Monday, June 16, 2014

మూడు శేర్ల వినాయకుడు



మనం గణపతి యొక్క అనేక రూపాలని పూజిస్తూ ఉంటాం. లక్ష్మీ గణపతి, మహాగణపతి, సిద్ధి బుద్ధి తో ఉన్న గణపతి, బాల గణపతి ఇలా అనేకానేక రూపాలతో ఉన్న గణపతిని మనం పూజిస్తూ ఉంటాం. మధురైలోని మీనాక్షి అమ్మ గుడిలో ఓ వినాయకుడి సన్నిధి ఉంది. ఆయన్ని అక్కడవారు అరవంలో "ముక్కురుని పిల్లయార్" అనిపిలుస్తుంటారు. ముక్కురుని అంటే మూడు శేర్లు (శేరు అనేది ఒక కొలత). పిల్లయార్ అంటే పిల్లవాడు అని. ముక్కురుని పిల్లయార్ గుడి మీనాక్షి అమ్మ గుడిలోనే కాక, చిదంబరంలోనూ, నాగపట్టణంలోనూ ఉంది. ఈ గణపతి అవతారానికి సంబంధించి ఒక చిత్రమైన కధ ఉంది

గణపతి రూపమే చాలా విచిత్రమైనది. ఎంతో పెద్ద దేహంతో చాటంత చెవులతో, పేద్ద తొండంతో, చిన్ని కళ్ళతో, పెద్ద ఏనుగు ముహంతో ఉంటాడు. కొద్దిగా మరగుజ్జు  రూపంలో ఉండి పెద్ద బొజ్జతో కూర్చొని ఉంటాడు. ఆయన చేతిలో కుడుములూ, ఉండ్రాళ్ళూ మొదలైనవి కనిపిస్తుంటాయి. ఈ అవతారాన్ని చూసి పూర్వం వినాయకుడిని అందరూ గేలిచేసి ఆటపట్టిస్తూ ఉండేవారుట. ఏమంటే "నువ్వు ఎప్పుడూ అంత బొజ్జతో ఉండి ఏ పనీ చెయ్యక మీ అమ్మగారిచ్చిన కుడుములు తింటూ ఉంటావ్ కదా?" అని. అలా అందరూ గేలిచేసేసరికి వినాయకుడికి బాధ కలిగిందిట. ఇహ లాభం లేదు ఏదన్నా పనిచేసి ఈ ఆటపట్టించే వారికందరికీ తగిన సమాధానం చెప్పాల్సిందే అనిపించి తన భక్తుడైన ఒక రైతు దగ్గర చిన్న పాటి ఉద్యోగం చేద్దామని వెళ్ళాడుట. 

    ఆ రైతు యొక్క వరిపంట ఏపుగా పెరిగి కోతకి సిద్ధంగా ఉందిట. ఓ బాలుడి రూపంలో వినాయకుడు వెళ్ళి రైతుకి సహాయం చేద్దామనుకొంటున్నట్టు చెప్పాడు. అందుకు రైతు కొంత ఆలోచించి జీతం ఎంతకావాలని అడిగాడుట. అందుకు వినాయకుడు "నీ చేతికి పంట వచ్చాకా మూడు శేర్ల ధాన్యాన్ని ఇయ్యమని" చెప్పాట్ట. అందుకు సరే అని రైతు వినాయకుడికి పొలంలో పిట్టలని తోలి తన ధాన్యపు పంటని కాపుగాసే పని ఇచ్చాట్ట. వినాయకుడు అలా రోజూ మంచె ఎక్కి పక్షులని పంట తినకుండా కాపుకాసాడుట. ఆఖరులో పంట చేతికొచ్చాకా రైతు సంతోషించి అన్న ప్రకారం మూడు శేర్ల ధాన్యాన్ని ఇచ్చాడుట. తన తొలి సంపాదనని తీసుకెళ్ళి అమ్మైన పార్వతీ దేవికి చూపించాట్ట గణపతి. అది చూసి పార్వతీదేవి " ఏ పిల్లాడైనా కష్టపడితే అమ్మ సంతోషించదు నాయనా. పుత్రుడు ప్రయోజకుడైతే అది తండ్రికే ఎక్కువ ఆనందాన్నిస్తుంది. నీ కష్టార్జితాన్ని మీ నాన్నగారికి చూపించు" అందిట. వినాయకుడు పరమేశ్వరుడి దగ్గరకు తీసుకెళ్ళి ఆ ధాన్యాన్ని చూపించి "నాన్నగారూ ఇంగోండి నా తొలి సంపాదన" అని చెప్పాడుట. పరమేశ్వరుడి చేష్టలు అర్ధం ఎవరు చెప్పగలరు ఆయనొక పిచ్చివాడిలా ఆనందంగా నవ్వుతూ ఆ మొత్తం ధాన్యాన్ని తన నెత్తిమీద వొంపేసుకొన్నాట్ట. ఒక విధంగా అంతా శివార్పణం అయ్యింది.

ఈ లీలకి గుర్తుగా ఈ రోజుకీ ముక్కూరుని పిల్లయార్ గుళ్ళలో వినాయకుడికి మూడు శేర్ల సరిపడా బియ్యంతో ఉండ్రాళ్ళు చేసి నైవేద్యం పెడుతుంటారు. మీరు ఈ టపాలో చూస్తున్నది మీనాక్షి అమ్మవారి గుడిలోని ముక్కురుని వినాయకుడి గుడి.

