మహా పెరియవర్ సాక్షాత్ పరమాత్మ స్వరూపులు, శివావతారులు. ఈ శతాబ్ధపు ఆది శంకరాచార్యులు. అప్పుడు స్వామి వారు కుంబకోణంలోని కంచి మఠంలో మకాం చేస్తున్నారు. వ్యాస పూర్ణిమ చాలా ఘనంగా జరిగింది. చంద్రమౌళీశ్వర పూజ పూర్తి అయిన తరువాత భక్తులందరూ పరమాచార్య స్వామి స్వహస్తాలతో ఇచ్చే అభిషేక తీర్థం కోసం ఆత్రుతగా వచ్చారు. వరుసగా నిలబడి వస్తున్న వాళ్ళలో ఒక భక్తుణ్ణి మహాస్వామి వారు తలెత్తి చూసారు.
వారు అతనితో, ”రేపు తెల్లవారుఝామున జరిగే వేదపారాయణానికి రా” అని అన్నారు. మహాస్వామి వారి ఆజ్ఞకి తిరుగేముంది?
స్వామి వారి ఆదేశం మేరకు మరుసటిరోజు ఉదయాన్నే వచ్చి, వేదపారాయణంలో పాల్గొన్నాడు. పారాయణం జరుగుతూ ఉండగా ఆశ్చర్యకరంగా మహాస్వామి వారు వచ్చారు. వారు చాలా అరుదుగా వస్తారు.
నిన్న తాము రమ్మన్న భక్తుడు చాలా శ్రద్ధగా భక్తితో వేదాలను ఆమ్నాయం చెయ్యడం గమనించారు. వేదపారాయణం తరువాత అందరికి తీర్థప్రసాదాలు ఇచ్చు సమయంలో అతన్ని పిలిచి కొద్దిసేపు వేచియుండమన్నారు.
ఆ భక్తుడు భయంతో మనసులో నేను వేదమంత్రాలు సరిగ్గా ఉచ్ఛరింలేదేమో అందుకే మహాస్వామి వారు ఉండమన్నారు అని అనుకున్నాడు. కొద్దిసేపటి తరువాత, మహాస్వామి వారు ఆజ్ఞాపించారు అని ఒక వైద్యుడు వచ్చి, అతన్ని పూర్తిగా పరీక్ష చేసారు. తరువాత అతని వైద్యశాలకు తీసుకుని వెళ్ళీ ఇంకొన్ని పరీక్షలు చేసిన తరువాత ఆ భక్తుడికి హృదయ సంబధమైన జబ్బు ఉందని తెలుసుకున్నారు.
పరమాచార్య స్వామి వారి ఆదేశానుసారం ఆ వైద్యుడు, ఏ శస్తచికిత్స అవసరం లేకుండానే ఆ భక్తుని జబ్బు నివారించాడు.
పది రోజుల తరువాత ఆ భక్తుడు మహాస్వామి వారి దర్శనానికి వచ్చాడు. అతని మనస్సులో ఉన్న ప్రశ్నలకు సమాధానంగా మహాస్వామి వారు అతనితో,
“నువ్వు వేదం చాలా శ్రద్ధతో పఠిస్తున్నావు కాని, మంత్రాలను ఉచ్ఛరిస్తున్నప్పుడు నీకుగల శ్వాస సంబంధమైన రుగ్మత చేత, చాలా ఇబ్బందిగా పలకడం వల్ల అక్కడక్కడ స్వరం తప్పుతున్నది. నేను దాన్ని గుర్తించి బహుశా నీకు ఊపిరితిత్తులు లేక గొంతు సమస్య ఏదో ఉన్నదని గ్రహించి వైద్యుణ్ణి రప్పించాను” అని అన్నారు.
తరువాత “కొద్దిసేపు వేదం పారాయణం చెయ్యి” అని ఆజ్ఞాపించారు.
అతను స్వరం తప్పకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా వేదం చెప్పాడు. మహాస్వామి వారు చాలా సంతోషించి అతణ్ణి ఆశీర్వదించారు.అలా ఆ భక్తుడికి ముందు జరగబోయే ఉపద్రవాన్ని మహాస్వామి వారు తప్పించారు.
ఎప్పుడైతే మనం భక్తితో పరమాత్ముణ్ణి ప్రార్థించి, సేవిస్తామో మనకు రాబోయే బాధలు కష్టాలు మన దరిచేరకనే కరిగిపోతాయి.
--- రా. వెంకటసామి, శక్తి వికటన్ ప్రచురణ
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
No comments:
Post a Comment