ఆంజనేయుడిని భవిష్యత్ బ్రహ్మ అని, చిరంజీవి అని, రామ దూత అని ఇలా అనేక పేర్లతో పిలవడం మనం చేస్తూనే ఉంటాం. హనుమంతుడికి "భవిష్యత్ బ్రహ్మ" అన్న పేరు ఎందుకొచ్చిందన్నదానికి కారణంగా మనకీ కింది కధ పరాశర సంహితలో కనిపిస్తుంది
శ్రీరామ పట్ఠాభిషేకానంతరం రాములవారు సుభిక్షంగా రాజ్యమేలుతున్నారు. ఆంజనేయుడు గంధమాధన పర్వతంలోని అరటి ఉద్యానవంలో తన నివాసమేర్పచుకొని ఉంటూ ఉన్నాడు. తను అను నిత్యమూ శ్రీరామదర్శనం చేసి తిరిగి తన చోటుకు వస్తూ ఉండేవాడు. ఒకానొకరోజున రాముడినీ సీతమ్మవారినీ దర్శించుకొని వారి పాదములకు ప్రణమిల్లినప్పుడు. ఆదరముగా శ్రీరాముడు హనుమను ఒక పనికోసం నియోగించాడు. అదేమిటంటే, బ్రహ్మ తనను ప్రార్ధించి తన వేలి ఉంగరాన్ని తీసుకొనివెళ్ళాడని, ఆ అంగుళీయకము సీతమ్మవారికి చాలా ఇష్టమైనదనీ దాన్ని హనుమ బ్రహ్మలోకానికి వెళ్ళి తీసుకు రావల్సింది అని చెప్పాడు. ఎంతో కాలానికి స్వామివారు తనని ఒక పనికోసం నియోగించడం ఆంజనేయుడికి అమితానానందాన్ని కలిగించింది. హనుమ వెంఠనే ఆకాశానికేసి ఎగిరి బ్రహ్మలోకానికి ప్రయాణించసాగాడు. హనుమ బ్రహ్మలోకానికిచేరిన వెంఠనే బ్రహ్మ ఆంజనేయుడిని సాదరంగా ఆహ్వానించి అతిధిఅభ్యాగతులు చేసి సత్కరించాడు. మాటలలో తన రాకకు కారణం చెప్పాడు హనుమంతుడు. అది విని బ్రహ్మ విచారించి శ్రీరాముడి ఉంగరం తనకు చాలా ప్రీతికరమైనదనీ, దాన్ని సక్షాత్ శ్రీరామచందృడికి ప్రతినిధిగా తాను భావించి పూజిస్తుంటాననీ, బ్రహ్మలోకం మొత్తం ఆ అంగుళీయకాన్ని ప్రతిరోజూ పూజిస్తుంటుందనీ అలాంటి విలువైన ఉంగరాన్ని తను హనుమకిచ్చి తిరిగి పంపలేనని చెప్పాడు. ఎన్నో విధాల ఒప్పించప్రయత్నించీ, విసిగీ ఆంజనేయుడు కోపంతో రగిలిపోయాడు. వెంఠనే ఓ ప్రశాంత ప్రదేశంలో కూర్చొని బ్రహ్మ ఉంగరాన్నివ్వకపోతే ఇంద్రాది దేవతలతో సహా సమస్త బ్రహ్మలోకాన్నీ నాశనం చేస్తానని భీష్మించుకొని తన ధ్యానం తీవ్రతరం చేసాడు. అలా హనుమ రామనామాన్ని ధ్యానిస్తున్నంతనే బ్రహ్మలోకం మొత్తం కంపించిపోయి దద్దరిల్లసాగింది. ఆసమయంలో ఆంజనేయుడు మహోగ్రరూపంతో ఇరవై చేతులతో వాటిలో ఈరవై ఆయుధాలను ధరించి,ఎర్రని కళ్ళతో భయంకరమైన ముఖంతో, కొరలతో ఉన్న నోటిని తెరచి వికటంగా అట్టహాసం చేసాడు. ఆ ధ్వనికి బ్రహ్మలోకం అతలాకుతలమైపోయింది
జరుగుతున్న విపత్కర పరిస్థితిని చూసిన బ్రహ్మకుమారుడైన సనత్కుమారుడు బ్రహ్మను సమీపించి శ్రీరామముద్రికను తిరిగి హనుమకిచ్చి పంపించడమే పరిష్కారంగా సూచించాడు. బ్రహ్మ అందరి సూచననూ విని ఆనజనేయుడిని శాంతించమని అనేకవిధాల స్థుతించాడు. శాంతించిన హనుమకి శ్రీరామ ఉంగరం పక్కనే ఉన్న అమృత సరస్సులో ఉందని వెళ్ళి తీసుకొమ్మన్నాడు. అందుకు హనుమ ఎంతో ఆనందంతో ఆ సరస్సులోకి దిగాడు. ఆశ్చర్యంగా హనుమకి ఒక్క రామ ఉంగరం కాక అనేకానేక రామముద్రికలు కనిపించాయి. అది చూసిన వెంఠనే ఓ భక్తిపూర్వక ఆనంద తన్మయత్వం కలిగింది. అదే భావనతో ఆ అమృతసరస్సులోంచీ బయటికొచ్చి బ్రహ్మకు ప్రణమిల్లి తిరిగి రాములవారి దగ్గరకి ప్రయాణమయ్యాడు.
దీనంగా రాముడికి తన అశక్తతని తెలియజేసాడు హనుమ. జరిగినదంతా పూసగుచ్చినట్టు చెప్పి ఆ అనేకానేక ఉంగరాల్లో తను ఏది రామ ముద్రికో తేల్చుకోలేక రిక్త హస్తాలతోనే వెనుదిరిగి వచ్చాడని చెప్పాడు. రాముడు చిరునవ్వి నవ్వి, అక్కడున్నవన్నీ తన ఉంగరాలేననీ ప్రతి యుగంలోనూ బ్రహ్మ తన దగ్గరకు వచ్చి తనను ప్రార్ధించీ తన ఉంగరాన్ని స్వీకరించి ఆ అమృత సరోవరంలో దాచిపెడతాడని చెప్పాడు. స్వామికార్యానికిగానూ ఇంతలా ప్రయత్నించిన హనుమని మెచ్చుకొంటూ "చిరంజీవ చిరంజీవ" నువ్వు భవిష్యత్ బ్రహ్మవై చిరంజీవిగా వర్ధిల్లమని ఆశీర్వదించాడు. ఆనాటి నుంచీ ఆంజనేయుడు చిరంజీవిగా భవిష్యత్ బ్రహ్మగా ప్రఖ్యాతినొందాడు.
No comments:
Post a Comment