ఒక భక్తుడు కంచి మఠంలోనికి ప్రవేశిస్తూ, తూలుతూ తడబడతూ క్రింద పడిపోబోయాడు. అతని అవస్థ చూసి అక్కడ ఉన్న వారు పట్టుకున్నారు. అయినా అతను నోట్లో నుండి రక్తం కక్కుకున్నాడు. అక్కడున్నవారు భయపడిపోయారు. అక్కడ రేగిన కలకలం పరమాచార్య స్వామి వారి చెవులను చేరింది.
వారు ఒక పరిచారికుని వంక చూసి “ఎందుకు అంత అలజడి అక్కడ?” అని అడిగారు.
మఠం మేనేజరు మహాస్వామి వారితో “ఎవరో భక్తుడు రక్తం కక్కుకున్నాడు” అని చెప్పాడు.
మహాస్వామి వారు మేనేజరుతో “అతనిదేవూరు? ఇప్పుడు ఎక్కడినుండి వస్తున్నాడు” కనుక్కోమన్నారు.
ఆ భక్తుడు తిరుచ్చి దగ్గర్లోని ఒక పల్లెటూరినుండి వచ్చాడు. చిదంబరంలోని నటరాజ స్వామి వారిని దర్శించుకుని కాంచీపురానికి వచ్చాడు. మహాస్వామి వారు ఆ పెద్దమనిషిని దగ్గర్లోని డాక్టరు దగ్గరకు తీసుకువెళ్ళమని చెప్పారు. రక్తం కక్కున్నాడు అని విన్న వెంటనే డాక్టరుగారు హెమొరేజ్ (రక్తస్రావం) వాల్ల ఇలా జరిగి ఉండొచ్చు అనుకున్నారు. హాస్పిటల్ లో చేర్పించమని సలహా ఇచ్చారు.
ఈ విషయాన్ని మహాస్వామి వారికి చేరవేసారు.
”ఇది హెమొరేజ్ కాదు. మీ నాన్నమ్మను అడిగితే అది వేడి చేయడం వల్ల అలా జరిగింది అని చెబుతారు. ఇంకొందరు దృష్టిదోషం వల్ల అలా జరిగింది అని చెబుతారు. నాకు తెలిసి ఈ పెద్దమనిషి వారి ఇంటి దైవం తిరువాచూర్ మదుర కాళి అమ్మన్. ఇప్పుడు వీరికి కాని వీళ్ల ఇంట్లో వాళ్ళకి ఇంటి దైవం విషయం గుర్తులేదు. కాని ఇప్పుడు వీరు అమ్మవారిని భక్తితో కొలవడం లేదు. కంచి కాళికాదేవికి పూజ చేసి ఇతనికి ప్రసాదం ఇవ్వండి. ఇతను చిదబరంలోని థిల్లై కాళి అమ్మవారిని దర్శించుకోకుండా ఇక్కడికి వచ్చాడు. అది తప్పు కదా? అంతే కాకుండా కాళి దేవి వారి ఇంటి ఆరాధ్యదైవం. మరి అటువంటప్పుడు కాళి దేవిని భక్తితో కొలవాలి కదా? సరే”
“అతనికి ఆరోగ్యం బాగుపడిన వెంటనే చిదంబరం వెళ్ళి థిల్లై కాళి అమ్మవారిని దర్శించుకోవాలి. వైద్యులు చెప్పినట్టు ఇతను అధిక రక్త పోటుతో బాధపడుతున్నాడు. అందుకే రక్తం కక్కున్నాడు. కావున అతని తిండిలో సాధ్యమైనంతవరకు ఉప్పు తగ్గించాలి.” ఇలా మహాస్వామి వారు చాలా సూచనలు చేసారు.
కాంచీపురం కాళి అమ్మవారి దేవస్థానం నుండి కుంకుమ తెచ్చి ఆ పెద్దమనిషి నుదుటిపైన రాసారు. అతన్ని శ్రీమఠం లోని హాల్లో పడుకోబెట్టారు. పరమాచార్య స్వామి వారు చెప్పినట్టు తరచుగా అతనికి చల్లటి నీటిని కొంచం కొంచం తాగడానికి ఇచ్చారు. రాత్రి అతను హాయిగా నిద్రపోయాడు. మరుసటి ఉదయం అతను మామూలుగా సంభాషించాడు. రాత్రి విశ్రాంతి వల్ల అతను కొంచం ఉత్సాహంగా కనపడ్డాడు. ఆయన మహాస్వామి వారి వద్ద ప్రసాదం తీసుకుని మేనేజరు గారికి ధన్యవాదాలు తెలిపి వెళ్ళిపోయాడు.
ఇంటికి వెళ్ళిన తరువాత తనకు ఎటువంటి ఆరోగ్య సమస్య లేదని అతను మేనేజరు గారికి ఉత్తరం రాసాడు. ఇంకా
“నేను ఇక ఎప్పుడూ మా ఇంటి దైవాన్ని మరచిపోను. కాని నాకు ఈనాటికి అర్థం కాని విషయం ఏంటంటే మహాస్వామి వారికి ఎలా తెలుసు నేను చిదంబరంలో థిల్లై కాళి అమ్మవారిని దర్శించుకోలేదని?” అది మనకి కూడా అంతుచిక్కని విషయం.
మన ఇంటి దైవం తరతరాలుగా మన చేత పూజింపబడుతూ మనల్ని రక్షిస్తున్న దైవం. కొత్త కొత్త దేవుళ్ళ మోజులో పడి ఇంటి దైవాన్ని ఎన్నటికి మరువరాదు. తల్లితండ్రులు కూడబెట్టిన ఆస్తులు కావాలి. కాని వారు అర్చించిన దైవం మాత్రం వద్దా?
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.
https://t.me/paramacharyavaibhavam
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
No comments:
Post a Comment