Courtesy : Chibi Vijayan
Photo : Danda pani

Tuesday, June 10, 2014

దాన మహిమ


దానం చెయ్యాలని మనలో ఏ కొద్ది మందికో ఉంటుంది. చాలా మందికి దానం చెయ్యడం వల్ల వచ్చే ఫలితం తెలియక దానధర్మాలు చేయకుండా జీవితం సాగిస్తుంటారు. మన వాంగ్మయ సర్వస్వం చేసిన ధర్మం వల్లే మనకు కామితార్ధాలు అన్నీ సమకూరతాయని తెలియజేస్తోంది. ఈ విషయాన్ని తెలుసుకొన్న ఒక వ్యక్తి జీవితం ఎంతగా మారిపోయిందో తెలిపే కధే ఇది

బలి చక్రవర్తి గతజన్మ వృత్తాంతం:

బలి చక్రవర్తి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన సాక్షాత్ శ్రీమహావిష్ణువుకే మూడు అడుగుల భూమిని దానం చేసిన మహనీయుడిగా, గొప్ప దాతగా చరిత్రలో నిలిచిపోయాడు. అతనికి అంతటి గొప్ప అవకాశం రావటానికి కారణం తను గతజన్మలో చేసుకొన్న పుణ్యమే. బలి గతజన్మలో ఒక దరిదృడు. అతను నాస్తికంగా ఉంటూ వేదపండితులనూ దేవతలనూ నిత్యం దూషిస్తూ తిరుగుతుండేవాడు. అతను దరిదృడే ఐనా వేశ్య లోలుడు. ఒక సారి వేశ్యా సంగమానికి సిద్ధమై ఎలాగో తను సంపాదించిన తాంబూలం, సుగంధ ద్రవ్యాలూ, శ్రీ చందనం, కర్పూరం, మల్లె పూలూ ఇత్యాది  భోగవస్తువులను ఒక సంచీలో పెట్టుకొని వేశ్యావాటిక కి బయల్దేరాడు. మార్గమధ్యంలో కాలుజారి నేలమీద పడ్డాడు. అలా పడేటప్పుడు తన తలకి బలంగా గాయమయ్యి మూర్చపోయాడు. ఆ సమయంలో తనకి విచిత్రమైన ఒక ఊహ కలిగింది. తన దగ్గరున్న ఈ పరిమళద్రవ్యాలన్నీ శివుడికి నివేదనచేస్తున్నట్టు. ఆ ఊహలో ఉండగానే తను ప్రాణాలు విడిచాడు. తన దగరున్న సర్వస్వాన్నీ భగవంతుడికి నివేదించినందుకు గానూ ఆ పరమేశ్వరుడి దయవల్ల అతనికి గొప్ప పుణ్యఫలం లభించింది.

మరణించిన తనను యమభటులు నరకానికి తీసుకుపోయారు. అక్కడ యముడు అతని పాపపుణ్యాలని విచారించగా అతనికి చేసిన పాపాలకి గానూ ఘోరమైన నరక శిక్షలు విధించాల్సి ఉందని చిత్రగుప్తుడు చెప్పాడు. కానీ అతను చివరలో తనయావత్తూ ఆ పరమేశ్వరుడికి నివేదిస్తున్నట్టూ భావించినందుకు మూడు ఘడియలపాటూ ఇంద్ర పదవిని చేపట్టాల్సి ఉందంది అలా మూడు ఘడియలూ పూర్తయ్యాకా అతనిని నరకంలో శిక్షించవచ్చని చెప్పాడు. ఇదంతా విన్న ఆ పాపికి తను ఇన్నాళ్ళూ చేసినపనులెంత ఘోరమైనవో తెలిసింది.  జన్మ చివరలో దేవుడికే అన్నీ దానం చేస్తున్నా అని అనుకోగానే ఇంత ఫలితం వచ్చింది, అలాంటిది తను నిజంగానే దానం చేస్తే ఎంత బాగుంటుందీ ? అనిపించింది.  ఇంతలో ఇందృడు, ఇంద్రగణాలు, అప్సరాగణాలూ మొత్తం అక్కడికి వచ్చి ఆ వేశ్యాలోలుడిని ఐరావతం మీద ఎక్కించుకొని సకల లాంచనాలతో సదరంగా స్వర్గానికి తోడుకొని వెళ్ళారు. 

తను ఇంద్ర సిమ్హాసనమ్మీద కూర్చొన్న వెంఠనే అగస్త్యుడికి ఐరావతాన్నీ, విశ్వామిత్రుడికి ఉచ్చైశ్రవాన్నీ, వశిష్టుడికి కామధేనువునూ, గాలవుడికి చింతామణినీ, కౌండిణ్యుడికి కల్పతరువునూ ఇలా ఇంద్రలోకంలోని గొప్ప గొప్ప మహర్షులకి విలువైన సంపదనంతా దానం చేసేసాడు. వారంతా ఎంతగానో సంతోషించి అతన్ని ఆశీర్వదించారు.

మూడు ఘడియల కాలం ఐపోయిన వెంఠనే ఇందృడక్కడకి వచ్చాడు. ఐరావతం మొదలు పారిజాత వృక్షం వరకూ అన్నిటినీ ఆ వేశ్యాలోలుడు దానం చెయ్యడం తెలుసుకొని కోపగించుకొన్నాడు. ఇంతలో యముడూ అక్కడికి వచ్చాడు ఆ పాపిని మళ్ళీ నరకానికి వెళ్ళడానికి సిద్ధంకమ్మన్నాడు. ఐతే మరలా చిత్రగుప్తుడు అడ్డుచెప్పి అతను ఈ మూడు ఘడియలకాలంలో చేసిన పుణ్య ఫలితంవల్ల తను ఇక మీదట నరకానికి రానవసరం లేదనీ, మరు జన్మలో మహా చక్రవర్తిగా భూమి మీద జన్మిస్తాడనీ చెప్పాడు. తను మునుపు చేసిన పనులకి గానూ అసుర వంశానికి రాజౌతాడని చెప్పాడు. ఆ దాన ఫలితంగనే బలి చక్రవర్తిగా అవతరించి సాక్షాత్ శ్రీ మహా విష్ణువుకే మూడు అడుగుల రూపేణా మూడు లోకాలను దానం చేసిన పుణ్యాన్ని పొందాడు. చిరంజీవిగా పాతాళానికి రాజై నిలిచిపోయాడు

Tuesday, June 3, 2014

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం

(అగస్త్యులవారూ లోపాముద్రా దేవీ)

పూర్వం అగస్త్య మహాముని బ్రహ్మచారిగా ఉంటూ తప్పస్సు చేసుకొంటూ కాలం గడుపుతున్నాడు. అందువల్ల ఆయనకు ధర్మబద్ధంగా సంతానయోగం లేకుండా పోయింది. ఇది చూసి వారి పితృదేవతలు చాలా బాధపడ్డారు. ఎలాగైనా అగస్త్యుడు పెళ్ళిచేసుకొని సంతానాన్ని పొందితే గానీ వారికి ఉత్తమలోకాలు ప్రాప్తించవని తలచి ఒక రోజు అగస్త్యుడికి తలకిందులుగా వేళ్ళాడుతూ దర్శనమిచ్చారు. అప్పుడు వారిని చూసి అగస్త్యుడు " ఎవరు మీరు ? ఎందుకిలా తలక్రిందులుగా వేళాడుతున్నారు ?" అని ప్రశ్నించాడు. అందుకు బదులుగా వారు "మేము నీ పితరులము నీవు వివాహం చేసుకోనందున మాకు ఉత్తమలోకాలు లేక ఇలా ఉండవలసి వచ్చిందని" చెప్పారు. ఎంతో బాధపడిన అగస్త్యుడు వెంఠనే తగిన జీవితభాగస్వామి కోసం అన్వేషణ మొదలుపెట్టాడు. 

