Showing posts with label గురుకటాక్షం. Show all posts
Showing posts with label గురుకటాక్షం. Show all posts

Tuesday, April 30, 2019

గురుకటాక్షం






ఒకరోజొక భక్తుడు పరమాచార్య స్వామివారితో, “గురు అనుగ్రహం ఇంకా కలగలేదు అందుకే మా అమ్మాయి పెళ్ళి ఆలస్యం అవుతోంది అని జ్యోతిష్కులు చెబుతున్నారు” అని దిగులుగా స్వామివారికి చెప్పుకున్నాడు. 

శ్రీమఠం భక్తుడు తెడియుర్ వంచి అయ్యర్ అప్పుడు అక్కడే నిలబడి ఉన్నాడు. వెంటనే అతణ్ణి స్వాంతనపరుస్తూ ప్రేమతో, “నువ్వు చెబుతున్నది తప్పు. గురు కటాక్షం లభించింది. నువ్వు ప్రత్యక్ష గురు స్వరూపమైన పరమాచార్య సన్నిధికి వచ్చావు. కాబట్టి నీకు పూర్తిగా గురు కటాక్షం లభించింది. కాబట్టి ఇక ఏ అడ్డంకులు ఉండవు. మీ అమ్మాయి వివాహం త్వరలోనే జరుగుతుంది” అని చెప్పారు. 

అవని మాసంలో ఇక పదిహేను రోజులే ఉన్నాయి. మరి ఈ అవని మాసం ముగిసే లోపల వివాహం ఎలా జరుగుతుంది? ఎందుకంటే తరువాత వచ్చే పురట్టాసి, ఐప్పసి, కార్తిగై(కార్తీకం), మార్గళి(ధనుర్మాసం) మాసాలు దాటిన తరువాతనే పెళ్ళి విషయాలు మాట్లడుకోగలం. ఇలా మనసులో పరి పరి విధాలుగా ఆలోచిస్తున్నాడు అమ్మాయి తండ్రి. 

పరమాచార్య స్వామివారి అనుగ్రహ వీక్షణం, సమ్మతం వంచి అయ్యర్ మాటల ద్వారా కలిగింది. అనుకోకుండా ఒకటి రెండు రోజుల తరువాత నిశ్చితార్థం జరిగింది. కొద్దిరోజులలోనే మాంగల్యధారణ వేడుక కూడా జరిగిపోయింది. కొత్త పెళ్ళి జంటను తీసుకుని వచ్చి ఆ భక్తుడు పరమ సంతోషంతో మహాస్వామి వారికి సాష్టాంగం చేసాడు. 

లేచి నిలబడి స్వామివారికి నమస్కరించి, ”ఇంత త్వరగా పెళ్ళి నిశ్చయం అవ్వడం వల్ల నేనే స్వయంగా వచ్చి ఈ విషయం మీకు చెప్పలేక పోయాను పెరియవా. నన్ను క్షమించండి; కేవలం మీ కరుణాకటాక్షం వల్ల మంచి ఇంటి నుండు అబ్బాయి లభించాడు. ఇంత త్వరగా పెళ్ళి కూడా జరిగిపోయింది. . . ” అని ఆనందంతో చెప్పుకున్నాడు.

ఎప్పటిలాగే స్వామివారు చెయ్యెత్తి వారినందరిని ఆశీర్వదించి పంపారు.

--- మహాపెరియవాళ్ – దరిశన అనుభవంగళ్ 3

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం