కురుక్షేత్ర మహాసంగ్రామం ముగిసిన పిమ్మట శ్రీకృష్ణుడు ద్వారకకు తిరుగుప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలో ఓ ఎడారిలో రాత్రికి సేదతీరి ఉదయాన్నే బయల్దేరదామని యెడారిలో ఒక చోట బసచేసాడు. సమీపంలోనే ఉత్తాంగుడు అనే మహర్షి కనిపించాడు. ఉత్తాంగుడు శ్రీకృష్ణుడి భక్తుడు. శ్రీకృష్ణుడు ఉత్తాంగుడుని చూసి " ఉత్తాంగా ! ఇక్కడ ఏం చేస్తున్నావ్?" అని ప్రశ్నించాడు. ఉత్తాంగుడు చిరునవ్వు నవ్వి "స్వామీ, మీకు తెలియనిదేముంటుంది. తాపసిని నేను ఈ యెడారి దారిన వెళుతూ రాత్రికి ఇక్కడ విశ్రమిద్దామని ఆగాను. కానీ మీరు? .. ఇక్కడా..? " అడిగాడు ఉత్తాంగుడు. "కురుక్షేత్ర మహా సంగ్రామం ముగిసింది తిరిగి ద్వారకకు వెళ్తున్నాను " చెప్పాడు కృష్ణుడు.
"కురుక్షేత్ర మహా సంగ్రామమా? యుద్ధం అంటే అపార ప్రాణ నష్టం కదా స్వామి, అందునా మీరు ఉండికూడా ఒక యుద్ధాన్ని ఆపలేకపోయారా ?" ఆశ్చర్యపోయాడు ఉత్తాంగుడు.
"నీవన్నది నిజమే ఉత్తాంగా యుద్ధం అపార ప్రాణనష్టాన్ని కలిగిస్తుంది. కానీ యుద్ధం అనివార్యమయ్యింది" చెప్పాడు కృష్ణుడు. ఉత్తాంగుడిలో ఒక అమర్షమేర్పడ్డది, ఒక అసహనమేర్పడ్డది. కోపంతో కృష్ణుడిని శపించడానికి తన కమండలంలోని జలాన్ని తన అరచేతిలోకి తీసుకొన్నాడు.
అప్పటికే గాంధారి అపార్ధంతో కృష్ణుణ్ణి శాపించింది. మరొక వ్యక్తి తనను అపార్ధం చేసుకొనడం కృష్ణుడికి ఇష్టం లేక ఉత్తాంగుడికి యుద్ధ కారణాన్ని వివరించడం మొదలుపెట్టాడు. " ఉత్తాంగా.. యుద్ధం జరగకుండా ఉండడానికి నా సాయశక్తులా కృషి చేసాను, రాయబారిగా దుర్యోధనుడినిని పాండవులకు కనీసం ఐదు ఊళ్ళిమ్మని బ్రతిమాలాను అందుకు దురోధనుడు ఐదు ఊళ్ళు కాదుగదా సూది మొన మోపినపాటి చోటుకూడా ఇవ్వడానికి నిరాకరించాడు".
ఉత్తాంగుడు నిజమా? అని ఆశ్చర్యంతో చూస్తున్నాడు.
కృష్ణుడు చెప్పడం కొనసాగించాడు. "ఉత్తాంగా ! అదీ కాక నిండు సభలో ద్రౌపదికి ఘోరపరాభవం జరిగింది. అట్టి మహాపాతకం చేసినందుకు కౌరవులకు తగిన శిక్ష పడితీరవల్సిందే. అందుకే యుద్ధానికి రంగం సిద్ధమయ్యింది " చెప్పడం ముగించాడు పరమాత్మ.
తొందరపాటులో శ్రీకృష్ణుణ్ణి అపార్ధం చేసుకొని శపించబోయిన ఉత్తాంగుడికి తను చేయబోయిన పనిని తలుచుకొని సిగ్గు కలిగింది. "క్షమించు దేవా ! ఆవేశంలో దేవాదిదేవుడివైన నిన్నే శపించబోయాను, నన్ను మన్నించు!" అని చేతిలోని తపో జలాన్ని నేలపై వదిలిపెట్టాడు.
శ్రీకృష్ణుడు దయతో ఉత్తాంగుడితో ఇలా అన్నాడు " ఉత్తాంగా ఏది ఏమైనా నా కారణమున నీ తపోజల రూపంలో నీ తపశ్శక్తి కొంత వృధా అయినది అందుకు మారుగా ఏదన్నా వరం కోరుకో".
"ఇంద్రాది దేవతలకే దుర్లభమైన మీ అమూల్య దర్శనంతో పావనమయ్యాను. ఇంతకన్నా ఏం కావాలి స్వామి? నాకే వరమూ వద్దు" సున్నితంగా బదులిచ్చాడు ఉత్తాంగుడు.
"కోరుకోమని నే అడుగుతున్నా ఉత్తాంగా..కోరుకో" మరోసారి పట్టుబట్టాడు శ్రీకృష్ణుడు. సహజంగా వరమివ్వని ఆయనే తనకు తానుగా అడుగుతుంటే, ఉత్తాంగుడు ఈ అవకాశాన్ని జాగ్రత్తగా వినుయోగించుకొన్వాలని కృష్ణుడు ఉద్దేశ్యం .
కానీ ఉత్తాంగుడు కొంత సేపు ఆలోచించి పరాచికంగా " కృష్ణా ! నా కమండలంలోని జలమే కదా వృధా అయ్యింది? అసలే ఇది యెడారి ప్రదేశం. కాబట్టి నాకు దప్పికైనప్పుడు నేను నిన్ను స్మరించినంతనే నువ్వు నాకు జలాన్ని అనుగ్రహించు చాలు" అన్నాడు.
సరే అని వరమిచ్చి కృష్ణుడు ఆ రాత్రికి ఉత్తాంగుడికి కూడా తనతో పాటే భోజనాది సపర్యలకు ఏర్పాటు చేయించాడు. ఉదయమే వీడ్కోలు పుచ్చుకొని వెళ్ళిపోయాడు.
కొన్నాళ్ళ పిదప ఉత్తాంగుడు యడారిలో ధ్యానం ముగించుకొన్న సమయంలో దాహం వేసింది. తనకు శ్రీకృష్ణుడు ఇచ్చిన వరం గుర్తుకువచ్చి స్వామిని స్మరించాడు. కొంత సేపటికి ఒక వేటగాడు ఉత్తాంగుడి ఎదుట కనిపించాడు. " స్వామీ మీరు చూడబోతే బాగా దప్పికతో ఉన్నట్టున్నారు. నా దగ్గర కొంత నీరు ఉంది పుచ్చుకోండి అని పిలిచాడు".
ఉత్తాంగుడు కనులు తెరిచి చూసే సరికి ఎదురుగా ఓ వేటగాడు దుమ్ముకొట్టుకుపోయిన దేహంతో చెమటతో దుర్గంధంతో ఉన్నాడు. అతని తో బాటూ వేటకుక్కలు ఉన్నాయి. ఆ దుర్గంధాన్నీ భరించలేక " వద్దు, ఇక్కడ నుంచీ వెళ్ళిపో" అన్నాడు ఉత్తాంగుడు.
"స్వామీ నేను నా తోలు సంచిలో నీళ్ళు తాగుతుంటే మీరు దాహార్తితో మీ పెదాలు తడి చేసుకోడం నే చూసాను. మీరు బాగా దాహంతో ఉన్నారు. దయచేసి కొంత పుచ్చుకోండి నేను మురికిగా ఉన్నా నా తోలు సంచీ, అందులో నీరూ శుభ్రంగా ఉన్నాయి" అని బదులిచ్చాడు వేటకాడు.
భృకుటి ముదివేసి కొంత అసహనంగా ఆ వేటగాడి కుక్కలకేసి చూస్తూ "వద్దు వెంఠనే ఇక్కడ నుంచీ వెళ్ళిపో" అని కోపంతో రెట్టించాడు ఉత్తాంగుడు.