ఆయనకి కొంతకాలానికి విదర్భరాజు కూతురైన లోపాముద్ర తగిన కన్యగా తోచింది. వెంఠనే విదర్భరాజుని  తన కూతురునిచ్చి పెళ్ళిచేయమన్నాడు. అందుకు ఆ రాజు సంతోషించి ఆనందంగా పెళ్ళిచేసాడు

అగస్త్యుడు లోపాముద్రతో సహా తన ఆశ్రమంలో నివసిస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలానికి తనకు సంతానం పొందాలని కోరిక కలిగి అదే భార్యతో చెప్పాడు. లోపాముద్ర రాచకన్యే ఐనా పెళ్ళయ్యాకా నారవస్త్రాలతో ఉంటూ పతిసేవలో నిరాడంబరంగా జీవించసాగేది. అగస్త్యుడు తన కోరిక చెప్పగానే తనకి ఈ ఆశ్రమంలో కూడా సకలసౌకర్యాలూ కలిగేలా చేసి అలాగే సంతానాన్నీ పొందవచ్చునని చెప్పింది. తన తపశ్శక్తితో ధనాన్నిపొందడం సరికాదనుకొన్నాడు అగస్త్యుడు.ధర్మబద్ధంగా ఎవరినైనా అడిగి పొందాలని భావించి సమీప రాజ్యాలకు రాజులైన వారిలో ఎవరి దగ్గర మిగులుధనం ఉంటే వారిని మాత్రమే అడగాలని నిర్ణయించుకొన్నాడు.  వెంఠనే శృతర్వుడు అనే రాజు దగ్గరికెళ్ళి అడిగాడు. ఆ రాజు లెక్కించి మిగులు ధనం లేదని చెప్పాడు. శృతర్వుడిని కూడా వెంటపెట్టుకొని బ్రద్నశ్వుడు అనే రాజు దగ్గరికెళ్ళాడు. అతనూ ధనాగారం లెక్కచూసి మిగులుధనం లేదని చెప్పడంతో శృతర్వుడినీ,బ్రద్నశ్వుడినీ వెంటపెట్టుకొని త్రసదస్యుడనే రాజు దగ్గరికెళ్ళాడు. ఆ రాజు దగ్గరా మిగులు ధనం లేకపోడంతో శృతర్వుడూ, బ్రద్నశ్వుడూ,త్రసదస్యుడినీ తనతో తీసుకొని ఇల్వలుడనే దానవ రాజు దగ్గరికెళ్ళాడు. 

ఆ దానవరాజుకి వాతాపి అనే సోదరుడుండే వాడు. వారిద్దరికీ ఓ వరం ఉంది. అదేంటంటే వాతాపి ప్రాకామ్య విద్య వల్ల అనుకొన్న రూపాన్ని పొందేవాడు. వాతాపిని మేకగా చేసి అతిధులకు వండి పెట్టి తిరిగి ఇల్వలుడు పిలవగానే  తాను యధా రూపం పొంది రాక్షసుడిగా రూపుదాల్చగలడు. ఈ వరగర్వంతో ఇద్దరూ ఆహార ధానం చేసినట్టే చేసి అకారణంగా ఎంతో మంది  ప్రాణాలూ, ధనాన్నీ హరించారు. ముందుగా వాతాపి మేక రూపం దాలుస్తాడు, ఆ మేకను చంపి కూరగా వండి ఆ వండిన కూరని అతిధులుగా వచ్చిన వారికి వడ్డిస్తారు. వాళ్ళు భోజనం చేసాకా ఇల్వలుడు " వాతాపీ బయటకు రా" అని పిలవగానే వాతాపి వారి కడుపును చీల్చుకొంటూ బయటికొచ్చేవాడు. ఈ విధంగా అనేకుల ప్రాణాలు బలిగొనారిద్దరు రాక్షసులూ.

శృతర్వుడూ, బ్రద్నశ్వుడూ,త్రసదస్యుడినీ తనతో తీసుకొని వచ్చిన అగస్త్యుడిని చూసి వారిద్దరూ ఇదే పన్నాగం పన్నుదామనుకొన్నారు. వాతాపి ఒక మామిడి పండు రూపంగా మారిపోయాడు. భోజనానంతరం  వడ్డించిన మామిడిపండు వాతాపే అని తపోమహిమతో  గ్రహించాడు అగస్త్యుడు. 

   తాను మామిడి పండును తిన్న వెంఠనే " జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం" అనుకో గానే తన కడుపులోని రాక్షసుడైన వాతాపి సుజీర్ణమైపోయాడు. ఇల్వలుడు ఎంత పిలిచినా వాతాపి బయటకి రాలేదు. ఇంకెక్కడి వాతాపి ? జీర్ణమైపోయాడని అగస్త్యులవారు చెప్పగానే భయబ్రాంతులకి లోనై అగస్త్యులవారి కాళ్ళ మీద పడ్డాడు. అగస్త్యుడు వచ్చిన పనిని నివేదించగగా లోభత్వం చేత మిగులు ధనం లేదని అగస్త్యుడికి  అబద్ధం చెప్పాడు. దివ్యదృష్టితో ఉన్న ధనాన్ని లెక్క కట్టి చెప్పిన అగస్త్యుడి మహిమకి అచ్చెరువొంది,  ఐనా బుద్ధి మార్చుకోక, వారికి ఎంత ధనాన్ని ఇద్దామని తాను మనసులో అనుకొంటున్నాడో ఆ మొత్తాన్ని సరిగ్గా చెబితే అప్పుడే ఇస్తానన్నాడు. ఇల్వలుడి మనసులో ఉన్న మొత్తాన్ని మళ్ళీ సరిగ్గా చెప్పాడు అగస్త్యుడు. అప్పుడు బుద్ధి తెచ్చుకొని ఆ మొత్తం ధనాన్ని అగస్త్యుడికే కాక కూడా వచ్చిన రాజులకీ ఇచ్చి పంపించాడు ఇల్వలుడు.

