భాగవతమంటే భగవత్ భక్తుల కథ. భగవత్ భక్తులకు సద్గుణాలే అలంకారం. అలాంటి మంచి గుణాలలో దానగుణం మరీ శ్రేష్ఠమైనది. ముక్తిమార్గాన్ని అనుసరించడానికి అది ఎంతగానో దోహదం చేస్తుందని బలిచక్రవర్తి కథ వివరిస్తోంది. బలి చక్రవర్తి దానగుణంలో అద్వితీయుడు. శ్రీమహావిష్ణువు దేవతల కోరికలను అనుసరించి బలిచక్రవర్తి వద్దకు వామనావతారంలో వెళ్ళడానికి బలిచక్రవర్తి దానగుణమే ప్రధానమైంది. మంచి ముఖవర్ఛస్సుతో పొట్టిగా ఉన్న బ్రాహ్మణ బాలుడు తన కోసం నడుస్తూ వచ్చేసరికి బలిచక్రవర్తికి ఎంతో ఆనందం వేసింది. ఎదురు వెళ్ళి నమస్కరించి తన సింహాసనం మీద కూర్చోబెట్టి అతిథిపూజ చేసి యోగక్షేమాలను అడిగాడు. ఆ తరువాత ఏమి కావాలో కోరుకోమని, విలువైన ఆభరణాలు, వస్త్రాలు, భూములేకాక చివరకు తన రాజ్యాన్నయినా ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు. అప్పుడు ఓ చక్కటి చిరునవ్వు నవ్వి తనలాంటి వాడికి అవేవీ అక్కర్లేదని, తనకు కేవలం మూడడుగుల నేల మాత్రం చాలని, దాన్ని ఇస్తే తనకు బ్రహ్మానందం కలుగుతుందని వామనుడు చెప్పాడు. బలిచక్రవర్తికి కొంత ఆశ్చర్యమేసింది. తనలాంటి రాజు దగ్గరకు వచ్చి తన అంతస్తుకు తగిన విధంగా ఏవైనా కోరుకోమని మళ్ళీ వేడుకున్నాడు. ఆశ మనిషికి చాలా చేటు తెస్తుందని, ఆశ పొడవైన తాడులాంటిదని, ఆ ఆశాపాశానికి చిక్కుకోవడం మనిషికి మంచిదికాదని వామనుడు వివరించాడు. తనకు కావాల్సింది కేవలం మూడు అడుగుల నేల మాత్రమేనని, దానిని ఇవ్వమని కోరాడు. బలిచక్రవర్తి ఒక స్థిర నిర్ణయానికి వచ్చి వామనుడికి మూడడుగుల నేల దానం ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ఇంతలో రాక్షస గురువైన శుక్రాచార్యుడు అక్కడికి వచ్చి, వచ్చినవాడు సామాన్యుడు కాడని, మూడడుగుల నేలను దానంగా తీసుకుని త్రివిక్రముడై బలిని అణచివేస్తాడని, దానితో వంశము, కులము, రాజ్యము అన్నీ నాశనమవుతాయని, దానము ఇవ్వవద్దని హెచ్చరిక చేశాడు. బలిచక్రవర్తి క్షణకాలం ఆలోచించి తన గురువుకు సమాధానం చెప్పాడు. పూర్వం తనకంటే అధికంగా రాజ్యాన్ని సముపార్జించిన రాజులు ఎందరెందరో ఉన్నారు. కానీ వారు మరణించిన తరువాత వారి పేరు ఎవరూ తలుచుకోలేదు. అదే శిబి చక్రవర్తి వంటివారుమంచి దానాలు చేసి ఇప్పటికీ కీర్తి అనే శరీరంతో వెలుగొందుతున్నారు. తాను కూడా దానం ఇవ్వటానికి సిద్ధమయ్యానని చెప్పాడు. వచ్చినవాడు హరి అయినా మరి ఎవరయినా తనకు లెక్కలేదని, అంతటివాడి చేయి కింద ఉండి తన చేయి పైన ఉండటమే తనకు ఆనందదాయకమని అన్నాడు. దానం ఇచ్చినందు వల్ల కులము, రాజ్యము, వంశము ఏవి నాశనమయినా తనకు లెక్కలేదని, ఒక్కసారి ఇచ్చినమాట వెనుకకు తీసుకోబోనని చెప్పాడు. ఆ తరువాత స్థిర నిర్ణయంతో వామనుడికి ఆనందంగా మూడడుగుల నేలను దానం చేశాడు. వామనుడు త్రివిక్రముడై, విశ్వమంతా వ్యాపించి బలిచక్రవర్తిని పాతాశ సామ్రాజ్యానికి అధిపతిని చేశాడు. బలిచక్రవర్తి పాత్ర ద్వారా భారతీయ సనాతన సంప్రదాయంలో దానగుణానికి ఉన్న విలువ ఎంతటిదో తెలుస్తోంది.
Showing posts with label భక్తి కధలు. Show all posts
Showing posts with label భక్తి కధలు. Show all posts
Wednesday, June 24, 2020
వామనావతారం
భాగవతమంటే భగవత్ భక్తుల కథ. భగవత్ భక్తులకు సద్గుణాలే అలంకారం. అలాంటి మంచి గుణాలలో దానగుణం మరీ శ్రేష్ఠమైనది. ముక్తిమార్గాన్ని అనుసరించడానికి అది ఎంతగానో దోహదం చేస్తుందని బలిచక్రవర్తి కథ వివరిస్తోంది. బలి చక్రవర్తి దానగుణంలో అద్వితీయుడు. శ్రీమహావిష్ణువు దేవతల కోరికలను అనుసరించి బలిచక్రవర్తి వద్దకు వామనావతారంలో వెళ్ళడానికి బలిచక్రవర్తి దానగుణమే ప్రధానమైంది. మంచి ముఖవర్ఛస్సుతో పొట్టిగా ఉన్న బ్రాహ్మణ బాలుడు తన కోసం నడుస్తూ వచ్చేసరికి బలిచక్రవర్తికి ఎంతో ఆనందం వేసింది. ఎదురు వెళ్ళి నమస్కరించి తన సింహాసనం మీద కూర్చోబెట్టి అతిథిపూజ చేసి యోగక్షేమాలను అడిగాడు. ఆ తరువాత ఏమి కావాలో కోరుకోమని, విలువైన ఆభరణాలు, వస్త్రాలు, భూములేకాక చివరకు తన రాజ్యాన్నయినా ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు. అప్పుడు ఓ చక్కటి చిరునవ్వు నవ్వి తనలాంటి వాడికి అవేవీ అక్కర్లేదని, తనకు కేవలం మూడడుగుల నేల మాత్రం చాలని, దాన్ని ఇస్తే తనకు బ్రహ్మానందం కలుగుతుందని వామనుడు చెప్పాడు. బలిచక్రవర్తికి కొంత ఆశ్చర్యమేసింది. తనలాంటి రాజు దగ్గరకు వచ్చి తన అంతస్తుకు తగిన విధంగా ఏవైనా కోరుకోమని మళ్ళీ వేడుకున్నాడు. ఆశ మనిషికి చాలా చేటు తెస్తుందని, ఆశ పొడవైన తాడులాంటిదని, ఆ ఆశాపాశానికి చిక్కుకోవడం మనిషికి మంచిదికాదని వామనుడు వివరించాడు. తనకు కావాల్సింది కేవలం మూడు అడుగుల నేల మాత్రమేనని, దానిని ఇవ్వమని కోరాడు. బలిచక్రవర్తి ఒక స్థిర నిర్ణయానికి వచ్చి వామనుడికి మూడడుగుల నేల దానం ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ఇంతలో రాక్షస గురువైన శుక్రాచార్యుడు అక్కడికి వచ్చి, వచ్చినవాడు సామాన్యుడు కాడని, మూడడుగుల నేలను దానంగా తీసుకుని త్రివిక్రముడై బలిని అణచివేస్తాడని, దానితో వంశము, కులము, రాజ్యము అన్నీ నాశనమవుతాయని, దానము ఇవ్వవద్దని హెచ్చరిక చేశాడు. బలిచక్రవర్తి క్షణకాలం ఆలోచించి తన గురువుకు సమాధానం చెప్పాడు. పూర్వం తనకంటే అధికంగా రాజ్యాన్ని సముపార్జించిన రాజులు ఎందరెందరో ఉన్నారు. కానీ వారు మరణించిన తరువాత వారి పేరు ఎవరూ తలుచుకోలేదు. అదే శిబి చక్రవర్తి వంటివారుమంచి దానాలు చేసి ఇప్పటికీ కీర్తి అనే శరీరంతో వెలుగొందుతున్నారు. తాను కూడా దానం ఇవ్వటానికి సిద్ధమయ్యానని చెప్పాడు. వచ్చినవాడు హరి అయినా మరి ఎవరయినా తనకు లెక్కలేదని, అంతటివాడి చేయి కింద ఉండి తన చేయి పైన ఉండటమే తనకు ఆనందదాయకమని అన్నాడు. దానం ఇచ్చినందు వల్ల కులము, రాజ్యము, వంశము ఏవి నాశనమయినా తనకు లెక్కలేదని, ఒక్కసారి ఇచ్చినమాట వెనుకకు తీసుకోబోనని చెప్పాడు. ఆ తరువాత స్థిర నిర్ణయంతో వామనుడికి ఆనందంగా మూడడుగుల నేలను దానం చేశాడు. వామనుడు త్రివిక్రముడై, విశ్వమంతా వ్యాపించి బలిచక్రవర్తిని పాతాశ సామ్రాజ్యానికి అధిపతిని చేశాడు. బలిచక్రవర్తి పాత్ర ద్వారా భారతీయ సనాతన సంప్రదాయంలో దానగుణానికి ఉన్న విలువ ఎంతటిదో తెలుస్తోంది.
Monday, June 22, 2020
సావిత్రి

మద్రదేశాధిపతి అయిన అశ్వపతికి ఆయన భార్య మాళవికి సావిత్రీ దేవత వరప్రసాదం వల్ల సావిత్రి జన్మించింది. 18 సంవత్సరాల నిరీక్షణ అనంతరం ఆ దంపతులకు అందం, తేలివితేటలు, అదృష్టం ఉన్న బాలిక జన్మించింది. సావిత్రి యుక్తవయసుకు వచ్చేసరికి అందాలరాశిగా, అతిలోక సౌందర్యవతిగా ఎదిగింది. ఆమెకు ఆశ్వపతి వివాహ ప్రయత్నాలు చేయడం ప్రారంభించాడు. చాలాకాలం పాటు ప్రయత్నాలు కొనసాగాయి. సాళ్వ రాజ్యాధిపతైన ద్యుమత్సేనుడి కుమారుడు సత్యవంతుడు. సత్యవంతుడి రూప, గుణ, విలాసాలను తెలుసుకొని ఆకర్షితురాలైంది. సావిత్రి. కానీ ద్యుమత్సేనుడి రాజ్యభ్రష్ఠుడై అడవులపాలై ఉన్నాడు. ఒకనాడు నారదమహర్షి మద్రదేశాధిపతైన ఆశ్వపతి దగ్గరకు వచ్చిన సందర్భంలో సావిత్రి పెళ్ళి ప్రస్తావన వచ్చింది. సావిత్రి దృఢ నిశ్చయంతో తన మనసులోని మాటను చెప్పి సత్యవంతుడిని వివాహమాడుతానని చెప్పింది. అందుకు నారదుడు సంతోషించాడు. అశ్వపతి ద్యుమత్సేనుండి వివరాలను అడుగగా నారదుడు తన దివ్యదృష్టితో చూసి సత్యవంతుడు రూపంలోనూ, గుణంలోనూ గొప్పవాడే అయినప్పటికీ ఒక సంవత్సర కాలంలోపు మరణించే అల్పాయిష్కుడని చెప్పాడు. అంతేకాక ఆశ్వపతి, నారదులు ఇద్దరూ సావిత్రిని ఈ కారణంతో మనసు మార్చుకొని వేరొక వరుడిని వివాహమాడమని చెప్పారు. అయినా ఆమె తన పట్టుదలను వదలలేదు. చేసేదిలేక ఆమె తండ్రి అడవికి వెళ్ళి ద్యుమత్సేనుడికి విషయమంతా వివరించి సావిత్రీ సత్యవంతుల వివాహానికి ఒప్పించాడు. ఒక శుభముహూర్తంలో మంచి కానుకలిచ్చి వివాహం జరిపించాడు. వివాహమైన తరువాత రత్నాభరణాలను, విలువైన వస్త్రాలను ధరించక కేవలం నార చీరలనే ధరించి సావిత్రి అత్తమామలకు, భర్తకు సపర్యలు చేస్తూ గడుపుతోంది. ఇంతలో నారదమహర్షి సత్యవంతుడి ఆయుస్షుకు సంబంధించి చేసిన హెచ్చరిక గుర్తుకు వచ్చింది. మరి నాలుగు రోజుల్లో సత్యవంతుడికి ఆయువు తీరుతుందని గ్రహించిన ఆమె కఠోరమైన త్రిరాత్రవ్రతానికి సిద్ధమైంది. మూడురోజుల వ్రతం ముగిసి నాలుగోరోజు ఉదయం సత్యవంతుడు అడవికి పూవులు, ఫలాల కోసం బయలుదేరాడు.
సావిత్రి కూడా అతడి వెంట బయలుదేరగా వద్దని వారించాడు. అయినా ఆమె భర్తను బతిమాలి, అత్తమామల దగ్గర సెలవు తీసుకొని అడవికి బయలుదేరింది. ఆ ఇద్దరూ అడవిలో పువ్వులు, పండ్లు కోసిన తరవాత కట్టెలను కొట్టిన అనంతరం సత్యవంతుడికి బాగా అలసటగా అనిపించి సావిత్రి ఒడిలో తలపెట్టుకొని పడుకున్నాడు. అలా పడుకున్న కొద్దిసేపటికి అతడు నిస్తేజుడు కావటం, కొద్దిదూరంలో తేజోవంతుడైన ఒక దివ్యపురుషుడు నిలబడి ఉండటం సావిత్రి గమనించింది. సత్యవంతుడిని తన ఒడి నుంచి దింపి ఆ దివ్యపురుషుడికి ఎదురుగా వెళ్ళి ఆయనయమధర్మరాజని తెలుసుకుని, యముడు తన భర్త ప్రాణాలను బంధించి తీసుకువెళ్ళడం చూసి వెంబడించింది. తనను వెంబడించి వస్తున్న సావిత్రి పాతివ్రత్య మహిమకు యముడు ముగ్ధుడై పతి ప్రాణం తప్ప ఏమైనా కోరుకోమన్నాడు. అప్పుడు ఆమె తన మామగారికి చూపును ప్రసాదించమని కోరింది. ఆ వరమిచ్చిన తరువాత మళ్ళీ వెంబడిస్తున్న సావిత్రిని చూసి ఇంకొక వరం కోరుకోమ్మనగా తన మామకు రాజ్యప్రాప్తి కలగాలని కోరుకుంది. యముడు అనుగ్రహించాడు. అయినా వదలక వెంబడిస్తున్న సావిత్రిని పతిప్రాణం తప్ప వేరొకటి కోరుకొమ్మనగా తన తండ్రికి పుత్రప్రాప్తి కలగాలని వేడుకుంది. అయినా మళ్ళీ వెంబడిస్తూ తన వాక్ చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్న సావిత్రి పాతివ్రత్యానికి ముచ్చటపడి యముడు సత్యవంతుడి ప్రాణాలను తిరిగి ఇచ్చేశాడు. ఇలా సావిత్రి తన మనోనిబ్బరంతో, దృఢ సంకల్పంతో అత్తమామలకు రాజ్యాన్ని, తండ్రికి పుత్రసంతానాన్ని, తనకు అయిదోతనాన్ని సంపాదించుకోగలిగింది. ఆడది అబలకాదు సబల అని సావిత్రి కథ వివరిస్తోంది.
Sunday, May 31, 2020
వింధ్యాద్రి గర్వభంగం - అగస్త్య మహాముని
అసూయాపరులకు, గర్వపోతులకు ఎప్పటికైనా గర్వభంగం తప్పదన్న సత్యాన్ని ఈ కథ నిరూపిస్తుంది. స్కాందపురాణంలో ఈ కథ కనిపిస్తుంది.
భూమండలం మీద ఉన్న కులపర్వతాలన్నింటికీ హిమవంతుడు రాజు. అలాగే మిగిలిన పర్వతాలలో ఒక్కొక్క పర్వతానికి ఉన్న విశేషాన్ని అనుసరించి సప్తకుల పర్వతాలకు ఒక్కొక్క ప్రత్యేకతను బ్రహ్మ ఏర్పాటు చేశాడు. అవికాక మిగిలిన ఇతర పర్వతాలకు కూడా స్థల ప్రభావాన్ని అనుసరించి ఒక్కొక్క పర్వతానికి ఒక్కొక్క గుర్తింపు ఇచ్చాడు. మిగిలిన పర్వాతాల గొప్పతనాన్ని చూసి వింధ్యపర్వతం మాత్రం నిరంతరం అసూయ పడుతుండేది. తాను కూడా తలచుకుంటే ఎంతో ఎత్తుకు ఎదగగల శక్తి కలిగిన పర్వతాన్నేనని గర్వపడుతుండేది. ఇలా గర్వపడటమే ఆ పర్వతం ఇప్పటికీ అణిగి మణిగి ఉండటానికి కారణమైంది. నిరంతర అసూయాగుణం కలిగిన ఆ వింధ్యపర్వతం ఒక రోజున నారదుడు దోవలో వెళుతుండగా ఆయనకు స్వాగతం పలికి అతిథి పూజలు చేసి సత్కరించి తన గోడంతా వెళ్లబోసుకుంది. మేరు పర్వతం, హిమాలయ పర్వతం, మందర పర్వతం, ఇలాంటి పర్వతాలు ఏవీ తగిన సామర్థ్యం కలిగి ఉండకపోయినా వాటిని అందరూ గౌరవిస్తున్నారని, పూజిస్తున్నారని వాస్తవానికి ఆ పర్వతాలన్నింటికంటే తానే అధిక శక్తి కలిగిన దానినని చెప్పుకుంది. నారదుడు వింధ్యపర్వతం గర్వం చూసి మనసులో నవ్వుకున్నాడు. కానీ కలహాభోజుడు అప్పటికి ఏదో ఒక విధంగా వింధ్యపర్వతం దగ్గర నుంచి బయటపడి వింధ్య పర్వతాన్ని సమర్ధిస్తున్నట్లుగా మిగిలిన పర్వతాలను తక్కువగా చూస్తున్నట్లుగా భావం కలిగేలా పూర్తిగా తన ప్రవర్తనను ప్రకటించకుండా వింధ్యాద్రి నుంచి ముందుకు కదిలాడు. వింధ్యపర్వతం ఆనాటి నుంచి ఎలాగైనా తన గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలని అనుకుంది. వెంటనే ఆకాశం వరకు పెరిగింది. వింధ్యపర్వతం అలా ఆకాశం వరకు పెరిగే సరికి సూర్యగమనానికి అడ్డంకి ఏర్పడింది. సూర్యుడు పర్వతానికి ఆ వైపు నిలిచిపోయాడు. నక్షత్ర, గ్రహ సంచారాలు కూడా ఆగిపోయాయి. ఇటువైపు, అటువైపు పగలు, రాత్రుల్లో మార్పులు జరగడం లేదు. దాంతో లోకవాసుల జీవితాలన్నీ అయోమయంలో పడ్డాయి.
సూర్యోదయ సూర్యాస్తమయాలు లేక మునులు సంధ్యావందనం, యజ్ఞయాగాలు చేసుకోలేకపోయారు. ఈ విపరీత పరిస్థితి దేవతలను సైతం బాగా కలచివేసింది. దేవతలంతా కలసి బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లి మొర పెట్టుకున్నారు. బ్రహ్మ సమయ స్ఫూర్తితో ఆలోచించి వింధ్యపర్వతం గర్వం అణచటానికి అగస్త్య మహాముని ఒక్కడే తగిన వాడని భావించాడు. గతంలో ఇంద్రపదవి చేపట్టి లోకాలను బాధించిన నహుషుడి గర్వాన్ని అణించింది, సముద్రాల జలాలను ఔపోశన పట్టింది ఆ మునేనని చెప్పి దేవతలందరినీ తీసుకుని అగస్త్య మహాముని ఆశ్రమానికి వెళ్లాడు. ఆయనకు విషయమంతా వివరించి ఎలాగైనా వింధ్యపర్వతం గర్వం అణచి ప్రపంచానికి మేలు చేయమని ప్రార్ధించాడు. అగస్త్యుడు కాశీ మహానగరాన్ని, కాశీ విశ్వేశ్వరుడిని, అన్నపూర్ణను విడిచిపెట్టి వెళ్లడం ఇష్టం లేకపోయినా లోకకల్యాణం కోసం దేవతల కోరికను తీర్చడం కోసం తన భార్య అయిన లోపాముద్రను వెంటపెట్టుకుని బయలుదేరాడు. వింధ్యపర్వతాన్ని ఆ దంపతులిద్దరూ సమీపించగానే వింధ్యుడు వారికి నమస్కరించి ఎటు వెళుతున్నారని అడిగాడు. అప్పుడు అగస్త్యుడు తాను భార్యా సమేతంగా దక్షిణ భారత యాత్రకు బయలుదేరినట్లు తమకు దోవ ఇస్తే అవతల వైపునకు వెళ్లగలమని చెప్పాడు. వింధ్యుడు అందుకు ఒప్పుకున్నాడు. అయితే అగస్త్యుడు తాను మళ్లీ తిరిగి వచ్చే వరకు అలాగే ఎత్తు తగ్గించుకుని అణిగి మణిగి ఉండాలని వింధ్యుడికి చెప్పాడు. అగస్త్యుడి మాటల్లోని ఆంతర్యాన్ని గమనించలేని వింధ్యపర్వతం ఆకాశానికి పెంచిన తన దేహాన్ని తగ్గించుకుని ముని దంపతులకు దారి ఇచ్చింది. లోపాముద్రతో కలసి ఆ పర్వతాన్ని దాటి ముందుకు వెళ్లాడు. సూర్యచంద్రాదులకు, నక్షత్ర గ్రహాలకు అడ్డు తొలగిపోవడంతో మళ్లీ ప్రపంచమంతా హాయిగా యథావిథిగా గడపగలిగింది.
అగస్త్యుడు కాశీ మహానగరం నుంచి అలా దక్షిణ భారతదేశంలో దాక్షారామం, శ్రీశైలం తదితర ప్రాంతాలను సందర్శించి అక్కడే ఉండిపోయి వెనక్కు తిరిగిరాలేదు. దాంతో వింధ్యుడు అలాగే ఉండిపోయాడు.
Thursday, May 28, 2020
హయగ్రీవావతారం

సకల చరాచర సృష్ఠికి కర్త అయిన బ్రహ్మకు శక్తిని ఇచ్చేవి వేదాలే, ఆ వేదాల సంరక్షణలో నిరంతరం మహావిష్ణువు నిమగ్నమై ఉంటాడని, విష్ణుతత్వ మహత్యాన్ని, వేద విజ్ఞాన ఔన్నత్యాన్ని గురించి ఈ కథ తెలియజేస్తుంది.
శ్రీ మహావిష్ణువు దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం ఎన్నో విధాలుగా ఎన్నెన్నో సందర్భాల్లో అవతరించాడు. తేజోవంతమైన రూపంతో ఆయన హయగ్రీవావతారం పొంది వేదాలను రక్షించాడు. కేవలం వేదోద్ధరణ లక్ష్యంగా హయగ్రీవావతారం కనిపిస్తుంది. పూర్వం శ్రీ మహావిష్ణువు నాభికమలంలో ఆసీనుడై ఉన్న సృష్ఠికర్త బ్రహ్మ తన పనిలో తాను నిమగ్నమై ఉండగా రజస్తమోగుణాలకు ప్రతీకలుగా ఉన్న మధుకైటభులు అనే ఇద్దరు రాక్షసులు గదలను ధరించి మెల్లగా బ్రహ్మదగ్గరకు చేరి, మనోహర రూపాలతో భాసిల్లుతున్న నాలుగు వేదాలను అపహరించారు.
బ్రహ్మ చూస్తుండగానే అపహరించిన వేదాలతో ఆ దానవులు సముద్రంలో ప్రవేశించి రసాతలానికి చేరారు. వేదాలను కోల్పోయిన బ్రహ్మ వేదాలే తనకు ఉత్తమ నేత్రాలని, వేదాలే తనకు ఆశ్రయాలని, వేదాలే తనకు ముఖ్య ఉపస్యాలని అవి లేకపోతే తాను సృష్ఠిని చేయడం కుదరదని విచారిస్తూ ఆ ఆపద నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచించసాగాడు. ఆయనకు వెంటనే శ్రీమహావిష్ణువు గుర్తుకు వచ్చి పరిపరివిధాల స్తుతించాడు. బ్రహ్మ ఆవేదనను శ్రీహరి గ్రహించి వేద సంరక్షణ కోసం యోగ రూపంతో ఒక దివ్యశరీరాన్ని పొందాడు. ఆ శరీరం చంద్రుడిలా ప్రకాశించసాగింది. ఆ శరీరమే హయగ్రీవ అవతారం అయింది. నక్షత్రాలతో నిండిన ఆకాశం ఆయన శిరస్సుగా మారింది. సూర్యకిరణ కాంతితో ఆయన కేశాలు మెరవసాగాయి. ఆకాశం పాతాళం రెండు చెవులుగా, భూమి లలాటభాగంగా, గంగా సరస్వతులు పిరుదులుగా, సముద్రాలు కనుబొమ్మలుగా, సూర్యచంద్రులు కన్నులుగా, సంధ్య నాసికగా, ఓంకారమే ఆయనకు అలంకారంగా, విద్యుత్తు నాలుకగా, పితృదేవతలు దంతాలుగా, గోలోకం బ్రహ్మలోకం రెండు పెదవులుగా, తమోమయమైన కాళరాత్రి ఆయనకు మెడభాగంగా అలరారాయి.
ఈ విధమైన ఒక దివ్యరూపాన్ని ధరించిన శ్రీహరి హయగ్రీవావతారం బ్రహ్మ ముందు నుంచి అంతర్ధానమై రసాతలానికి ప్రవేశించింది. అక్కడ హయగ్రీవుడు ఉదాత్త, అనుదాత్త స్వరయుక్తంగా పెద్దగా సామవేదాన్ని గానం చేయసాగాడు. ఆ మధుర గానవాహిని రసాతలం అంతా మారుమోగింది. ఆ గానరసం రసాతలంలో వేదాలను దొంగిలించి దాక్కున్న రాక్షసుల చెవులకు కూడా సోకింది. ఆ గాన రసవాహినికి ఆ రాక్షసులిద్దరు పరవశించి బ్రహ్మ దగ్గర నుంచి తాము తెచ్చిన వేదాలను ఒక చోట భద్రం చేసి గానం వినిపించిన దిక్కుకు పరుగులు తీశారు. అయితే ఇంతలో హయగ్రీవుడు రాక్షసులు దాచిన వేదాలను తీసుకొని సముద్ర గర్భం నుంచి బయటకు వచ్చి అక్కడ ఈశాన్యభాగంలో హయగ్రీవరూపాన్ని విడిచి తన స్వరూపాన్ని పొందాడు. రాక్షసులు గానం వినిపించిన దిక్కుకు బయలుదేరి వెళ్లి ఎంత వెతికినా, ఎక్కడ వెతికినా ఎవరూ కనిపించలేదు. వెంటనే తమ వేదాలను దాచి ఉంచిన ప్రదేశానికి వెళ్లి చూశారు. అక్కడ వేదాలు కనిపించలేదు.
వెంటనే ఆ ఇద్దరూ రసాతలం నుంచి వెలుపలికి వచ్చి సముద్రంలో దివ్యతేజ కాంతిపుంజంలాగా ఉండి ఆదిశేషుడి మీద యోగ నిద్రాముద్రలో ఉన్న శ్రీమహావిష్ణువును చూశారు. ఆ రాక్షసులు తాము దాచిన వేదాలను అపహరించింది ఆ శ్వేతపురుషుడేనని, తమ దగ్గర నుంచి వేదాలను తెచ్చినది కాక ఏమీ తెలియనట్లు నిద్రిస్తున్నాడని కోపగించుకొని శ్రీమహావిష్ణువు మీదకు యుద్ధానికి వెళ్లారు. అప్పుడు విష్ణువు ఆ రాక్షసులతో యుద్ధం చేసి వారిని సంహరించాడు. ఇలా హయగ్రీవావతారం వేదోద్ధరణ లక్ష్యంగా అవతరించింది.
Saturday, May 23, 2020
నారద తుంబురులు
భారతీయ పురాణ సాహిత్యంలో తారసపడే ప్రతి కథ, పాత్ర మానవాళికి ఒక మంచి మార్గాన్నో, నడవడికనో నేర్పడానికే అవతరించినట్లు అనిపిస్తూ ఉంటుంది. అందరికీ సుపరిచితమైన నారదుడు వంటి పాత్రల ప్రవర్తన ద్వారా కూడా సందేశం అందుతూ ఉంటుంది. నారదుడు, తుంబురుడు ఇద్దరూ సహాధ్యాయులు (ఒకచోట విద్యనేర్చుకున్నారు), గానవిద్యలో తనను మించిన వారు ఎవరూ ఉండవోరనేది నారదముని పెంచుకున్న భావం. ఆ గర్వఫలమే ‘తాడితన్నే వాడు ఉంటే వాడితల తన్నేవాడు మరొకరు ఎప్పుడూ ఉండే ఉంటాడనే నగ్నసత్యాన్ని చవిచూడాల్సి వచ్చింది నారదుడు. తన గర్వభంగ కథనంతా మణికంఠరుడు అనే ఓ గంధర్వుడికి వివరించి విచారం పొందాడు. నారదుడి నోవేదనంతా ఇలా ఉంది.
వైకుంఠంలో ఒకనాడు శ్రీమహావిష్ణువు నిండుకొలువు తీరి ఉన్నాడు. ఆ కొలువు కూటానికి దేవతలు, మినగణాలు, గంధర్వులు, తదితరులంతా విచ్చేశారు. సభా ప్రాంగణానికి ముందు ఉన్న అందమైన తోట నుంచి లక్ష్మీదేవి నల్లని మబ్బుల మధ్యన మెరుపు తీగలాగా మెరుస్తూ చెలికత్తెలు అటూ ఇటూ నడుస్తుండగా శ్రీమహావిష్ణువు కొలువుతీరిన ప్రదేశానికి బయలుదేరి వస్తోంది. ఆమెను చూడాలనే తపన అక్కడ ఉన్న వారందరిలోనూ బయలుదేరింది. ఈ లోగా విష్వక్సేనుడు తన పరివారంతో అక్కడికి వచ్చాడు. వారంతా చేతిలో బెత్తాలు ధరించి లక్ష్మీదేవి నడిచే దారికి అడ్డంగా ఉన్న వారందరినీ చెదరగొట్టి కకావికలు చేశారు. బ్రహ్మలాంటి దేవతలు కూడా ఆ ధాటికి దూరంగా పారిపోవాల్సి వచ్చింది. ఇంకా నారదుడు వంటి వారి పరిస్థితి చెప్పనవసరం లేదు. అలా లక్ష్మీదేవి కొలువు కూటంలోకి వెళ్లిన వెంటనే ద్వారపాలకులు తలుపులు మూసివేశారు. కొద్దిసేపైన తరువాత లోపలి నుంచి ఎవరో వచ్చి ఓహో తుంబురుడా అంటూ గట్టిగా పిలిచి తుంబురుడిని లోపలకు తీసుకువెళ్లారు. లోపల ఏం జరుగుతుందోనని బయట ఉన్న వారందరికీ ఆతృత హెచ్చింది. కొద్ది సమయం అయిన తరువాత చిరునవ్వులు నవ్వుతూ గంధపు పూతలతో మెడలో దగాదగా మెరిసే పతకంతో సన్మానితుడైన తుంఉబురుడు బయటకు రాగానే అందరూ ఏమిటి విశేషమని అడిగారు. తుంబురుడు సంతోషంతో శ్రీమహాలక్ష్మి చెంత ఉండగా మహావిష్ణువు తన గానాన్ని విని ఆనందించి ఇలా సత్కరించాడని చెప్పాడు. ఆ మాటలు నారదుడి మనసును ఎంతో నొప్పించాయి. అసూయతో అతని హృదయం రగిలిపోయింది. ఇంతకు ముందు ఎక్కడ గానకళను ప్రదర్శించినా తామిద్దరూ కలసి ప్రదర్శించటం అలవాటుగా వస్తోంది. గానకళలో తనకు ఎన్నోమార్లు ప్రశంసలు వచ్చాయి. ఇప్పుడు తుంబురుడు తగుదనమ్మా అంటూ తానొక్కడే వెళ్లి శ్రీహరి ఎదుట గానాన్ని ఆలపించటం అతని హృదయాన్ని భగభగలాడించింది. ఎలాగయినా తుంబురుడిని మించిన గానకళా విద్వాంసుడిగా ఇప్పుడు అందరిచేత మెప్పు పొందాలని అనుకున్నాడు. దీనితోపాటుగా తుంబురుడి గాన విద్యలోని దోషాలను పసిగట్టి వాటిని బయటపెట్టేందుకు స్నేహాన్ని నటిస్తూనే కార్యాన్ని సాధించాలని అనుకున్నాడు. ఒకనాడు తుంఉబురుడి ఇంటికి వెళ్లిన నారదుడికి పాటకు సిద్ధంగా ఉంచిన వీణ కనిపించింది. అక్కడ ఉన్న పరిచారికలను తుంబురుడెక్కడ అని అడుగగా లోపల ఉన్నాడని పిలుచుకొస్తామని వెళ్లారు. ఈలోగా అక్కడ పెట్టి ఉంచిన వీణను నారదుడు తాకాడు. తుంఉబురుడు శ్రుతి చేసి పెట్టిన వీణ అద్భుతమైన రాగాలను ఆలపించింది. శ్రుతి చేసిన వీణే అంత అద్భుతంగా ఆలాపన చేస్తే తుంబురుడు స్వయంగా గానమాలపిస్తే ఇంక ఎంత గొప్పగా ఉంటుందోనని హించుకొని సిగ్గుపడి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తరువాత ఎంతో మంది గురువులను అతడు ఆశ్రయించి గానవిద్యలో తనను తుంఉబురుడి కంటే గొప్పవాడిని చేయమని అడిగాడు. వారంతా అది తమకు సాధ్యపడదని చెప్పారు. చివరకు చేసేది లేక శ్రీమహావిష్ణువు గురించి చాలా కాలం తపస్సు చేశాడు. ఆయన ప్రత్యక్షమై నారదుడి కోరిక విని ఈ అవతారంలో అది సాధ్యపడదని తరువాత వచ్చే అవతారంలో వీలు కల్పిస్తానని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఇలా తానొక్కడే గానకళలో గొప్పవాడని భావించుకున్న నారదుడు భంగపాటుకు గురై పండితులు ఎప్పుడూ నీటికొద్దీ తామరలాగా ఉంటారని, చెవిటివాడి ముందు శంఖం దినట్లుగా తమకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారి ఎదుట తమ విద్యను ప్రదర్శించరని గ్రహించాడు. తుంబురుడు తన సహాధ్యాయి అయినప్పటికీ ఎంతో కృషి చేసి గాన కళాప్రపూర్ణుడు అయ్యాడని, అది తెలియని తాను గానే గొప్ప అనుకుని గర్వపడి చివరకు గర్వభంగపాటుకు గురికావాల్సి వచ్చిందనుకున్నాడు. విద్యావంతులు, గుణవంతులు, వినయ సంపన్నులు సమయాన్ని సందర్భాన్ని పురస్కరించుకుని మాత్రమే తమలోని గొప్పతనాన్ని ప్రదర్శిస్తారని తెలుసుకోలేని వారు నారదుడిలాగే గర్వభంగం పొందాల్సి వస్తుందని ఈ కథ సారాంశం.
మూలం డాక్టర్ యల్లాప్రగడ మల్లికార్జునరావు
Wednesday, August 7, 2019
త్య్రంబకం

అలల సవ్వడిలో
సప్తస్వర స్వనాలను సమ్మిళితం చేస్తూ రాజమహేంద్రి కాంతకు మణిమేఖలలా భాసిల్లుతూ
పరవళ్ళు తొక్కుతూ పరవశించి పోతూ, ఉరవళ్ళు తొక్కుతూ
ఉత్సాహంతో సాగుతూ సాగర సంగమం చేస్తున్న గోదారితల్లి పుట్టిల్లు మహారాష్ట్రలోని
నాసిక్ దగ్గర ఉన్న త్య్రంబకం. తన పుట్టుకలోనే ఓ పవిత్రతను, ఓ సామాజిక ప్రయోజనాన్ని నింపుకుని అవతరించిన
గౌతమీ మాత రాజమహేంద్రి దాకా సాగి మధ్య మధ్యలో ఎన్నెన్నో తీర్ధాలను ఉపనదులను
కలుపుకుని సప్తరుషుల పేర్ల మీద ఏడు పాయలుగా ఎగసి పడుతున్న ఆనందంలా సాగర సంగమానికి
ఉరుకులెత్తటం చూస్తుంటూనే గుండెనిండా ఆనందం గంతులేస్తుంటుంది. గోహత్య మహాపాపాన్ని
ప్రక్షాళన చెయ్యటానికి పరమేశ్వరుడి శిరస్సునుండి దూకి వచ్చిన ఈ గంగను(గౌతమి) తాకిన
వారందరికీ తరతరాల పాపం నశించి పుణ్యం ఒకటికి పది రెట్లు చేకూరుతుందన్నది ఆస్థిక జన
భావన. ఈ గౌతమి ఆవిర్భావానికి, అక్కడే
పరమేశ్వరుడు త్య్రంబకేశ్వరుడై జ్కోతిర్లింగ రూపంలో వెలుగొందటానికి కారణమైన ఓ కథ
స్థల పురాణంగా ప్రచారంలో వుంది.

(త్రయంబకేశ్వర ఆలయం)
అంతేకాక అష్టాదశ పురాణాలలో ఒకటైన శ్రీ
శివమహాపురాణంలో త్య్రంబకేశ్వర మహత్యం అనే పేరున కూడా ఒక కథ కనిపిస్తుంది. కొందరు
రుషులు గౌతమ మహర్షికి గోహత్యా పాపం సంక్రమించేలా చేసి ఆ పాపం పోవటానికి
పరమేశ్వరుడిని గురించి తపస్సు చేసి ఆయన అనుగ్రహంతో గంగను భూమి మీదకు తీసుకు
రమ్మనమని చెప్పారు. గౌతముడు అలాగే చేశాడు. పరమేశ్వరుడి అనుగ్రహంతో ఆయన శిరస్సు
నుండి నేల మీదకు వచ్చిన గంగ వెంటనే ఒక స్త్రీ రూపాన్ని ధరించి అక్కడ
ప్రత్యక్షమైంది. అప్పుడు గౌతముడు ఆమెకు నమస్కరించి తన వెంట వచ్చి పాపప్రక్షాళన
చేయమని కోరాడు. పరమేశ్వరుడు కూడా ఆమెను అలాగే చెయ్యమని ఆజ్ఞాపించాడు. కానీ గంగ
కేవలం గౌతమ ముని పాపాన్ని ప్రక్షాళన చేసి మళ్ళీ వెంటనే తిరిగి తన స్థానానికి తాను
చేరుకుంటానని చెప్పింది. కానీ భక్తవత్సలుడైన మహేశ్వరుడు మానవలోకానకి ఉపకారం
చెయ్యాలని అనుకుని సూర్యుడి కుమారుడు ఇరవై ఎనిమిదవ మనువుగా పాలనలోకి వచ్చేంత వరకూ
భూమి మీదే వుండమని ఆజ్ఞాపించాడు. అందుకు గంగ భూలోకంలో తనకు అందరి కన్నా, అన్నిటికన్నా విశేషశక్తిని కలిగించటం
దానితోపాటు పరమేశ్వరుడు కూడా పార్వతితోనూ, శివగణాలతోనూ కూడి తన సమీపంలోనే ఉన్నట్లైతే తాను భూలోకంలో వుండటానికి ఎటువంటి
అభ్యంతరం లేదని, తనకు ఆ వరాన్ని
ప్రసాదించమని వేడుకుంది. ఆమె మాటలను పరమేశ్వరుడు కాదనలేకపోయాడు. గంగను ఈశ్వరుడు
అలా అనుగ్రహించిన వెను వెంటనే అక్కడికి దేవతలు, రుషులు అనేక తీర్ధాల సమూహాలు వచ్చి చేరాయి.
వారంతా పరమేశ్వరుడికి గంగకు, గౌతముడికి జయ
ధ్వానాలు పలికారు. ఆ తర్వాత బ్రహ్మ, విష్ణు తదితర దేవతలంతా ముక్త కంఠంతో పరమేశ్వరుడిని స్తుతించారు. ఈశ్వరుడప్పుడు
ప్రసన్నుడై ఏదైనా వరం కోరుకోమని అన్నాడు. ఆ మాటలకు సంతోషించి ఆ దేవతలంతా కూడా
భూమి మీద అవతరించిన గంగను భూమి మీదే వుండేలాగా చెయ్యమని ప్రార్ధించారు. అయితే
అంతలోనే గంగాదేవి కల్పించుకుని ఆ దేవతలంతా కూడా ఎందుకు భూమి మీదే వుండకూడదని
అన్నది. అయితే వారు ఆమెకు సమాధానమిస్తూ ‘‘ సింహరాశౌ యదా స్యాద్వై గురుస్సర్వ
సుహృత్తమఃతదావయం చ సర్వే త్యాగ మిష్యామో న సంశయంఏకాదశ చ వర్షాణి లోకానాం పాతకం
త్విహంక్షాలితం యద్భవేదేవం మలి నాస్స్మ గురి ద్వరే’’గురువు ఎప్పుడు సింహరాశిలో
వుంటాడో అప్పుడు తామంతా నిశ్శంసయంగా గంగలోకే వచ్చి వసిస్తామని చెప్పారు. పదకొండు
సంవత్సరాలపాటు తామంతా మానవుల పాపాలను ప్రక్షాళనం చేసే పనిలో నిమగ్నమై ఉండి
పన్నెండవ సంవత్సరంలో తమ మాలిన్యాన్ని పోగొట్టుకునేందుకే ఇలా వస్తున్నట్లు కూడా
చెప్పారు. సింహంలో గురుడు వున్నంతవరకు తాము గంగలో వుంటామని, అప్పుడు శంకురుడిని దర్శించి తమ పాపాలను
కడిగేసుకుంటామని ఆ తరువాత కూడా గంగ అనుమతిని పొంది మాత్రమే తమ తమ నెలవులకు
వెళ్తామని దేవతలంతా గంగాదేవికి చెప్పారు. ఆ మాటలకు గంగ ఎంతో సంతోషించింది.
ఆనాటినుండి ఆ ప్రదేశంలో పరమేశ్వరుడు తన గణాలతోనూ, పార్వతితోనూ త్య్రంబకేశ్వరుడుగా అవతరించాడు.
సంస్కృత భాషలో అంబకము అనే పదానికి కన్ను అనే అర్ధం ఉంది. మూడు కన్నులు గలవాడు కనుక
ఆయన త్య్రంబకుడయ్యాడు. గంగ కూడా ఆనాటినుండే గౌతమిగా మారిపోయింది. అంటే గౌతమ మహర్షి
తపస్సు చేయగా అవతరించిన కారణంగా ఆ పేరు స్థిరపడింది. ఆనాటినుండే గురువు సింహరాశిలో
వుండగా సర్వతీర్ధాలు, దేవతలు అక్కడకు
రావటం ప్రారంభించారు. అదే పుష్కర సుమయమైంది. అలా గౌతమీనది అవతరణ, త్య్రంబకేశ్వర జ్యోతిర్లింగ ఆవిర్భావం
జరిగినట్లుగా శివపురాణంలోని గౌతమి మహాత్యం అనే కథ వివరిస్తుంది. త్య్రంబకేశ్వర
జ్యోతిర్లింగ మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో ఉంది. ఈ నాసిక్‌కు కూడా స్థల
పురాణముంది. సీతారామలక్ష్మణులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో బ్రహ్మగిరికి సమీపంలో
వుండగా శూర్పణఖ తారసిల్లింది. ఆమె ఆగడాలను సహించలేని లక్ష్మణుడు ఆమె నాసికను,
చెవులను ఇక్కడే
ఖండించాడని ఆ కారణంగానే ఈ ప్రదేశానికి నాసిక్ అని పేరు వచ్చిందని పెద్దలు
పేర్కొంటున్నారు.
- శ్రీ యల్లాప్రగడ మల్లికార్జున రావు గారు
- సేకరణ ఈనాడు దినపత్రిక నుంచీ
Saturday, August 3, 2019
కేశవుడు
ఆ గుర్రం చివరకు కృష్ణుడి కంట్లో పడింది. అది సాధారణమైన గుర్రం కాదని రాక్షసుడని కృష్ణుడు గ్రహించాడు. వెంటనే ఆ గుర్రం మీదకు లంఘించాడు. ఆ గుర్రం కోపావేశంతో ముందరి కాళ్లను ఎత్తి గట్టిగా కృష్ణుడిని తన్నింది. అయితే ఏమాత్రం ఆ దెబ్బకు చలించక దాని ముందరి రెండు కాళ్లు పట్టి ఒక్కసారి విసురుగా పైకెత్తి ఆ గుర్రాన్ని నేలకేసి కొట్టాడు కృష్ణుడు. ఆ దెబ్బతో ఆ రాక్షసుడు కొద్దిసేపు అచేతనంగా నేల మీద పడినా మళ్లీ వెంటనే శక్తిని పుంజుకుని కృష్ణుడి మీదకు దూకాడు. ఈసారి శ్రీకృష్ణుడు తన ఎడమ చేతిని ఆ గుర్రం నోట్లో గట్టిగా తిప్పడంతో వాడిగా ఉన్న దాని దంతాలన్నీ జారి నేల మీద పడ్డాయి. గుర్రం నోట్లో ఉన్న కృష్ణుడి చెయ్యి క్షణక్షణానికి ఉబ్బినట్లుగా అయి కేశికి పిరాడలేదు. వెంటనే ఆ రాక్షసుడు నోరు చీలి కిందపడి చచ్చాడు. రాక్షసుడి పీడ విరగడ కావడంతో గోపాలకులంతా ఆనందంతో పొంగిపోయారు. ఇలా కేశి అనే రాక్షసుడు సంహరించడం వల్లనే శ్రీకృష్ణుడికి కేశవుడు అనే పేరు వచ్చింది. కంసుడు పంపిన రాక్షసుల్లో అరిష్టుడు అనే రాక్షసుడు భయంకరమైన వృషభ రూపంలో వచ్చి కృష్ణుడిని వధించాలని ప్రయత్నించగా ఆ వృషభాసురుడిని కూడా అవలీలగా కృష్ణుడు సంహరించాడు. అలాగే వ్యోమాసురుడు అనే రాక్షసుడు కృష్ణ సంహర లక్ష్యంతో వచ్చాడు. ఆ రాక్షసుడు మయుడికి కుమారుడు. ఎన్నో మాయలు సృష్టిస్తూ గోప బాలకులను ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. ఒకరోజున వాడు గోపబాలకులందరినీ బంధించి తీసుకువెళ్లి ఒక కొండ గుహలో దాచిపెట్టి ఆ గుహ ద్వారాన్ని పెద్ద బండరాయితో మూసివేశాడు. కృష్ణుడు ఈ విషయాన్ని గ్రహించి వ్యోమాసురుడి మీదకు వెళ్లాడు. ఆ రాక్షసుడు తన శరీరాన్ని విపరీతంగా పెంచి తన బలానంతా ప్రదర్శించాడు. అయితే కృష్ణుడు ఎంత మాత్రం చలించకుండా ఆ రాక్షసుడిని పట్టి తన భుజబలంతో మట్టి కరిపించాడు. ఆ తరువాత గుహ ద్వారానికి అడ్డంగా పెట్టి ఉన్న బండను తొలగించి గోప బాలకులందరినీ రక్షించాడు. ఇలా చిన్నతనంలోనే బాలకృష్ణుడు తన ఎన్నెన్నో మాయలను చూపి శిష్టరక్షణ దుష్ట శిక్షణ చేశాడు.
