Saturday, October 13, 2018

వినాయకుడు - విరుగుడు



నేను ఒకసారి కంచి మఠం వెళ్ళినప్పుడు ఒక అర్చకులు నాకు ఈ కింది విషయం చెప్పారు.

దాదాపు 45 సంవత్సరాల కిందట పరమాచార్య స్వామి వారు తిరుచిరాపల్లికి దగ్గర్లోని ఒక పల్లెటూరిలో మకాం చేస్తున్నారు. ఒకరోజు వారు చంద్రమౌళీశ్వర పూజకు ఉపక్రమిస్తూ, మఠం మేనేజరుతో “ఇంక కొద్దిసేపట్లో అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయ అర్చకులు ఇక్కడికి వస్తారు. వారికి భోజనాలు పెట్టించి, 2 గంటలకు నా వద్దకు తీసుకుని రా” అని చెప్పారు.

అక్కడే నిలబడి ఉన్న ఒక శిష్యుడితో, “మఠం స్థపతితో చెప్పి రెండు అడుగుల వినాయకుని విగ్రహం తయారు చెయ్యమని చెప్పు” అని ఆజ్ఞాపించారు.

మహాస్వామి వారి ఆజ్ఞ ప్రకారం మేనేజరు అర్చకులను మఠం సంప్రదాయం ప్రకారం స్వాగతించి, మద్యాహ్న సమయం కావడం వల్ల వారికి భోజన సదుపాయం ఏర్పాటు చేసి వారి భోజనం తరువాత స్వామి వారి వద్దకు తీసుకుని వెళ్ళాడు.

పరమాచార్య స్వామి వారు అందరినీ పేరుపేరునా వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ప్రధాన అర్చకులు పరమాచార్యస్వామి వారితో, “పెరియవ రోజూ ఉదయం అర్చకులు ఎవరైతే అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయ గర్భగృహం తలుపులు తీసి లోపలికి వెళ్తున్నారో, ఆ వెళ్ళినవారు వెంటనే కళ్ళు తిరిగి పడిపోతున్నారు. మళ్ళా పది నిముషములు ఉపచారము చేసిన తరువాతనే స్వస్థత పొందుతున్నారు. కావున మిగిలిన అర్చకులు ఎవరూ లోపలికి వెళ్ళడానికి సాహసించడం లేదు” అని తమ బాధను చెప్పుకున్నారు.

వెంటనే మహాస్వామి వారు వారితో, “రేపు నేనే స్వయంగా దేవాలయానికి వస్తాను. నేను వచ్చిన తరువాతనే మీరు ఆలయ తలుపులు తెరవండి” అని చెప్పి వారికి ప్రసాదాన్ని ఇచ్చి పంపించారు.

మరుసటి రోజు తెల్లవారుఝామున 5:30 గంటలకు పరమాచార్య స్వామి వారు అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయానికి వచ్చారు. ఒక అర్చకుడు అమ్మవారి గర్భగృహం తలుపులు తెరిచాడు. వెంటనే కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. పది నిముషముల తరువాత లేచి తన పనులకు వెళ్ళిపోయాడు. అది చూసి మహాస్వామి వారు కొద్దిసేపు ధ్యానంలోకి వెళ్ళారు. తరువాత ఆలయ ప్రధాన అర్చకుణ్ణి పిలిచి, “రేపటినుండి అతణ్ణి గర్భగృహం పక్క ద్వారం నుండి లోపలికి వెళ్ళమని చెప్పండి” అని ఎల్ల వెళ్ళాలో చెప్పి, తలుపులు తీసిన రెండు నిముషముల తరువాత లోపలికి వెళ్ళండి అని చెప్పారు.

సాయంత్రం స్థపతి వినాయకుని విగ్రహం తీసుకుని పరమాచార్య స్వామి వారి వద్దకు వచ్చాడు. స్వామి వారు ఒక మంటప నిర్మాణం చేసి, దాని పైన ఈ వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించమని చెప్పారు. అది ఎలా ఉండాలి అంటే “అమ్మవారి దృష్టి కాంతి, వినాకుడి దృష్టి కాంతి సమాంతరంగా ఒకటికొకటి కలవాలి” అలా నిర్మాణం చెయ్యవలసిందని చెప్పారు. స్వామి వారు చెప్పినట్టుగానే ఆలయంలో వినాయకుణ్ణి వారి అమ్మగారైన అఖిలాండేశ్వరి ఎదురుగా ప్రతిష్టించారు. ఆగమోక్తంగా ప్రతిష్ట పూజలు నిర్వహించారు. అప్పటి నుండి అర్చకులకు కళ్ళుతిరిగి పడిపోవడం జరుగలేదు.

ఇప్పటికీ, అష్టమూర్తి క్షేత్రములలో ఒకటైన, జల లింగ క్షేత్రమైన జంబుకేశ్వరం(తిరువణైకావల్) లోని అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయానికి ఎదురుగా వినాయకుడు ఉంటాడు. తల్లి తొలి చూపు తన తొలి బిడ్దడిపై ప్రసరించేట్టుగా పరమాచార్య స్వామి వారు సుముఖుడైన వినాయకుని ప్రతిష్ట చేయించారు.

[సాక్షాత్ పరమశివ అవతారులైన ఆదిశంకరాచార్యుల వారు, రాబోవు కాలాములలో ప్రజలు అనుష్టానము లేక, తపశ్శక్తి లేక దేవతా మూర్తుల ఎదురుగుండా నిలబడలేరని గ్రహించి, ఎక్కువగా ఉన్న తేజస్సును లెక్కకట్టి దాన్ని శ్రీచక్రంలోకి తీసి అక్కడే శ్రీచక్ర ప్రతిష్ట చేసారు. జంబుకేశ్వరం జల క్షేత్రం కావటం చేత అమ్మవారి సువర్ణ తాటంకాలలో శ్రీచక్రం వేసి అమ్మవారికి ధరింపచేసారు]

--- ఎ. త్యాగరాజన్, చెన్నై - శక్తి వికటన్ ప్రచురణ

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం