నేను కాంచీపురంలోనే ఉండడంవల్ల ప్రతిరోజూ మహాస్వామివారి దర్శనభాగ్యం దొరికేది. ఒకసారి శ్రీమఠంలో ఎదో ఆరాధన సoదర్భoగా కావల్సినంత మంది వైదికులు దొరకకలేదు. పరమాచార్య స్వామివారు నాపేరు సిఫారసు చేసి వేరే వాళ్లతో పాటుగా ఆ కార్యక్రమంలో వైదికునిగా పాలుపంచుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించారు. భోజనాలు అయిన తరువాత నన్ను పిలిచి సహస్ర గాయత్రి చెయ్యమన్నారు. ఆ ఆరాధనలో వైదికునిగా పాల్గొన్నదానికి పరిహారంగా.
నాకు చెంగల్పేట్ న్యాయాలయానికి బదిలీ అవ్వడంతో నాకు పరమాచార్య స్వామివారి దర్శన భాగ్యం తగ్గిపోయింది. కాబట్టి ప్రతి నెల అనుషం (స్వామివారి జన్మ నక్షత్రమైన అనూరాధ నక్షత్రం) రోజు కాంచీపురానికి వెళ్ళి కామాక్షి అమ్మవారి ఆలయంలో త్రిశతి అర్చన చెయ్యించి, ప్రసాదాన్ని పరమాచార్య స్వామివారికి సమర్పించి వారిని దర్శించుకొనేవాణ్ణి. ఒకసారి అలా వెళ్ళగా శ్రీమఠం ఆరోజు భక్తులతో చాలా రద్దీగా ఉంది. దర్శించుకుని బయటకు వచ్చే భక్తులవద్ద ఉన్నాను నేను. మహాస్వామివారు దగ్గర ఉన్న సేవకునితో “శ్రేష్టిదార్ ని పిలువు” అని ఆదేశించారు.
కొంతమంది మా గుంపువైపు “శ్రేష్టిదార్ శ్రేష్టిదార్” అని అరిచారు. ఎవరో నన్ను తీసుకునివెళ్ళి మహాస్వామివారి ముందు నిలబెట్టారు. వారు స్వామితో, “శ్రేష్టిదార్ ఎవరూ లేరు. కోర్టు నుండి ఈ పెద్ద గుమాస్తా ఉన్నారు” అని చెప్పారు. నేను స్వామితో, “పెరియవ నేను శ్రేష్టిదార్ ను కాను, హెడ్ క్లర్క్ ని అని చెప్పాను”.
కాని స్వామివారు పట్టుబట్టి “ఎందుకు నువ్వు శ్రేష్టిదార్ కాకూడదు?” అని అడిగారు.
నేనూ ఖచ్చితంగానే సమాధానం చెప్పాను. “నాకు దానికి కావాల్సిన విద్యార్హతలు లేవు. నేను కేవలం SSLC ముగించాను. నా కిందన ఉన్నవాళ్ళు న్యాయశాస్త్రంలో BA.,BL, MA.,BL మొదలైనవి పూర్తిచేసినవారు. కాబట్టి విదార్హతలను బట్టి నాకు రాదు. అదీగాక, బెంచిలో ఉన్న జిల్లా న్యాయాధికారి పరమ కఠినుడు కనుక నా పేరును సిఫారసు చెయ్యడు. కాబట్టి నేను శ్రేష్టిదార్ ను కాలేను” అని చెప్పాను. స్వామివారు నాకు వెళ్ళడానికి అనుమతినిచ్చారు.
కొన్నిరోజుల తరువాత చెన్నై న్యాయాలయం నుండి కొంతమంది తనిఖీకి వచ్చారు. వారు నా శక్తి సామర్థ్యాలను పరిశీలించి హైకోర్టు జడ్జికి ఒక రహస్య నివేదిక సమర్పించారు. కొన్నిరోజుల తరువాత నన్ను శ్రేష్టిదార్ గా చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. అందరికి ఆశ్చర్యం కలిగింది ఇది ఎలా సాధ్యం అని. కేవలం విద్యార్హతలను బట్టే ఉన్నత పదవులిస్తారు అనుకునే వారికి ఇది ఒక గుణపాఠం.
ఈలోగా, నేను తరువాతి అనుషానికి కాంచీపురం వెళ్ళాను. పరమాచార్య స్వామివారి ముందు కామాక్షి అమ్మవారి ప్రసాదం పెట్టగానే స్వామివారు చెయ్యెత్తి తమ తలపై ఉంచుకుని శ్రేష్టిదార్ (‘హెడ్’, ‘చీఫ్’) అని అర్థం స్ఫురించేట్టుగా నాకు చూపిస్తూ “ఇప్పుడు నిన్ను శ్రేష్టిదార్ అని పిలవొచ్చునా?” అని అడిగారు.
స్వామివారు అలా అనగానే నా వొళ్ళు గగుర్పాటుకు గురి అయ్యింది. నేను ఏమీ మాట్లాడలేకున్నాను. నేను చెయ్యగలిగింది ‘దైవం మానుష రూపేణా’ అన్నట్టుగా నా ఎదురుగా ఉన్న సర్వేశ్వరునికి సాష్టాంగం చేసి నా కన్నీళ్లతో వారి పాదపద్మములను కడగడమే. వారే నాకు ఉద్యోగోన్నతి కల్పించినవారు. జరగబోయేది ఏమిటో ఆ దైవానికే తెలుసు అని ఆరోజే నాకు అర్థం అయ్యింది.
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
--- పి.కె రామనాథన్, చెన్నై. మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 6
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.
t.me/paramacharyavaibhavam
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం