్షసులు గదలను ధరించి మెల్లగా బ్రహ్మదగ్గరకు చేరి, మనోహర రూపాలతో భాసిల్లుతున్న నాలుగు వేదాలను అపహరించారు.

                                                  బ్రహ్మ చూస్తుండగానే అపహరించిన వేదాలతో ఆ దానవులు సముద్రంలో ప్రవేశించి రసాతలానికి చేరారు. వేదాలను కోల్పోయిన బ్రహ్మ వేదాలే తనకు ఉత్తమ నేత్రాలని, వేదాలే తనకు ఆశ్రయాలని, వేదాలే తనకు ముఖ్య ఉపస్యాలని అవి లేకపోతే తాను సృష్ఠిని చేయడం కుదరదని విచారిస్తూ ఆ ఆపద నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచించసాగాడు. ఆయనకు వెంటనే శ్రీమహావిష్ణువు గుర్తుకు వచ్చి పరిపరివిధాల స్తుతించాడు. బ్రహ్మ ఆవేదనను శ్రీహరి గ్రహించి వేద సంరక్షణ కోసం యోగ రూపంతో ఒక దివ్యశరీరాన్ని పొందాడు. ఆ శరీరం చంద్రుడిలా ప్రకాశించసాగింది. ఆ శరీరమే హయగ్రీవ అవతారం అయింది. నక్షత్రాలతో నిండిన ఆకాశం ఆయన శిరస్సుగా మారింది. సూర్యకిరణ కాంతితో ఆయన కేశాలు మెరవసాగాయి. ఆకాశం పాతాళం రెండు చెవులుగా, భూమి లలాటభాగంగా, గంగా సరస్వతులు పిరుదులుగా, సముద్రాలు కనుబొమ్మలుగా, సూర్యచంద్రులు కన్నులుగా, సంధ్య నాసికగా, ఓంకారమే ఆయనకు అలంకారంగా, విద్యుత్తు నాలుకగా, పితృదేవతలు దంతాలుగా, గోలోకం బ్రహ్మలోకం రెండు పెదవులుగా, తమోమయమైన కాళరాత్రి ఆయనకు మెడభాగంగా అలరారాయి.

                ఈ విధమైన ఒక దివ్యరూపాన్ని ధరించిన శ్రీహరి హయగ్రీవావతారం బ్రహ్మ ముందు నుంచి అంతర్ధానమై రసాతలానికి ప్రవేశించింది. అక్కడ హయగ్రీవుడు ఉదాత్త, అనుదాత్త స్వరయుక్తంగా పెద్దగా సామవేదాన్ని గానం చేయసాగాడు. ఆ మధుర గానవాహిని రసాతలం అంతా మారుమోగింది. ఆ గానరసం రసాతలంలో వేదాలను దొంగిలించి దాక్కున్న రాక్షసుల చెవులకు కూడా సోకింది. ఆ గాన రసవాహినికి ఆ రాక్షసులిద్దరు పరవశించి బ్రహ్మ దగ్గర నుంచి తాము తెచ్చిన వేదాలను ఒక చోట భద్రం చేసి గానం వినిపించిన దిక్కుకు పరుగులు తీశారు. అయితే ఇంతలో హయగ్రీవుడు రాక్షసులు దాచిన వేదాలను తీసుకొని సముద్ర గర్భం నుంచి బయటకు వచ్చి అక్కడ ఈశాన్యభాగంలో హయగ్రీవరూపాన్ని విడిచి తన స్వరూపాన్ని పొందాడు. రాక్షసులు గానం వినిపించిన దిక్కుకు బయలుదేరి వెళ్లి ఎంత వెతికినా, ఎక్కడ వెతికినా ఎవరూ కనిపించలేదు. వెంటనే తమ వేదాలను దాచి ఉంచిన ప్రదేశానికి వెళ్లి చూశారు. అక్కడ వేదాలు కనిపించలేదు.

                                               వెంటనే ఆ ఇద్దరూ రసాతలం నుంచి వెలుపలికి వచ్చి సముద్రంలో దివ్యతేజ కాంతిపుంజంలాగా ఉండి ఆదిశేషుడి మీద యోగ నిద్రాముద్రలో ఉన్న శ్రీమహావిష్ణువును చూశారు. ఆ రాక్షసులు తాము దాచిన వేదాలను అపహరించింది ఆ శ్వేతపురుషుడేనని, తమ దగ్గర నుంచి వేదాలను తెచ్చినది కాక ఏమీ తెలియనట్లు నిద్రిస్తున్నాడని కోపగించుకొని శ్రీమహావిష్ణువు మీదకు యుద్ధానికి వెళ్లారు. అప్పుడు విష్ణువు ఆ రాక్షసులతో యుద్ధం చేసి వారిని సంహరించాడు. ఇలా హయగ్రీవావతారం వేదోద్ధరణ లక్ష్యంగా అవతరించింది.

Saturday, May 23, 2020

నారద తుంబురులు

Tumburu - Wikipedia



భారతీయ పురాణ సాహిత్యంలో తారసపడే ప్రతి కథ, పాత్ర మానవాళికి ఒక మంచి మార్గాన్నో, నడవడికనో నేర్పడానికే అవతరించినట్లు అనిపిస్తూ ఉంటుంది. అందరికీ సుపరిచితమైన నారదుడు వంటి పాత్రల ప్రవర్తన ద్వారా కూడా సందేశం అందుతూ ఉంటుంది. నారదుడు, తుంబురుడు ఇద్దరూ సహాధ్యాయులు (ఒకచోట విద్యనేర్చుకున్నారు), గానవిద్యలో తనను మించిన వారు ఎవరూ ఉండవోరనేది నారదముని పెంచుకున్న భావం. ఆ గర్వఫలమే ‘తాడితన్నే వాడు ఉంటే వాడితల తన్నేవాడు మరొకరు ఎప్పుడూ ఉండే ఉంటాడనే నగ్నసత్యాన్ని చవిచూడాల్సి వచ్చింది నారదుడు. తన గర్వభంగ కథనంతా మణికంఠరుడు అనే ఓ గంధర్వుడికి వివరించి విచారం పొందాడు. నారదుడి నోవేదనంతా ఇలా ఉంది.
వైకుంఠంలో ఒకనాడు శ్రీమహావిష్ణువు నిండుకొలువు తీరి ఉన్నాడు. ఆ కొలువు కూటానికి దేవతలు, మినగణాలు, గంధర్వులు, తదితరులంతా విచ్చేశారు. సభా ప్రాంగణానికి ముందు ఉన్న అందమైన తోట నుంచి లక్ష్మీదేవి నల్లని మబ్బుల మధ్యన మెరుపు తీగలాగా మెరుస్తూ చెలికత్తెలు అటూ ఇటూ నడుస్తుండగా శ్రీమహావిష్ణువు కొలువుతీరిన ప్రదేశానికి బయలుదేరి వస్తోంది. ఆమెను చూడాలనే తపన అక్కడ ఉన్న వారందరిలోనూ బయలుదేరింది. ఈ లోగా విష్వక్సేనుడు తన పరివారంతో అక్కడికి వచ్చాడు. వారంతా చేతిలో బెత్తాలు ధరించి లక్ష్మీదేవి నడిచే దారికి అడ్డంగా ఉన్న వారందరినీ చెదరగొట్టి కకావికలు చేశారు. బ్రహ్మలాంటి దేవతలు కూడా ఆ ధాటికి దూరంగా పారిపోవాల్సి వచ్చింది. ఇంకా నారదుడు వంటి వారి పరిస్థితి చెప్పనవసరం లేదు. అలా లక్ష్మీదేవి కొలువు కూటంలోకి వెళ్లిన వెంటనే ద్వారపాలకులు తలుపులు మూసివేశారు. కొద్దిసేపైన తరువాత లోపలి నుంచి ఎవరో వచ్చి ఓహో తుంబురుడా అంటూ గట్టిగా పిలిచి తుంబురుడిని లోపలకు తీసుకువెళ్లారు. లోపల ఏం జరుగుతుందోనని బయట ఉన్న వారందరికీ ఆతృత హెచ్చింది. కొద్ది సమయం అయిన తరువాత చిరునవ్వులు నవ్వుతూ గంధపు పూతలతో మెడలో దగాదగా మెరిసే పతకంతో సన్మానితుడైన తుంఉబురుడు బయటకు రాగానే అందరూ ఏమిటి విశేషమని అడిగారు. తుంబురుడు సంతోషంతో శ్రీమహాలక్ష్మి చెంత ఉండగా మహావిష్ణువు తన గానాన్ని విని ఆనందించి ఇలా సత్కరించాడని చెప్పాడు. ఆ మాటలు నారదుడి మనసును ఎంతో నొప్పించాయి. అసూయతో అతని హృదయం రగిలిపోయింది. ఇంతకు ముందు ఎక్కడ గానకళను ప్రదర్శించినా తామిద్దరూ కలసి ప్రదర్శించటం అలవాటుగా వస్తోంది. గానకళలో తనకు ఎన్నోమార్లు ప్రశంసలు వచ్చాయి. ఇప్పుడు తుంబురుడు తగుదనమ్మా అంటూ తానొక్కడే వెళ్లి శ్రీహరి ఎదుట గానాన్ని ఆలపించటం అతని హృదయాన్ని భగభగలాడించింది. ఎలాగయినా తుంబురుడిని మించిన గానకళా విద్వాంసుడిగా ఇప్పుడు అందరిచేత మెప్పు పొందాలని అనుకున్నాడు. దీనితోపాటుగా తుంబురుడి గాన విద్యలోని దోషాలను పసిగట్టి వాటిని బయటపెట్టేందుకు స్నేహాన్ని నటిస్తూనే కార్యాన్ని సాధించాలని అనుకున్నాడు. ఒకనాడు తుంఉబురుడి ఇంటికి వెళ్లిన నారదుడికి పాటకు సిద్ధంగా ఉంచిన వీణ కనిపించింది. అక్కడ ఉన్న పరిచారికలను తుంబురుడెక్కడ అని అడుగగా లోపల ఉన్నాడని పిలుచుకొస్తామని వెళ్లారు. ఈలోగా అక్కడ పెట్టి ఉంచిన వీణను నారదుడు తాకాడు. తుంఉబురుడు శ్రుతి చేసి పెట్టిన వీణ అద్భుతమైన రాగాలను ఆలపించింది. శ్రుతి చేసిన వీణే అంత అద్భుతంగా ఆలాపన చేస్తే తుంబురుడు స్వయంగా గానమాలపిస్తే ఇంక ఎంత గొప్పగా ఉంటుందోనని ­హించుకొని సిగ్గుపడి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తరువాత ఎంతో మంది గురువులను అతడు ఆశ్రయించి గానవిద్యలో తనను తుంఉబురుడి కంటే గొప్పవాడిని చేయమని అడిగాడు. వారంతా అది తమకు సాధ్యపడదని చెప్పారు. చివరకు చేసేది లేక శ్రీమహావిష్ణువు గురించి చాలా కాలం తపస్సు చేశాడు. ఆయన ప్రత్యక్షమై నారదుడి కోరిక విని ఈ అవతారంలో అది సాధ్యపడదని తరువాత వచ్చే అవతారంలో వీలు కల్పిస్తానని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఇలా తానొక్కడే గానకళలో గొప్పవాడని భావించుకున్న నారదుడు భంగపాటుకు గురై పండితులు ఎప్పుడూ నీటికొద్దీ తామరలాగా ఉంటారని, చెవిటివాడి ముందు శంఖం ­దినట్లుగా తమకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారి ఎదుట తమ విద్యను ప్రదర్శించరని గ్రహించాడు. తుంబురుడు తన సహాధ్యాయి అయినప్పటికీ ఎంతో కృషి చేసి గాన కళాప్రపూర్ణుడు అయ్యాడని, అది తెలియని తాను గానే గొప్ప అనుకుని గర్వపడి చివరకు గర్వభంగపాటుకు గురికావాల్సి వచ్చిందనుకున్నాడు. విద్యావంతులు, గుణవంతులు, వినయ సంపన్నులు సమయాన్ని సందర్భాన్ని పురస్కరించుకుని మాత్రమే తమలోని గొప్పతనాన్ని ప్రదర్శిస్తారని తెలుసుకోలేని వారు నారదుడిలాగే గర్వభంగం పొందాల్సి వస్తుందని ఈ కథ సారాంశం.