ఈ రోజుల్లోనూ చిన్న పిల్లలకు అజీర్తి చేస్తే పెద్దవాళ్ళు కడుపుమీద నూనెను మర్దనా చేస్తూ "జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం.." అనటం కనిపిస్తుంది. ఈ ఆచారానికి వెనుక గల కధ ఇదే !

Sunday, May 25, 2014

భవిష్యత్ బ్రహ్మ హనుమ




ఆంజనేయుడిని భవిష్యత్ బ్రహ్మ అని, చిరంజీవి అని, రామ దూత అని ఇలా అనేక పేర్లతో పిలవడం మనం చేస్తూనే ఉంటాం. హనుమంతుడికి "భవిష్యత్ బ్రహ్మ" అన్న పేరు ఎందుకొచ్చిందన్నదానికి కారణంగా మనకీ కింది కధ పరాశర  సంహితలో కనిపిస్తుంది

శ్రీరామ పట్ఠాభిషేకానంతరం రాములవారు సుభిక్షంగా రాజ్యమేలుతున్నారు. ఆంజనేయుడు గంధమాధన పర్వతంలోని అరటి ఉద్యానవంలో తన నివాసమేర్పచుకొని ఉంటూ ఉన్నాడు. తను అను నిత్యమూ శ్రీరామదర్శనం చేసి తిరిగి తన చోటుకు వస్తూ ఉండేవాడు.   ఒకానొకరోజున రాముడినీ సీతమ్మవారినీ దర్శించుకొని వారి పాదములకు ప్రణమిల్లినప్పుడు. ఆదరముగా శ్రీరాముడు హనుమను ఒక పనికోసం నియోగించాడు.   అదేమిటంటే, బ్రహ్మ తనను ప్రార్ధించి తన వేలి ఉంగరాన్ని తీసుకొనివెళ్ళాడని, ఆ అంగుళీయకము సీతమ్మవారికి చాలా ఇష్టమైనదనీ దాన్ని హనుమ బ్రహ్మలోకానికి వెళ్ళి తీసుకు రావల్సింది అని చెప్పాడు. ఎంతో కాలానికి స్వామివారు తనని ఒక పనికోసం నియోగించడం ఆంజనేయుడికి అమితానానందాన్ని కలిగించింది. హనుమ వెంఠనే ఆకాశానికేసి ఎగిరి బ్రహ్మలోకానికి ప్రయాణించసాగాడు. హనుమ బ్రహ్మలోకానికిచేరిన వెంఠనే బ్రహ్మ ఆంజనేయుడిని సాదరంగా ఆహ్వానించి అతిధిఅభ్యాగతులు చేసి సత్కరించాడు. మాటలలో తన రాకకు కారణం చెప్పాడు హనుమంతుడు. అది విని బ్రహ్మ విచారించి శ్రీరాముడి ఉంగరం తనకు చాలా ప్రీతికరమైనదనీ, దాన్ని సక్షాత్ శ్రీరామచందృడికి ప్రతినిధిగా తాను భావించి పూజిస్తుంటాననీ, బ్రహ్మలోకం మొత్తం ఆ అంగుళీయకాన్ని ప్రతిరోజూ పూజిస్తుంటుందనీ అలాంటి విలువైన ఉంగరాన్ని తను హనుమకిచ్చి తిరిగి పంపలేనని చెప్పాడు. ఎన్నో విధాల ఒప్పించప్రయత్నించీ, విసిగీ ఆంజనేయుడు కోపంతో రగిలిపోయాడు. వెంఠనే ఓ ప్రశాంత ప్రదేశంలో కూర్చొని బ్రహ్మ ఉంగరాన్నివ్వకపోతే ఇంద్రాది దేవతలతో సహా సమస్త బ్రహ్మలోకాన్నీ నాశనం చేస్తానని భీష్మించుకొని తన ధ్యానం తీవ్రతరం చేసాడు. అలా హనుమ రామనామాన్ని ధ్యానిస్తున్నంతనే బ్రహ్మలోకం మొత్తం కంపించిపోయి దద్దరిల్లసాగింది. ఆసమయంలో ఆంజనేయుడు మహోగ్రరూపంతో ఇరవై చేతులతో వాటిలో ఈరవై ఆయుధాలను ధరించి,ఎర్రని కళ్ళతో భయంకరమైన ముఖంతో,  కొరలతో ఉన్న నోటిని తెరచి వికటంగా అట్టహాసం చేసాడు. ఆ ధ్వనికి బ్రహ్మలోకం అతలాకుతలమైపోయింది

జరుగుతున్న విపత్కర పరిస్థితిని చూసిన బ్రహ్మకుమారుడైన సనత్కుమారుడు బ్రహ్మను సమీపించి శ్రీరామముద్రికను తిరిగి హనుమకిచ్చి పంపించడమే పరిష్కారంగా సూచించాడు. బ్రహ్మ అందరి సూచననూ విని ఆనజనేయుడిని శాంతించమని అనేకవిధాల స్థుతించాడు. శాంతించిన హనుమకి శ్రీరామ ఉంగరం పక్కనే ఉన్న అమృత సరస్సులో ఉందని వెళ్ళి తీసుకొమ్మన్నాడు. అందుకు హనుమ ఎంతో ఆనందంతో ఆ సరస్సులోకి దిగాడు. ఆశ్చర్యంగా హనుమకి ఒక్క రామ ఉంగరం కాక అనేకానేక రామముద్రికలు కనిపించాయి. అది చూసిన వెంఠనే ఓ భక్తిపూర్వక ఆనంద తన్మయత్వం కలిగింది. అదే భావనతో ఆ అమృతసరస్సులోంచీ బయటికొచ్చి బ్రహ్మకు ప్రణమిల్లి తిరిగి రాములవారి దగ్గరకి ప్రయాణమయ్యాడు.

