Saturday, August 10, 2019

హింస - అహింస

Image result for dharmavyadha


మనిషి మనసును వేధించే ధర్మసందేహాలను తీర్చే మహాగ్రంధంగా మహాభారతానికి మంచి పేరుంది. మనిషికి కలిగే ధర్మ సందేహాల్లో హింస, అహింసల తారతమ్యం ఎలా ఉంటుందనేది ప్రధానమైనది. ఒకప్పుడు కౌశికుడు అనే మునికి కూడా హింసకు అహింసకు తేడా తెలుసుకోవాలనిపించింది. దీనికి కారణం ధర్మవ్యాధుడు అనే కసాయివాడు త్రికరణశుద్ధిగా ధార్మికుడుగా కనిపించడమే. ‘నీవు మాంసం అమ్ముతూ జీవిస్తున్నావు కదా? అది హింస కాదా? దానివల్ల పాపం రాదా?’ అని కౌశికుడు ఆ కసాయివాడిని ప్రశ్నించాడు. అతడు అడిగిన ప్రశ్నలన్నిటికీ ధర్మవ్యాధుడు సమాధానాలు చెప్పిన సారాంశంలో అహింసా స్వరూపం ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఓ కౌశికమునీ ఈ లోకంలో ప్రాణుల మరణం అనేది వాటి పూర్వజన్మకర్మ ఫలితం మీద ఆధారపడి ఉంటుందని పెద్దలు చెబుతున్నారు. చంపేవాడు కేవలం నిమిత్తమాత్రుడేననేది వారి భావన. అసలు ఈ జగత్తును సృష్టించినప్పుడే బ్రహ్మదేవుడు కొన్ని కొన్ని ప్రాణుల కోసం మరికొన్ని జంతు, మృగ సమూహాలను సృష్టించాడని, అలాగే పండ్లు, కూరగాయలు, దుంపలు వంటి వాటిని కూడా ఆహార పదార్థాలుగా సృష్టించాడని వేదాలు ఘోషిస్తున్నాయి. హింస అన్ని సందర్భాల్లో హింసలాగా కనిపించదు. తన శరీరాన్ని కోసి అగ్నికి, ఇంద్రుడికి ఆహారంగా ఇచ్చిన శిబి చక్రవర్తికి పాపం కలగడానికి బదులు, పుణ్యలోక ప్రాప్తి కలిగింది. నిష్టాగరిష్ఠులైన వారు యజ్ఞాలను చేసేటప్పుడు పశువులను బలి ఇస్తుంటారు. ఇది పైకి హింసలాగే కనిపిస్తుంది. కానీ వారికి ఎవరికీ పాపం అంటడం లేదు. రైతు పొలాన్ని దున్నేటప్పుడు అతడి నాగటి కొనకు తగిలి వేలాది జీవులు మరణిస్తుంటాయి. కానీ ఆ హాలికుడికి పాపం అంటడం లేదు. మనుషులు నడిచేటప్పుడు వారి కాళ్ల కింద పడి అనేక ప్రాణులు నశిస్తుంటాయి. భూమి, ఆకాశం, నీరు అంతా జలమయమే కదా! కనుక మనిషైనవాడు తన జీవన యాత్ర సాగించేటప్పుడు ఏదో ఒక సందర్భంలో హింస చేయక తప్పదు. కానీ ఇవన్నీ తెలియని కొందరు తాము హింస చేయడం లేదని అనుకుంటూ ఉంటారు. అది ఒట్టి భ్రమ మాత్రమే. పనిగట్టుకుని అడవులకు వెళ్లి తపస్సు చేసుకుంటూ మేము హింసకు దూరంగా ఉన్నామని అనుకునే వారు కూడా ఆహారం కోసం చెట్ల ఆకులను, దుంపలను కోసేటప్పుడు ఆ చెట్లను హింసిస్తూ హింసకు పాల్పడుతున్నట్లే లెక్క కనుక వీటన్నిటినీ గమనిస్తే హింస చేయని వాడు ఈ లోకంలో ఒక్కడు కూడా లేనట్లే కదా అని ధర్మవ్యాధుడు అన్నాడు. మరి అహింస అనేది ఎలా ఉంటుందని మళ్లీ ముని ప్రశ్నించాడు. ఎవరికి వారు తమకు సాధ్యమయినంత వరకు హింసకు దూరంగా ఉండటమే అహింస అని చెప్పవచ్చని ధర్మవ్యాధుడు కౌశికమునికి వివరించాడు.









- శ్రీ యల్లాప్రగడ మల్లికార్జున రావు గారు

- సేకరణ ఈనాడు దినపత్రిక నుంచీ

No comments:

Post a Comment