Sunday, May 31, 2020

వింధ్యాద్రి గర్వభంగం - అగస్త్య మహాముని

Agastya and Lopamudra. - Mahabharat - A Story Retold | Facebook



                                                 
                     అసూయాపరులకు, గర్వపోతులకు ఎప్పటికైనా గర్వభంగం తప్పదన్న సత్యాన్ని ఈ కథ నిరూపిస్తుంది. స్కాందపురాణంలో ఈ కథ కనిపిస్తుంది.


                   భూమండలం మీద ఉన్న కులపర్వతాలన్నింటికీ హిమవంతుడు రాజు. అలాగే మిగిలిన పర్వతాలలో ఒక్కొక్క పర్వతానికి ఉన్న విశేషాన్ని అనుసరించి సప్తకుల పర్వతాలకు ఒక్కొక్క ప్రత్యేకతను బ్రహ్మ ఏర్పాటు చేశాడు. అవికాక మిగిలిన ఇతర పర్వతాలకు కూడా స్థల ప్రభావాన్ని అనుసరించి ఒక్కొక్క పర్వతానికి ఒక్కొక్క గుర్తింపు ఇచ్చాడు. మిగిలిన పర్వాతాల గొప్పతనాన్ని చూసి వింధ్యపర్వతం మాత్రం నిరంతరం అసూయ పడుతుండేది. తాను కూడా తలచుకుంటే ఎంతో ఎత్తుకు ఎదగగల శక్తి కలిగిన పర్వతాన్నేనని గర్వపడుతుండేది. ఇలా గర్వపడటమే ఆ పర్వతం ఇప్పటికీ అణిగి మణిగి ఉండటానికి కారణమైంది. నిరంతర అసూయాగుణం కలిగిన ఆ వింధ్యపర్వతం ఒక రోజున నారదుడు దోవలో వెళుతుండగా ఆయనకు స్వాగతం పలికి అతిథి పూజలు చేసి సత్కరించి తన గోడంతా వెళ్లబోసుకుంది. మేరు పర్వతం, హిమాలయ పర్వతం, మందర పర్వతం, ఇలాంటి పర్వతాలు ఏవీ తగిన సామర్థ్యం కలిగి ఉండకపోయినా వాటిని అందరూ గౌరవిస్తున్నారని, పూజిస్తున్నారని వాస్తవానికి ఆ పర్వతాలన్నింటికంటే తానే అధిక శక్తి కలిగిన దానినని చెప్పుకుంది. నారదుడు వింధ్యపర్వతం గర్వం చూసి మనసులో నవ్వుకున్నాడు. కానీ కలహాభోజుడు అప్పటికి ఏదో ఒక విధంగా వింధ్యపర్వతం దగ్గర నుంచి బయటపడి వింధ్య పర్వతాన్ని సమర్ధిస్తున్నట్లుగా మిగిలిన పర్వతాలను తక్కువగా చూస్తున్నట్లుగా భావం కలిగేలా పూర్తిగా తన ప్రవర్తనను ప్రకటించకుండా వింధ్యాద్రి నుంచి ముందుకు కదిలాడు. వింధ్యపర్వతం ఆనాటి నుంచి ఎలాగైనా తన గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలని అనుకుంది. వెంటనే ఆకాశం వరకు పెరిగింది.  వింధ్యపర్వతం అలా ఆకాశం వరకు పెరిగే సరికి సూర్యగమనానికి అడ్డంకి ఏర్పడింది. సూర్యుడు పర్వతానికి ఆ వైపు నిలిచిపోయాడు. నక్షత్ర, గ్రహ సంచారాలు కూడా ఆగిపోయాయి. ఇటువైపు, అటువైపు పగలు, రాత్రుల్లో మార్పులు జరగడం లేదు. దాంతో లోకవాసుల జీవితాలన్నీ అయోమయంలో పడ్డాయి.

                                              సూర్యోదయ సూర్యాస్తమయాలు లేక మునులు సంధ్యావందనం, యజ్ఞయాగాలు చేసుకోలేకపోయారు. ఈ విపరీత పరిస్థితి దేవతలను సైతం బాగా కలచివేసింది. దేవతలంతా కలసి బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లి మొర పెట్టుకున్నారు. బ్రహ్మ సమయ స్ఫూర్తితో ఆలోచించి వింధ్యపర్వతం గర్వం అణచటానికి అగస్త్య మహాముని ఒక్కడే తగిన వాడని భావించాడు. గతంలో ఇంద్రపదవి చేపట్టి లోకాలను బాధించిన నహుషుడి గర్వాన్ని అణించింది, సముద్రాల జలాలను ఔపోశన పట్టింది ఆ మునేనని చెప్పి దేవతలందరినీ తీసుకుని అగస్త్య మహాముని ఆశ్రమానికి వెళ్లాడు. ఆయనకు విషయమంతా వివరించి ఎలాగైనా వింధ్యపర్వతం గర్వం అణచి ప్రపంచానికి మేలు చేయమని ప్రార్ధించాడు. అగస్త్యుడు కాశీ మహానగరాన్ని, కాశీ విశ్వేశ్వరుడిని, అన్నపూర్ణను విడిచిపెట్టి వెళ్లడం ఇష్టం లేకపోయినా లోకకల్యాణం కోసం దేవతల కోరికను తీర్చడం కోసం తన భార్య అయిన లోపాముద్రను వెంటపెట్టుకుని బయలుదేరాడు.  వింధ్యపర్వతాన్ని ఆ దంపతులిద్దరూ సమీపించగానే వింధ్యుడు వారికి నమస్కరించి ఎటు వెళుతున్నారని అడిగాడు. అప్పుడు అగస్త్యుడు తాను భార్యా సమేతంగా దక్షిణ భారత యాత్రకు బయలుదేరినట్లు తమకు దోవ ఇస్తే అవతల వైపునకు వెళ్లగలమని చెప్పాడు. వింధ్యుడు అందుకు ఒప్పుకున్నాడు. అయితే అగస్త్యుడు తాను మళ్లీ తిరిగి వచ్చే వరకు అలాగే ఎత్తు తగ్గించుకుని అణిగి మణిగి ఉండాలని వింధ్యుడికి చెప్పాడు. అగస్త్యుడి మాటల్లోని ఆంతర్యాన్ని గమనించలేని వింధ్యపర్వతం ఆకాశానికి పెంచిన తన దేహాన్ని తగ్గించుకుని ముని దంపతులకు దారి ఇచ్చింది. లోపాముద్రతో కలసి ఆ పర్వతాన్ని దాటి ముందుకు వెళ్లాడు. సూర్యచంద్రాదులకు, నక్షత్ర గ్రహాలకు అడ్డు తొలగిపోవడంతో మళ్లీ ప్రపంచమంతా హాయిగా యథావిథిగా గడపగలిగింది.

                  అగస్త్యుడు కాశీ మహానగరం నుంచి అలా దక్షిణ భారతదేశంలో దాక్షారామం, శ్రీశైలం తదితర ప్రాంతాలను సందర్శించి అక్కడే ఉండిపోయి వెనక్కు తిరిగిరాలేదు. దాంతో వింధ్యుడు అలాగే ఉండిపోయాడు.