ఉత్తర చిదంబరంగా పేరుగాంచిన సతారాలోని నటరాజ స్వామి దేవాలయం స్వామివారి ఆదేశం ప్రకారం నిర్మించబడింది. ఆలయం పూర్తవడానికి ముందే, శ్రీ జగదీశ భట్ గారిని దేవాలయ వ్యవహారాలు చూసుకోవల్సిందిగా ఆజ్ఞాపించారు.
పరమాచార్య స్వామివారి ఆదేశానుసారం శ్రీ జగదీశ భట్ కూడా సతారా వెళ్లి, అత్యంత భక్తి శ్రద్ధలతో ఆలయ వ్యవహారాలు చూసుకుంటూ ఉండేవారు. కాని అతను అక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇక వాటిని తట్టుకోలేక కంచీపురానికి తిరిగొచ్చాడు. పరమాచార్య స్వామివారు విచారించగా తనకు కల్గిన ఇబ్బందులను ఏకరువుపెట్టాడు.
కాని కరుణామూర్తులైన స్వామివారు అతని ఇబ్బందులను విని, పరిపూర్ణమైన ఆశీస్సులను అందించి, సతారాకు తిరిగివెళ్ళమని ఆదేశించారు. జగదీశ భట్ తో మాట్లాడుతూ, “శ్రీ ఏకాంబరేశ్వర దేవాలయంలో తలక్రిందులుగా వేలాడుతున్న గబ్బిలాలను చూశావా?” అని అడిగారు. గబ్బిలాలకు నోరు, మలమూత్ర ద్వారములు రెండూ ఒక్కటే అని చెప్పారు. తినడానికి, విసర్జించడానికి కూడా ఒక్కటే వాడుతాయి. ఎవరైనా దేవాలయ నిధులు, ధనము తస్కరించడానికి ప్రయత్నిస్తే, మరుసటి జన్మలో గబ్బిలంగా జన్మిస్తాడు అని శాస్త్రవచనం. స్వామివారు ఇదంతా చెప్పగానే, దేవాలయ ద్రవ్య విషయంలో అతను మరింత శ్రద్ధ కనబరుస్తూ, ఇది తనకు హెచ్చరికగా భావించాడు.
స్వామివారే స్వయంగా అతణ్ణి ఉత్సాహపరచడంతో కొత్త శక్తి వచ్చినట్లై దేవాలయాన్ని చూసుకునే బాధ్యతను తీసుకుని, చాలా సంవత్సరాల పాటు తన కర్తవ్యాన్ని నిర్వహించారు. కాని, ఎదో కారణాల వల్ల మొత్తం దేవాలి బాధ్యత, అర్చక బాధ్యత మొత్తం జగదీశ భట్ గారి పైనే పడ్డాయి. చివరకు మొత్తం వ్యవహారాలు చూసుకోవడం తలకు మించిన భారం అయిపొయింది. అటువంటి సమయంలో పరమాచార్య స్వామివారు తనకు ఇలా ఇబ్బంది కలగాజేస్తున్నారని చాలా నిరాశకు గురయ్యాడు.
ఆరాత్రి జగదీశ భట్ కు నిద్రపట్టడం లేదు. తెల్లవారుఝామున పరమాచార్య స్వామివారు కనపడ్డారు. వారు రెండుచేతులను పైకెత్తి సంపూర్ణ ఆశీస్సులను అందిస్తున్నట్టుగా కల వచ్చింది. “నువ్వు ఏమి భయపడకు. అంతా నేను చూసుకుంటాను” అని పరమాచార్య స్వామివారు ధైర్యం ఇచ్చినట్టుగా అనిపించింది. కనుల నీరు కారుతుండగా వెంటనే నిద్రనుండి మేల్కొన్నారు.
అది కేవలం కల లాగా అనిపించడం లేదు. స్వయంగా పరమాచార్య స్వామివారే వచ్చి ఆశీర్వాదించినట్టుగా ఉంది. ఆరోజు తనకి నూతనోత్సాహం కలిగింది. అన్ని పనులనూ ఎంతో ఉత్సాహంగా చేసుకున్నారు. ఒత్తిడి అసలు లేదు. ఇదంతా కేవలం పరమాచార్య ఆశీస్సులవల్లే అని అతనికి తెలుసు.
మరుసటిరోజు మరొక్క ఆశ్చర్యం జరిగింది. ఒక యువకుడు దేవాలయానికి వచ్చి అతని ముందు నిలబడ్డాడు. ఇంతకుముందు అతను భట్ కు సహాయకునిగా ఉండేవాడు. కాని ఏవో కారణాల వల్ల వెళ్ళిపోయాడు. ఎన్నో చోట్ల ప్రయత్నించి, చివరకు ఇక్కడే తనకు అనుగుణంగా ఉందని తిరిగొచ్చాడు. ఇక ఎప్పటికి ఈ దేవాలయాన్ని విడవకూదడనే దృఢ నిశ్చయంతో వచ్చాడు. అది కూడా మహాస్వామివారి కరుణయే అని జగదీశ భట్ గారికి అవగతమైంది.
బ్రహ్మజ్ఞానుల ఆశీస్సులు వారు భౌతికంగా మనవద్ద లేకపోయినా అవి తప్పాక జరిగి తీరుతాయని జగదీశ భట్ గారి జీవితంలో జరిగిన ఈ సంఘటన వల్ల అర్థమవుతుంది.
--- “శ్రీ పెరియవ మహిమై” పత్రిక నుండి
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
No comments:
Post a Comment