మూలం డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు

Monday, February 10, 2020

దక్షిణ గోగ్రహణం

Image result for pandavas agnyathavasam

పాండవులు అజ్ఞాతవాస దీక్షలో ఉన్నప్పుడు వారి అజ్ఞాతాన్ని భంగపరచి పాండవులను ఎలాగైనా మరోమారు అరణ్య, అజ్ఞాతవాసాలకు పంపాలని దుర్యోధనుడు ఎప్పటికప్పుడు తీవ్రంగా ఆలోచిస్తూనే ఉన్నాడు. దుర్యోధనుడి ఆలోచనలకు అనుకూలంగా ఒక సమాచారం అందింది. మత్స్యదేశ రాజైన విరాటరాజు బావమరిది సింహబలుడు (కీచకుడు) మరణించాడని దుర్యోధనుడు తెలుసుకున్నాడు. భూలోకంలో భీమసేనుడు, కీచకుడు, బలరాముడు, శల్యుడు సమాన బలవంతులని దుర్యోధనుడికి తెలుసు. అదీకాక మహాబలశాలి అయిన కీచకుడిని అన్ని అవయవాలు విరిచి ముద్దలాగా చేసి చంపగలిగింది భీముడేనని, భీముడే గంధర్వుడి రూపంలో ఆ పని చేసి ఉంటాడని దుర్యోధనుడు అనుకున్నాడు. అందుకు కారణం కీచకుడికి బలరాముడు, శల్యుడు దూరంగా ఉన్నారు. అదీకాక పాండవులు ఎక్కడ అజ్ఞాతంలో ఉండే అవకాశం ఉందని ఆలోచిస్తుంటే సస్య శ్యామలంగా, సుభిక్షంగా ఉండే ప్రాంతంలోనే పాండవులు ఉండే వీలుందని భీష్మాచార్యుడు చెప్పిన మాటలను బట్టి కూడా పాండవుల ఉనికి దుర్యోధనుడు ­హించాడు. వెంటనే తన మంత్రులు సామంతులతో కొలువు తీరి మత్స్యదేశాన్ని దక్షిణ దిక్కు నుంచి, ఉత్తర దిక్కు నుంచి రెండు వైపులా బంధించగలిగితే విరాటరాజును రక్షించటానికి పాండవులు వచ్చి తీరుతారని అప్పుడు వారి గుట్టు రట్టవుతుందని దుర్యోధనుడు తన వారందరికీ చెప్పాడు. ఈ ఆలోచన బాగుందని, తానందుకు సిద్ధమని అక్కడే ఉన్న త్రిగర్త రాజైన సుశర్మ చెప్పాడు. కీచకుడి అండ చూసుకొని విరాటరాజు తన మీదకు ఎన్నోసార్లు దండెత్తి వచ్చి అవమాన పరిచాడని కీచకుడు మరణించాడు కనుక ఇప్పుడు తాను విరాటుడిని జయించగలనని పలికాడు. దుర్యోధనుడు, కర్ణుడులాంటి వారంతా సుశర్మ ఆలోచనను సమర్ధించి మత్స్యదేశాన్ని దక్షిణ దిక్కు నుంచి సుశర్మ ముట్టడించేలాగా ఆ తరువాత ఉత్తర దిక్కు నుంచి కౌరవ ప్రముఖులు విరాట రాజ్యాన్ని ముట్టడించేలాగా పథకం సిద్ధం చేసుకుని యుద్ధ సన్నాహాలు ప్రారంభించారు. మత్స్యదేశాన్ని దక్షిణ దిక్కు నుంచి తాకుతూ వచ్చి సుశర్మ గోసంపదను తరలించుకు వెళుతున్నాడని విరాటరాజుకు వర్తమానం వచ్చింది. విరాటుడు వెంటనే తన తమ్ముడు శతానీకుడు తదితర వీరులను సిద్ధం చేసి యుద్ధానికి బయలుదేరాడు. గతంలో ఎన్నోసార్లు తన చేతిలో పరాజితుడైనప్పటికీ సుశర్మకు బుద్ధి రాకపోవటం విచిత్రంగా ఉందని విరాటరాజు అనుకున్నాడు. విరాటరాజు చేస్తున్న యుద్ధ సంరంభాన్ని గమనించి కంకుభట్టు రూపంలో ఉన్న ధర్మరాజు విరాటుడి దగ్గరకు వెళ్లి గతంలో తనకు ఒక ముని అనేక దివ్యాస్త్రాలను ప్రసాదించాడని తనకు కొన్ని రథాలను, సైన్యాన్ని సమకూర్చితే యుద్ధ రంగానికి తానూ వచ్చి సహాయపడుతానని చెప్పాడు. తమ కొలువులోనే వంటవాడుగా ఉన్న వలలుడిని కూడా యుద్ధానికి తీసుకువెళ్ల వచ్చని అతడు మల్లయుద్ధంలో ఎంతో నేర్పుకలవాడని చెప్పాడు. అలాగే గోవులను రక్షస్తున్న దామగ్రంధిని, అశ్వశిక్షకుడైన తంత్రీపాలుడు కూడా యద్ధ విద్యలో ఎంతో నిపుణులని వారిని కూడా యద్ధానికి బయలుదేర దీయమని చెప్పాడు. విరాటరాజు కంకుభట్టు మాటలకు సమ్మతించి కంకుభట్టుకు, వలలుడికి, దామగ్రంధికి, తంత్రీపాలుడికి కావాల్సిన ఆయుధాలను, రథాలను ఏర్పాటు చేశాడు. అలా నలుగురు సోదరులు విరాటరాజు వెంట తరలివెళ్లి సుశర్మను ఎదుర్కొన్నారు. సుశర్మకు, విరాటరాజుకు మహాభీకరంగా పోరు జరిగింది. కానీ చివరలో సుశర్మ విరాటరాజును విరథుడిని చేసి తన రథం మీద ఎక్కించుకుని తీసుకువెళ్లసాగాడు. ఆ పరిస్థితిని చూసి విరాటుడి సైన్యమంతా చెల్లా చెదురవుతున్న సమయంలో ధర్మరాజు, భీముడిని పిలిచి పరిస్థితి చేయిదాటి పోయేలా ఉందని అజ్ఞాతవాసంలో తమకు ఆశ్రయాన్నిచ్చి ఆదుకుంటున్న విరాటుడిని రక్షంచటం తమ కర్తవ్యమని చెప్పాడు. భీముడు వెంటనే ఒక పెద్ద చెట్టును పెకలించి సుశర్మ సైన్యాన్ని చెదరగొడతానని బయలుదేరబోతుండగా ధర్మరాజు అలా చేయవద్దని పెద్ద పెద్ద చెట్లను, వృక్షాలను పెకలించి శత్రువులతో పోరాడేది భీముడేనన్న సంగతి కౌరవులు పసిగడితే తమ గుట్టు రట్టవుతుందన్నాడు. అలాకాక శస్త్రాలు, ఆయుధాలతోనే యద్ధం చేయమని చెప్పాడు. వెంటనే భీమసేనుడు అమిత ఉత్సాహంతో విరాటరాజును రథం మీద ఎక్కించుకునివెళుతున్న సుశర్మను వెంబడించాడు. తన అస్త్ర, ఆయుధ, భుజబలాన్నంతా ప్రదర్శించి సుశర్మను నిలువరింప చేశాడు. సుశర్మ రథసారథి, అశ్వాలు పడిపోగా రథచక్ర రక్షకుడైన శోణాశ్యుడు పారిపోయాడు. వెంటనే విరాటుడు కూడా విజృంభించటంతో త్రిగర్త సేనలు చెల్లా చెదురయ్యాయి. భీముడి దెబ్బకు సుశర్మ మూర్ఛపోయాడు. అతనిని రథం మీదకు ఎక్కించుకుని భీముడు తన అన్న దగ్గరకు తీసుకువచ్చి సుశర్మను వధించటానికి అనుమతివ్వమని కోరాడు. అయితే ధర్మరాజు అందుకు అంగీకరించలేదు. సుశర్మకు అప్పుడే మూర్ఛ నుంచి మెలకువ వచ్చింది. భీముడు, ధర్మరాజు పలికిన సూటిపోటీ మాటలతో అతడు అవమాన భారంతో కుంగిపోయాడు. భీముడు, ధర్మరాజు సూచన మేరకు అతడిని విడిచిపెట్టాడు. ఇదంతా చూస్తున్న విరాటరాజుకు ఎంతో ఆశ్చర్యమేసింది. తన ప్రాణాలను, రాజ్యాన్ని రక్షంచినందుకు ఎంతగానో కృతజ్ఞతలు చెప్పి తన రాజ్యంలో ఉన్న ధనాన్ని, చివరకు రాజ్యాన్ని కూడా గ్రహించమని కోరాడు. అయితే ధర్మరాజు తాము ధనాన్ని కోరి యద్ధం చేయలేదని, దైవానుగ్రహం వల్లనే సుశర్మ మీద విజయం లభించిందని, తమకు ఎలాంటి బహుమానాలు అక్కరలేదని చెప్పాడు. కంకుభట్టు ఔదార్యానికి మత్స్యదేశ రాజైన విరాటుడు ఎంతో ముచ్చటపడ్డాడు.

