Sunday, February 26, 2023
అంతా కాలమహిమ
సృష్టిలో జరిగేదంతా కాలాన్ని అనుసరించే జరుగుతుంటుంది. కాలాన్ని లేదా సమయాన్ని విస్మరించి వృథా చేసి ఎవరూ చేయగలిగింది ఏదీ ఉండదు. ఎందుకంటే కాలమే అత్యంత బలీయమైనది అని తెలియచెప్పే కథా సందర్భం ఇది. మహాభారతం శాంతిపర్వం ఇరవై అయిదో అధ్యాయంలో ఈ విషయం కనిపిస్తుంది. కాలానుగుణంగా మాత్రమే మనిషి దేన్నైనా పొందుతూ ఉంటాడు. కానికాలం వచ్చినప్పుడు బుద్ధిబలం, శాస్త్ర అధ్యయన అనుభవం లాంటివేవీ ఉపయోగపడవు. కాలంకాని కాలంగా మారి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండాలంటే దైవస్వరూపమైన కాలాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాల్సిందే. ఎందుకంటే కానికాలంలో సాధించగలిగేది ఏదీ ఉండదు. ఒక్కొక్కసారి మూర్ఖుడు కూడా కొన్ని ప్రయోజనాలను పొందుతూ ఉంటాడు. దీనికి కారణం అతడికి కాలం కలిసిరావటమే. కార్యసిద్ధి విషయంలో కాలమే సామాన్యకారణం. కలిసిరాని కాలంలో మంత్రాలు, మందులులాంటివేవీ ఫలితాన్నివ్వవు. మందులు వాడవలసి వచ్చే విషయాన్ని కాలాన్ని వృథా చేయకుండా సకాలంలో గుర్తించగలిగినప్పుడు అసలా మందుల అవసరమే ఉండదు.
కాల మహిమను చూపే ప్రకృతి
కాలం కలిసొస్తే అన్నీ అవే సిద్ధిస్తాయి. వృద్ధి చెందుతాయి. కాలం మహిమను ప్రకృతి మనకు నిత్యం చూపిస్తూనే ఉంటుంది. ఎలాగంటే కాలంవల్లే గాలి వేగంగా వీస్తుంది, వర్షం కురుస్తుంది. భూమ్మీద పడ్డ వర్షపునీరు మేఘాలను చేరేది కూడా కాల ప్రభావంతోనే. కాలం కారణంగానే నీటిలో పద్మాలు, కలువలు ఉద్భవిస్తూ ఉంటాయి, అడవులలో చెట్లు పెరుగుతుంటాయి. అంతదాకా ఎందుకు కృష్ణపక్షం, శుక్లపక్షం అంటూ నెలలో కొన్ని రోజులు చీకటి రాత్రులు, మరికొన్ని రోజులు వెన్నెలరాత్రులు ఏర్పడేది కాలానుగుణంగానే. చెట్లకు పువ్వులు, ఫలాలు కలగకుండా ఉంటున్నది కూడా ఆ కాలం కారణంగానే. అకాలంలో నదులకు ప్రవాహవేగం ఉండదు. పక్షులు, పాములు, లేళ్లు, ఏనుగులు, కొండ జంతువులు విజృంభించవు. అకాలంలో స్త్రీలకు గర్భం రాకపోవడం అందరికీ తెలిసిందే. కాలం కానప్పుడు చలి, వేడి, వర్షం ఉండనే ఉండవు.
కాలం చెల్లితేనే మరణం
కాలం చెల్లితేనే మరణం అయినా రాగలిగేది. జననం అయినా జరిగేది. కాలం రాకుండా శిశువుకు మాటలురావు... యౌవనమూ రాదు. కాలం రాకుండా నాటిన విత్తనం మొలకెత్తటం జరగదు. కచ్చితమైన కాలంలోనే సూర్యుడు ఉదయించటం, అస్తమించటం జరుగుతుంటుంది. చంద్రుడు వృద్ధి పొందటం, క్షీణించటమనేవి, సముద్రుడు ఆటుపోట్లకు లోనయ్యేదీ కేవలం కాలప్రభావంతోనే. కాలగమనాన్ని ఆపగలిగిన శక్తి ఎవరికీ లేదు. రాజులందరూ మరణించింది కాలం తీరినందువల్లనే. ఒక్క మాటలో చెప్పాలంటే జగత్తు చైతన్యమంతా కాలం కదిలికలకు లోబడే ఉంటుంది. ఈ విషయాన్ని గమనించుకొని దైవస్వరూపమైన కాలాన్ని జాగ్రత్తగా అనుసరిస్తూ సకాలంలో పనులు ముగించుకొన్న వారికి అశాంతి ఉండదు. కాలం వృథా అయినప్పుడే జీవితాల్లో అశాంతి అల్లకల్లోలం లాంటివన్నీ వరసపెడుతుంటాయి అని ఓ సందేశాన్ని ఈ కథా సందర్భం అందిస్తోంది.
Subscribe to:
Posts (Atom)