"స్వామీ ఈ యెడారిలో నీళ్ళు దొరకడం అంత సులువు కాదు. దయచేసి కొంత నీరు పుచ్చుకోండి" బ్రతిమాలాడు వేటకాడు. " నీలాంటి వేటకాడిచ్చిన నీటిని తాగి బ్రతికే కన్నా దాహంతోనైనా చనిపోతా కానీ నీ నీళ్ళు తాగనే తాగను.. వెళ్ళిపో !" అని ఆగ్రహోదర్గుడయ్యాడు ఉత్తాంగుడు. వేటగాడు వెళ్ళిపోయాడు.
కొంత సేపటికి నిదానించిన ఉత్తాంగుడికి మనసులో ఓ భావన కలిగింది. శ్రీకృష్ణుడు తానిచ్చిన మాట తప్పాడనిపించింది. వెంఠనే " కృష్ణా ! నాకు వరమిచ్చి కూడా నా దాహం తీర్చలేదు. మాట తప్పావ్" అని ఆకాశం వంక చూస్తూ బిగ్గరగా అరిచాడు. ఉత్తర క్షణం కృష్ణ స్వామి ఉత్తాంగుడి ముందు ప్రత్యక్షమయ్యాడు.
" ఏది? నీరు ? నీళ్ళిస్తానని ఆడి మాట తప్పావ్ ! దాహంతో ప్రాణం కడంటేసింది. వట్టిచేతులతో వచ్చావా? " నిందా పూర్వకంగా కోపంతో అన్నాడు ఉత్తాంగుడు. ఉత్తాంగుడు ఆవేశంగా చెప్పడం ముగించాకా చిరునవ్వుతో కృష్ణుడు ఇలా బదులిచ్చాడు " నిజమే ఉత్తాంగా ! నేను నీకు నీళ్ళివలేదు. నీకు అమరలభ్యమైన అమృతాన్నిద్దామని ప్రయత్నించాను. నీవు నన్ను స్మరించిన వెంఠనే దేవేందృడిని నీకు అమృతాన్నిమ్మని చెప్పాను. ఇందృడందుకు సమ్మతించి అమర లభ్యమైన అమృతాన్ని అందుకు యోగ్య్లైన వారికే ఇవ్వాలి కావున అందుకొనబోను వాని యోగ్యతనీ, పాత్రత నీ పరీక్షించి ఇస్తా అని చెప్పాడు. ఆ వేటగాడు సాక్షాత్తు దేవేందృడే ! అతని తోలు సంచీ అమృత కలశము. సకల చరాచర సృష్టినీ సృజించి నడిపించి లయించే ఆ బ్రహ్మాన్ని నువ్వు అందరిలో చూసావో లేదో పరీక్షించాడు ఇందృడు. నువ్వు అందరినీ సమానంగా చూడ లేకపోయావ్ ఉత్తాంగా" నిట్టూర్చి చెప్పాడం ముగించాడు శ్రీకృష్ణుడు.
కొంత మంచి నీటిని ఉత్తాంగుడికి అందించాడు కృష్ణుడు. కానీ సిగ్గుతో పశ్చాత్తాపంతో ఉన్న ఉత్తాంగుడు నీటిని సేవించే స్థితిలో లేడు. "నా తప్పు తెలిసింది స్వామి. అందరిలో అంతటా ఆ పరబ్రహ్మను చూడగలిగే వరకూ నా సాధన కొనసాగిస్తా. నన్నాశిర్వదించండి స్వామి" అని నీటిని సేవించి శెలవు తీసుకొని వెళ్ళిపోయాడు ఉత్తాంగుడు.
Main Story Courtesy : Sri S.A. Krishnan @ hindumythologyforgennext.blogspot.com
ఇప్పుడే చదివా చాలా బాగుంది అందరిలో అంతటా ఆ పరబ్రహ్మను చూడగలిగే తత్వం అలవరచుకోవాలని మనస్పూర్తి గా నమ్ముతున్నా ఇంత మంచి నీతి ని తెలిపే కధ ప్రచురించినందుకు ధన్యవాదములు
ReplyDelete