Wednesday, June 24, 2020

వామనావతారం

Story of Vamana Avatar - Hinduism for Kids



భాగవతమంటే భగవత్‌ భక్తుల కథ. భగవత్‌ భక్తులకు సద్గుణాలే అలంకారం. అలాంటి మంచి గుణాలలో దానగుణం మరీ శ్రేష్ఠమైనది. ముక్తిమార్గాన్ని అనుసరించడానికి అది ఎంతగానో దోహదం చేస్తుందని బలిచక్రవర్తి కథ వివరిస్తోంది. బలి చక్రవర్తి దానగుణంలో అద్వితీయుడు. శ్రీమహావిష్ణువు దేవతల కోరికలను అనుసరించి బలిచక్రవర్తి వద్దకు వామనావతారంలో వెళ్ళడానికి బలిచక్రవర్తి దానగుణమే ప్రధానమైంది. మంచి ముఖవర్ఛస్సుతో పొట్టిగా ఉన్న బ్రాహ్మణ బాలుడు తన కోసం నడుస్తూ వచ్చేసరికి బలిచక్రవర్తికి ఎంతో ఆనందం వేసింది. ఎదురు వెళ్ళి నమస్కరించి తన సింహాసనం మీద కూర్చోబెట్టి అతిథిపూజ చేసి యోగక్షేమాలను అడిగాడు. ఆ తరువాత ఏమి కావాలో కోరుకోమని, విలువైన ఆభరణాలు, వస్త్రాలు, భూములేకాక చివరకు తన రాజ్యాన్నయినా ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు. అప్పుడు ఓ చక్కటి చిరునవ్వు నవ్వి తనలాంటి వాడికి అవేవీ అక్కర్లేదని, తనకు కేవలం మూడడుగుల నేల మాత్రం చాలని, దాన్ని ఇస్తే తనకు బ్రహ్మానందం కలుగుతుందని వామనుడు చెప్పాడు. బలిచక్రవర్తికి కొంత ఆశ్చర్యమేసింది. తనలాంటి రాజు దగ్గరకు వచ్చి తన అంతస్తుకు తగిన విధంగా ఏవైనా కోరుకోమని మళ్ళీ వేడుకున్నాడు. ఆశ మనిషికి చాలా చేటు తెస్తుందని, ఆశ పొడవైన తాడులాంటిదని, ఆ ఆశాపాశానికి చిక్కుకోవడం మనిషికి మంచిదికాదని వామనుడు వివరించాడు. తనకు కావాల్సింది కేవలం మూడు అడుగుల నేల మాత్రమేనని, దానిని ఇవ్వమని కోరాడు. బలిచక్రవర్తి ఒక స్థిర నిర్ణయానికి వచ్చి వామనుడికి మూడడుగుల నేల దానం ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ఇంతలో రాక్షస గురువైన శుక్రాచార్యుడు అక్కడికి వచ్చి, వచ్చినవాడు సామాన్యుడు కాడని, మూడడుగుల నేలను దానంగా తీసుకుని త్రివిక్రముడై బలిని అణచివేస్తాడని, దానితో వంశము, కులము, రాజ్యము అన్నీ నాశనమవుతాయని, దానము ఇవ్వవద్దని హెచ్చరిక చేశాడు. బలిచక్రవర్తి క్షణకాలం ఆలోచించి తన గురువుకు సమాధానం చెప్పాడు. పూర్వం తనకంటే అధికంగా రాజ్యాన్ని సముపార్జించిన రాజులు ఎందరెందరో ఉన్నారు. కానీ వారు మరణించిన తరువాత వారి పేరు ఎవరూ తలుచుకోలేదు. అదే శిబి చక్రవర్తి వంటివారుమంచి దానాలు చేసి ఇప్పటికీ కీర్తి అనే శరీరంతో వెలుగొందుతున్నారు. తాను కూడా దానం ఇవ్వటానికి సిద్ధమయ్యానని చెప్పాడు. వచ్చినవాడు హరి అయినా మరి ఎవరయినా తనకు లెక్కలేదని, అంతటివాడి చేయి కింద ఉండి తన చేయి పైన ఉండటమే తనకు ఆనందదాయకమని అన్నాడు. దానం ఇచ్చినందు వల్ల కులము, రాజ్యము, వంశము ఏవి నాశనమయినా తనకు లెక్కలేదని, ఒక్కసారి ఇచ్చినమాట వెనుకకు తీసుకోబోనని చెప్పాడు. ఆ తరువాత స్థిర నిర్ణయంతో వామనుడికి ఆనందంగా మూడడుగుల నేలను దానం చేశాడు. వామనుడు త్రివిక్రముడై, విశ్వమంతా వ్యాపించి బలిచక్రవర్తిని పాతాశ సామ్రాజ్యానికి అధిపతిని చేశాడు. బలిచక్రవర్తి పాత్ర ద్వారా భారతీయ సనాతన సంప్రదాయంలో దానగుణానికి ఉన్న విలువ ఎంతటిదో తెలుస్తోంది.

No comments:

Post a Comment