దీనంగా రాముడికి తన అశక్తతని తెలియజేసాడు హనుమ. జరిగినదంతా పూసగుచ్చినట్టు చెప్పి ఆ అనేకానేక ఉంగరాల్లో తను ఏది రామ ముద్రికో తేల్చుకోలేక రిక్త హస్తాలతోనే వెనుదిరిగి వచ్చాడని చెప్పాడు. రాముడు చిరునవ్వి నవ్వి, అక్కడున్నవన్నీ తన ఉంగరాలేననీ ప్రతి యుగంలోనూ బ్రహ్మ తన దగ్గరకు వచ్చి తనను ప్రార్ధించీ తన ఉంగరాన్ని స్వీకరించి ఆ అమృత సరోవరంలో దాచిపెడతాడని చెప్పాడు. స్వామికార్యానికిగానూ ఇంతలా ప్రయత్నించిన హనుమని మెచ్చుకొంటూ "చిరంజీవ చిరంజీవ" నువ్వు భవిష్యత్ బ్రహ్మవై చిరంజీవిగా వర్ధిల్లమని ఆశీర్వదించాడు. ఆనాటి నుంచీ ఆంజనేయుడు చిరంజీవిగా భవిష్యత్ బ్రహ్మగా ప్రఖ్యాతినొందాడు.

Sunday, May 11, 2014

ఉత్తాంగుడు




కురుక్షేత్ర మహాసంగ్రామం ముగిసిన పిమ్మట శ్రీకృష్ణుడు ద్వారకకు తిరుగుప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలో ఓ ఎడారిలో రాత్రికి సేదతీరి ఉదయాన్నే బయల్దేరదామని యెడారిలో ఒక చోట బసచేసాడు. సమీపంలోనే ఉత్తాంగుడు అనే మహర్షి కనిపించాడు. ఉత్తాంగుడు శ్రీకృష్ణుడి భక్తుడు. శ్రీకృష్ణుడు ఉత్తాంగుడుని చూసి " ఉత్తాంగా ! ఇక్కడ ఏం చేస్తున్నావ్?" అని ప్రశ్నించాడు. ఉత్తాంగుడు చిరునవ్వు నవ్వి "స్వామీ, మీకు తెలియనిదేముంటుంది. తాపసిని నేను ఈ యెడారి దారిన వెళుతూ రాత్రికి ఇక్కడ విశ్రమిద్దామని ఆగాను. కానీ మీరు? .. ఇక్కడా..? " అడిగాడు ఉత్తాంగుడు.  "కురుక్షేత్ర మహా సంగ్రామం ముగిసింది తిరిగి ద్వారకకు వెళ్తున్నాను " చెప్పాడు కృష్ణుడు. 

"కురుక్షేత్ర మహా సంగ్రామమా? యుద్ధం అంటే అపార ప్రాణ నష్టం కదా స్వామి, అందునా మీరు ఉండికూడా ఒక యుద్ధాన్ని ఆపలేకపోయారా ?" ఆశ్చర్యపోయాడు ఉత్తాంగుడు. 

"నీవన్నది నిజమే ఉత్తాంగా యుద్ధం అపార ప్రాణనష్టాన్ని కలిగిస్తుంది. కానీ యుద్ధం అనివార్యమయ్యింది" చెప్పాడు కృష్ణుడు. ఉత్తాంగుడిలో ఒక అమర్షమేర్పడ్డది, ఒక అసహనమేర్పడ్డది. కోపంతో కృష్ణుడిని శపించడానికి తన కమండలంలోని జలాన్ని తన అరచేతిలోకి తీసుకొన్నాడు. 

అప్పటికే గాంధారి అపార్ధంతో కృష్ణుణ్ణి శాపించింది. మరొక వ్యక్తి తనను అపార్ధం చేసుకొనడం కృష్ణుడికి ఇష్టం లేక ఉత్తాంగుడికి యుద్ధ కారణాన్ని వివరించడం మొదలుపెట్టాడు. " ఉత్తాంగా.. యుద్ధం జరగకుండా ఉండడానికి నా సాయశక్తులా కృషి చేసాను, రాయబారిగా దుర్యోధనుడినిని పాండవులకు కనీసం ఐదు ఊళ్ళిమ్మని బ్రతిమాలాను అందుకు దురోధనుడు ఐదు ఊళ్ళు కాదుగదా సూది మొన మోపినపాటి చోటుకూడా ఇవ్వడానికి నిరాకరించాడు". 

ఉత్తాంగుడు నిజమా? అని ఆశ్చర్యంతో చూస్తున్నాడు.

 కృష్ణుడు చెప్పడం కొనసాగించాడు. "ఉత్తాంగా ! అదీ కాక  నిండు సభలో ద్రౌపదికి ఘోరపరాభవం జరిగింది. అట్టి మహాపాతకం చేసినందుకు  కౌరవులకు తగిన శిక్ష పడితీరవల్సిందే. అందుకే యుద్ధానికి రంగం సిద్ధమయ్యింది " చెప్పడం  ముగించాడు పరమాత్మ.

తొందరపాటులో శ్రీకృష్ణుణ్ణి అపార్ధం చేసుకొని శపించబోయిన ఉత్తాంగుడికి తను చేయబోయిన పనిని తలుచుకొని సిగ్గు కలిగింది. "క్షమించు దేవా ! ఆవేశంలో దేవాదిదేవుడివైన నిన్నే శపించబోయాను, నన్ను మన్నించు!" అని చేతిలోని తపో జలాన్ని నేలపై వదిలిపెట్టాడు. 

శ్రీకృష్ణుడు దయతో ఉత్తాంగుడితో ఇలా అన్నాడు " ఉత్తాంగా ఏది ఏమైనా నా కారణమున నీ తపోజల రూపంలో నీ తపశ్శక్తి కొంత వృధా అయినది అందుకు మారుగా ఏదన్నా వరం కోరుకో". 

"ఇంద్రాది దేవతలకే దుర్లభమైన మీ అమూల్య దర్శనంతో పావనమయ్యాను. ఇంతకన్నా ఏం కావాలి స్వామి? నాకే వరమూ వద్దు" సున్నితంగా బదులిచ్చాడు ఉత్తాంగుడు.

"కోరుకోమని నే అడుగుతున్నా ఉత్తాంగా..కోరుకో" మరోసారి పట్టుబట్టాడు శ్రీకృష్ణుడు. సహజంగా వరమివ్వని ఆయనే తనకు తానుగా అడుగుతుంటే, ఉత్తాంగుడు ఈ అవకాశాన్ని జాగ్రత్తగా వినుయోగించుకొన్వాలని కృష్ణుడు ఉద్దేశ్యం .

కానీ ఉత్తాంగుడు కొంత సేపు ఆలోచించి పరాచికంగా " కృష్ణా ! నా కమండలంలోని జలమే కదా వృధా అయ్యింది? అసలే ఇది యెడారి ప్రదేశం. కాబట్టి నాకు దప్పికైనప్పుడు నేను నిన్ను స్మరించినంతనే నువ్వు నాకు జలాన్ని అనుగ్రహించు చాలు" అన్నాడు.

సరే అని వరమిచ్చి కృష్ణుడు ఆ రాత్రికి ఉత్తాంగుడికి కూడా తనతో పాటే భోజనాది సపర్యలకు ఏర్పాటు చేయించాడు. ఉదయమే వీడ్కోలు పుచ్చుకొని వెళ్ళిపోయాడు.

కొన్నాళ్ళ పిదప ఉత్తాంగుడు యడారిలో ధ్యానం ముగించుకొన్న సమయంలో దాహం వేసింది. తనకు శ్రీకృష్ణుడు ఇచ్చిన వరం గుర్తుకువచ్చి స్వామిని స్మరించాడు. కొంత సేపటికి ఒక వేటగాడు ఉత్తాంగుడి ఎదుట కనిపించాడు. " స్వామీ మీరు చూడబోతే బాగా దప్పికతో ఉన్నట్టున్నారు. నా దగ్గర కొంత నీరు ఉంది పుచ్చుకోండి అని పిలిచాడు". 

ఉత్తాంగుడు కనులు తెరిచి చూసే సరికి ఎదురుగా ఓ వేటగాడు దుమ్ముకొట్టుకుపోయిన దేహంతో చెమటతో దుర్గంధంతో ఉన్నాడు. అతని తో బాటూ వేటకుక్కలు ఉన్నాయి. ఆ దుర్గంధాన్నీ భరించలేక " వద్దు, ఇక్కడ నుంచీ వెళ్ళిపో" అన్నాడు ఉత్తాంగుడు. 

"స్వామీ నేను నా తోలు సంచిలో నీళ్ళు తాగుతుంటే మీరు దాహార్తితో మీ పెదాలు తడి చేసుకోడం నే చూసాను. మీరు బాగా దాహంతో ఉన్నారు. దయచేసి కొంత పుచ్చుకోండి నేను మురికిగా ఉన్నా నా తోలు సంచీ, అందులో నీరూ శుభ్రంగా ఉన్నాయి" అని బదులిచ్చాడు వేటకాడు.

భృకుటి ముదివేసి కొంత అసహనంగా ఆ వేటగాడి కుక్కలకేసి చూస్తూ "వద్దు వెంఠనే ఇక్కడ నుంచీ వెళ్ళిపో" అని కోపంతో రెట్టించాడు ఉత్తాంగుడు. 

"స్వామీ ఈ యెడారిలో నీళ్ళు దొరకడం అంత సులువు కాదు. దయచేసి కొంత నీరు పుచ్చుకోండి" బ్రతిమాలాడు వేటకాడు. " నీలాంటి వేటకాడిచ్చిన నీటిని తాగి బ్రతికే కన్నా దాహంతోనైనా చనిపోతా కానీ నీ నీళ్ళు తాగనే తాగను.. వెళ్ళిపో !" అని ఆగ్రహోదర్గుడయ్యాడు ఉత్తాంగుడు. వేటగాడు వెళ్ళిపోయాడు.

కొంత సేపటికి నిదానించిన ఉత్తాంగుడికి మనసులో ఓ భావన కలిగింది. శ్రీకృష్ణుడు తానిచ్చిన మాట తప్పాడనిపించింది. వెంఠనే " కృష్ణా ! నాకు వరమిచ్చి కూడా నా దాహం తీర్చలేదు. మాట తప్పావ్" అని ఆకాశం వంక చూస్తూ బిగ్గరగా అరిచాడు. ఉత్తర క్షణం కృష్ణ స్వామి ఉత్తాంగుడి ముందు ప్రత్యక్షమయ్యాడు.

" ఏది? నీరు ? నీళ్ళిస్తానని ఆడి మాట తప్పావ్ ! దాహంతో ప్రాణం కడంటేసింది. వట్టిచేతులతో వచ్చావా? " నిందా పూర్వకంగా కోపంతో అన్నాడు ఉత్తాంగుడు. ఉత్తాంగుడు ఆవేశంగా చెప్పడం ముగించాకా చిరునవ్వుతో కృష్ణుడు ఇలా బదులిచ్చాడు " నిజమే ఉత్తాంగా ! నేను నీకు నీళ్ళివలేదు. నీకు అమరలభ్యమైన అమృతాన్నిద్దామని ప్రయత్నించాను. నీవు నన్ను స్మరించిన వెంఠనే దేవేందృడిని నీకు అమృతాన్నిమ్మని చెప్పాను. ఇందృడందుకు సమ్మతించి అమర లభ్యమైన అమృతాన్ని అందుకు యోగ్య్లైన వారికే ఇవ్వాలి కావున అందుకొనబోను వాని యోగ్యతనీ, పాత్రత నీ పరీక్షించి ఇస్తా అని చెప్పాడు. ఆ వేటగాడు సాక్షాత్తు దేవేందృడే ! అతని తోలు సంచీ అమృత కలశము. సకల చరాచర సృష్టినీ సృజించి నడిపించి లయించే ఆ బ్రహ్మాన్ని నువ్వు అందరిలో చూసావో లేదో పరీక్షించాడు ఇందృడు. నువ్వు అందరినీ సమానంగా చూడ లేకపోయావ్ ఉత్తాంగా" నిట్టూర్చి చెప్పాడం ముగించాడు శ్రీకృష్ణుడు.

కొంత మంచి నీటిని ఉత్తాంగుడికి అందించాడు కృష్ణుడు. కానీ సిగ్గుతో పశ్చాత్తాపంతో ఉన్న ఉత్తాంగుడు నీటిని సేవించే స్థితిలో లేడు. "నా తప్పు తెలిసింది స్వామి. అందరిలో అంతటా ఆ పరబ్రహ్మను చూడగలిగే వరకూ నా సాధన కొనసాగిస్తా. నన్నాశిర్వదించండి స్వామి" అని నీటిని సేవించి శెలవు తీసుకొని వెళ్ళిపోయాడు ఉత్తాంగుడు.