- శ్రీ యల్లాప్రగడ మల్లికార్జున రావు గారు
- సేకరణ ఈనాడు దినపత్రిక నుంచీ
Wednesday, July 31, 2019
గరుత్మంతుడు

ప్రత్యక్ష దైవాల వంటి తల్లిదండ్రుల పొందగలిగిన తనయులు సర్వత్రా జయాలనే పొందుతుంటారని గరుత్మంతుడి వృత్తాంతం మహాభారతంలో వివరిస్తోంది. వినతకు రెండో సంతానంగా జన్మించిన గరుత్మంతుడు అప్పటికే ఆమె కద్రువకు, ఆమె సంతతికి దాస్యం చేస్తుండడం చూసి ఎలాగయినా తల్లి దాస్యాన్ని పోగొట్టాలని నిర్ణయించుకున్నాడు. ఒకనాడు గరుత్మంతుడు తన దగ్గరకు వచ్చిన సర్పాలని చూసి నా తల్లి దాస్యం, నా దాస్యం విముక్తి కావడానికి మీరు ఏం కావాలో కోరుకొమ్మని అడిగాడు. ‘మాకు అమృతం తెచ్చిపెట్టు మీ దాస్యం విముక్తి అవుతుంది’ అని వారు పలికారు. వెంటనే గరుత్మంతుడు తల్లి వినత దగ్గరకు వెళ్లి నమస్కరించి విషయం చెప్పి తనకు ఆకలిగా ఉందని ఆహారం ఇవ్వమని ప్రార్థించాడు. ఆమె చాలా సంతోషించి సముద్రంలో ఉన్న నిషాదులను మాత్రం తిని ఆకలి తీర్చుకొనమని ఆశీర్వదించింది. గరుత్మంతుడు తల్లి చెప్పినట్లు చేశాడు. కాని ఆకలి తీరలేదు. వెంటనే తన తండ్రి కస్యప ప్రజాపతిని ప్రార్థించాడు. ఆయన పరస్పరం శాపాలను పెట్టుకుని ఏనుగు, తాబేలుగా మారిన విభావనుడు, సుప్రతీకుడు అనే వారిని భక్షించి ఆకలి తీర్చుకొమ్మన్నాడు. భారీకాయాలతో ఉన్న ఆ రెంటిని ఒక పెద్ద చెట్టు కొమ్మమీద పెట్టుకుని భక్షించాలనుకుని కాలు మోపబోగా ఆ చెట్టు కొమ్మ ఫెళఫెళ విరిగింది. ఆ కొమ్మకు బొటనవేలు పరిమాణంలో ఉండి తలకిందులుగా వేలాడుతూ తపస్సు చేసుకుంటున్న వాలఖిల్యులు అనే మునులు ఉన్నారు. వెంటనే కొమ్మను పట్టుకొని తన తండ్రి దగ్గరకు గరుత్మంతుడు వెళ్లాడు. వాలఖిల్యులు గరుత్మంతునిమీద బాగా కోపించారు. అయితే విషయాన్ని వివరించి గరుత్మంతుడు తన కుమారుడేనని పట్టుదలతో అతను తన తల్లి దాస్యం తీర్చడానికి స్వర్గలోకం నుంచి అమృతభాండం తేవడానికి వెళుతున్నాడని, దయతో కోపాన్ని ఉపసంహరించుకోమని ప్రార్థించాడు. ఆ ప్రార్థనకు వాలఖిన్యులు సంతోషించి గరుత్మంతుని శపించకుండా హిమాలయాలకు తపస్సు చేసుకోవడానికి వెళ్లిపోయారు. ఆ తరువాత తండ్రి సూచన మేరకు చెట్టుకొమ్మను హిమాలయాలకు తీసుకుని వెళ్లి విడిచి ఏనుగు, తాబేలును భక్షించి అమృతభాండం కోసం స్వర్గలోకానికి వెళ్లాడు. ఇలా తలిదండ్రుల ఆశీస్సులతో కష్టాలను అధిగమించి గరుత్మంతుడు కార్యసాధకుడయ్యాడు.
- శ్రీ యల్లాప్రగడ మల్లికార్జున రావు గారు
- సేకరణ ఈనాడు దినపత్రిక నుంచీ
Saturday, June 15, 2019
సుద్యుమ్నుడు - ఇళ

సంసార జీవితంలో
భార్యా, భర్త, ఇద్దరూ ఒక మాట మీదనే నిలబడి ఒక బాటలోనే నడవాలని
అలా కాని పక్షంలో భవిష్యత్తు విచిత్రమైన మార్పులు పొందుతూ ఉంటుందని అవి వారి
సంతానాన్ని ఇబ్బందులకు గురిచేస్తాయనే విషయాన్ని సుద్యుమ్నుడి కథ తెలుపుతుంది.
అలాగే భారతం కేవలం పురాణ గ్రంథమే కాదని అందులో ఈనాడు వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో మనకు కనిపిస్తున్న
ఎన్నో అద్భుతాలు ఆనాటి వారు హ మాత్రంగానయినా
ఆలోచించగలిగారనే విషయాన్ని మహాభారతంలోని కథ, సాహిత్యం వివరిస్తోంది. వైవశ్యత మనువు భార్య
శ్రద్ధాదేవి, వైవశ్యత మనువు
తన భార్యతో కలిసి పుత్రకామేష్టియాగం ప్రారంభించాడు. శ్రద్ధాదేవికి తనకు కూతురు
జన్మిస్తే బాగుండుననే అభిప్రాయం కలిగింది. ఒక రోజున ఆమె యాగం చేస్తున్న హోత వద్దకు
వెళ్ళి నమస్కరించి తనకు కూతురు కలిగేలా యాగం చేయమని ప్రార్థించింది. ప్రార్థనను
మన్నించి హోమం చేశారు. పుత్రకామేష్టి పూర్తయిన తర్వాత శ్రద్ధాదేవికి కూతురు
జన్మించింది.
ఆ శిశువుకు ‘ఇళ’ అని పేరు పెట్టారు. కానీ వైవశ్యత మనువు యజ్ఞ బ్రహ్మ
వశిష్టుడి వద్దకు వెళ్ళి పుత్రుడికి బదులుగా పుత్రిక జన్మించిందని తన కోరిక ఎందుకు
భగ్నమైందని అడిగాడు. వశిష్టుడు దివ్యదృష్టితో జరిగినదంతా తెలిసికొని తన శక్తితో
ఇళను బాలుడిగా మార్చాడు. ఆ బాలుడికి సుద్యుమ్నుడు అని పేరు పెట్టారు. సుద్యుమ్నుడు
పెరిగి పెద్దవాడయ్యాడు. ఒకనాడతడు తన మంత్రిగణంతో వేటకు వెళ్ళి చాలాసేపు సింహాలను,
పులులను వేటాడి అలసి ఆ
సమీపంలో ఉన్న ఒక కొలనులో ఉన్న నీటిని తాగారు. వెంటనే సుద్యుమ్నుడు, అతడి పరివారం గుర్రాలతో సహా ఆడవారిగా
మారిపోయారు. దానికి కారణం పూర్వం ఆ ప్రాంతంలో పురుష సంచారాన్ని నిషేధిస్తూ పార్వతి
కోరిక మేరకు పరమేశ్వరుడు శాపం ఇవ్వడమే. సుద్యుమ్నుడు అతడి పరివారం స్త్రీలుగా
మారడంతో తిరిగి తమ రాజ్యానికి వెళ్ళలేక అక్కడక్కడ తిరగడం ప్రారంభించారు. ఒకనాడు
అక్కడికి సమీపంలో ఉన్న బుధుడి ఆశ్రమానికి వెళ్ళడం తటస్థించింది. బుధుడి కొడుకైన
చంద్రుడు రాజస్త్రీగా ఉన్న సుద్యుమ్నుడి (ఇళ) మీద మనసు పడ్డాడు. వారిద్దరి సమాగ
ఫలితంగా కొన్నాళ్ళకు వారికి పురూరవుడు జన్మించాడు. కొంత కాలం గడిచిన తరువాత
సుద్యుమ్నుడు తనకు బాల్యంలో ఆడరూపు పోగొట్టి మగరూపు తెప్పించిన వశిష్టుని
తలుచుకున్నాడు.
వశిష్టుడు అక్కడికి వచ్చి విషయం తెలుసుకున్నాడు. తన శిష్యుడు
ప్రస్తుతం ఉన్న ఆడ రూపును పోగొట్టి మగ రూపును ప్రసాదించమన్న కోరికను తీర్చలేక
శివుడిని గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై పార్వతికి ఇచ్చిన మాటను
తోసివేయక వశిష్టుని కోరికను కాదనలేక ఉభయ తారకంగా ఉండే విధంగా ఒక మాసం మగవాడుగా,
ఒక మాసం ఆడదిగా
సుద్యుమ్నుడు ఉండే విధంగా అనుగ్రహించి అంతర్థానమయ్యాడు. సుద్యుమ్నుడు అప్పటికి
ఆనందించి తిరిగి రాజ్యానికి వెళ్ళి పురుష రూపంగా ఉన్నప్పుడు మాత్రమే రాజ్య పరిపాలన
చేయడం ప్రారంభించాడు. ఆ కాలంలో సుద్యుమ్నునకు.. ఉత్కళుడు, గయుడు, విమలుడు అను ముగ్గురు కుమారులు కలిగారు. వారు ఉత్తరరాజ్య భాగాలకు రాజులయ్యారు. తమ రాజు కొన్ని మాసాలు మాత్రమే పరిపాలన చేస్తుండడం ప్రజలకు
వింత అనిపించి ఆనోటా ఆ నోటా అసలు విషయం తెలుసుకున్నారు. ఈ లోగా సుద్యుమ్నుడి
కొడుకు పురూరవుడు పెరిగి పెద్దవాడయ్యాడు. సుద్యుమ్నుడు ప్రజలు తనను గురించి
అనుకునే పలు రకాల మాటలు వినలేక సుద్యుమ్నునకు ఈ జీవితమంటే రోత పుట్టింది. అతను తన పుత్రుడు పురూరవునకు ప్రతిష్ఠానపుర రాజ్య సింహాసనం అప్పగించి తపోవనాలకు వెళ్లిపోయాడు. సుద్యుమ్నుడి తల్లిదండ్రులు ఏకాభిప్రాయం కలిగి ఉండకపోవడం ఈ కథలోని
ఇన్ని మార్పులకు, సుద్యుమ్నుడి
మనోవేదనకు కారణమైంది.
