Friday, April 24, 2020

ముందు పద్మావతీ కల్యాణం చెయ్యి

Chandrashekarendra Saraswati | MOA

కంచి పరమాచార్య స్వామివారిలో ఉన్న ఒక యోగి లక్షణాలను, అనన్యసామాన్యమైన నిరాడంబరతను కలిపి చూడడం మా అదృష్టం. వారి అవతార రహస్యాన్ని తెలుసుకున్న ఎందఱో భక్తులను స్వామివారు అనుగ్రహించారు.

ఆ ప్రత్యక్ష దైవాన్ని ప్రత్యక్షంగా సేవించి తరించే భాగ్యం పొందినవారిలో శ్రీమఠం బాలు ఒకరు. ప్రతిరోజూ వారి అవతారాన్ని తెలిపే అన్నో సంఘటనలను ప్రత్యక్షంగా చూశాడు. ఈ సంఘటను కూడా అతను చెప్పిన అనుభవాల్లో ఒకటి.
మరవక్కాడు రామస్వామి అనే భక్తునికి నలుగురు కూతుళ్ళు, ఇద్దరు కుమారులు. యుక్తవయస్సులో అతను ఏ విషయంలోనూ ఆసక్తి చూపకుండా, ఊరికే అక్కడా ఇక్కడా తిరుగుతుండడంతో, నెలవారీ ఆదాయం అంటూ ఏమి లేదు. వైదిక కర్మలలో పండితులకు సహాయం చెయ్యడంవల్ల లభించే కొద్ది మొత్తమే అతని కుటుంబానికి ఆసరా.

అతను నివసిస్తున్న గృహం తాతలనాటిది కావడంతో ఇంటికి అద్దె కట్టాల్సిన అవసరం లేదు. గ్రామ శివార్లలో అతనికి ఒక కొబ్బరితోట ఉంది. దాని నుండి వచ్చే ఆదాయమే వారికి తిండి పెడుతోంది.

పెద్దమ్మాయికి ఇరవైరెండేళ్ళు. తరువాతి అమ్మాయికి ఇరవైయ్యేళ్ళు. ఇద్దరి పెళ్ళిళ్ళు ఒకే ముహూర్తంలో జరిపించేస్తే ఖర్చు కొద్దివరకు తగ్గుతుందని అతని ఆలోచన. కాని జరుగుతున్న సంఘటనలు దానికి ఊతమియ్యడంలేదు. పెద్దమ్మాయికి మంచి సంబంధం కుదరడంతో, త్వరగా పెళ్లిచేయ్యాలనే అతను ఇష్టపడడంతో, కొబ్బరితోట అమ్మడానికి నిశ్చయించుకుని ఒకరి వద్ద ధర కూడా నిర్ణయించేశాడు.

కాని అతను చేస్తున్న ఈ పని అన్నగారికి నచ్చలేదు. ఆ కొబ్బరితోట తరతరాలుగా వస్తున్నది కావడంతో, అందులో ఇతనికి భాగం ఉన్నది కాబట్టి, కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ తెచ్చుకున్నాడు. రామస్వామి అయ్యర్ కు ఏమీ పాలుపోలేదు. అసలే ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాడు. ఎలాగో కుమార్తె పెళ్లి జరిపించాలి అనుకున్నాడు. కాని అతని అన్న కొబ్బరితోట అమ్మకానికి అడ్డుపడ్డాడు. రామస్వామి చాలా చాలా బాధలో ఉన్నాడు.

ఇక తను చేసేదేంలేక కరుణా సముద్రుడైన పరమాచార్య స్వామివద్దకు పరిగెత్తుకుని వచ్చాడు. స్వామివారికి సాష్టాంగం చేసి నిల్చుని, గద్గదమైన స్వరంతో, కళ్ళ నీరు కారుతుండగా మొత్తం విషయం అంతా స్వామివారికి విన్నవించాడు. పరమాచార్య స్వామివారు అయిదు నిముషాల పాటు అతనివైపు చూసి, ఏమీ చెప్పకుండా ప్రసాదం ఇచ్చి పంపేశారు.

పెద్ద దుఃఖభారంతో వచ్చిన ఆ భక్తుడు నిరాశాపడ్డాడు. పరమాచార్య స్వామివారు కనీసం చిన్న మాట సాయంగా బాధపడకు అని కూడా చెప్పకుండా పంపించివేశారు అన్న బాధతో బయటకు వచ్చాడు. అతను బయటకు రాగానే, మహాస్వామివారిని సేవించుకునే అదృష్టం కల్గిన బాలు కనపడ్డాడు. దుఃఖం తన్నుకురావడంతో తన బాధను బాలుకు చెప్పుకున్నాడు. “పరమాచార్య స్వామివారు తలచుకుంటే ఏమైనా చెయ్యగలరు. మా అన్నకు అన్నీ ఉన్నాయి; పెద్ద ఇల్లు, ఆస్తి, ఐశ్వర్యం; ఎప్పుడూ యాత్రలలో ఉంటాడు; నేను ఎప్పుడూ ప్రత్యక్షంగా కలవలేను; నా వల్ల చెయ్యడం కాకపోయినా ఎపుడూ మా న్నాన్నగారి ఆబ్దికానికి కూడా పిలవడు; ఎంతో కష్టపడి నా కుమార్తె పెళ్లి చేద్దామనుకుంటే, ఇలా చేశాడు”