Saturday, August 10, 2019

హింస - అహింస

Image result for dharmavyadha


మనిషి మనసును వేధించే ధర్మసందేహాలను తీర్చే మహాగ్రంధంగా మహాభారతానికి మంచి పేరుంది. మనిషికి కలిగే ధర్మ సందేహాల్లో హింస, అహింసల తారతమ్యం ఎలా ఉంటుందనేది ప్రధానమైనది. ఒకప్పుడు కౌశికుడు అనే మునికి కూడా హింసకు అహింసకు తేడా తెలుసుకోవాలనిపించింది. దీనికి కారణం ధర్మవ్యాధుడు అనే కసాయివాడు త్రికరణశుద్ధిగా ధార్మికుడుగా కనిపించడమే. ‘నీవు మాంసం అమ్ముతూ జీవిస్తున్నావు కదా? అది హింస కాదా? దానివల్ల పాపం రాదా?’ అని కౌశికుడు ఆ కసాయివాడిని ప్రశ్నించాడు. అతడు అడిగిన ప్రశ్నలన్నిటికీ ధర్మవ్యాధుడు సమాధానాలు చెప్పిన సారాంశంలో అహింసా స్వరూపం ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఓ కౌశికమునీ ఈ లోకంలో ప్రాణుల మరణం అనేది వాటి పూర్వజన్మకర్మ ఫలితం మీద ఆధారపడి ఉంటుందని పెద్దలు చెబుతున్నారు. చంపేవాడు కేవలం నిమిత్తమాత్రుడేననేది వారి భావన. అసలు ఈ జగత్తును సృష్టించినప్పుడే బ్రహ్మదేవుడు కొన్ని కొన్ని ప్రాణుల కోసం మరికొన్ని జంతు, మృగ సమూహాలను సృష్టించాడని, అలాగే పండ్లు, కూరగాయలు, దుంపలు వంటి వాటిని కూడా ఆహార పదార్థాలుగా సృష్టించాడని వేదాలు ఘోషిస్తున్నాయి. హింస అన్ని సందర్భాల్లో హింసలాగా కనిపించదు. తన శరీరాన్ని కోసి అగ్నికి, ఇంద్రుడికి ఆహారంగా ఇచ్చిన శిబి చక్రవర్తికి పాపం కలగడానికి బదులు, పుణ్యలోక ప్రాప్తి కలిగింది. నిష్టాగరిష్ఠులైన వారు యజ్ఞాలను చేసేటప్పుడు పశువులను బలి ఇస్తుంటారు. ఇది పైకి హింసలాగే కనిపిస్తుంది. కానీ వారికి ఎవరికీ పాపం అంటడం లేదు. రైతు పొలాన్ని దున్నేటప్పుడు అతడి నాగటి కొనకు తగిలి వేలాది జీవులు మరణిస్తుంటాయి. కానీ ఆ హాలికుడికి పాపం అంటడం లేదు. మనుషులు నడిచేటప్పుడు వారి కాళ్ల కింద పడి అనేక ప్రాణులు నశిస్తుంటాయి. భూమి, ఆకాశం, నీరు అంతా జలమయమే కదా! కనుక మనిషైనవాడు తన జీవన యాత్ర సాగించేటప్పుడు ఏదో ఒక సందర్భంలో హింస చేయక తప్పదు. కానీ ఇవన్నీ తెలియని కొందరు తాము హింస చేయడం లేదని అనుకుంటూ ఉంటారు. అది ఒట్టి భ్రమ మాత్రమే. పనిగట్టుకుని అడవులకు వెళ్లి తపస్సు చేసుకుంటూ మేము హింసకు దూరంగా ఉన్నామని అనుకునే వారు కూడా ఆహారం కోసం చెట్ల ఆకులను, దుంపలను కోసేటప్పుడు ఆ చెట్లను హింసిస్తూ హింసకు పాల్పడుతున్నట్లే లెక్క కనుక వీటన్నిటినీ గమనిస్తే హింస చేయని వాడు ఈ లోకంలో ఒక్కడు కూడా లేనట్లే కదా అని ధర్మవ్యాధుడు అన్నాడు. మరి అహింస అనేది ఎలా ఉంటుందని మళ్లీ ముని ప్రశ్నించాడు. ఎవరికి వారు తమకు సాధ్యమయినంత వరకు హింసకు దూరంగా ఉండటమే అహింస అని చెప్పవచ్చని ధర్మవ్యాధుడు కౌశికమునికి వివరించాడు.









- శ్రీ యల్లాప్రగడ మల్లికార్జున రావు గారు

- సేకరణ ఈనాడు దినపత్రిక నుంచీ

Wednesday, August 7, 2019

త్య్రంబకం


Image result for nasik

అలల సవ్వడిలో సప్తస్వర స్వనాలను సమ్మిళితం చేస్తూ రాజమహేంద్రి కాంతకు మణిమేఖలలా భాసిల్లుతూ పరవళ్ళు తొక్కుతూ పరవశించి పోతూ, ఉరవళ్ళు తొక్కుతూ ఉత్సాహంతో సాగుతూ సాగర సంగమం చేస్తున్న గోదారితల్లి పుట్టిల్లు మహారాష్ట్రలోని నాసిక్‌ దగ్గర ఉన్న త్య్రంబకం.  తన పుట్టుకలోనే ఓ పవిత్రతను, ఓ సామాజిక ప్రయోజనాన్ని నింపుకుని అవతరించిన గౌతమీ మాత రాజమహేంద్రి దాకా సాగి మధ్య మధ్యలో ఎన్నెన్నో తీర్ధాలను ఉపనదులను కలుపుకుని సప్తరుషుల పేర్ల మీద ఏడు పాయలుగా ఎగసి పడుతున్న ఆనందంలా సాగర సంగమానికి ఉరుకులెత్తటం చూస్తుంటూనే గుండెనిండా ఆనందం గంతులేస్తుంటుంది. గోహత్య మహాపాపాన్ని ప్రక్షాళన చెయ్యటానికి పరమేశ్వరుడి శిరస్సునుండి దూకి వచ్చిన ఈ గంగను(గౌతమి) తాకిన వారందరికీ తరతరాల పాపం నశించి పుణ్యం ఒకటికి పది రెట్లు చేకూరుతుందన్నది ఆస్థిక జన భావన. ఈ గౌతమి ఆవిర్భావానికి, అక్కడే పరమేశ్వరుడు త్య్రంబకేశ్వరుడై జ్కోతిర్లింగ రూపంలో వెలుగొందటానికి కారణమైన ఓ కథ స్థల పురాణంగా ప్రచారంలో వుంది. 
Image result for trayambakeshwar
(త్రయంబకేశ్వర ఆలయం)
             అంతేకాక అష్టాదశ పురాణాలలో ఒకటైన శ్రీ శివమహాపురాణంలో త్య్రంబకేశ్వర మహత్యం అనే పేరున కూడా ఒక కథ కనిపిస్తుంది. కొందరు రుషులు గౌతమ మహర్షికి గోహత్యా పాపం సంక్రమించేలా చేసి ఆ పాపం పోవటానికి పరమేశ్వరుడిని గురించి తపస్సు చేసి ఆయన అనుగ్రహంతో గంగను భూమి మీదకు తీసుకు రమ్మనమని చెప్పారు. గౌతముడు అలాగే చేశాడు. పరమేశ్వరుడి అనుగ్రహంతో ఆయన శిరస్సు నుండి నేల మీదకు వచ్చిన గంగ వెంటనే ఒక స్త్రీ రూపాన్ని ధరించి అక్కడ ప్రత్యక్షమైంది. అప్పుడు గౌతముడు ఆమెకు నమస్కరించి తన వెంట వచ్చి పాపప్రక్షాళన చేయమని కోరాడు. పరమేశ్వరుడు కూడా ఆమెను అలాగే చెయ్యమని ఆజ్ఞాపించాడు. కానీ గంగ కేవలం గౌతమ ముని పాపాన్ని ప్రక్షాళన చేసి మళ్ళీ వెంటనే తిరిగి తన స్థానానికి తాను చేరుకుంటానని చెప్పింది. కానీ భక్తవత్సలుడైన మహేశ్వరుడు మానవలోకానకి ఉపకారం చెయ్యాలని అనుకుని సూర్యుడి కుమారుడు ఇరవై ఎనిమిదవ మనువుగా పాలనలోకి వచ్చేంత వరకూ భూమి మీదే వుండమని ఆజ్ఞాపించాడు. అందుకు గంగ భూలోకంలో తనకు అందరి కన్నా, అన్నిటికన్నా విశేషశక్తిని కలిగించటం దానితోపాటు పరమేశ్వరుడు కూడా పార్వతితోనూ, శివగణాలతోనూ కూడి తన సమీపంలోనే ఉన్నట్లైతే తాను భూలోకంలో వుండటానికి ఎటువంటి అభ్యంతరం లేదని, తనకు ఆ వరాన్ని ప్రసాదించమని వేడుకుంది. ఆమె మాటలను పరమేశ్వరుడు కాదనలేకపోయాడు. గంగను ఈశ్వరుడు అలా అనుగ్రహించిన వెను వెంటనే అక్కడికి దేవతలు, రుషులు అనేక తీర్ధాల సమూహాలు వచ్చి చేరాయి. వారంతా పరమేశ్వరుడికి గంగకు, గౌతముడికి జయ ధ్వానాలు పలికారు. ఆ తర్వాత బ్రహ్మ, విష్ణు తదితర దేవతలంతా ముక్త కంఠంతో పరమేశ్వరుడిని స్తుతించారు. ఈశ్వరుడప్పుడు ప్రసన్నుడై ఏదైనా వరం కోరుకోమని అన్నాడు. ఆ మాటలకు సంతోషించి ఆ దేవతలంతా కూడా భూమి మీద అవతరించిన గంగను భూమి మీదే వుండేలాగా చెయ్యమని ప్రార్ధించారు. అయితే అంతలోనే గంగాదేవి కల్పించుకుని ఆ దేవతలంతా కూడా ఎందుకు భూమి మీదే వుండకూడదని అన్నది. అయితే వారు ఆమెకు సమాధానమిస్తూ ‘‘ సింహరాశౌ యదా స్యాద్వై గురుస్సర్వ సుహృత్తమఃతదావయం చ సర్వే త్యాగ మిష్యామో న సంశయంఏకాదశ చ వర్షాణి లోకానాం పాతకం త్విహంక్షాలితం యద్భవేదేవం మలి నాస్స్మ గురి ద్వరే’’గురువు ఎప్పుడు సింహరాశిలో వుంటాడో అప్పుడు తామంతా నిశ్శంసయంగా గంగలోకే వచ్చి వసిస్తామని చెప్పారు. పదకొండు సంవత్సరాలపాటు తామంతా మానవుల పాపాలను ప్రక్షాళనం చేసే పనిలో నిమగ్నమై ఉండి పన్నెండవ సంవత్సరంలో తమ మాలిన్యాన్ని పోగొట్టుకునేందుకే ఇలా వస్తున్నట్లు కూడా చెప్పారు. సింహంలో గురుడు వున్నంతవరకు తాము గంగలో వుంటామని, అప్పుడు శంకురుడిని దర్శించి తమ పాపాలను కడిగేసుకుంటామని ఆ తరువాత కూడా గంగ అనుమతిని పొంది మాత్రమే తమ తమ నెలవులకు వెళ్తామని దేవతలంతా గంగాదేవికి చెప్పారు. ఆ మాటలకు గంగ ఎంతో సంతోషించింది. ఆనాటినుండి ఆ ప్రదేశంలో పరమేశ్వరుడు తన గణాలతోనూ, పార్వతితోనూ త్య్రంబకేశ్వరుడుగా అవతరించాడు. సంస్కృత భాషలో అంబకము అనే పదానికి కన్ను అనే అర్ధం ఉంది. మూడు కన్నులు గలవాడు కనుక ఆయన త్య్రంబకుడయ్యాడు. గంగ కూడా ఆనాటినుండే గౌతమిగా మారిపోయింది. అంటే గౌతమ మహర్షి తపస్సు చేయగా అవతరించిన కారణంగా ఆ పేరు స్థిరపడింది. ఆనాటినుండే గురువు సింహరాశిలో వుండగా సర్వతీర్ధాలు, దేవతలు అక్కడకు రావటం ప్రారంభించారు. అదే పుష్కర సుమయమైంది. అలా గౌతమీనది అవతరణ, త్య్రంబకేశ్వర జ్యోతిర్లింగ ఆవిర్భావం జరిగినట్లుగా శివపురాణంలోని గౌతమి మహాత్యం అనే కథ వివరిస్తుంది. త్య్రంబకేశ్వర జ్యోతిర్లింగ మహారాష్ట్రలోని నాసిక్‌ సమీపంలో ఉంది. ఈ నాసిక్‌కు కూడా స్థల పురాణముంది. సీతారామలక్ష్మణులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో బ్రహ్మగిరికి సమీపంలో వుండగా శూర్పణఖ తారసిల్లింది. ఆమె ఆగడాలను సహించలేని లక్ష్మణుడు ఆమె నాసికను, చెవులను ఇక్కడే ఖండించాడని ఆ కారణంగానే ఈ ప్రదేశానికి నాసిక్‌ అని పేరు వచ్చిందని పెద్దలు పేర్కొంటున్నారు.