Pic : COURTESY http://www.india-forums.com/
Main Story Courtesy : Sri S.A. Krishnan @ hindumythologyforgennext.blogspot.com 

Monday, April 21, 2014

శ్రీకృష్ణుడూ - చిత్రకారుడూ



అనగనగా ఓ గొప్ప చిత్రకారుడుండేవాడుట. అతను ఎంత గొప్ప చిత్రాన్నైనా ఇట్టే తన కుంచెతో చిత్రీకరించి రంగులు వేసి అందరినీ ఆశ్చర్యపరచేవాడుట. ప్రకృతిలో ఎంతో అందమైన సూర్యోదయం, పండు వెన్నెలా, నెమలి నాట్యం, రామచిలుకలూ, కుందేళ్ళూ, అందమైన అడవులూ, సెలయేళ్ళూ, మేఘాలూ ఇలా ప్రపంచంలో ఏ అందమైన దృశ్యం కనపడ్డా దాన్ని తన కుంచెతో పఠమ్మీద బంధించనిదే వదిలేవాడు కాదు. తన కళాకౌశలాన్నిజునులందరూ మెచ్చుకొన్నారు, పురాధికారులూ, రాజులు సైతం బహుమానాలిచ్చి అభినందించారు. అలాంటి ఆ చిత్రకారుడికి ఒక సారి ఎవరొ కనబడి... "ఫలానా రేపల్లె అనే ఊరులో ముద్దులొకిలే ఓ అందమైన పిల్లాడున్నాడూ, అతని అందం అంతా ఇంతా కాదు.  చూసినకొద్దీ చూడాలనిపించే అందం ఆ పిల్లాడిది. ఎంతటి అందమో అంతటి తెలివి. ఎంతటి తెలివో అంతటి అల్లరి, ఎంతటి అల్లరో అంతటి అమాయకత్వం కనబరుస్తూ ....ఎవ్వరికీ అందక అందరినీ ఆనందింపజేస్తూ ఆడుకొనే ఓ పిల్లాడు ఉన్నాడూ, అతని పేరు కృష్ణుడు.. అతనిని కనుక నువ్వు చిత్రీకరిచగలిగితే అదే నీకు నిజమైన గొప్పదనం"  అన్నారుట.

ఆ మాటలకి ఆ కళాకారుడిలో పట్టుదల పెరిగింది. ఆ పిల్లాడెలా ఉంటాడో వెంఠనే చూడాలనిపించింది. ఎంతో వ్యయప్రయాసలకోర్చి అందరినీ వాకబుచేస్తూ ఊరులెన్నో దాటుకొని చివరకి రేపల్లె చేరాడు. రేపల్లెలో కన్నయ్యని తెలీనివాళ్ళుండరు కదా ? వాకబు చేయగానే కన్నయ్య ఇంటికి దారి చూపించారు.  అక్కడికి చిత్రకారుడు చేరే సరికి సాయంత్రమయ్యింది. అప్పుడు చిన్ని కృష్ణుడు గోపబాలురితో కలిసి ఆనందంగా ఆడుకొంటున్నాడు. రాశీభూతమైన ఆ సౌందర్యలావణ్య ముగ్ధమోహన మూర్తిని చూడగానే ఆ కళాకారుడికి తను విన్నది నిజమే సుమా ! అనిపించింది. ఆ ముద్దులొలికే అందాలబాలుడిని చిత్రీకరిస్తేనే తన కళకి ఓ పరిపూర్ణత వస్తుందనిపించింది. ఆలస్యం చేయక ఆ చిత్రకారుడు కన్నయ్యని సమీపించాడు.

తను మునుపు చిత్రించిన అందమైన చిత్రాలనన్నీ తన సంచీలోంచి తీసి చూపించాడు. చిన్నికృష్ణుడు అన్నీ మురిపంగా చూడసాగాడు. "ఇంగో నువ్వూ కదలకుండా కాసేపు నుంచొంటే.. నీ బొమ్మనీ ఇలా గీస్తాను..సరేనా !" అన్నాడు చిత్రకారుడు అనునయంగా. పిల్లాడికి బొమ్మలంటే సరదా కదా?  నవ్వుతూ "ఓ !అలాగే !" అన్నాడు కన్నయ్య.

కాలికి సిరిమువ్వగజ్జెలూ, చక్కని దోవతీ, మెడలో పూలమాలా, నుదుటన కస్తూరి, గాలికి అందంగా ఊగే ముంగురులూ, తలపై నెమలిపించం, చేత పిల్లన గ్రోవితో అందానికే అందమై నిలుచున్నాడా గోపబాలుడు. చిత్రకారుడుకి ఆపాదమస్తకం కన్నులపండువగా ఉంది, ఎంతో శ్రద్ధగా ఎంతో అద్భుతంగా తన ప్రతిభనంతా వెచ్చిస్తూ ఆ చిత్రాన్ని గీయటం పూర్తిచేసాడు.

కొంతసేపటికి కన్నయ్యని తోటి పిల్లలు పిలుస్తుంటే కదలక తప్పింది కాదు. చిత్రకారుడు పిల్లాడిని కదలకుండా నించున్నందుకు మెచ్చుకొని, మరునాడు ఆ చిత్రానికి రంగులు వేసి తీసుకొస్తానని చెప్పి శెలవుతీసుకొన్నాడు.

రాత్రంతా ఆ చిత్రానికి రంగులు వేసి మరీంత మనోహరంగా ఆ చిత్రాన్ని పూర్తిచేసాడు. తను జీవితం మొత్తంలో అంత అందంగా వేసిన బొమ్మ ఆ చిన్నికృష్ణుడిదే అనిపించింది చిత్రకారుడికి. అది ఆ బాలుడికి చూపిస్తే తప్పక సంతోషిస్తాడనిపించింది అతనికి.

మరునాడు ఆ చిత్రపఠాన్ని తీసుకొని వెళ్ళి కన్నయ్యకి చూపించాడు. అప్పుడే చిన్ని కన్నయ్య స్నానానికి ఉపక్రమిస్తూ ఉన్నాడు.  యశోదా దేవి కన్నయ్య ఒంటి నిండా వెన్న పట్టించి బాగా మర్దనా చేసింది. అందువల్లా బాలకుడు చక్కగా మెరుస్తున్నాడు. జుత్తును దువ్వి పీలకవేసినట్టు ఉంది. మెడలో ముత్యాలహారాలతో,  మొలలో బంగారు మొలతాడు తో చేతిలో కొద్దిగా వెన్నతో ఉన్నాడు ఆ బుజ్జిబాలుడు. కన్నయ్యకి ఆ చిత్రపఠాన్నిచ్చాడు కళాకారుడు. ఎంతో ఆత్రంగా బాలుడి ఆనందాన్ని చూద్దామని వేచి చూస్తున్నాడు చిత్రకారుడు.

