మహాభాగవతంలో వ్యాసుడు చెప్పిన కథ ఇది. ఈనాటికీ మానవాళికి ఎంతోగొప్ప సందేశాన్ని ఈ పురాణ కథ అందిస్తోంది. వివాహ సమయంలో వధూవరులకు ఈడూజోడూ కుదిరిందో లేదో చూసి పెళ్లి చేయటం తప్పనిసరని అని ఈడూ, జోడూ లేని వివాహాల వల్ల ఎన్నో అనర్ధాలు కలుగుతాయని తారాశశాంకం అనే ఈ కథ తెలియజేస్తోంది. దేవతల గురువైన బృహస్పతి భార్య తార. బృహస్పతి వృద్ధుడు. తార వయస్సులో ఉంది. బృహస్పతి నిత్యం యజ్ఞయాగాది క్రతువుల్లో నిమగ్నమై ఉండేవాడు. తార తన భర్తకు సేవలందిస్తూ ఉండేది. కానీ ఆమె యవ్వనంలో ఉండటంతో శారీరకంగా ఆమెకు కలిగిన కోరికలు తీరటానికి వీలుకలిగేది కాదు. వయస్సుతో వచ్చిన కోరికలను అణుచుకోవటానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తూనే ఆమె భర్తసేవలో నిమగ్నమై ఉండేది. ఇలా కాలం గడుస్తుండగా బృహస్పతి దగ్గర విద్య నేర్చుకోవటం కోసం అత్రి మహామునికి, అనసూయకు బ్రహ్మదేవుడి అంశ వల్ల జన్మించిన చంద్రుడు వచ్చాడు. చంద్రుడు ఎంతో అందంగా ఉండేవాడు. నవమోహనాకారుడు, సుందరుడు అయిన చంద్రుడిని చూసి తార మోహంతో వివశురాలైంది. ఎంతో కాలంగా తీరకుండా ఉన్న కోరికలను తీర్చుకోవటానికి తార చంద్రుడికి దగ్గరైంది. బృహస్పతి తరచూ యజ్ఞయాగాల కోసం దేశాంతరానికి వెళ్లడం వీరికి వీలు కలిగించింది. ఇలా ఉండగా తార గర్భవతి అయింది. అప్పుడు చంద్రుడు తారను తన వెంట తీసుకొని వెళ్లిపోయాడు. ఎక్కడికో వెళ్లి తిరిగి వచ్చిన బృహస్పతి విషయమంతా తెలుసుకొని తనభార్యను తనకు ఇవ్వమని చంద్రుడిని అడిగాడు. కానీ చంద్రుడు అందుకు ఒప్పుకోలేదు. ఆ కారణంగా చంద్రుడికి బృహస్పతికి ఘోరయుద్ధం జరిగింది. బృహస్పతికి బద్ధశత్రువైన రాక్షస గురువు శుక్రాచార్యుడు వచ్చి చంద్రుడి పక్షాన చేరాడు. దాంతో గురుశిష్యుల మధ్యన జరుగుతున్న ఆ యుద్ధం దేవదానవ యుద్ధంగా మారింది. ఇలా దేవతలకు, రాక్షసులకు సాగుతున్న పోరు విరామం లేకుండా ఉండటంతో లోకాలన్నీ తల్లడిల్లాయి. ఈ విషయాన్ని బ్రహ్మ గమనించి దేవదానవులకు యుద్ధం తగదని వివరించి యుద్ధాన్ని విరమింపజేసి శాంతింపచేశాడు. తారను బృహస్పతికి ఇచ్చి పంపివేశాడు. ఆ తరువాత కొంతకాలానికి తారకు ఒక కుమారుడు కలిగాడు. మళ్లీ చంద్రుడు వెళ్లి ఆ కుమారుడు తనవాడేనని తనకు అప్పగించమని కోరాడు. ఆ సమయలో బ్రహ్మ, రుషులు వచ్చి తారనే స్వయంగా అడిగి ఆమెకు పుట్టిన బాలుడు చంద్రుడి కుమారుడేనని తార వల్ల తెలుసుకొని ఆ శిశువును చంద్రుడికి అప్పగించారు. ఆ చంద్రుడి కుమారుడే బుధుడు. అందంలో చంద్రుడిలాగా, బుద్ధిలో బృహస్పతిలాగా భాసిల్లే బుధుడు నవగ్రహాలలో ఒకడయ్యాడు. ఈ బుధుడు నిత్య యౌవ్వనుడు. |
Tuesday, August 27, 2019
తారాశశాంకం
Sunday, August 18, 2019
సత్యహరిశ్చంద్రుడు
భారతీయ పురాణ సాహిత్యంలో ఆదర్శవంతమైన చక్రవర్తిగా మానవాళికంతటికీ మార్గదర్శకుడుగా హరిశ్చంద్రుడు కనిపిస్తాడు. హరిశ్చంద్రుడి కథ మార్కండేయ పురాణంలో వివరంగా ఉంది. త్రిశంకుడి కుమారుడు హరిశ్చంద్రుడు. సూర్యవంశ రాజుల్లో ఇతడు సుప్రసిద్ధుడు.