మొత్తం విన్న తరువాత “ఇదంతా ఎందుకు స్వామివారితో చెప్పలేదు?” అని అడిగాడు బాలు. “నేను మొత్తం చెప్పాను, పరమాచార్య స్వామివారు సాంతం విన్నారు. కేవలం విభూతి ప్రసాదం ఇచ్చారు కాని ఏ ‘అనుగ్రహం’ ఇవ్వలేదు” అని బదులిచ్చాడు రామస్వామి.

ఎంతో బాధతో తన గోడు చెప్పుకున్న రామస్వామిని చూసి, పెరియవా ఇలా చెయ్యకుండా ఉండాల్సింది అనుకున్నాడు బాలు. అందరిపై కరుణను ప్రసరించే మహాస్వామి, రామస్వామిని ఇలా వదిలేయరాడు కదా! అందునా పేదవాడైన రామస్వామిపై స్వామివారి కరుణ దయ అపారమైనవి కదా! అని అనుకున్నాడు.

“ఏమి బాధపడవద్దు. నీ సమస్యను స్వామివారికి వదిలి ఏం జరగాలో అది చూడు. ఎలాగో స్వామివారే నిన్ను కాపాడుతారులే” అని అతణ్ణి స్వాంతనపరచి పంపాడు బాలు.

కొన్ని రోజులు గడిచిపోయాయి. ‘ఉపన్యాస చక్రవర్తి’ శ్రీ మార్గబంధు శాస్త్రి పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చారు. అతని ఐశ్వర్యము, యశస్సు అతను ధరించిన తెల్లని పట్టుపంచె, జరి అంచు ఉన్న అంగవస్త్రం, బంగారుతో అల్లిన రుద్రాక్షమాల, నవరత్నాల హారంలో కనపడుతోంది. మహాస్వామివారు గంటల తరబడి వివిధ అంశాలపై వారితో మాట్లాడేవారు. వారు ఎప్పుడు వచ్చినా సాయింత్రాలు ఉపన్యాసం చెప్పమని స్వామివారు అడిగేవారు.

కాని ఈసారి ఎందుకనో ఎప్పటిలాగా లేదు. భార్యతో, ఇద్దరు శిష్యులతో కలిసి, చేతిలో ఉన్న పళ్ళెం నిండా పళ్ళతో వచ్చి నిల్చున్న ఆయన్ని పట్టించుకోకుండా స్వామివారు ఇతరులతో సంభాషిస్తున్నారు. “ఎందుకు ఇవ్వాళ ఇలా జరుగుతోంది. దేశంలోనే ప్రఖ్యాతిచెందిన ఉపన్యాస చక్రవర్తి వేచియున్నాడు; సరే స్వామివారికి చెబుదాం” అనుకుని, గట్టిగా స్వామివారికి వినపడేటట్లు, “మార్గబంధు శాస్త్రి వచ్చారు” అని చెప్పాడు.

స్వామివారి చూపు ఇటువైపు పడ్డట్టుగా అన్పించడంతో, అటువంటి అవకాశం కోసం ఎదురుచూస్తున్న మార్గబంధు శాస్త్రి పళ్ళ తట్టను స్వామివారికి సమర్పించి, “చాలాకాలం తరువాత ఏడెనిమిది రోజులదాకా నాకు ఎటువంటి కార్యక్రమాలు లేవు. అందుకేనే తిరుమలకు వెళ్తున్నాను. ‘శ్రీనివాస కల్యాణం’ చేయించా

లని నా భార్య కోరిక. అందుకనే వెంటనే బయలుదేరాము. పరమాచార్యుల వారి అనుగ్రహంతో మేము ‘శ్రీనివాస కల్యాణం’ చేయించాలని అనుకుంటున్నాము” అని చెప్పాడు.

పరమాచార్య స్వామివారు అతనివైపు చూడనుకూడా లేదు. కనీసం అతని మాటలు కూడా వినలేదు. చుట్టూ ఉన్నవారితో ఎంతో ఉత్సాహంగా మాట్లాడుతున్నారు, కాని దాదాపు అరగంటపాటు మార్గబంధు శాస్త్రితో మాట్లాడలేదు.

స్వామివారికి గుర్తుచేయాలని “శాస్త్రి అక్కడ నిలబడి ఉన్నారు” అని మరలా చెప్పాడు బాలు.

‘పరమాచార్య స్వామివారు నన్ను ఆశీర్వదించి, తిరుమలకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాళ నన్ను ఇలా నిర్లక్ష్యం చేస్తున్నారని’ తలచి, “అవును. పెరియవా నన్ను అనుగ్రహించాలి. ‘శ్రీనివాస కల్యాణం’ చేయించడానికి ఈరోజే తిరుమలకు వెళ్తున్నాను” అని అర్థించాడు.

వెంటనే మహాస్వామివారు లేచి, “ముందు పద్మావతీ  కల్యాణం చెయ్యి” అని చెప్పి లోపలకు వెళ్ళిపోయారు. దీనంతటినీ గమనిస్తున్న అక్కడున్నవారికి ఇది విపరీతంగా తోచింది.

‘శ్రీనివాస కల్యాణం’ అంటే ‘పద్మావతీ  కళ్యాణమే’ కదా! అంటే “తిరుమలలో శ్రీనివాస కల్యాణం చేయించేవారందరూ తిరుచానూరు వెళ్లి పద్మావతీ కల్యాణం చేయించమనా స్వామి వారి ఆదేశం”

దీనికి అర్థమేంటో మార్గబంధు శాస్త్రికి కూడా అర్థం కాలేదు. “ఎందుకు పరమాచార్య స్వామివారు ఇటువంటి ఆదేశాన్ని ఇచ్చి లోపలకు వెళ్ళిపోయారు” అని ఆలోచిస్తూ నిలబడిపోయాడు. కాని వెంటనే దాని అర్థమేంటో, అంతరార్థమేంటో స్వామివారే స్ఫురింపచేశారు.

మరో రెండు నెలలు గడిచిపోయాయి. పరమ సంతోషం నిండిన మొహంతో రామస్వామి అయ్యర్ పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చాడు. తన కుమార్తె పెళ్లి పత్రికను స్వామివారికి సమర్పించడానికి వచ్చాడు ఈసారి.

“అంతా పరమాచార్య స్వామివారి అనుగ్రమ వల్లనే. నా కుమార్తె పెళ్లి ఖర్చు మొత్తం భరించడానికి మా అన్న ఒప్పుకున్నాడు. కేవలం కన్యాదానం చెయ్యడం మాత్రమే నా బాధ్యత అని మిగినదంతా తను చూసుకుంటానని నాతో చెప్పాడు. కొబ్బరితోట పైన వేసిన కోర్టుకేసు కూడా వెనక్కుతీసుకున్నాడు. నా చిన్న కుమారునికి ఉపనయనం చేసి, తన శిష్యునిగా తీసుకుంటానని చెప్పాడు. మా అన్నయ్య ఇలా మారిపోతాడని నా కలలో కూడా అనుకోలేదు. ఇదంతా పరమాచార్య స్వామివారి అనుగ్రహం వల్లనే సాధ్యమయ్యింది” అని చెప్పుకుంటూపోయాడు. కాని పరమాచార్య స్వామివారు ఎలా అనుగ్రహించారో అతనికి తెలియదు.

మహాస్వామివారు చెయ్యెత్తి ఆశీర్వదించి, ప్రసాదం ఇచ్చి పంపారు. రామాస్వామి అయ్యర్ బయటకు రాగానే, మరలా బాలు తారసపడ్డాడు. “రామస్వామి! ఏంటి నీ చేతిలో? పెళ్లి పత్రికా? నీ కుమార్తెదా? నీవద్ద ఒక్క పైసా కూడా లేదని చెప్పావు కదా?” అని అడిగి, రామస్వామి ఇచ్చిన పత్రిక తీసుకున్నాడు.

ఇది ఇలా ఉంది, “. . . . . సౌభాగ్యవతి పద్మావతి, మరవక్కాడు జగదీశ్వర శాస్త్రి మనవరాలు, నా తమ్ముడు చిరంజీవి రామస్వామి పెద్ద కుమార్తె. . .” చివరన ఇట్లు “మీ భవదీయుడు, మార్గబంధు శాస్త్రి”

బాలు ఆశ్చర్యంతో నోట మాటరాక నిశ్చేష్టుడయ్యాడు.

రెండు నెలల క్రితం పరమాచార్య స్వామివారు మార్గబంధు శాస్త్రికి చెప్పినదానికి అర్థం ఇదా! రామస్వామి అన్న ఈయనే అని స్వామివారికి తెలిసి ఉండవచ్చు. కాని రామస్వామి పెద్ద కుమార్తె పేరు పద్మావతి అని ఎలా తెలుసు?

పరమాచార్య స్వామివారికి అంతా తెలుసు అన్న నిజంలో ప్రత్యేకత ఏమి లేదు. ఆ ప్రత్యక్ష దైవానికి అనుగ్రహించడం తప్ప ఇంకేం తెలుసు. ఇటువంటి అనుగ్రహానికి పాత్రులైన ఆ భక్తులు ఎంతటి యశస్సును పొందుతారో మనం ఊహించగలమా?

కరుణాసముద్రుల కరుణ నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది.

--- “శ్రీ శ్రీ శ్రీ మహాపెరియవా మహిమై” పత్రిక నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/paramacharyavaibhavam

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

No comments:

Post a Comment