Monday, October 31, 2016

సౌరాష్ట్రే సోమనాధంచ..

జ్యోతిర్లింగాల ప్రస్థావన పొడిగిస్తూ ఈ రోజు సోమనాధేశ్వరుడి గురించి కొన్ని తాత్విక విష్యాలని పంచుకొంటాను. ఈ స్థలపురాణంలో ఎన్నో వైద్య, జ్యోతిష్య, ఖగోళ శాస్త్ర రహస్యాలు దాగున్నాయని మనకి తెలుస్తుంది. ఇక కధలోకి వెళితే..

అత్రి మహర్షికీ  అనసూయామాతలు దత్తాత్రేయుడు, దూర్వాసాడు వంటి మహనీయులనని పుతృలుగా పొందిన పుణ్యదంపతులు. వారి సంతానంగా చంద్రుడు పుట్టాడు. ఆయనకే ఆత్రేయుడు, శశి, ఇందు, సోమ మొదల్గు పేర్లు ఉన్నాయి. చంద్రుడు తండ్రి ఐన అత్రిమహాముని దగ్గర సకల శాస్త్రాలు నేర్చి, తదుపరి బృహస్పతి దగ్గర వేదవేదాంగాలూ నేర్చాడు. దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ వచ్చిన చంద్రుడు అసమాన సౌందర్యశీలి, పరాక్రమశీలి, అమిత తేజో సంపన్నుడు. చంద్రుడు తదనంతరం రాజసూయ, అశ్వమేధ యాగాలను జరిపి సకలదేవతలనూ సంతృప్తి పరచాడు. ఎంతో సంతసించిన బ్రహ్మ గారు గ్రహత్వాన్ని అనుగ్రహించి, సకల ఓషధులకు, జలవనరులకూ, వృక్షలకూ, అడవులకూ అధిష్టాన దేవతవగా ఉండమని దీవించాడు. అంతటి యోగ్యుడైన చక్కని వరుడు కనుకనే దక్షప్రజాపతి ఆయన 27 మంది కుమార్తెలను చంద్రుడికిచ్చి వివాహం చేసాడు. చంద్రుడు మొదట్లో తన భార్యలందరితో సఖ్యతతోనే ఉన్నా కాలక్రమేణా రోహిణి పట్ల అమితమైన ఇష్టంతో తక్కినవారిని అశ్రద్ధ చేయనారంభించాడు. రోహిణి కూడా ఈ ప్రవర్తనను వారించకపోగా తన అపురూప లావణ్య సౌందర్యాల వల్లనే తనస్వామి తనను వీడడంలేదనీ గర్వంతో ఉండి చంద్రుడిని వారించలేదు. విషయం ప్రజాపతికి తెలిసి ఒక సారి చంద్రుడిని మందలించినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు.

కాలక్రమేణా రోహిణి క్షణం కూడా విడువలేని స్థితికి వచ్చాడు చంద్రుడు. ఈ సారి దక్షుడికి తక్కిన కుమార్తెలంతా దీనంగా మొరపెట్టుకొని ఫిర్యాదు చేసారు. ప్రజాపతి ఆగ్రహోదగృడయ్యి చంద్రుడిని "క్షయ" వ్యాధి పీడితుడవ్వమని శంపించాడు. చేసిన తప్పు అప్పుడు కానీ చంద్రుడికి తెలియలేదు. రోహిణి కూడా ఇది విని తను వారించనందుకూ, పతికి కలిగిన శాపానికీ పొరలి పొరలి ఏడ్చింది. చివరకు ఎంతో మధనపడ్డాకా  లొకాంలో గల ఓషధులూ, నదులూ సముద్రాలూ క్షయించిపోతే స్రుష్టికే  వినాశం కనుక బ్రహ్మ గారు దయతలచి ప్రభాస తీర్ధంలో పరమేశ్వరుడి కోసం తపస్సు చెయ్యమని తరుణోపాయం చెప్పారు. తపస్సు చేసిన చంద్రుడికి శివుడు ప్రత్యక్షమయ్యి చేసిన అపరాధానికి ప్రజాపతి శాపం అనివార్యమని, బ్రహ్మ అంతటి వాడు కనుక ఆయన మీద గౌరవంతో దానికి ఉపసమ్హరించలేననీ చెప్పాడు. కానీ చంద్రుడు తపస్సుకు మెచ్చిన శివుడు ఇక నుంచి అందరి పట్ల సమభావంతో మసలుకోవాలని చెప్పి అమృతత్వం ఇచ్చి, క్ష్యయచే ఒక పక్షం పీడించబడ్డా మిగతా పక్షం పూర్ణత్వం సంతరించుకొంటావని చెప్పి అనుగ్రహించాడు. 


ఇక తాత్విక విష్యాలకొస్తే ... 

మహా అందగాడు చంద్రుడు. చంద్రుడు అంటే మనస్సే కనుక అది సహజంగా అందం కలిగి ఉంటుంది. పసిపిల్లలని చూడండీ ఏ కల్లాకపటం లేని ఆ స్వచ్చమైన మనస్సే చందృడు. దాని అందం ముందు ఏదైనా దిగదుడుపే!

చంద్రుడు జ్యోతిష శాస్త్రంలో మనస్సుకు కారకుడు. చంద్రబలం పుష్కలంగా ఉంటే చెక్కుచెదరి మనోనిబ్బరం అలవడుతుంది. మన మనస్సు నిత్య చంచలం. అందుకే చంద్రుడికి చెంగు చెంగున గెంతే జింకలు పూంచిన వెండి రధం వాహనం. వెండి రజో గుణాన్ని కలగజేస్తుంది. రజస్సే కోరికలకు మూలం. వృషభ రాశిలో కృత్తిక నాల్గవ పాదంలో రోహిణి నక్షత్రంలో చందృడు ఉచ్చ స్థితిని పొందుతాడని మనం జ్యోతిష్యంలో చూస్తాం. రోహిణికి రోహణ శక్తి ఉంది. అది అందంతో సమ్మోహన పరిచే శక్తి ,చెప్పనలవి కాని  ఆనందాన్నిస్తుంది. రోహిణిలో పుట్టిన కృష్ణుడే అందుకు ఉదాహరణ. ఇది లాలస స్వభావాన్నీ కలిగిస్తుంది అందుకే ఆయనకు 16000 గోపికలు ప్రియురాళ్ళయ్యారు. మనస్సుచూరగొనే ఏ వస్తువుకైనా రోహిణి ఒక ప్రతీకగా చెప్పుకోవచ్చు. 

క్షయ శాపం కృష్ణ శుక్ల పక్షాలు ఏర్పడడం ఇక్కడి ఖగోళ  రహస్యం. మతి స్థిమితం లేనివాళ్ళకి, దీర్ఘరోగాలవారికీ, క్షయరోగులకూ సోమనాధ దర్శనం అమోఘమైన ఫలితాలనిస్తుంది.

జీవితం అంటే కష్టం సుఖం, మంచీ చెడూ, అన్నీ ఉంటాయి మనస్సు మాత్రం ఎప్పుడూ సుఖాన్నే, అందమైనవాటినే కోరుకొంటుంది అది దాని లక్షణం. మన: కారకుడైన చంద్రుడు రోహిణిని కోరుకొన్నట్టు. ఇలా మనోహర విషయాలను అలవాటుపడి, విషయలాలసత్వం అలవడితే మన భాద్యతని మనం విస్మరిస్తాం (చంద్రుడు భర్తగా భాద్యత విస్మరించినట్టే ) పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి అని కూడా చూసాం.

ఇక ప్రజాపతి శాపం "క్షయ". చంద్రుడు క్షీణించడం అంటే క్షీణించడం మన మనస్సు తగ్గడమే. అంటే మోజుతీరిపోవడం లాంటిది. ఏ కొత్త వస్తువైనా మనకు మొదటలో ఎంత నచ్చినా పాతపడ్డకా మనసులో ఆసక్తి తగ్గిపోతుంది కదా ? అలాగన్నమాట !.

క్షయే కలగకపోతే ఇంక ముందుకు కదలదు మనస్సు. అందుకే క్షయా ఉండాలి, వృద్ధీ కలగాలి అని పరమేశ్వరుడు ఆశీర్వదించాడు. ప్రపంచంలో అన్నిట్లో తానుండి ఆసక్తిని పెంచి మనస్సులో ఆసాక్తిని వృద్ది చేసేదీ ఆయనే, ఆసక్తి క్షయించి వైరాగ్యాన్నిచ్చి రక్షించేదీ ఆయనే.  చేసిన తప్పుకి పశ్చాత్తాప పడ్డ చంద్రుడిని కరుణించి నెత్తిన పెట్టుకొన్న ఆ సోమనాధుడు, మనందరికీ నిశ్చలమైన మనస్సునిచ్చి వ్యామోహ వైరాగ్య ప్రభావాలని అధిగమిస్తూ జీవనయానం చెయ్యడానికి ఊతంగా నిలిస్తాడనడంలో సందేహం లేదు.


ఓం నమ:శివాయ  

ప్రభాస తీర్ధంలోని సోమనాధేశ్వరుడు


1 comment:

  1. చాలా బాగుంది. ధన్యవాదములు

    ReplyDelete