అయోధ్యను రాజధానిగా చేసుకొని పరిపాలిస్తుండేవాడు. ఆయన భార్య పేరు చంద్రమతి. కుమారుడు లోహితాస్యుడు. ఏకపత్నీవ్రతుడుగా, సత్యసంధుడుగా హరిశ్చంద్రుడికి తిరుగులేని పేరుంది. ఒకనాడు దేవేంద్రుడి సభలో జరిగిన ఒక సన్నివేశం హరిశ్చంద్రుడి జీవితాన్ని ఎన్నో పరీక్షలను పెట్టి, ఎన్నెన్నో మలుపులను తిప్పింది. ఇంద్రసభలో సత్యం తప్పక పలికేవారు ఎవరున్నారు? అనే ప్రశ్న ప్రస్తావనకు వచ్చింది. అప్పుడు వెంటనే అక్కడ ఉన్న వశిష్ఠుడు భూలోకంలో హరిశ్చంద్రుడు ఉన్నాడని చెప్పాడు. కానీ అక్కడ ఉన్న వశిష్ఠుడి బద్ధశత్రువు విశ్వామిత్రుడు లేచి హరిశ్చంద్రుడు సత్యవాక్య పరిపాలకుడుకాడు అని, ఆ విషయాన్ని తాను నిరూపిస్తానని హరిశ్చంద్రుడితో ఎలాగైనా అబద్ధం ఆడిస్తానని అన్నాడు.
అలా వశిష్ఠుడికి, విశ్వామిత్రుడికి పట్టుదల పెరిగింది. విశ్వామిత్రుడు తన మాట నెగ్గించుకోవటానికి ఒక రోజున హరిశ్చంద్రుడి దగ్గరకు వచ్చి తాను ఒక యజ్ఞం తలపెట్టానని దానికి ఎంతో ధనం అవసరమవుతుందని ఆ ధనం కావాలని అడిగాడు. అప్పుడు హరిశ్చంద్రుడు ఆ ధనాన్ని తాను ఇస్తానని వాగ్దానం చేశాడు. కానీ విశ్వామిత్రుడు వెంటనే ఆ ధనం తనకు ప్రస్తుతం అవసరం లేదని అవసరం వచ్చినప్పుడ అడుగుతానని చెప్పి వెళ్లిపోయాడు. అలా జరిగిన కొంతకాలానికి హరిశ్చంద్రుడు వేట కోసం అడవికి వెళ్లాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇద్దరు మాతంగ కన్యలను హరిశ్చంద్రుడి దగ్గరకు పంపాడు. ఆ కన్యలు తమ అందచందాలతో, సంగీత నాట్యాలతో హరిశ్చంద్రుడిని ఆకర్షించాలని చూశాడు. హరిశ్చంద్రుడు వారి ఆకర్షణలో పడక వారికి బహుమానాలు ఇచ్చి పంపించాలని అనుకున్నాడు. అయితే ఆ కన్యలిద్దరు తమకు బహుమానాలు అక్కర లేదని తమను వివాహం చేసుకోమని కోరారు. కానీ హరిశ్చంద్రుడు తాను ఏకపత్నీవ్రతుడినని, రెండోసారి పెళ్లిచేసుకోవటం ధర్మం కాదని ఆ కన్యలను పంపించాడు. విశ్వామిత్రుడు ఆ ఇద్దరు కన్యలను వెంటపెట్టుకొని వచ్చి హరిశ్చంద్రుడిని వారి కోరిక తీర్చమన్నాడు. హరిశ్చంద్రుడు అందుకు ఒప్పుకోలేదు. తన రాజ్యాన్నయినా వదులుకుంటానని ఏకపత్నీవ్రతాన్ని విడిచి పెట్టి అధర్మానికి పాల్పడనని చెప్పాడు. వెంటనే విశ్వామిత్రుడు తనకు రాజ్యాన్ని ఇచ్చి వెళ్లిపొమ్మని, లేదా కన్యలను పెళ్లాడమన్నాడు. హరిశ్చంద్రుడు రాజ్యాన్ని విశ్వామిత్రుడికి అప్పగించి కట్టుబట్టలతో నగరం నుంచి బయలుదేరాడు. రాజ్యం సర్వస్వాన్ని కోల్పోయిన హరిశ్చంద్రుడిని విశ్వామిత్రడు నిలదీసి గతంలో తనకు వాగ్దానం చేసిన ధనాన్ని ఇవ్వమని అడిగాడు. ప్రస్తుతం తన దగ్గర ధనం లేదని కొంత సమయమిస్తే ధనాన్ని చెల్లిస్తానని హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడిని వేడుకున్నాడు. అందుకు అంగీకరించి తనకు రావాల్సిన ధనాన్ని వసూలు చేసుకోవటానికి తన శిష్యుడైన నక్షత్రకుడు అనే వాడిని పంపాడు. హరిశ్చంద్రుడి వెనుకనే బయలుదేరిన నక్షత్రకుడు ఆ రాజును ఎన్నెన్నో కష్టాలపాలు చేశాడు. ‘సొమ్ము ఇస్తానని అనలేదు అని’ ఒక్క అబద్ధం చెప్పమని తాను వెంటనే వెళ్లిపోతానన్నాడు. కానీ హరిశ్చంద్రుడు అందుకు ఒప్పుకోక ఎన్నెన్నో కష్టాలనుభవిస్తూ చివరకు కాశీ నగరానికి చేరాడు. అక్కడ కాలకౌశికుడు అనే బ్రాహ్మణుడికి హరిశ్చంద్రుడు తన భార్యను అమ్మి దాంతో వచ్చిన ధనాన్ని నక్షత్రకుడికి ఇచ్చాడు. అయినా ఇంకా విశ్వామిత్రుడి అప్పు ఎంతో మిగిలి ఉంది. అప్పుడు హరిశ్చంద్రుడు వీరబాహుడు అనే ఒక కాటికాపరికి తానే స్వయంగా అమ్ముడు పోయి ఆ ధనాన్ని నక్షత్రకుడికి ఇచ్చాడు. అయినా హరిశ్చంద్రుడి కష్టాలు తీరలేదు.
హరిశ్చంద్రుడి భార్య అయిన చంద్రమతి కాలకౌశికుడి ఇంట్లో కష్టాలను అనుభవిస్తూ ఉండగా, అడవికి దర్భల కోసం వెళ్లిన ఆమె కుమారుడు లోహితాస్యుడు పాము కరిచి మరణించాడు. తన కుమారుడు మరణించాడని తెలుసుకొని ఆ శవాన్ని అంత్యక్రియలు చేయటానికి శవాన్ని తీసుకొని చంద్రమతి స్మశానికి వెళ్లింది. అక్కడ వీరబాహుడికి సేవకుడిగా, కాటికాపరిగా ఉన్న హరిశ్చంద్రుడు శవాన్ని దహనం చేయనీయలేదు. కాటి సుంకం చెల్లించితీరాలని చంద్రమతిని పట్టుబట్టాడు. తన దగ్గర చిల్లిగవ్వ కూడా ధనం లేదని, కాటి సుంకం కట్టలేనని అంది. అప్పుడు హరిశ్చంద్రుడు అయితే నీ మెడలో ఉన్న మంగళసూత్రాన్ని అమ్మి ఆ డబ్బుతో సుంకాన్ని చెల్లించమని హరిశ్చంద్రుడన్నాడు. ఆ మాటలకు చంద్రమతి ఆశ్చర్యపోయింది. తన మెడలోని మంగళసూత్రం తన భర్తకు తప్ప వేరొకరెవరికీ కనపడదని అది తనకు వరమని కనుక కాటికాపరిగా ఉన్నవ్యక్తి హరిశ్చంద్రుడే అయివుంటాడని అనుకుని అప్పుడు తన విషయాన్నంతా చంద్రమతి హరిశ్చంద్రుడికి చెప్పింది.
విషయం తెలుసుకుని ఎంతో బాధపడిన హరిశ్చంద్రుడు తన విధి నిర్వహణనను మాత్రం అమ్మలేదు. మంగళసూత్రం అమ్మి ధనం తీసుకురమ్మని నగరానికి పంపాడు. అంత రాత్రివేళ చంద్రమతి నగరంలోకి వెళుతుండగా ఇంకొక కష్టం వచ్చి పడింది. కాశీరాజు కుమారుడిని ఎవరో దొంగలు చంపి, అతడి దగ్గర ఉన్న ఆభరణాలను అపహరించి పారిపోతుండగా రాజభటులు ఆ దొంగలను చూసి తరుముకురాసాగారు. ఆ దొంగలు పరుగెత్తుతూ వచ్చి వారికి దారిలో ఎదురైన చంద్రమతి దగ్గర తాము దొంగతనం చేసి తెచ్చిన సొమ్ములు పడవేసి పారిపోయారు. అటుగా వచ్చిన రాజభటులు చంద్రమతే రాకుమారుడిని హత్యచేసి ధన్నాన్ని దొంగిలించిదని భావించి ఆమెను బంధించి రాజు దగ్గరకు తీసుకువెళ్లారు. రాజు ఆమెకు మరణదండన విధించటంతో రాజభటుల ఆమెను కాటికాపరిగా ఉన్న హరిశ్చంద్రుడి దగ్గరకే తీసుకువచ్చి శిక్ష అమలు చేయమన్నారు. ఆమె తన భార్య అని తెలిసినా, నిరపరాధి అని తెలిసినా రాజు ఆజ్ఞను హరిశ్చంద్రుడు అమలుపరిచాడు. అయితే హరిశ్చంద్రుడు ఖడ్గం ఎత్తి చంద్రమతి శిరస్సును తెగవేయబోగానే విచిత్రంగా ఆ ఖడ్గం ఒక పూలదండలాగా మారి చంద్రమతి మెడలో పడింది. వెంటనే దేవతలంతా అక్కడ ప్రత్యక్షమయ్యారు. విశ్వామిత్రుడు, వశిష్ఠుడులాంటి రుషులు అక్కడకు వచ్చి చేరి అబద్ధం ఆడని, ధర్మం తప్పని హరిశ్చంద్రుడిని ఎంతగానో ప్రశంసించారు. విశ్వామిత్రుడు ఓడిపోయానని ఒప్పుకోవటంతో హరిశ్చంద్రుడి మీద దేవతలంతా పుష్పవృష్ఠి కురిపించారు. ఇలా హరిశ్చంద్రుడు సర్వమానవాళికి ఆదర్శ పురుషుడయ్యాడు. సత్య నిరతిని తప్పక సత్యహరిశ్చందృడిగా పేరు పొందాడు.
Saturday, August 10, 2019
హింస - అహింస
- శ్రీ యల్లాప్రగడ మల్లికార్జున రావు గారు
- సేకరణ ఈనాడు దినపత్రిక నుంచీ
Wednesday, August 7, 2019
త్య్రంబకం
అలల సవ్వడిలో
సప్తస్వర స్వనాలను సమ్మిళితం చేస్తూ రాజమహేంద్రి కాంతకు మణిమేఖలలా భాసిల్లుతూ
పరవళ్ళు తొక్కుతూ పరవశించి పోతూ, ఉరవళ్ళు తొక్కుతూ
ఉత్సాహంతో సాగుతూ సాగర సంగమం చేస్తున్న గోదారితల్లి పుట్టిల్లు మహారాష్ట్రలోని
నాసిక్ దగ్గర ఉన్న త్య్రంబకం. తన పుట్టుకలోనే ఓ పవిత్రతను, ఓ సామాజిక ప్రయోజనాన్ని నింపుకుని అవతరించిన
గౌతమీ మాత రాజమహేంద్రి దాకా సాగి మధ్య మధ్యలో ఎన్నెన్నో తీర్ధాలను ఉపనదులను
కలుపుకుని సప్తరుషుల పేర్ల మీద ఏడు పాయలుగా ఎగసి పడుతున్న ఆనందంలా సాగర సంగమానికి
ఉరుకులెత్తటం చూస్తుంటూనే గుండెనిండా ఆనందం గంతులేస్తుంటుంది. గోహత్య మహాపాపాన్ని
ప్రక్షాళన చెయ్యటానికి పరమేశ్వరుడి శిరస్సునుండి దూకి వచ్చిన ఈ గంగను(గౌతమి) తాకిన
వారందరికీ తరతరాల పాపం నశించి పుణ్యం ఒకటికి పది రెట్లు చేకూరుతుందన్నది ఆస్థిక జన
భావన. ఈ గౌతమి ఆవిర్భావానికి, అక్కడే
పరమేశ్వరుడు త్య్రంబకేశ్వరుడై జ్కోతిర్లింగ రూపంలో వెలుగొందటానికి కారణమైన ఓ కథ
స్థల పురాణంగా ప్రచారంలో వుంది.
(త్రయంబకేశ్వర ఆలయం)
అంతేకాక అష్టాదశ పురాణాలలో ఒకటైన శ్రీ
శివమహాపురాణంలో త్య్రంబకేశ్వర మహత్యం అనే పేరున కూడా ఒక కథ కనిపిస్తుంది. కొందరు
రుషులు గౌతమ మహర్షికి గోహత్యా పాపం సంక్రమించేలా చేసి ఆ పాపం పోవటానికి
పరమేశ్వరుడిని గురించి తపస్సు చేసి ఆయన అనుగ్రహంతో గంగను భూమి మీదకు తీసుకు
రమ్మనమని చెప్పారు. గౌతముడు అలాగే చేశాడు. పరమేశ్వరుడి అనుగ్రహంతో ఆయన శిరస్సు
నుండి నేల మీదకు వచ్చిన గంగ వెంటనే ఒక స్త్రీ రూపాన్ని ధరించి అక్కడ
ప్రత్యక్షమైంది. అప్పుడు గౌతముడు ఆమెకు నమస్కరించి తన వెంట వచ్చి పాపప్రక్షాళన
చేయమని కోరాడు. పరమేశ్వరుడు కూడా ఆమెను అలాగే చెయ్యమని ఆజ్ఞాపించాడు. కానీ గంగ
కేవలం గౌతమ ముని పాపాన్ని ప్రక్షాళన చేసి మళ్ళీ వెంటనే తిరిగి తన స్థానానికి తాను
చేరుకుంటానని చెప్పింది. కానీ భక్తవత్సలుడైన మహేశ్వరుడు మానవలోకానకి ఉపకారం
చెయ్యాలని అనుకుని సూర్యుడి కుమారుడు ఇరవై ఎనిమిదవ మనువుగా పాలనలోకి వచ్చేంత వరకూ
భూమి మీదే వుండమని ఆజ్ఞాపించాడు. అందుకు గంగ భూలోకంలో తనకు అందరి కన్నా, అన్నిటికన్నా విశేషశక్తిని కలిగించటం
దానితోపాటు పరమేశ్వరుడు కూడా పార్వతితోనూ, శివగణాలతోనూ కూడి తన సమీపంలోనే ఉన్నట్లైతే తాను భూలోకంలో వుండటానికి ఎటువంటి
అభ్యంతరం లేదని, తనకు ఆ వరాన్ని
ప్రసాదించమని వేడుకుంది. ఆమె మాటలను పరమేశ్వరుడు కాదనలేకపోయాడు. గంగను ఈశ్వరుడు
అలా అనుగ్రహించిన వెను వెంటనే అక్కడికి దేవతలు, రుషులు అనేక తీర్ధాల సమూహాలు వచ్చి చేరాయి.
వారంతా పరమేశ్వరుడికి గంగకు, గౌతముడికి జయ
ధ్వానాలు పలికారు. ఆ తర్వాత బ్రహ్మ, విష్ణు తదితర దేవతలంతా ముక్త కంఠంతో పరమేశ్వరుడిని స్తుతించారు. ఈశ్వరుడప్పుడు
ప్రసన్నుడై ఏదైనా వరం కోరుకోమని అన్నాడు. ఆ మాటలకు సంతోషించి ఆ దేవతలంతా కూడా
భూమి మీద అవతరించిన గంగను భూమి మీదే వుండేలాగా చెయ్యమని ప్రార్ధించారు. అయితే
అంతలోనే గంగాదేవి కల్పించుకుని ఆ దేవతలంతా కూడా ఎందుకు భూమి మీదే వుండకూడదని
అన్నది. అయితే వారు ఆమెకు సమాధానమిస్తూ ‘‘ సింహరాశౌ యదా స్యాద్వై గురుస్సర్వ
సుహృత్తమఃతదావయం చ సర్వే త్యాగ మిష్యామో న సంశయంఏకాదశ చ వర్షాణి లోకానాం పాతకం
త్విహంక్షాలితం యద్భవేదేవం మలి నాస్స్మ గురి ద్వరే’’గురువు ఎప్పుడు సింహరాశిలో
వుంటాడో అప్పుడు తామంతా నిశ్శంసయంగా గంగలోకే వచ్చి వసిస్తామని చెప్పారు. పదకొండు
సంవత్సరాలపాటు తామంతా మానవుల పాపాలను ప్రక్షాళనం చేసే పనిలో నిమగ్నమై ఉండి
పన్నెండవ సంవత్సరంలో తమ మాలిన్యాన్ని పోగొట్టుకునేందుకే ఇలా వస్తున్నట్లు కూడా
చెప్పారు. సింహంలో గురుడు వున్నంతవరకు తాము గంగలో వుంటామని, అప్పుడు శంకురుడిని దర్శించి తమ పాపాలను
కడిగేసుకుంటామని ఆ తరువాత కూడా గంగ అనుమతిని పొంది మాత్రమే తమ తమ నెలవులకు
వెళ్తామని దేవతలంతా గంగాదేవికి చెప్పారు. ఆ మాటలకు గంగ ఎంతో సంతోషించింది.
ఆనాటినుండి ఆ ప్రదేశంలో పరమేశ్వరుడు తన గణాలతోనూ, పార్వతితోనూ త్య్రంబకేశ్వరుడుగా అవతరించాడు.
సంస్కృత భాషలో అంబకము అనే పదానికి కన్ను అనే అర్ధం ఉంది. మూడు కన్నులు గలవాడు కనుక
ఆయన త్య్రంబకుడయ్యాడు. గంగ కూడా ఆనాటినుండే గౌతమిగా మారిపోయింది. అంటే గౌతమ మహర్షి
తపస్సు చేయగా అవతరించిన కారణంగా ఆ పేరు స్థిరపడింది. ఆనాటినుండే గురువు సింహరాశిలో
వుండగా సర్వతీర్ధాలు, దేవతలు అక్కడకు
రావటం ప్రారంభించారు. అదే పుష్కర సుమయమైంది. అలా గౌతమీనది అవతరణ, త్య్రంబకేశ్వర జ్యోతిర్లింగ ఆవిర్భావం
జరిగినట్లుగా శివపురాణంలోని గౌతమి మహాత్యం అనే కథ వివరిస్తుంది. త్య్రంబకేశ్వర
జ్యోతిర్లింగ మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో ఉంది. ఈ నాసిక్‌కు కూడా స్థల
పురాణముంది. సీతారామలక్ష్మణులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో బ్రహ్మగిరికి సమీపంలో
వుండగా శూర్పణఖ తారసిల్లింది. ఆమె ఆగడాలను సహించలేని లక్ష్మణుడు ఆమె నాసికను,
చెవులను ఇక్కడే
ఖండించాడని ఆ కారణంగానే ఈ ప్రదేశానికి నాసిక్ అని పేరు వచ్చిందని పెద్దలు
పేర్కొంటున్నారు.
