మీరు ‘తిరువరుత్ చల్వర్’ సినిమాలో అప్పర్ (63 నాయనార్లలోని నాల్వర్లు సుందర్, అప్పర్, జ్ఞానసంబంధర్, మాణిక్యవాచకర్ లలో ఒకరు) గా చేశారు. ఆ దృశ్యాలు ఇప్పటికి మామనస్సులో ముద్రవేశాయి. ఈ పాత్ర చెయ్యడానికి మీకు కంచి పరమాచార్య స్వామివారు ప్రేరేపణ అని చెప్పారు కదా! అది కొంచం వివరిస్తారా? అని ఒక పాత్రికేయుడు శివాజి గణేశన్ ని అడిగాడు.
నటనలో రాణించాలంటే నటులకు సూక్ష్మపరిశీలన చాలా అవసరం అని నా అభిప్రాయం. నేను నా చుట్టూ ఉన్న పరిసరాలని, వ్యక్తులని బాగా గమనిస్తుంటాను. నేను అప్పర్ గా నటించాను కాబట్టి, ఒక పాతకాలంనాటి శివభక్తుని గుణాలను చూపించాలి, అతని వేషధారణ, ఆహార్యము మొదలైనవి.
పరమాచార్య స్వామివారు నన్ను దర్శనానికి రమ్మన్నారని నాకు ఒకరోజు శంకరమఠం నుండి కబురు వచ్చింది. అప్పుడు స్వామివారు మైలాపూర్ లోని మఠంలో ఉన్నారు. నాకు సరిగ్గా గుర్తుంటే ఆ మఠం కర్పగాంబళ్ కళ్యాణమంటపం పక్కనే ఉంటుంది.
నేను, నా భార్య, అమ్మానాన్న నలుగురం కలిసి స్వామివారి దర్శనానికి వెళ్ళాము. మేము మఠానికి వెళ్ళగానే మమ్మల్ని ఒక గదిలో కూర్చోమని చెప్పారు. దాదాపు ఒక గంటసేపు ఉన్నాము అనుకుంటా. అప్పుడు స్వామివారి ఎదో ఉపన్యాసం చెబుతున్నారు. హఠాత్తుగా కరెంటు పోవడంతో అంతా గాఅఢాంధకారంగా మారిపోయింది.
స్వామివారు చేతిలో ఒక చిన్న దీపంతో మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చారు. నిదానంగా కూర్చుని కళ్ళపైన చేతులనుంచుకొని మా వైపు చూస్తున్నారు.
”నువ్వు శివాజి గణేశన్ కదూ?” అని అడిగారు.
”అవును స్వామి నేనే” అని బదులిచ్చి నేలపై పడి స్వామివారికి సాష్టాంగం చేసి వారి ఆశీస్సులు తీసుకున్నాను. అమ్మానాన్న, నా భార్య కూడా స్వామికి నమస్కరించారు.
“మిమ్మల్నందరిని చూడటం చాలా సంతోషంగా ఉంది” అన్నారు స్వామి. తారువాత స్వామివారు:
“నేను తిరుపతి, తిరువణైక్కావల్, తంజావూరులోని పున్నైనల్లూర్ మారియమ్మన్ దేవాలయం వంటి చోట్లకి వెళ్ళినప్పుడు ఆలయ ధర్మకర్తలు నాకు ఏనుగుల చేత పుష్పమాలలు వేయించారు. దేవస్థానానికి ఈ ఏనుగులని ఎవరు ఇచ్చారు అని అడిగగా వారు ‘శివాజి గణేశన్’ అని చెప్పారు.
దేశంలో చాలామంది ధనవంతులున్నారు. ప్రచారం కోసం వారు దేవాలయాలకు ధనం ఇస్తారు. కాని దేవాలయాలకు ఏనుగులను ఇవ్వాలంటే దానికి ఉదారమైన గుణం ఉండాలి. అది నీలో ఉంది.
నిన్ను కన్న నీ తల్లితండ్రులు అదృష్టవంతులు. మీ తల్లితండ్రుల కోసం నేను భగవంతుణ్ణి ప్రార్థిస్తాను.” అని చెప్పి స్వామివారు లేచి లోపలికి వెళ్ళారు.
ఆ సమయంలో నేను ఎంత ఆనందానికి లోనయ్యుంటానో ఆలోచించండి. ఎంతటి ఆశ్చర్యకరమైన అనుగ్రహం అది! అలోచించండి ఒకసారి.
చెప్పలంటే నాకు జీవితంలో భయం అనేది లేదు. భయం అన్నది నేనెరుగను. ప్రత్యేకించి నాకు స్వామివారి అనుగ్రహం ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి. అంతా వారు చూసుకుంటారు.
బహుశా ఈ సంఘటన నాపైన ప్రభావం చూపింది అనుకుంటా. స్వామివారు అలవాట్లని చాలా క్షుణ్ణంగా గమనించాను. కాబట్టి ఆ సూక్ష్మ పరిశీలన వల్లే ఆ సినిమాలో అప్పర్ లా నటించగలిగాను.
--- ‘నడిగర్ తిలగమ్’ శివాజి గణేశన్ ఆత్మకథ నుండి
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.
t.me/paramacharyavaibhavam
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం