Wednesday, July 31, 2019

గరుత్మంతుడు

Related image


ప్రత్యక్ష దైవాల వంటి తల్లిదండ్రుల పొందగలిగిన తనయులు సర్వత్రా జయాలనే పొందుతుంటారని గరుత్మంతుడి వృత్తాంతం మహాభారతంలో వివరిస్తోంది. వినతకు రెండో సంతానంగా జన్మించిన గరుత్మంతుడు అప్పటికే ఆమె కద్రువకు, ఆమె సంతతికి దాస్యం చేస్తుండడం చూసి ఎలాగయినా తల్లి దాస్యాన్ని పోగొట్టాలని నిర్ణయించుకున్నాడు. ఒకనాడు గరుత్మంతుడు తన దగ్గరకు వచ్చిన సర్పాలని చూసి నా తల్లి దాస్యం, నా దాస్యం విముక్తి కావడానికి మీరు ఏం కావాలో కోరుకొమ్మని అడిగాడు. ‘మాకు అమృతం తెచ్చిపెట్టు మీ దాస్యం విముక్తి అవుతుంది’ అని వారు పలికారు. వెంటనే గరుత్మంతుడు తల్లి వినత దగ్గరకు వెళ్లి నమస్కరించి విషయం చెప్పి తనకు ఆకలిగా ఉందని ఆహారం ఇవ్వమని ప్రార్థించాడు. ఆమె చాలా సంతోషించి సముద్రంలో ఉన్న నిషాదులను మాత్రం తిని ఆకలి తీర్చుకొనమని ఆశీర్వదించింది. గరుత్మంతుడు తల్లి చెప్పినట్లు చేశాడు. కాని ఆకలి తీరలేదు. వెంటనే తన తండ్రి కస్యప ప్రజాపతిని ప్రార్థించాడు. ఆయన పరస్పరం శాపాలను పెట్టుకుని ఏనుగు, తాబేలుగా మారిన విభావనుడు, సుప్రతీకుడు అనే వారిని భక్షించి ఆకలి తీర్చుకొమ్మన్నాడు. భారీకాయాలతో ఉన్న ఆ రెంటిని ఒక పెద్ద చెట్టు కొమ్మమీద పెట్టుకుని భక్షించాలనుకుని కాలు మోపబోగా ఆ చెట్టు కొమ్మ ఫెళఫెళ విరిగింది. ఆ కొమ్మకు బొటనవేలు పరిమాణంలో ఉండి తలకిందులుగా వేలాడుతూ తపస్సు చేసుకుంటున్న వాలఖిల్యులు అనే మునులు ఉన్నారు. వెంటనే కొమ్మను పట్టుకొని తన తండ్రి దగ్గరకు గరుత్మంతుడు వెళ్లాడు. వాలఖిల్యులు గరుత్మంతునిమీద బాగా కోపించారు. అయితే విషయాన్ని వివరించి గరుత్మంతుడు తన కుమారుడేనని పట్టుదలతో అతను తన తల్లి దాస్యం తీర్చడానికి స్వర్గలోకం నుంచి అమృతభాండం తేవడానికి వెళుతున్నాడని, దయతో కోపాన్ని ఉపసంహరించుకోమని ప్రార్థించాడు. ఆ ప్రార్థనకు వాలఖిన్యులు సంతోషించి గరుత్మంతుని శపించకుండా హిమాలయాలకు తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోయారు. ఆ తరువాత తండ్రి సూచన మేరకు చెట్టుకొమ్మను హిమాలయాలకు తీసుకుని వెళ్లి విడిచి ఏనుగు, తాబేలును భక్షించి అమృతభాండం కోసం స్వర్గలోకానికి వెళ్లాడు. ఇలా తలిదండ్రుల ఆశీస్సులతో కష్టాలను అధిగమించి గరుత్మంతుడు కార్యసాధకుడయ్యాడు.






శ్రీ యల్లాప్రగడ మల్లికార్జున రావు గారు
సేకరణ ఈనాడు దినపత్రిక నుంచీ

No comments:

Post a Comment