Sunday, March 5, 2023

అంతా పరమేశ్వరుడికి చెందినదే

పరమేశ్వరుడికి శివుడు, రుద్రుడు, కపర్థి ఇటువంటి పేర్లున్నట్లుగా అందరికీ విదితమే. కానీ కృష్ణదర్శనుడు అనే ఒక విచిత్రమైన అవతారాన్ని కూడా ఈశ్వరుడు ధరించాల్చి వచ్చింది. కృష్ణదర్శనుడు అంటే నల్లని కళ్లు కలిగినవాడు అనే అర్థం స్ఫురిస్తుంది. శివపురాణం ఇరవైతొమ్మిదో అధ్యాయం శతురుద్ర సంహితలోని కృష్ణదర్శనావతారంలో కనిపించే ఈ కథ ఒక సామాజిక ఉపయోగ కథ. సాధారణంగా వృద్ధుడైన తండ్రి కూర్చోవటం తప్ప ఆయన చేసేదీ ఏదీ ఉండదు. ఆయన చెప్పే మాటల్లో కూడా అంతగా ఆచరణ యోగ్యమైన అంశాలు ఏవీ ఉండవని కొంతమంది భావిస్తుంటారు. అయితే వృద్ధుడైన తండ్రి ఎప్పటికీ ఒక మంచి మార్గాన్ని కుమారులకు సూచిస్తూ వారి జీవితం సుఖప్రదం కావటానికి కావలసిన సూచనలు చేస్తుంటాడనే విషయం ఈ కథలో మనం గమనించవచ్చు. ఈ కథలో నభగుడికి జ్ఞానాన్ని ఇచ్చిన కృష్ణదర్శనుడు అనే పేరుగల పరమోత్తమ పరమేశ్వర అవతార విశేషాలను మనకు కనిపిస్తాయి. పూర్వం భూమండలాన్ని పాలించిన మానవులలో శ్రాద్ధదేవుడు అనే మనువుకు ఇక్ష్వాకువు తదితర పుత్రులుండేవారు. వారిలో నభగుడు కూడా ఒకడు. ఈ నభగుడికి నాభగుడు అనే కుమారుడుండేవాడు. శ్రీమహావిష్ణు భక్తుడైన అంబరీషుడు నాభగుడి కుమారుడు. ఈ వంశక్రమంలో ఉన్న నభగుడికి శివుడు జ్ఞానాన్ని ప్రసాదించాడు. నభగుడు చాలా బుద్ధిమంతుడు. అతడు విద్యాభ్యాసం కోసం చిరకాలం జితేంద్రియుడై గురుకులంలో నివసించాడు. ఆయన అలా గురుకులంలో విద్యాభ్యాసం చేస్తున్న రోజుల్లోనే నభగుడి సోదరులైన ఇక్ష్వకువు తదితర సోదరులంతా తమ తండ్రి శ్రాద్ధదేవుడి ఆస్తిలో నభగుడికి భాగం ఇవ్వకుండా తామంతా సమానంగా పంచుకున్నారు. అలా ఆస్తినంతా పంచుకున్న తర్వాత వివాహాది కార్యాలన్న జరిపించుకొని వారంతా సుఃంచసాగారు. తండ్రినే అప్పగించిన సోదరులు నభగుడు మాత్రం గురుకులంలో సర్వవేదవేదాంగాలు నేర్చుకొని చాలాకాలం తర్వాత ఇల్లు చేరాడు. తన సోదరులంతా తమ తండ్రి ఆస్తిని సమానంగా పంచుకొని ఆనందిస్తున్నారని తెలిసికొని తనకు రావలసిన భాగాన్ని కూడా ఇవ్వమని నభగుడు తన సోదరులను ప్రేమపూర్వకంగా అడిగాడు. అప్పుడు ఆ సోదరులంతా తాము ఆస్తిని పంచుకొని చాలా కాలమైందని, ఇప్పుడు ప్రత్యేకంగా మరోభాగాన్ని ఏర్పాటు చేయమంటే సాధ్యం కాదని అయితే వృద్ధుడైన తండ్రినే తామిచ్చే ఆస్తి భాగంగా భావించుకొని తీసుకోమని చెప్పి పంపారు. నభగుడు తన సోదరుల దగ్గర నుంచి బయలుదేరి తన తండ్రి దగ్గరకు వచ్చి జరిగిన విషయాన్నంతా చెప్పాడు. శ్రాద్ధదేవుడు ఆ మాటలు విని ఆశ్చర్యపోయాడు. తన కుమారుడైన నభగుడిని ఓదార్చి సోదరుల మోసాన్ని లెక్కచేయవద్దని, వారు తనను దాయ భాగంగా అప్పచెప్పినందుకు జీవనోపాయాన్ని చూపించగలనని ధైర్యం చెప్పాడు. ధైర్య వచనాలలో భాగంగా నభగుడికి శ్రాద్ధదేవుడు ఒక ఉపాయాన్ని