- శ్రీ యల్లాప్రగడ
మల్లికార్జున రావు గారు
- సేకరణ ఈనాడు
దినపత్రిక నుంచీ
Wednesday, June 12, 2019
నారాయణుడు ఉన్న చోట

గొప్ప
నీతిశాస్త్రంగా, పూజనీయ గ్రంథంగా ఉన్న మహాభారత కథలో అక్కడక్కడా కొన్ని
సందేహాలు పాఠకులకు తలెత్తుతుంటాయి. ఇది ధర్మమా? అధర్మమా? అని తేల్చుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి వాటిలో కౌరవ పాండవులకు
గురుపుత్రుడైన అశ్వత్థామ ప్రయోగించిన దివ్య అస్త్రాలన్నీ నిర్వీర్యం కావడం
ఆశ్చర్యంగా కనిపిస్తుంది. తన అస్త్రాలు విశ్వాన్ని మొత్తాన్ని జయించగలవనే నమ్మకంతో
ఉన్న అశ్వత్థామ అవి దేనికీ పనికి రాకుండా పోవడంతో తీవ్రంగా కలత చెందుతాడు. యుద్ధం
చేస్తున్నప్పుడు ఎవరో ఒక మహాపురుషుడు ఒక శూలాన్ని పట్టుకొని తన ముందు నిలబడి
శత్రుసంహారం చేయడం అర్జునుడికి కనిపిస్తుంటుంది. అశ్వత్థామ, అర్జునులకు ఇవి తీరని సందేహాలుగా మిగులుతాయి. ఈ సందేహాలను వ్యాసభగవానుడు
నివృత్తి చేసి వారి మనస్సులను సమాధాన పరిచి మళ్లీ కార్యోన్ముఖులను చేస్తాడు.
అందుకే ద్రోణపర్వం చివర్లో వ్యాసుడు ముందుగా అశ్వత్థామకు సాక్షాత్కరిస్తాడు.
అందరికీ గురువు, ఎదురులేని శక్తికలిగిన తన తండ్రిని రణరంగంలో
దృష్టద్యుమ్నుడు చాలా నీచంగా సంహరించడం అశ్వత్థామకు విపరీతమైన ఆగ్రహాన్ని
కలిగించింది. వెంటనే తన దగ్గర ఉన్న నారాయణాస్త్రంతో శత్రుసంహారం చేస్తానని
దుర్యోధనుడికి అశ్వత్థామ ధైర్యం చెబుతాడు. ఆ అస్త్రం ఎంతో శక్తిమంతమైందని, తన తండ్రి నారాయణుడిని ఆరాధించి ఆ అస్త్రాన్ని పొంది తనకు ఇచ్చినట్లు
చెప్పాడు. ఆ దివ్యాస్త్రంతో ఎలాంటి వారినైనా సంహరించగలనని, తన తండ్రిని చంపిన శత్రువుల మీద పగతీర్చుకుంటానన్నాడు. అశ్వత్థామ పలికిన ఆ
ధైర్యపు వచనాలతో కౌరవసేనలో మళ్లీ ఉత్సాహం కలిగింది. అశ్వత్థామ నారాయణాస్త్రాన్ని
ప్రయోగించాడు. యుద్ధరంగంలో కలకలం మొదలైంది. వాసుదేవుడు చిద్విలాసం చిందించాడు.
అర్జునుడు బ్రహ్మ సృష్ఠించి ఇచ్చిన మహాస్త్రాన్ని ప్రయోగించాడు. అది అశ్వత్థామ
ప్రయోగించిన అస్త్రాన్ని క్షీణింపచేసింది. అశ్వత్థామకు ఏమీ అర్ధంకాక అస్త్రాలను
విడిచి పెట్టి అయోమయంగా ఎటో వెళ్లిపోయాడు. అలా వెళుతున్న అశ్వత్థామకు వ్యాసుడు
ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు అశ్వత్థామ తన మనస్సులో ఉన్న వ్యథనంతా వెళ్లగక్కాడు.
ఎంతో గొప్ప దివ్యాస్త్రాలనుకున్న తన అస్త్రాలన్నీ ఏ కారణంతోనో పనికిరాకుండా
పోయాయని, తన శత్రువులైన కృష్ణార్జునులను ఏమీ చేయలేకపోవడం
తనకెంతో వ్యథ కలిగిస్తోందన్నాడు. అప్పుడు వ్యాసుడు చిరునవ్వుతో కృష్ణుడు
సామాన్యుడు కాడు. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువేనని చెప్పాడు. లోకాలన్నింటినీ
రక్షించాలనే అతడు కృష్ణుడుగా జన్మించాడు. ఈ కృష్ణుడే పురాణ మునుల్లో ప్రసిద్ధులైన
నరనారాయణుల్లో నారాయణుడు. శక్తి కోసం హిమాలయ పర్వతాల మీద కఠోరంగా తపస్సు చేసిన
నారాయణుడికి పరమశివుడు ప్రమథగణాలతో సహా ప్రత్యక్షమయ్యాడు. తనకు వరాలు ప్రసాదించమని
శివుడిని ఆయన కోరుకున్నాడు.
లోక సంరక్షణ కోసం దేవతలు, గంధర్వులు తదితరులలో జన్మించి దుష్టులను సంహరించమని శివుడు నారాయణుడికి
చెప్పాడు. నారాయణుడు యుద్ధంలో నిలబడినప్పుడు ఏ అస్త్రశస్త్రాలు పని చేయకుండా గొప్ప
శక్తిని పరమేశ్వరుడు నారాయణుడికి ఇచ్చాడు. నరనారాయణులలో నరుడు అర్జునుడుగా
జన్మించాడు. పరమేశ్వర శక్తితో ఉన్న కృష్ణుడు ఉండడం వల్లనే నీ దివ్యాస్త్రాలు
ప్రభావం చూప లేక పోయాయని వివరించాడు. వ్యాసుడి బోధతో అసలు విషయాన్ని గ్రహించిన
అశ్వత్థామ మనసులోనే పరమేశ్వరుడిని స్తుతించి శ్రీకృష్ణుడికి నమస్కరించి
మనశ్శాంతిని పొందాడు.
ఆ తరువాత
వ్యాసుడు అర్జునుడి దగ్గరకు వెళ్లాడు. అర్జునుడు ఆయనను సాదరంగా ఆహ్వానించి పూజించి
సత్కరించాడు. అనంతరం తన మనస్సులో ఒక సందేహం ఉందని దాన్ని తీర్చమని వేడుకున్నాడు.
తాను యుద్ధం చేస్తున్నప్పుడు ఎవరో ఒక దివ్య పురుషుడు గొప్ప ప్రకాశవంతమైన శరీరంతో
వెలుగుతూ తన ముందు నిలబడి చేతిలో ఉన్న శూలంతో తాను చంపాలనుకున్న శత్రువులందిరినీ
సంహరిస్తూ కనిపిస్తున్నాడు. నేను కేవలం ఆయన వెనుక నిలబడి శత్రువుల మీదకు బాణాలు
వేస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఆ దివ్యపురుషుడు ఎవరై ఉంటారో చెప్పమన్నాడు. అప్పుడు
వ్యాసమహర్షి సమాధానం చెబుతూ అర్జునుడికి దివ్యతేజోరాశిగా కనిపించిన వ్యక్తి
సాక్షాత్తు పరమశివుడు. పాశుపతంలాంటి అస్త్రాలను ప్రసాదించింది కూడా ఆయనే.
ధర్మరక్షణ కోసం సాక్షాత్తు ఆ రుద్రుడే యుద్ధరంగంలో కృష్ణార్జునులకు అండగా
నిలిచాడని వివరించి అంతర్ధానమయ్యాడు.
- శ్రీ యల్లాప్రగడ
మల్లికార్జున రావు గారు
- సేకరణ ఈనాడు
దినపత్రిక నుంచీ
Saturday, June 8, 2019
మార్కండేయ మహాముని

పుణ్యపురుషుల
సందర్శనం, పవిత్ర ప్రదేశాల
ప్రభావం సామాన్యమైనవి కావని అర్ధాయుష్కులను కూడా చిరాయుష్కులుగా చేయగల శక్తి
తీర్థక్షేత్ర సందర్శనం వలన కలుగుతుందని వివరించే కథ పద్మపురాణం 33వ అధ్యాయంలో కనిపిస్తుంది. మార్కండేయ ముని
జీవితానికి సబంధించిన ఈ కథను పులస్త్యముని భీష్ముడికి వివరించి చెప్పాడు. పూర్వం
మ్రుకండుడు అనే ముని తన భార్యతో సహా కఠోరంగా తపస్సు చేసి దైవానుగ్రహం వలన ఒక
కుమారుడిని పొందాడు. ఆ బాలుడు ఐదేళ్ల ప్రాయంలోనే మంచి గుణగణాలతో ప్రకాశిస్తూ
ఉండేవాడు. ఆ చిన్నారి బాలుడు ఇంటి ముంగిట తిరుగుతూ వచ్చేపోయే వారందరికీ జరగబోయే
విషయాలను ఎన్నింటినో వివరిస్తూ ఉండేవాడు. దీనిని గమనించిన మ్రుకండుడు ఒకరోజున తన
కుమారుడిని పిలిచి నీ ఆయుర్ధాయం ఎంతో చెప్పగలవా అని అడిగాడు.
ఆ బాలుడు తనకు బ్రహ్మ
ఇచ్చిన ఆయువు ఇంకా ఆరు మాసములే ఉందని చెప్పాడు. ఆ మాటలను విని దుఃఖిస్తున్న
తండ్రిని దుఃఖించవడద్దని ఆ బాలుడు చెప్పాడు. వెంటనే మ్రుకండుడు తన కుమారుడికి
ఉపనయనం జరిపించి, హితబోధగా
కనిపించిన ప్రతిమనిషికి ఎటువంటి బేధాన్ని తలచకుండా నమస్కరిస్తూ ఉండమని చెప్పాడు. ఆ
బాలుడు తండ్రి మాటను శిరసావహించి తనకు కనిపించిన ప్రతి మనిషికి ఎంతో భక్తిభావంతో,
వినయంతో నమస్కరిస్తూ
ఉండేవాడు. ఇలా కాలం గడుస్తుండగా ఒకరోజున సప్తరుషులు తీర్థయాత్రలకు వెళుతూ ఆ బాలుడి
కంట పడ్డారు. తనకు ఎదురైన ఆ సప్తర్షులందరికీ ఎంతో భక్తితో నమస్కరించాడు. ఆ
చిన్నారి బాలుడు అలా నమస్కరించడం ఎంతో ముచ్చటగా సప్తర్షులకు అనిపించింది. వెంటనే
వారు ‘‘పూర్ణాయుష్కుడవు కమ్ము’’ అని దీవించారు. అయితే ఆ వెంటనే వారు ఆ బాలుడికి
బ్రహ్మ అల్పాయువునే ప్రసాదించాడని తెలుసుకున్నారు. అంతేగాక ఇంకా ఐదు రోజులు
మాత్రమే అతనికి ఆయువు ఉందని గ్రహించారు. వెనువెంటనే ఆలస్యం చేయక ఆ బాలుడిని కూడా
వెంటబెట్టుకొని వారంతా బ్రహ్మ దగ్గరకు వెళ్ళి నమస్కరించారు. ఆ రుషుల నడుమ బాలుడే
ముందుగా తనను గుర్తించి నమస్కరించడం బ్రహ్మకు కూడా ఎంతో ఆనందాన్ని కలిగించింది.
వెంటనే బ్రహ్మదేవుడు చిరాయువు కమ్మని ఆ బాలుడిని ఆశీర్వదించాడు. బ్రహ్మ ఆశీర్వచనం
విని ప్రక్కనే ఉన్న రుషులంతా ఎంతో ఆనందించారు. ఆ రుషులంతా అలా ఎందుకు ఒక్కసారిగా
ఆనందస్వరూపులవుతున్నారో బ్రహ్మకు తెలియరాక ఆ బాలుడు ఎవరని, రుషులంతా తనదగ్గరకు రావడానికి కారణమేమిటని
రుషులను ప్రశ్నించాడు బ్రహ్మ. అప్పుడు సప్తర్షులు ఆ బాలుడు మ్రుకండుడి కుమారుడని
జరిగిన విషయమంతా వివరించి ఆ బాలుడు తన తండ్రి ఆజ్ఞానుసారం కనిపించిన ప్రతిమనిషికి
భక్తి, వినయాలతో నమస్కరిస్తూ
తీర్థయాత్రలు చేస్తున్న తమకు ఎదురయ్యాడని చెప్పారు. తాము కూడా ఆ బాలుడిని
దీర్ఘాయువుగా ఉండమని దీవించినట్లు ఇప్పుడు బ్రహ్మదేవుడు కూడా ఆ బాలుడిని చిరాయువు
ప్రసాదంచడం ఎంతో ఆనందాన్ని కలిగించినట్లు వారు చెప్పారు. ఆ మాటలను విని బ్రహ్మదేవుడు
కూడా ఎంతో ఆనందించి ఆ మార్కండేయుడు (మ్రుకండముని కుమారుడు) తన ఆయువుతో సమానమైన
ఆయువు కలిగినవాడవుతాడని మరోమారు పలికి రుషులకు, మార్కడేయునికి వీడ్కోలు పలికాడు. అనంతరం
మార్కండేయుడు తన ఇంటికి, రుషులు
తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్ళారు. మార్కండేయుడు ఇంటికి తిరిగివచ్చి తన తండ్రితో
జరిగిన విషయాన్నంతటినీ వివరించి తన జీవితమంతా బ్రహ్మను గురించిన తపస్సులోనే
గడిచేలా అనుమతి ఇవ్వమని వేడుకున్నాడు. తన కుమారుడి విజయానికి మ్రుకండుడు ఎంతగానో
ఆనందించినప్పటికీ వెంటనే తనను వీడి వెళుతున్నందుకు కొంత బాధాతప్తుడయ్యాడు. అప్పుడు
మార్కండేయుడు తండ్రికి ధైర్యం చెప్పి దుఃఖించవలసిన పనిలేదని తాను పుష్కరతీర్థంలో
తపస్సు నిర్వహించడానికి వెళుతున్నానని ఆ పుష్కరతీర్థ మహిమను సాక్షాత్తూ జగన్నాథుడే
‘‘బ్రహ్మలోకస్య
పన్థానం ధన్యాఃపశ్యంతి పుష్కరం! యన్తు వర్షశతం సాగ్రమగ్నిహోత్రముపాసితా!! కార్తీకం
వసేదేకాం పుష్కరే సమమేవచ! కర్తుమ్మయా నశక్తిః కర్మణానైవ సాధితమే!!’’
ఇలా
అభివర్ణించాడని చెప్పాడు. ఈ కథలో అల్పాయుష్కుడైన బాలుడు తీర్థయాత్రలు చేస్తున్న
సప్తర్షులకు కనిపించడం వారివెంటనే తానే బయలుదేరి బ్రహ్మలోకం వరకూ వెళ్ళి బ్రహ్మ
ఆశీస్సులను కూడా పొందటం లాంటి సందర్భాలను పరిశీలిస్తే సత్పురుషుల సందర్శనం,
తీర్థయాత్రల వలన కలిగే
పుణ్యఫలితం ఎంతటి సత్ఫలితాలను ఇస్తాయో గమనించవచ్చు.
- శ్రీ యల్లాప్రగడ
మల్లికార్జున రావు గారు
- సేకరణ ఈనాడు
దినపత్రిక నుంచీ
Saturday, June 1, 2019
సుందోపసుందుల కథ
ఎంత ఆత్మీయత అనురాగాలతో ఉన్న సోదరులైనా ఒక కాంత కారణంగా కక్షలకు, కార్పణ్యాలతో రగిలి జీవితాలను నాశనం చేసుకునే పరిస్థితులేర్పడుతుంటాయని, అలా జరగకుండా ఉండాలంటే తగిన విధంగా ధర్మమార్గంలో ప్రవర్తించాలని చెప్పే కథ ఇది. అలాగే పాండవులయిదుగురు ద్రౌపదిని వివాహం చేసుకున్న తరువాత ద్రౌపదితో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరు ఆమెకు భర్తగా ఉండేలాగా, నిర్ణయాన్ని అతిక్రమించిన వారు సంవత్సర కాలంపాటు తీర్థయాత్రలకు వెళ్లి వచ్చేలాగా ఎవరి సమక్షంలో నిర్ణయం తీసుకున్నారనే విషయం కూడా ఈ కథలోనే తెలుస్తుంది. వీటన్నిటితోపాటు అప్సరస కన్యలలో అతిలోక సౌందర్యవతి అయిన తిలోత్తమ జన్మకు, ఆ జన్మ కారణానికి ఉన్న సంబంధాన్ని కూడా ఈ కథలో చూడవచ్చు.
నారదుడు పాండువులకు ఈ సుందోపసుందుల కథలో వివరించి చెప్పాడు. ద్రౌపది స్వయంవరం తరువాత పాండవులు కుంతితో కలిసి హస్తినకు వచ్చారు. దృతరాష్ట్రుడిచ్చిన అర్ధరాజ్యంతో ఖాండవప్రస్థంలో ఇంద్రప్రస్థపురాన్ని నిర్మించుకుని పాండవులు రాజ్యమేలుతుండగా ఒక రోజున నారుదుడు అక్కడికి వచ్చాడు.
ధర్మరాజాదులు చేసిన అతిథి పూజలు స్వీకరించిన తరువాత ఆ అయిదుగురు సోదరులకు ద్రౌపది లేని సమయంలో ఈ కథను వివరించాడు. పూర్వం నికుంభుడు అనే రాక్షసుడికి సుందుడు, ఉపసుందుడు అనే ఇద్దరు కుమారులు జన్మించారు. ఆ ఇద్దరూ ఒకరి మీద ఒకరు ప్రాణప్రదమైన ఆత్మీయత అనురాగాలతో జీవిస్తుండేవారు. రాక్షసులైనా బ్రహ్మ గురించి కఠోర దీక్షతో తపస్సు చేయడానికి వింధ్యపర్వత ప్రాంతాలకు ఆ ఇద్దరూ వెళ్ళారు. ఆ సోదరుల తపోదీక్షకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. కామరూపం, కామగమనం, అమరత్వం, ఇతరులెవరితో మరణం లేకుండా ఉండేస్థితి, సకలమాయలు తామిద్దరికీ కావాలని బ్రహ్మను వారు కోరుకున్నారు. వారు కోరిన వరాలలో అమరత్వం తప్ప మిగిలిన కోరికలన్నింటినీ బ్రహ్మ అనుగ్రహించాడు. బ్రహ్మ దగ్గర పొందిన ఆ వరాలతో ఆ ఇద్దరూ లోకాలన్నింటినీ హింసాప్రవృత్తితో అతలాకుతలం చేయసాగారు. వారికున్న మాయారూపాలను ధరించే శక్తి వల్ల పులులుగా, ఏనుగులుగా మారి మునులు రుషులు ఉండే ఆశ్రమాలను చిందరవందర చేయసాగారు. దేవతలను కూడా తీవ్రంగా భయపెట్టడం వారికి పరిపాటైంది. ఈ కష్టానికి చింతిస్తూ దేవతలు, రుషులంతా బ్రహ్మ దగ్గరకు వెళ్లి తమను రక్షించమని ప్రార్థించారు.
బ్రహ్మ వారంరికీ అభయమిచ్చి సుందోపసుందులు ఇద్దరూ ఇతరులెవరితోనూ తమకు మరణం ప్రాప్తించకూడదని కోరుకున్నారు. కానీ తామిద్దరిలో ఒకరి వల్ల ఒకరు మరణం పొందకుండా ఉండే కోరికను కోరుకోలేదని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసి మునులను దేవతలను రక్షించాలని బ్రహ్మదేవుడు అనుకున్నాడు. వెంటనే విశ్వకర్మను పిలిపించి సృష్టి మొత్తంలోకి సౌందర్యవతి అయిన ఒక కన్యను సృష్టించమని చెప్పాడు. విశ్వకర్మ బ్రహ్మ ఆజ్ఞను శిరసా వహించి సృష్టి మొత్తంలో ఉన్న అన్ని అందమైన వస్తువులలో ఒక్కొక్క దాని నుంచి నువ్వుగింజంత ప్రమాణంలో అందాన్ని స్వీకరించి ఒక అద్భుత సౌందర్యరాశి వంటి యువతిని సృష్టించాడు. సంస్కృతంలో నువ్వుగింజను ‘తిల’ అని అంటారు. తిల ప్రమాణంలో అన్ని సౌందర్యాల నుంచి తీసిన సౌందర్యంతో రూపొందినది కనుక ఆ సౌందర్యవతి పేరు తిలోత్తమ అయింది.
తిలోత్తమ వెంటనే మద్యం మత్తులో మదిరాక్షుల నడుమ భోగాలను అనుభవిస్తున్న సుందోపసుందుల ఎదుట నిలిచి వయ్యారాలు ఒలకపోసింది. ఆ ఇద్దరిని అమితంగా ఆకట్టుకుంది. వారిద్దరూ ఆమె కోసం పోటీ పడసాగారు. అప్పుడు తిలోత్తమ ఇద్దరూ ఒకరితో ఒకరు యుద్ధానికి దిగి ఎవరు బలాఢ్యులని నిరూపించుకుంటే తాను వారి సొంతమవుతానని పలికింది. అప్పటి దాకా అపూర్వమైన అనురాగం, ఆత్మీయతానుబంధాలతో ఉన్న సోదరులైన సుందోపసుందులు ఇద్దరూ ఒకరి మీదకు ఒకరు కాలుదువ్వుకున్నారు. భీకరంగా పోరాడుకుని చివరకు ఇద్దరూ మరణించారు.
ఇలా తిలోత్తమ అనే స్త్రీ కారణంగా అంతకు ముందు ఎప్పుడూ ఏ సందర్భంలోనూ విరోధులుగా కనిపించని సుందోపసుందులు బద్ధవిరోధులై మరణించారని పాండవులు కూడా ద్రౌపది కారణంగా అలా నాశనం కావడం మంచిది కాదని నారదుడు చెప్పాడు. అప్పుడు నారదుడి సమక్షంలోనే ధర్మరాజు తన సోదరులతో కలిసి ద్రౌపదితో ఒక్కొక్కరు ఒక సంవత్సరంపాటు భర్తగా ఉండేలాగా, ఈ నిర్ణయాన్ని అతిక్రమించినవారు ఒక సంవత్సరం పాటు తీర్ధయాత్రలకు వెళ్ళేలాగా ఏర్పాటుచేసుకున్నారు.
- శ్రీ యల్లాప్రగడ మల్లికార్జున రావు గారు
- సేకరణ ఆనంద్
ఈనాడు దినపత్రిక నుంచీ
Monday, April 21, 2014
శ్రీకృష్ణుడూ - చిత్రకారుడూ
అనగనగా ఓ గొప్ప చిత్రకారుడుండేవాడుట. అతను ఎంత గొప్ప చిత్రాన్నైనా ఇట్టే తన కుంచెతో చిత్రీకరించి రంగులు వేసి అందరినీ ఆశ్చర్యపరచేవాడుట. ప్రకృతిలో ఎంతో అందమైన సూర్యోదయం, పండు వెన్నెలా, నెమలి నాట్యం, రామచిలుకలూ, కుందేళ్ళూ, అందమైన అడవులూ, సెలయేళ్ళూ, మేఘాలూ ఇలా ప్రపంచంలో ఏ అందమైన దృశ్యం కనపడ్డా దాన్ని తన కుంచెతో పఠమ్మీద బంధించనిదే వదిలేవాడు కాదు. తన కళాకౌశలాన్నిజునులందరూ మెచ్చుకొన్నారు, పురాధికారులూ, రాజులు సైతం బహుమానాలిచ్చి అభినందించారు. అలాంటి ఆ చిత్రకారుడికి ఒక సారి ఎవరొ కనబడి... "ఫలానా రేపల్లె అనే ఊరులో ముద్దులొకిలే ఓ అందమైన పిల్లాడున్నాడూ, అతని అందం అంతా ఇంతా కాదు. చూసినకొద్దీ చూడాలనిపించే అందం ఆ పిల్లాడిది. ఎంతటి అందమో అంతటి తెలివి. ఎంతటి తెలివో అంతటి అల్లరి, ఎంతటి అల్లరో అంతటి అమాయకత్వం కనబరుస్తూ ....ఎవ్వరికీ అందక అందరినీ ఆనందింపజేస్తూ ఆడుకొనే ఓ పిల్లాడు ఉన్నాడూ, అతని పేరు కృష్ణుడు.. అతనిని కనుక నువ్వు చిత్రీకరిచగలిగితే అదే నీకు నిజమైన గొప్పదనం" అన్నారుట.
ఆ మాటలకి ఆ కళాకారుడిలో పట్టుదల పెరిగింది. ఆ పిల్లాడెలా ఉంటాడో వెంఠనే చూడాలనిపించింది. ఎంతో వ్యయప్రయాసలకోర్చి అందరినీ వాకబుచేస్తూ ఊరులెన్నో దాటుకొని చివరకి రేపల్లె చేరాడు. రేపల్లెలో కన్నయ్యని తెలీనివాళ్ళుండరు కదా ? వాకబు చేయగానే కన్నయ్య ఇంటికి దారి చూపించారు. అక్కడికి చిత్రకారుడు చేరే సరికి సాయంత్రమయ్యింది. అప్పుడు చిన్ని కృష్ణుడు గోపబాలురితో కలిసి ఆనందంగా ఆడుకొంటున్నాడు. రాశీభూతమైన ఆ సౌందర్యలావణ్య ముగ్ధమోహన మూర్తిని చూడగానే ఆ కళాకారుడికి తను విన్నది నిజమే సుమా ! అనిపించింది. ఆ ముద్దులొలికే అందాలబాలుడిని చిత్రీకరిస్తేనే తన కళకి ఓ పరిపూర్ణత వస్తుందనిపించింది. ఆలస్యం చేయక ఆ చిత్రకారుడు కన్నయ్యని సమీపించాడు.
తను మునుపు చిత్రించిన అందమైన చిత్రాలనన్నీ తన సంచీలోంచి తీసి చూపించాడు. చిన్నికృష్ణుడు అన్నీ మురిపంగా చూడసాగాడు. "ఇంగో నువ్వూ కదలకుండా కాసేపు నుంచొంటే.. నీ బొమ్మనీ ఇలా గీస్తాను..సరేనా !" అన్నాడు చిత్రకారుడు అనునయంగా. పిల్లాడికి బొమ్మలంటే సరదా కదా? నవ్వుతూ "ఓ !అలాగే !" అన్నాడు కన్నయ్య.
కాలికి సిరిమువ్వగజ్జెలూ, చక్కని దోవతీ, మెడలో పూలమాలా, నుదుటన కస్తూరి, గాలికి అందంగా ఊగే ముంగురులూ, తలపై నెమలిపించం, చేత పిల్లన గ్రోవితో అందానికే అందమై నిలుచున్నాడా గోపబాలుడు. చిత్రకారుడుకి ఆపాదమస్తకం కన్నులపండువగా ఉంది, ఎంతో శ్రద్ధగా ఎంతో అద్భుతంగా తన ప్రతిభనంతా వెచ్చిస్తూ ఆ చిత్రాన్ని గీయటం పూర్తిచేసాడు.
కొంతసేపటికి కన్నయ్యని తోటి పిల్లలు పిలుస్తుంటే కదలక తప్పింది కాదు. చిత్రకారుడు పిల్లాడిని కదలకుండా నించున్నందుకు మెచ్చుకొని, మరునాడు ఆ చిత్రానికి రంగులు వేసి తీసుకొస్తానని చెప్పి శెలవుతీసుకొన్నాడు.
రాత్రంతా ఆ చిత్రానికి రంగులు వేసి మరీంత మనోహరంగా ఆ చిత్రాన్ని పూర్తిచేసాడు. తను జీవితం మొత్తంలో అంత అందంగా వేసిన బొమ్మ ఆ చిన్నికృష్ణుడిదే అనిపించింది చిత్రకారుడికి. అది ఆ బాలుడికి చూపిస్తే తప్పక సంతోషిస్తాడనిపించింది అతనికి.
మరునాడు ఆ చిత్రపఠాన్ని తీసుకొని వెళ్ళి కన్నయ్యకి చూపించాడు. అప్పుడే చిన్ని కన్నయ్య స్నానానికి ఉపక్రమిస్తూ ఉన్నాడు. యశోదా దేవి కన్నయ్య ఒంటి నిండా వెన్న పట్టించి బాగా మర్దనా చేసింది. అందువల్లా బాలకుడు చక్కగా మెరుస్తున్నాడు. జుత్తును దువ్వి పీలకవేసినట్టు ఉంది. మెడలో ముత్యాలహారాలతో, మొలలో బంగారు మొలతాడు తో చేతిలో కొద్దిగా వెన్నతో ఉన్నాడు ఆ బుజ్జిబాలుడు. కన్నయ్యకి ఆ చిత్రపఠాన్నిచ్చాడు కళాకారుడు. ఎంతో ఆత్రంగా బాలుడి ఆనందాన్ని చూద్దామని వేచి చూస్తున్నాడు చిత్రకారుడు.
కన్నయ్య ఆ చిత్రపఠాన్ని కళ్ళు పెద్దవి చేసి, ఒక్క నిమిషం పాటూ తేరిపారా చూసాడు. "ఈ బొమ్మ నాది కాదుగా !" అన్నాడు. వెంఠనే చిత్రకారుడు ఆశ్చర్యపోయాడు. "ఇంగో చూడు నేనెలా ఉన్నానో? ఈ బొమ్మ చూడెలా ఉందో? " కొంత అసంతృప్తి ద్వ్హనించగా కుండబద్దలుకొట్టినట్టూ చెప్పేసాడు కన్నయ్య. దాంతో చిత్రకారుడు దిగాలు పడిపోయాడు. తన శ్రమంతా వృధా ఐపోయిందనిపించింది. ఆ చిన్నిపిల్లాడిని మెప్పించలేని ఆ ప్రయత్నం వృధా అనిపించింది. వెంఠనే ఇంకో గట్టి ప్రయత్నం చేద్దామని కుంచె, పఠమూ అందుకొన్నాడు. చిత్రించడం పూర్తిచేసాడు. మరునాడు యధావిధిగా రంగులద్ది తీసుకొచ్చాడు. అప్పుడు కన్నయ్య ఉదయాన్నే ఆలకాపరిలా ముస్తాబయ్యి ఆవులని మేపడానికి బయల్దేరుతున్నాడు. చిత్రకారుడు తాను తెచ్చిన చిత్రపఠాన్ని చూపించాడు. అప్పుడు కన్నయ్య తలకి చిన్న తలపాగా చుట్టుకొనీ, చేత చిన్ని కర్ర పుచ్చుకొనీ, బొడ్డులో వేణువు దోపుకొనీ, భుజాన చద్దిమూట తగిలించుకొనీ ఉన్నాడు. మళ్ళీ కన్నయ్య "ఇంగో చూడు నేనెలా ఉన్నానో? ఈ బొమ్మ చూడెలా ఉందో?... ఊహు ! ఇది నేను కాదు" అనేసాడు. ఇలా కొన్ని పర్యాయాలయ్యాకా చిత్రకారుడికి ఆత్మనూన్యత ఆవరించింది. ఎన్ని బహుమానాలందుకొంటే ఏమి ? ఎంత కీర్తి ఘడిస్తే ఏమి ? ఈ చిన్నారి పసి మనసుని ఆనందింపజేయలేకపోయాకా తన కళకి ఏమి విలువ ? అని చింతించి. ఈ జన్మ వృధా కనుక ఆత్మహత్యే శరణ్యం అని తలచి అందుకు ఉపక్రమించాడు.
సమయానికి నారదమునీందృల వారు ఆపి విషయం ఏంటని? వాకబుచేయగా, చిత్రకారుడు తన గోడంతా వెళ్ళబోసుకొన్నాడు. అప్పుడు నారదులవారు అతనికి ధైర్యం చెప్పీ. "ఆ పిల్లాడి బొమ్మని నేను గీసిస్తాలే, నువ్వు నేని చెప్పిన పని చెయ్యి చాలు.." అన్నారుట. " నేనే గీయలేని ఆ అందమైన రూపాన్ని మీరెలా గీయగలరు స్వామీ ? .. అసమభవం !!!! "అన్నాట్ట చిత్రకారుడు. "అవన్నీ నే చూసుకొంటాను నాయనా. నువ్వు రేపుదయానే నేనిచ్చిన చిత్రపఠాన్ని తీసుకెళ్ళు ఆ బాలుడికి చూపించు. అతను అసమాన్యుడు.. వెంఠనే అతనికి సాష్టాంగ పడి నమస్కరించు.. " అన్నారుట.
నారదులవారు ఒక గుడ్డలో చుట్టిన ఒక చిత్రపఠాన్ని చిత్రకారుడికిచ్చారుట. ఆ చిత్రపఠాన్ని చిత్రకారుడు తీసుకొని కన్నయ్య దగ్గరికెళ్ళాడుట. అది కన్నయ్య చేతిలో పెట్టి అమాంతం కాళ్ళమీదపడ్డాడుట. లేచి చూసే సరికి ఆ చిన్నికన్నయ్య ఆ గుడ్డను తొలగించి ఆ చిత్రపటాన్ని విప్పి చూసి, అందులో తన అందాన్ని చూసి తెగ మురిసిపోతున్నాట్ట. ఎట్ట్కేలకూ ఆ చిన్నారికన్నయ్య కళ్ళల్లో ఆనందం చూడగలిగినందుకు చిత్రకారుడి మనసుప్పొంగిపోయింది. నారదుడికి తానెంతో రుణపడ్డట్టనిపించిని. కానీ ఇంతలో ఒక సందేహం కలిగింది..ఎంతో ప్రతిభాశాలి ఐన తనే చిత్రీకరించలేని ఆ బొమ్మని నారదులవారెలా గీసారా అని? వెంఠనే ఆ బొమ్మని తనూ చూడాలనిపించి కన్నయ్య చేతిలో పఠానికేసి తొంగిచూశాడు.
అదేంటో తెలుసా? ... అద్దం :)
మిగింపు భలే గమ్మత్తుగా ఉంది కదూ ? శ్రీహరి లీలలు నారదుడికి కొత్తా ? ....
నీతి: మానవ ప్రయత్నం దాని ఫలితం చాలా గొప్పవే ఐనా ఆ ప్రయత్నం వల్ల వచ్చే ప్రయోజనం అంతా మన ప్రతిభే అనుకోకూడదు. దైవానుగ్రహం ఉండడం వల్లే అవన్నీ సమకూరతాయి. "అంతా నీదే భారం" అని అంతా ఆ దేవుడికే వదిలేస్తే ఆయనే మనకి మన విజయాలకి తగిన శక్తీ యుక్తీ ఇచ్చి రక్షిస్తాడు.
హరే రామ హరే రామ || రామ రామ హరే హరే !
హరే కృష్ణ హరే కృష్ణ || కృష్ణ కృష్ణ హరే హరే !
Subscribe to:
Posts (Atom)

