Saturday, September 8, 2018

పరమాచార్య స్వామి – ఉప్పు వ్యాపారి



అనుకోకుండా నాకు ఒక పెద్ద దుఃఖం, భరింపరాని శోకం కలిగింది. నాలుగు నెలల దాకా మహాస్వామి వారిని దర్శించుకోవడానికి కూడా వెళ్ళలేదు. మహాస్వామి వారు నాకోసం కబురు పంపారు. ఇద్దరు లేదా ముగ్గురు పెద్ద అధికారులు వచ్చి నన్ను వారి వద్దకు తీసుకుని వెళ్ళారు.

అప్పుడు రాత్రి పది గంటలు. . . . కటిక చీకటి. . . . కేవలం ఒక మట్టి ప్రమిద మాత్రమే వెలుగుతోంది.

”...నిపుణౌ”, మహాస్వామి వారు మెల్లిగా చెప్పారు, “చెప్పు”.

”తవ హి చరణావేవ నిపుణౌ . . . సౌందర్యలహరి లోని నాలుగవ శ్లోకం
త్వదన్యః పాణిభ్యాం. . . ”

పరమాచార్య స్వామి వారు చిన్నగా అన్నారు, “అందరికీ ఆ అమ్మే ఆశ్రయం. ఎవరెవరికి ఏమి ఎప్పుడు ఎలా ఇవ్వాలో ఆమెకి తెలుసు.”

అంతా నిశ్శబ్ధం.... ”సాంబమూర్తి నీకు సంత అంటే ఏంటో తెలుసా?”

“తెలుసు పెరియావ. చాలామంది వర్తకులు సరుకులు తెచ్చి అమ్ముతూ ఉంటారు. వారంలో ఒక రోజు ప్రతి గ్రామంలో సంత జరుగుతుంది. వారు ఈరోజు ఇక్కడ రేపు అక్కడ అని ప్రయాణిస్తూంటారు.”

“నీవు ఉప్పు వ్యాపారి గురించి ఎప్పుడైనా విన్నావా?”

“అవును. వారు సంతలో ఉప్పు అమ్ముకుని జీవిస్తూ ఉంటారు. వారికి అదే జీవనాధారం.”

“అవును. అటువంటి ఒక ఉప్పు వ్యాపారి కామాక్షి అమ్మకి పరమ భక్తుడు. ఒకసారి అతను ఒక ఊరిలో సంత ముగించుకుని మరొక ఊరికి వెళ్తుండగా మార్గమధ్యంలో ఒక అడవి గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమంది దొంగలు ఇతన్ని చూసారు. గాడిద పైన ఉప్పు మూటలు తీసుకువెళ్తున్న అతన్ని చూసి “రేయ్ రేపు సంతలో ఇతను ఈ ఉప్పునంతా అమ్మి డబ్బులతో మళ్ళా ఇదే మార్గంలో వెళ్తాడు. అప్పుడు మనం ఇతని ధనాన్ని దొంగిలించాలి.” వారు ఒక పథకం వేసారు. ఇంకా, వాళ్ళు పేల్చే మందుగుండు సామాగ్రి గురించి నీకు తెలుసా?”

“దేవాలయాలలో ఉత్సవాల సమయంలో పేలుడు పదార్థాలతో మందుగుండు సామాగ్రి తయారుచేస్తారు. గొట్టాలలో గట్టిగా కుక్కి ఒక వత్తి పెడతారు. ఆ వత్తి చివరకు అగ్ని తగిలితే అది చిన్నగా వెళ్ళి మందుగుండును తాకి పెద్దగా శబ్దము చేస్తూ పేలుతుంది.”

“అవును. ఆ దొంగల పథకము కూడా అదే. ఒక మందుగుండు పేలిస్తే ఆ గాడిద కంగారులో అటు ఇటు పరిగెడుతుంది. ఆ ఉప్పు వ్యాపారి భయతో అరుస్తూ గగ్గోలు పెడతాడు. అప్పుడు అతని దట్టీ నుండి డబ్బు తస్కరించవచ్చు.”