శ్రీ యల్లాప్రగడ మల్లికార్జున రావు గారు
సేకరణ ఈనాడు దినపత్రిక నుంచీ

Wednesday, July 31, 2019

గరుత్మంతుడు

Related image


ప్రత్యక్ష దైవాల వంటి తల్లిదండ్రుల పొందగలిగిన తనయులు సర్వత్రా జయాలనే పొందుతుంటారని గరుత్మంతుడి వృత్తాంతం మహాభారతంలో వివరిస్తోంది. వినతకు రెండో సంతానంగా జన్మించిన గరుత్మంతుడు అప్పటికే ఆమె కద్రువకు, ఆమె సంతతికి దాస్యం చేస్తుండడం చూసి ఎలాగయినా తల్లి దాస్యాన్ని పోగొట్టాలని నిర్ణయించుకున్నాడు. ఒకనాడు గరుత్మంతుడు తన దగ్గరకు వచ్చిన సర్పాలని చూసి నా తల్లి దాస్యం, నా దాస్యం విముక్తి కావడానికి మీరు ఏం కావాలో కోరుకొమ్మని అడిగాడు. ‘మాకు అమృతం తెచ్చిపెట్టు మీ దాస్యం విముక్తి అవుతుంది’ అని వారు పలికారు. వెంటనే గరుత్మంతుడు తల్లి వినత దగ్గరకు వెళ్లి నమస్కరించి విషయం చెప్పి తనకు ఆకలిగా ఉందని ఆహారం ఇవ్వమని ప్రార్థించాడు. ఆమె చాలా సంతోషించి సముద్రంలో ఉన్న నిషాదులను మాత్రం తిని ఆకలి తీర్చుకొనమని ఆశీర్వదించింది. గరుత్మంతుడు తల్లి చెప్పినట్లు చేశాడు. కాని ఆకలి తీరలేదు. వెంటనే తన తండ్రి కస్యప ప్రజాపతిని ప్రార్థించాడు. ఆయన పరస్పరం శాపాలను పెట్టుకుని ఏనుగు, తాబేలుగా మారిన విభావనుడు, సుప్రతీకుడు అనే వారిని భక్షించి ఆకలి తీర్చుకొమ్మన్నాడు. భారీకాయాలతో ఉన్న ఆ రెంటిని ఒక పెద్ద చెట్టు కొమ్మమీద పెట్టుకుని భక్షించాలనుకుని కాలు మోపబోగా ఆ చెట్టు కొమ్మ ఫెళఫెళ విరిగింది. ఆ కొమ్మకు బొటనవేలు పరిమాణంలో ఉండి తలకిందులుగా వేలాడుతూ తపస్సు చేసుకుంటున్న వాలఖిల్యులు అనే మునులు ఉన్నారు. వెంటనే కొమ్మను పట్టుకొని తన తండ్రి దగ్గరకు గరుత్మంతుడు వెళ్లాడు. వాలఖిల్యులు గరుత్మంతునిమీద బాగా కోపించారు. అయితే విషయాన్ని వివరించి గరుత్మంతుడు తన కుమారుడేనని పట్టుదలతో అతను తన తల్లి దాస్యం తీర్చడానికి స్వర్గలోకం నుంచి అమృతభాండం తేవడానికి వెళుతున్నాడని, దయతో కోపాన్ని ఉపసంహరించుకోమని ప్రార్థించాడు. ఆ ప్రార్థనకు వాలఖిన్యులు సంతోషించి గరుత్మంతుని శపించకుండా హిమాలయాలకు తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోయారు. ఆ తరువాత తండ్రి సూచన మేరకు చెట్టుకొమ్మను హిమాలయాలకు తీసుకుని వెళ్లి విడిచి ఏనుగు, తాబేలును భక్షించి అమృతభాండం కోసం స్వర్గలోకానికి వెళ్లాడు. ఇలా తలిదండ్రుల ఆశీస్సులతో కష్టాలను అధిగమించి గరుత్మంతుడు కార్యసాధకుడయ్యాడు.






శ్రీ యల్లాప్రగడ మల్లికార్జున రావు గారు
సేకరణ ఈనాడు దినపత్రిక నుంచీ

Saturday, June 15, 2019

సుద్యుమ్నుడు - ఇళ



Image result for sudyumna

సంసార జీవితంలో భార్యా, భర్త, ఇద్దరూ ఒక మాట మీదనే నిలబడి ఒక బాటలోనే నడవాలని అలా కాని పక్షంలో భవిష్యత్తు విచిత్రమైన మార్పులు పొందుతూ ఉంటుందని అవి వారి సంతానాన్ని ఇబ్బందులకు గురిచేస్తాయనే విషయాన్ని సుద్యుమ్నుడి కథ తెలుపుతుంది. అలాగే భారతం కేవలం పురాణ గ్రంథమే కాదని అందులో ఈనాడు వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో మనకు కనిపిస్తున్న ఎన్నో అద్భుతాలు ఆనాటి వారు ­హ మాత్రంగానయినా ఆలోచించగలిగారనే విషయాన్ని మహాభారతంలోని కథ, సాహిత్యం వివరిస్తోంది. వైవశ్యత మనువు భార్య శ్రద్ధాదేవి, వైవశ్యత మనువు తన భార్యతో కలిసి పుత్రకామేష్టియాగం ప్రారంభించాడు. శ్రద్ధాదేవికి తనకు కూతురు జన్మిస్తే బాగుండుననే అభిప్రాయం కలిగింది. ఒక రోజున ఆమె యాగం చేస్తున్న హోత వద్దకు వెళ్ళి నమస్కరించి తనకు కూతురు కలిగేలా యాగం చేయమని ప్రార్థించింది. ప్రార్థనను మన్నించి హోమం చేశారు. పుత్రకామేష్టి పూర్తయిన తర్వాత శ్రద్ధాదేవికి కూతురు జన్మించింది. 

