మద్రదేశాధిపతి అయిన అశ్వపతికి ఆయన భార్య మాళవికి సావిత్రీ దేవత వరప్రసాదం వల్ల సావిత్రి జన్మించింది. 18 సంవత్సరాల నిరీక్షణ అనంతరం ఆ దంపతులకు అందం, తేలివితేటలు, అదృష్టం ఉన్న బాలిక జన్మించింది. సావిత్రి యుక్తవయసుకు వచ్చేసరికి అందాలరాశిగా, అతిలోక సౌందర్యవతిగా ఎదిగింది. ఆమెకు ఆశ్వపతి వివాహ ప్రయత్నాలు చేయడం ప్రారంభించాడు. చాలాకాలం పాటు ప్రయత్నాలు కొనసాగాయి. సాళ్వ రాజ్యాధిపతైన ద్యుమత్సేనుడి కుమారుడు సత్యవంతుడు. సత్యవంతుడి రూప, గుణ, విలాసాలను తెలుసుకొని ఆకర్షితురాలైంది. సావిత్రి. కానీ ద్యుమత్సేనుడి రాజ్యభ్రష్ఠుడై అడవులపాలై ఉన్నాడు. ఒకనాడు నారదమహర్షి మద్రదేశాధిపతైన ఆశ్వపతి దగ్గరకు వచ్చిన సందర్భంలో సావిత్రి పెళ్ళి ప్రస్తావన వచ్చింది. సావిత్రి దృఢ నిశ్చయంతో తన మనసులోని మాటను చెప్పి సత్యవంతుడిని వివాహమాడుతానని చెప్పింది. అందుకు నారదుడు సంతోషించాడు. అశ్వపతి ద్యుమత్సేనుండి వివరాలను అడుగగా నారదుడు తన దివ్యదృష్టితో చూసి సత్యవంతుడు రూపంలోనూ, గుణంలోనూ గొప్పవాడే అయినప్పటికీ ఒక సంవత్సర కాలంలోపు మరణించే అల్పాయిష్కుడని చెప్పాడు. అంతేకాక ఆశ్వపతి, నారదులు ఇద్దరూ సావిత్రిని ఈ కారణంతో మనసు మార్చుకొని వేరొక వరుడిని వివాహమాడమని చెప్పారు. అయినా ఆమె తన పట్టుదలను వదలలేదు. చేసేదిలేక ఆమె తండ్రి అడవికి వెళ్ళి ద్యుమత్సేనుడికి విషయమంతా వివరించి సావిత్రీ సత్యవంతుల వివాహానికి ఒప్పించాడు. ఒక శుభముహూర్తంలో మంచి కానుకలిచ్చి వివాహం జరిపించాడు. వివాహమైన తరువాత రత్నాభరణాలను, విలువైన వస్త్రాలను ధరించక కేవలం నార చీరలనే ధరించి సావిత్రి అత్తమామలకు, భర్తకు సపర్యలు చేస్తూ గడుపుతోంది. ఇంతలో నారదమహర్షి సత్యవంతుడి ఆయుస్షుకు సంబంధించి చేసిన హెచ్చరిక గుర్తుకు వచ్చింది. మరి నాలుగు రోజుల్లో సత్యవంతుడికి ఆయువు తీరుతుందని గ్రహించిన ఆమె కఠోరమైన త్రిరాత్రవ్రతానికి సిద్ధమైంది. మూడురోజుల వ్రతం ముగిసి నాలుగోరోజు ఉదయం సత్యవంతుడు అడవికి పూవులు, ఫలాల కోసం బయలుదేరాడు.
సావిత్రి కూడా అతడి వెంట బయలుదేరగా వద్దని వారించాడు. అయినా ఆమె భర్తను బతిమాలి, అత్తమామల దగ్గర సెలవు తీసుకొని అడవికి బయలుదేరింది. ఆ ఇద్దరూ అడవిలో పువ్వులు, పండ్లు కోసిన తరవాత కట్టెలను కొట్టిన అనంతరం సత్యవంతుడికి బాగా అలసటగా అనిపించి సావిత్రి ఒడిలో తలపెట్టుకొని పడుకున్నాడు. అలా పడుకున్న కొద్దిసేపటికి అతడు నిస్తేజుడు కావటం, కొద్దిదూరంలో తేజోవంతుడైన ఒక దివ్యపురుషుడు నిలబడి ఉండటం సావిత్రి గమనించింది. సత్యవంతుడిని తన ఒడి నుంచి దింపి ఆ దివ్యపురుషుడికి ఎదురుగా వెళ్ళి ఆయనయమధర్మరాజని తెలుసుకుని, యముడు తన భర్త ప్రాణాలను బంధించి తీసుకువెళ్ళడం చూసి వెంబడించింది. తనను వెంబడించి వస్తున్న సావిత్రి పాతివ్రత్య మహిమకు యముడు ముగ్ధుడై పతి ప్రాణం తప్ప ఏమైనా కోరుకోమన్నాడు. అప్పుడు ఆమె తన మామగారికి చూపును ప్రసాదించమని కోరింది. ఆ వరమిచ్చిన తరువాత మళ్ళీ వెంబడిస్తున్న సావిత్రిని చూసి ఇంకొక వరం కోరుకోమ్మనగా తన మామకు రాజ్యప్రాప్తి కలగాలని కోరుకుంది. యముడు అనుగ్రహించాడు. అయినా వదలక వెంబడిస్తున్న సావిత్రిని పతిప్రాణం తప్ప వేరొకటి కోరుకొమ్మనగా తన తండ్రికి పుత్రప్రాప్తి కలగాలని వేడుకుంది. అయినా మళ్ళీ వెంబడిస్తూ తన వాక్ చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్న సావిత్రి పాతివ్రత్యానికి ముచ్చటపడి యముడు సత్యవంతుడి ప్రాణాలను తిరిగి ఇచ్చేశాడు. ఇలా సావిత్రి తన మనోనిబ్బరంతో, దృఢ సంకల్పంతో అత్తమామలకు రాజ్యాన్ని, తండ్రికి పుత్రసంతానాన్ని, తనకు అయిదోతనాన్ని సంపాదించుకోగలిగింది. ఆడది అబలకాదు సబల అని సావిత్రి కథ వివరిస్తోంది.