“ఆ రోజు సంతలో ఉప్పు వ్యాపారి తన దగ్గర ఉన్న ఉప్పును అమ్మడానికి కుప్పలుగా పోసాడు. కాని ఆరోజు బాగా వర్శం పడి ఉప్పు మొత్తం కరిగిపోయింది. అతనికి ఆరోజు వ్యాపారం లో నష్టము మనస్సుకు కష్టము కలిగింది. బుద్దికి తోచినట్టుగా మనస్సుకు వచ్చినట్టుగా కామాక్షిని తిట్టడం మొదలుపెట్టాడు. అతని కోపం ఏంటంటే డబ్బులేకుండా ఇంటికి వెళ్ళాలి అని. ఇంటికి వెనుతిరిగి నడక మొదలుపెట్టాడు. అడవి మార్గంలోకి ప్రవేశించగానే దొంగలు అతన్ని చూసి మందుగుండు పేల్చడానికి సిద్ధపడ్డారు. వత్తి గుండా మంట లోపలికి వెళ్ళి మందుగుండు సామాగ్రిని చేరింది కాని పేలలేదు. వారు దానికి కారణం వెతకగా ఆ మందుగుండు బాగా తడిసిపోయింది పొద్దున్న పడిన వర్షానికి. వాళ్ళు ఉప్పు వ్యాపారితో ఇలా అన్నారు. “దేవుడు నిన్ను కాపాడాడు. నీకోసమే ఈరోజు వర్షం పడినట్టుంది. పో ఇంటికి పోయి దేవున్ని ప్రార్థించు”

ఆ ఉప్పు వ్యాపారి నిశ్చేష్టుడయ్యాడు. “అమ్మ నాకు ద్రోహం చేసింది అనుకున్నాను. కాని అది తప్పు. ఆమె నన్ను కాపాడింది. అమ్మా కామాక్షి నన్ను క్షమించు. నాకు ఎప్పుడు ఎక్కడ ఏమి ఇవ్వాలో నీకు బాగా తెలుసు. నా అజ్ఞానాన్ని మన్నించు తల్లీ. వర్షం రాకపోయి ఉంటే నేను ఉప్పు మొత్తం అమ్మి డబ్బుతో వస్తుండేవాడిని. డబ్బు తీసుకోవడంతో పాటు ఈ దొంగలు నన్ను కొట్టేవారు. నన్ను కాపాడినందుకు నీకు కృతజ్ఞతలు.“

కావున మనకి ఏమి లభించినా అది అమ్మ అనుగ్రహమే. మిగిలినది దేనికోసమూ ఆశించకుండా పరులకు మంచి చెయ్యడమే.

మహాస్వామి వారు చిన్న గొంతుకతో, తీరికగా చెప్పిన ఈ దీర్ఘ ఉపన్యాసం ముగిసే నాటికి రాత్రి 2:30 అయ్యింది.

అప్పుడు నేను “నా తల పైన ఉన్న వెయ్యి టన్నుల బరువు తీసేసినట్టు అయ్యింది” అని అన్నాను.

పరమాచార్య స్వామి వారు సంతతో మొదలుపెట్టి కామాక్షి అమ్మతో ముగించారు. అది నా మనస్థితి కోసం చెప్పబడినా ఇది అందరికీ వర్తిస్తుంది. ఎందుకంటే అందరూ ఇటువంటి స్థితిలో ఉన్నవారమే కదా!

తరువాత మహాస్వామి వారు ”క్రమం తప్పకుండా ప్రతిరోజూ రామాయణం చదువు. నీ మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది.” అని అన్నారు

ఈనాటికి నాకు రామాయణ పారాయణ - మనస్సుకు ప్రశాంతత ఒకేసారి వస్తుంది.

--- బ్రహ్మశ్రీ రామకృష్ణ దీక్షితర్, శ్రీమఠం విద్వాన్. మహాపెరియావళ్ దరిశన అనుభవంగళ్-1

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

No comments:

Post a Comment