వివరించాడు. అంగిరస వంశంలో జన్మించిన జ్ఞానులు కొంతమంది సత్రయాగం చేస్తున్నారని అక్కడకు వెళ్లి వారిని సమీపించి రెండు వైశ్వదేవ సూక్తాలను చక్కగా పఠించమని నభగుడికి తండ్రి సూచించాడు. దానివల్ల ఆ సత్రయాగం సుసంపన్నమౌతుందని, ఆ కారణంగా యాగం పూర్తికాగానే యాగం చేస్తున్న అంగిరస వంశంలోని వారు స్వర్గానికి వెళుతూ సంతోషంగా తమ యాగంలో మిగిలిన ధనాన్నంతా నభగుడికి ఇచ్చి వెళ్తారని దాంతో సుఃంచమని శ్రాద్ధదేవుడు చెప్పాడు. తన తండ్రి మాటలను అనుసరించి ఆయన చెప్పినట్లుగానే సత్రయాగం దగ్గరకు వెళ్ళి వైశ్వదేవ సూక్తాలను పఠించాడు. ఆ యాగం చేస్తున్న వారంతా యాగం పూర్తికాగానే అక్కడున్న సంపదనంతటినీ ఎంతో ఆనందంగా నభగుడికి ఇచ్చి స్వర్గానికి వెళ్లారు. వచ్చినవాడు శివుడే.. అయితే అంతలోనే నభగుడికి ఒక చిక్కు వచ్చిపడినట్లుయింది. ఆ సంపదను తీసుకొంటుండగా ఎంతో సుందరమైన దేహం కలిగినవాడు, నల్లని కన్నులతో ప్రకాశిస్తున్నవాడు కృష్ణదర్శనుడు అనే పేరున్న ఓ వ్యక్తి అక్కడకు వచ్చాడు. నభగుడిని ఆ సంపదనంతా ఎందుకు తీసుకువెళుతున్నట్లు? అసలు నీవెవరు? అని గద్దించి అడిగాడు. అప్పుడు నభగుడు తనకు ఆ సంపదనంతా రుషులిచ్చారని చెప్పాడు. నభగుడు అలా అన్నప్పటికీ దానికి తగిన సాక్ష్యం ఏదని, అది తన సంపద ఎందుకు కాకూడదని ప్రశ్నించాడా వ్యక్తి. అప్పుడు నభగుడు తన గతమంతా చెప్పాడు. ఆ మాటలు విన్న తర్వాత కృష్ణదర్శనుడు అయితే తమ వివాదాన్ని తీర్చగలిగిన యోగ్యుడు ఒక్క శ్రాద్ధదేవుడేనని ఆయన దగ్గరకే వెళ్లి నిజాన్ని రుజువు చేసుకునేందుకు బయలుదేరమని కృష్ణదర్శనుడు నభగుడితో అన్నాడు. ఇద్దరూ అలా శ్రాద్ధదేవుడి దగ్గరకు బయలుదేరారు. నభగుడు తన తండ్రితో కృష్ణదర్శనుడికి తనకు కలిగిన వివాదం గురించి చెప్పాడు. అప్పుడు శ్రాద్ధదేవుడు ఒక క్షణంపాటు ఆలోచించి ఆ వచ్చినది ఎవరో కాదని సాక్షాత్తూ శివుడే అయి ఉంటాడని, అయినా ఈ జగత్తులోని సర్వ వస్తువులూ శివుడికి సంబంధించినవే అందులోనూ యజ్ఞానికి సంబంధించిన వస్తువులు విశేషించి ఆయా మిగిలిన వస్తువులన్నింటినీ రుద్రభాగాలు అని అంటారు. కనుకనే శివుడు అలా మారురూపంలో అక్కడకు వచ్చి ఉండవచ్చని చెప్పాడు. అంతలో శ్రాద్ధదేవుడు, నభగుడు ఉన్న ప్రదేశానికి కృష్ణదర్శనుడు చిరునవ్వులు చిందిస్తూ వచ్చాడు. తండ్రీకొడుకులిద్దరూ ఆయనకు సాష్టాంగదండ ప్రణామాలు అర్పించి స్తుతించారు. కృష్ణదర్శనుడుగా ఉన్న ఈశ్వరుడు అప్పుడక్కడ తన నిజస్వరూపాన్ని సాక్షాత్కరింపచేశాడు. తల్లిదండ్రులు వృద్ధులయ్యారని వారు దేనికి పనికిరారని ఎవరూ భావించుకోకూడదని, అసలైన ఉత్తమ జీవనమార్గాన్ని పిల్లలకు సూచించగలిగేది తండ్రేనని చెప్పాడాయన. ఈ సత్యాన్ని శ్రాద్ధదేవుడు రుజువుచేసినందుకు తనకెంతో ఆనందంగా ఉందని శ్రాధ్ధదేవుడిని, నభగుడిని ఆశీర్వదించి అంతర్థానమయ్యాడు.

Sunday, February 26, 2023

అంతా కాలమహిమ

సృష్టిలో జరిగేదంతా కాలాన్ని అనుసరించే జరుగుతుంటుంది. కాలాన్ని లేదా సమయాన్ని విస్మరించి వృథా చేసి ఎవరూ చేయగలిగింది ఏదీ ఉండదు. ఎందుకంటే కాలమే అత్యంత బలీయమైనది అని తెలియచెప్పే కథా సందర్భం ఇది. మహాభారతం శాంతిపర్వం ఇరవై అయిదో అధ్యాయంలో ఈ విషయం కనిపిస్తుంది. కాలానుగుణంగా మాత్రమే మనిషి దేన్నైనా పొందుతూ ఉంటాడు. కానికాలం వచ్చినప్పుడు బుద్ధిబలం, శాస్త్ర అధ్యయన అనుభవం లాంటివేవీ ఉపయోగపడవు. కాలంకాని కాలంగా మారి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండాలంటే దైవస్వరూపమైన కాలాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాల్సిందే. ఎందుకంటే కానికాలంలో సాధించగలిగేది ఏదీ ఉండదు. ఒక్కొక్కసారి మూర్ఖుడు కూడా కొన్ని ప్రయోజనాలను పొందుతూ ఉంటాడు. దీనికి కారణం అతడికి కాలం కలిసిరావటమే. కార్యసిద్ధి విషయంలో కాలమే సామాన్యకారణం. కలిసిరాని కాలంలో మంత్రాలు, మందులులాంటివేవీ ఫలితాన్నివ్వవు. మందులు వాడవలసి వచ్చే విషయాన్ని కాలాన్ని వృథా చేయకుండా సకాలంలో గుర్తించగలిగినప్పుడు అసలా మందుల అవసరమే ఉండదు. కాల మహిమను చూపే ప్రకృతి కాలం కలిసొస్తే అన్నీ అవే సిద్ధిస్తాయి. వృద్ధి చెందుతాయి. కాలం మహిమను ప్రకృతి మనకు నిత్యం చూపిస్తూనే ఉంటుంది. ఎలాగంటే కాలంవల్లే గాలి వేగంగా వీస్తుంది, వర్షం కురుస్తుంది. భూమ్మీద పడ్డ వర్షపునీరు మేఘాలను చేరేది కూడా కాల ప్రభావంతోనే. కాలం కారణంగానే నీటిలో పద్మాలు, కలువలు ఉద్భవిస్తూ ఉంటాయి, అడవులలో చెట్లు పెరుగుతుంటాయి. అంతదాకా ఎందుకు కృష్ణపక్షం, శుక్లపక్షం అంటూ నెలలో కొన్ని రోజులు చీకటి రాత్రులు, మరికొన్ని రోజులు వెన్నెలరాత్రులు ఏర్పడేది కాలానుగుణంగానే. చెట్లకు పువ్వులు, ఫలాలు కలగకుండా ఉంటున్నది కూడా ఆ కాలం కారణంగానే. అకాలంలో నదులకు ప్రవాహవేగం ఉండదు. పక్షులు, పాములు, లేళ్లు, ఏనుగులు, కొండ జంతువులు విజృంభించవు. అకాలంలో స్త్రీలకు గర్భం రాకపోవడం అందరికీ తెలిసిందే. కాలం కానప్పుడు చలి, వేడి, వర్షం ఉండనే ఉండవు. కాలం చెల్లితేనే మరణం కాలం చెల్లితేనే మరణం అయినా రాగలిగేది. జననం అయినా జరిగేది. కాలం రాకుండా శిశువుకు మాటలురావు... యౌవనమూ రాదు. కాలం రాకుండా నాటిన విత్తనం మొలకెత్తటం జరగదు. కచ్చితమైన కాలంలోనే సూర్యుడు ఉదయించటం, అస్తమించటం జరుగుతుంటుంది. చంద్రుడు వృద్ధి పొందటం, క్షీణించటమనేవి, సముద్రుడు ఆటుపోట్లకు లోనయ్యేదీ కేవలం కాలప్రభావంతోనే. కాలగమనాన్ని ఆపగలిగిన శక్తి ఎవరికీ లేదు. రాజులందరూ మరణించింది కాలం తీరినందువల్లనే. ఒక్క మాటలో చెప్పాలంటే జగత్తు చైతన్యమంతా కాలం కదిలికలకు లోబడే ఉంటుంది. ఈ విషయాన్ని గమనించుకొని దైవస్వరూపమైన కాలాన్ని జాగ్రత్తగా అనుసరిస్తూ సకాలంలో పనులు ముగించుకొన్న వారికి అశాంతి ఉండదు. కాలం వృథా అయినప్పుడే జీవితాల్లో అశాంతి అల్లకల్లోలం లాంటివన్నీ వరసపెడుతుంటాయి అని ఓ సందేశాన్ని ఈ కథా సందర్భం అందిస్తోంది.