                       కన్నయ్య ఆ చిత్రపఠాన్ని కళ్ళు పెద్దవి చేసి,  ఒక్క నిమిషం పాటూ తేరిపారా చూసాడు. "ఈ బొమ్మ నాది కాదుగా !" అన్నాడు. వెంఠనే చిత్రకారుడు ఆశ్చర్యపోయాడు. "ఇంగో చూడు నేనెలా ఉన్నానో? ఈ బొమ్మ చూడెలా ఉందో? " కొంత అసంతృప్తి ద్వ్హనించగా కుండబద్దలుకొట్టినట్టూ చెప్పేసాడు కన్నయ్య. దాంతో చిత్రకారుడు దిగాలు పడిపోయాడు. తన శ్రమంతా వృధా ఐపోయిందనిపించింది.  ఆ చిన్నిపిల్లాడిని మెప్పించలేని ఆ ప్రయత్నం వృధా అనిపించింది. వెంఠనే ఇంకో గట్టి ప్రయత్నం చేద్దామని కుంచె, పఠమూ అందుకొన్నాడు. చిత్రించడం పూర్తిచేసాడు. మరునాడు యధావిధిగా రంగులద్ది తీసుకొచ్చాడు. అప్పుడు కన్నయ్య ఉదయాన్నే ఆలకాపరిలా ముస్తాబయ్యి ఆవులని మేపడానికి బయల్దేరుతున్నాడు. చిత్రకారుడు తాను తెచ్చిన చిత్రపఠాన్ని చూపించాడు. అప్పుడు కన్నయ్య తలకి చిన్న తలపాగా చుట్టుకొనీ, చేత చిన్ని కర్ర పుచ్చుకొనీ, బొడ్డులో వేణువు దోపుకొనీ, భుజాన చద్దిమూట తగిలించుకొనీ ఉన్నాడు. మళ్ళీ కన్నయ్య "ఇంగో చూడు నేనెలా ఉన్నానో? ఈ బొమ్మ చూడెలా ఉందో?... ఊహు ! ఇది నేను కాదు" అనేసాడు. ఇలా కొన్ని పర్యాయాలయ్యాకా చిత్రకారుడికి ఆత్మనూన్యత ఆవరించింది. ఎన్ని బహుమానాలందుకొంటే ఏమి ? ఎంత కీర్తి ఘడిస్తే ఏమి ? ఈ చిన్నారి పసి మనసుని ఆనందింపజేయలేకపోయాకా తన కళకి ఏమి విలువ ? అని చింతించి. ఈ జన్మ వృధా కనుక ఆత్మహత్యే శరణ్యం అని తలచి అందుకు ఉపక్రమించాడు.

సమయానికి నారదమునీందృల వారు ఆపి విషయం ఏంటని? వాకబుచేయగా, చిత్రకారుడు తన గోడంతా వెళ్ళబోసుకొన్నాడు. అప్పుడు నారదులవారు అతనికి ధైర్యం చెప్పీ. "ఆ పిల్లాడి బొమ్మని నేను గీసిస్తాలే, నువ్వు నేని చెప్పిన పని చెయ్యి చాలు.." అన్నారుట. " నేనే గీయలేని ఆ అందమైన రూపాన్ని మీరెలా గీయగలరు స్వామీ ? .. అసమభవం !!!! "అన్నాట్ట చిత్రకారుడు. "అవన్నీ నే చూసుకొంటాను నాయనా. నువ్వు రేపుదయానే నేనిచ్చిన చిత్రపఠాన్ని తీసుకెళ్ళు ఆ బాలుడికి చూపించు. అతను అసమాన్యుడు.. వెంఠనే అతనికి సాష్టాంగ పడి నమస్కరించు.. " అన్నారుట.

నారదులవారు ఒక గుడ్డలో చుట్టిన ఒక చిత్రపఠాన్ని చిత్రకారుడికిచ్చారుట. ఆ చిత్రపఠాన్ని చిత్రకారుడు తీసుకొని కన్నయ్య దగ్గరికెళ్ళాడుట. అది కన్నయ్య చేతిలో పెట్టి అమాంతం కాళ్ళమీదపడ్డాడుట. లేచి చూసే సరికి ఆ చిన్నికన్నయ్య ఆ గుడ్డను తొలగించి ఆ చిత్రపటాన్ని విప్పి చూసి, అందులో తన అందాన్ని చూసి తెగ మురిసిపోతున్నాట్ట. ఎట్ట్కేలకూ ఆ చిన్నారికన్నయ్య కళ్ళల్లో ఆనందం చూడగలిగినందుకు చిత్రకారుడి మనసుప్పొంగిపోయింది.  నారదుడికి తానెంతో రుణపడ్డట్టనిపించిని. కానీ ఇంతలో ఒక సందేహం కలిగింది..ఎంతో ప్రతిభాశాలి ఐన తనే చిత్రీకరించలేని ఆ బొమ్మని నారదులవారెలా గీసారా అని? వెంఠనే ఆ బొమ్మని తనూ చూడాలనిపించి కన్నయ్య చేతిలో పఠానికేసి తొంగిచూశాడు.

 అదేంటో తెలుసా? ... అద్దం :)

మిగింపు భలే గమ్మత్తుగా ఉంది కదూ ? శ్రీహరి లీలలు నారదుడికి కొత్తా ? ....

నీతి: మానవ ప్రయత్నం దాని ఫలితం చాలా గొప్పవే ఐనా ఆ ప్రయత్నం వల్ల వచ్చే ప్రయోజనం అంతా మన ప్రతిభే అనుకోకూడదు. దైవానుగ్రహం ఉండడం వల్లే అవన్నీ సమకూరతాయి. "అంతా నీదే భారం" అని అంతా ఆ దేవుడికే వదిలేస్తే ఆయనే మనకి మన విజయాలకి తగిన శక్తీ యుక్తీ ఇచ్చి రక్షిస్తాడు.



హరే రామ హరే రామ || రామ రామ హరే హరే !
హరే కృష్ణ హరే కృష్ణ || కృష్ణ కృష్ణ హరే హరే !