- శ్రీ యల్లాప్రగడ మల్లికార్జున రావు గారు
- సేకరణ ఈనాడు దినపత్రిక నుంచీ
Saturday, August 3, 2019
కేశవుడు
ఆ గుర్రం చివరకు కృష్ణుడి కంట్లో పడింది. అది సాధారణమైన గుర్రం కాదని రాక్షసుడని కృష్ణుడు గ్రహించాడు. వెంటనే ఆ గుర్రం మీదకు లంఘించాడు. ఆ గుర్రం కోపావేశంతో ముందరి కాళ్లను ఎత్తి గట్టిగా కృష్ణుడిని తన్నింది. అయితే ఏమాత్రం ఆ దెబ్బకు చలించక దాని ముందరి రెండు కాళ్లు పట్టి ఒక్కసారి విసురుగా పైకెత్తి ఆ గుర్రాన్ని నేలకేసి కొట్టాడు కృష్ణుడు. ఆ దెబ్బతో ఆ రాక్షసుడు కొద్దిసేపు అచేతనంగా నేల మీద పడినా మళ్లీ వెంటనే శక్తిని పుంజుకుని కృష్ణుడి మీదకు దూకాడు. ఈసారి శ్రీకృష్ణుడు తన ఎడమ చేతిని ఆ గుర్రం నోట్లో గట్టిగా తిప్పడంతో వాడిగా ఉన్న దాని దంతాలన్నీ జారి నేల మీద పడ్డాయి. గుర్రం నోట్లో ఉన్న కృష్ణుడి చెయ్యి క్షణక్షణానికి ఉబ్బినట్లుగా అయి కేశికి పిరాడలేదు. వెంటనే ఆ రాక్షసుడు నోరు చీలి కిందపడి చచ్చాడు. రాక్షసుడి పీడ విరగడ కావడంతో గోపాలకులంతా ఆనందంతో పొంగిపోయారు. ఇలా కేశి అనే రాక్షసుడు సంహరించడం వల్లనే శ్రీకృష్ణుడికి కేశవుడు అనే పేరు వచ్చింది. కంసుడు పంపిన రాక్షసుల్లో అరిష్టుడు అనే రాక్షసుడు భయంకరమైన వృషభ రూపంలో వచ్చి కృష్ణుడిని వధించాలని ప్రయత్నించగా ఆ వృషభాసురుడిని కూడా అవలీలగా కృష్ణుడు సంహరించాడు. అలాగే వ్యోమాసురుడు అనే రాక్షసుడు కృష్ణ సంహర లక్ష్యంతో వచ్చాడు. ఆ రాక్షసుడు మయుడికి కుమారుడు. ఎన్నో మాయలు సృష్టిస్తూ గోప బాలకులను ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. ఒకరోజున వాడు గోపబాలకులందరినీ బంధించి తీసుకువెళ్లి ఒక కొండ గుహలో దాచిపెట్టి ఆ గుహ ద్వారాన్ని పెద్ద బండరాయితో మూసివేశాడు. కృష్ణుడు ఈ విషయాన్ని గ్రహించి వ్యోమాసురుడి మీదకు వెళ్లాడు. ఆ రాక్షసుడు తన శరీరాన్ని విపరీతంగా పెంచి తన బలానంతా ప్రదర్శించాడు. అయితే కృష్ణుడు ఎంత మాత్రం చలించకుండా ఆ రాక్షసుడిని పట్టి తన భుజబలంతో మట్టి కరిపించాడు. ఆ తరువాత గుహ ద్వారానికి అడ్డంగా పెట్టి ఉన్న బండను తొలగించి గోప బాలకులందరినీ రక్షించాడు. ఇలా చిన్నతనంలోనే బాలకృష్ణుడు తన ఎన్నెన్నో మాయలను చూపి శిష్టరక్షణ దుష్ట శిక్షణ చేశాడు.
- శ్రీ యల్లాప్రగడ మల్లికార్జున రావు గారు
- సేకరణ ఈనాడు దినపత్రిక నుంచీ
Subscribe to:
Posts (Atom)