                           ఆ శిశువుకు ‘ఇళ’ అని పేరు పెట్టారు. కానీ వైవశ్యత మనువు యజ్ఞ బ్రహ్మ వశిష్టుడి వద్దకు వెళ్ళి పుత్రుడికి బదులుగా పుత్రిక జన్మించిందని తన కోరిక ఎందుకు భగ్నమైందని అడిగాడు. వశిష్టుడు దివ్యదృష్టితో జరిగినదంతా తెలిసికొని తన శక్తితో ఇళను బాలుడిగా మార్చాడు. ఆ బాలుడికి సుద్యుమ్నుడు అని పేరు పెట్టారు. సుద్యుమ్నుడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఒకనాడతడు తన మంత్రిగణంతో వేటకు వెళ్ళి చాలాసేపు సింహాలను, పులులను వేటాడి అలసి ఆ సమీపంలో ఉన్న ఒక కొలనులో ఉన్న నీటిని తాగారు. వెంటనే సుద్యుమ్నుడు, అతడి పరివారం గుర్రాలతో సహా ఆడవారిగా మారిపోయారు. దానికి కారణం పూర్వం ఆ ప్రాంతంలో పురుష సంచారాన్ని నిషేధిస్తూ పార్వతి కోరిక మేరకు పరమేశ్వరుడు శాపం ఇవ్వడమే. సుద్యుమ్నుడు అతడి పరివారం స్త్రీలుగా మారడంతో తిరిగి తమ రాజ్యానికి వెళ్ళలేక అక్కడక్కడ తిరగడం ప్రారంభించారు. ఒకనాడు అక్కడికి సమీపంలో ఉన్న బుధుడి ఆశ్రమానికి వెళ్ళడం తటస్థించింది. బుధుడి కొడుకైన చంద్రుడు రాజస్త్రీగా ఉన్న సుద్యుమ్నుడి (ఇళ) మీద మనసు పడ్డాడు. వారిద్దరి సమాగ ఫలితంగా కొన్నాళ్ళకు వారికి పురూరవుడు జన్మించాడు. కొంత కాలం గడిచిన తరువాత సుద్యుమ్నుడు తనకు బాల్యంలో ఆడరూపు పోగొట్టి మగరూపు తెప్పించిన వశిష్టుని తలుచుకున్నాడు. 

                    వశిష్టుడు అక్కడికి వచ్చి విషయం తెలుసుకున్నాడు. తన శిష్యుడు ప్రస్తుతం ఉన్న ఆడ రూపును పోగొట్టి మగ రూపును ప్రసాదించమన్న కోరికను తీర్చలేక శివుడిని గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై పార్వతికి ఇచ్చిన మాటను తోసివేయక వశిష్టుని కోరికను కాదనలేక ఉభయ తారకంగా ఉండే విధంగా ఒక మాసం మగవాడుగా, ఒక మాసం ఆడదిగా సుద్యుమ్నుడు ఉండే విధంగా అనుగ్రహించి అంతర్థానమయ్యాడు. సుద్యుమ్నుడు అప్పటికి ఆనందించి తిరిగి రాజ్యానికి వెళ్ళి పురుష రూపంగా ఉన్నప్పుడు మాత్రమే రాజ్య పరిపాలన చేయడం ప్రారంభించాడు. ఆ కాలంలో సుద్యుమ్నునకు.. ఉత్కళుడు, గయుడు, విమలుడు అను ముగ్గురు కుమారులు కలిగారు. వారు ఉత్తరరాజ్య భాగాలకు రాజులయ్యారు.  తమ రాజు కొన్ని మాసాలు మాత్రమే పరిపాలన చేస్తుండడం ప్రజలకు వింత అనిపించి ఆనోటా ఆ నోటా అసలు విషయం తెలుసుకున్నారు. ఈ లోగా సుద్యుమ్నుడి కొడుకు పురూరవుడు పెరిగి పెద్దవాడయ్యాడు. సుద్యుమ్నుడు ప్రజలు తనను గురించి అనుకునే పలు రకాల మాటలు వినలేక సుద్యుమ్నునకు ఈ జీవితమంటే రోత పుట్టింది. అతను తన పుత్రుడు పురూరవునకు ప్రతిష్ఠానపుర రాజ్య సింహాసనం  అప్పగించి తపోవనాలకు వెళ్లిపోయాడు.  సుద్యుమ్నుడి తల్లిదండ్రులు ఏకాభిప్రాయం కలిగి ఉండకపోవడం ఈ కథలోని ఇన్ని మార్పులకు, సుద్యుమ్నుడి మనోవేదనకు కారణమైంది.




- శ్రీ యల్లాప్రగడ మల్లికార్జున రావు గారు
- సేకరణ ఈనాడు దినపత్రిక నుంచీ

Saturday, June 8, 2019

మార్కండేయ మహాముని


 Related image
పుణ్యపురుషుల సందర్శనం, పవిత్ర ప్రదేశాల ప్రభావం సామాన్యమైనవి కావని అర్ధాయుష్కులను కూడా చిరాయుష్కులుగా చేయగల శక్తి తీర్థక్షేత్ర సందర్శనం వలన కలుగుతుందని వివరించే కథ పద్మపురాణం 33వ అధ్యాయంలో కనిపిస్తుంది. మార్కండేయ ముని జీవితానికి సబంధించిన ఈ కథను పులస్త్యముని భీష్ముడికి వివరించి చెప్పాడు. పూర్వం మ్రుకండుడు అనే ముని తన భార్యతో సహా కఠోరంగా తపస్సు చేసి దైవానుగ్రహం వలన ఒక కుమారుడిని పొందాడు. ఆ బాలుడు ఐదేళ్ల ప్రాయంలోనే మంచి గుణగణాలతో ప్రకాశిస్తూ ఉండేవాడు. ఆ చిన్నారి బాలుడు ఇంటి ముంగిట తిరుగుతూ వచ్చేపోయే వారందరికీ జరగబోయే విషయాలను ఎన్నింటినో వివరిస్తూ ఉండేవాడు. దీనిని గమనించిన మ్రుకండుడు ఒకరోజున తన కుమారుడిని పిలిచి నీ ఆయుర్ధాయం ఎంతో చెప్పగలవా అని అడిగాడు.

                                                             ఆ బాలుడు తనకు బ్రహ్మ ఇచ్చిన ఆయువు ఇంకా ఆరు మాసములే ఉందని చెప్పాడు. ఆ మాటలను విని దుఃఖిస్తున్న తండ్రిని దుఃఖించవడద్దని ఆ బాలుడు చెప్పాడు. వెంటనే మ్రుకండుడు తన కుమారుడికి ఉపనయనం జరిపించి, హితబోధగా కనిపించిన ప్రతిమనిషికి ఎటువంటి బేధాన్ని తలచకుండా నమస్కరిస్తూ ఉండమని చెప్పాడు. ఆ బాలుడు తండ్రి మాటను శిరసావహించి తనకు కనిపించిన ప్రతి మనిషికి ఎంతో భక్తిభావంతో, వినయంతో నమస్కరిస్తూ ఉండేవాడు. ఇలా కాలం గడుస్తుండగా ఒకరోజున సప్తరుషులు తీర్థయాత్రలకు వెళుతూ ఆ బాలుడి కంట పడ్డారు. తనకు ఎదురైన ఆ సప్తర్షులందరికీ ఎంతో భక్తితో నమస్కరించాడు. ఆ చిన్నారి బాలుడు అలా నమస్కరించడం ఎంతో ముచ్చటగా సప్తర్షులకు అనిపించింది. వెంటనే వారు ‘‘పూర్ణాయుష్కుడవు కమ్ము’’ అని దీవించారు. అయితే ఆ వెంటనే వారు ఆ బాలుడికి బ్రహ్మ అల్పాయువునే ప్రసాదించాడని తెలుసుకున్నారు. అంతేగాక ఇంకా ఐదు రోజులు మాత్రమే అతనికి ఆయువు ఉందని గ్రహించారు. వెనువెంటనే ఆలస్యం చేయక ఆ బాలుడిని కూడా వెంటబెట్టుకొని వారంతా బ్రహ్మ దగ్గరకు వెళ్ళి నమస్కరించారు. ఆ రుషుల నడుమ బాలుడే ముందుగా తనను గుర్తించి నమస్కరించడం బ్రహ్మకు కూడా ఎంతో ఆనందాన్ని కలిగించింది. వెంటనే బ్రహ్మదేవుడు చిరాయువు కమ్మని ఆ బాలుడిని ఆశీర్వదించాడు. బ్రహ్మ ఆశీర్వచనం విని ప్రక్కనే ఉన్న రుషులంతా ఎంతో ఆనందించారు. ఆ రుషులంతా అలా ఎందుకు ఒక్కసారిగా ఆనందస్వరూపులవుతున్నారో బ్రహ్మకు తెలియరాక ఆ బాలుడు ఎవరని, రుషులంతా తనదగ్గరకు రావడానికి కారణమేమిటని రుషులను ప్రశ్నించాడు బ్రహ్మ. అప్పుడు సప్తర్షులు ఆ బాలుడు మ్రుకండుడి కుమారుడని జరిగిన విషయమంతా వివరించి ఆ బాలుడు తన తండ్రి ఆజ్ఞానుసారం కనిపించిన ప్రతిమనిషికి భక్తి, వినయాలతో నమస్కరిస్తూ తీర్థయాత్రలు చేస్తున్న తమకు ఎదురయ్యాడని చెప్పారు. తాము కూడా ఆ బాలుడిని దీర్ఘాయువుగా ఉండమని దీవించినట్లు ఇప్పుడు బ్రహ్మదేవుడు కూడా ఆ బాలుడిని చిరాయువు ప్రసాదంచడం ఎంతో ఆనందాన్ని కలిగించినట్లు వారు చెప్పారు. ఆ మాటలను విని బ్రహ్మదేవుడు కూడా ఎంతో ఆనందించి ఆ మార్కండేయుడు (మ్రుకండముని కుమారుడు) తన ఆయువుతో సమానమైన ఆయువు కలిగినవాడవుతాడని మరోమారు పలికి రుషులకు, మార్కడేయునికి వీడ్కోలు పలికాడు. అనంతరం మార్కండేయుడు తన ఇంటికి, రుషులు తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్ళారు. మార్కండేయుడు ఇంటికి తిరిగివచ్చి తన తండ్రితో జరిగిన విషయాన్నంతటినీ వివరించి తన జీవితమంతా బ్రహ్మను గురించిన తపస్సులోనే గడిచేలా అనుమతి ఇవ్వమని వేడుకున్నాడు. తన కుమారుడి విజయానికి మ్రుకండుడు ఎంతగానో ఆనందించినప్పటికీ వెంటనే తనను వీడి వెళుతున్నందుకు కొంత బాధాతప్తుడయ్యాడు. అప్పుడు మార్కండేయుడు తండ్రికి ధైర్యం చెప్పి దుఃఖించవలసిన పనిలేదని తాను పుష్కరతీర్థంలో తపస్సు నిర్వహించడానికి వెళుతున్నానని ఆ పుష్కరతీర్థ మహిమను సాక్షాత్తూ జగన్నాథుడే
‘‘బ్రహ్మలోకస్య పన్థానం ధన్యాఃపశ్యంతి పుష్కరం! యన్తు వర్షశతం సాగ్రమగ్నిహోత్రముపాసితా!! కార్తీకం వసేదేకాం పుష్కరే సమమేవచ! కర్తుమ్మయా నశక్తిః కర్మణానైవ సాధితమే!!’’
ఇలా అభివర్ణించాడని చెప్పాడు. ఈ కథలో అల్పాయుష్కుడైన బాలుడు తీర్థయాత్రలు చేస్తున్న సప్తర్షులకు కనిపించడం వారివెంటనే తానే బయలుదేరి బ్రహ్మలోకం వరకూ వెళ్ళి బ్రహ్మ ఆశీస్సులను కూడా పొందటం లాంటి సందర్భాలను పరిశీలిస్తే సత్పురుషుల సందర్శనం, తీర్థయాత్రల వలన కలిగే పుణ్యఫలితం ఎంతటి సత్ఫలితాలను ఇస్తాయో గమనించవచ్చు.


- శ్రీ యల్లాప్రగడ మల్లికార్జున రావు గారు
- సేకరణ ఈనాడు దినపత్రిక నుంచీ