Thursday, November 17, 2016

ఉజ్జైన్యాం మహాకాళం





(ఉజ్జయిని మహాకాళేశ్వరుడు)


అందరికీ నమస్కారం.

ఈ రోజు మూడవ జ్యోతిర్లింగమైన మహాకాళేశ్వరుడి గురించి తెలుసుకుందాం. ఉజ్జయినిలో ఉన్న ఈ క్షేత్రం కూడా శ్రీశైలంలాగే శక్తిపీఠంతో కూడిన జ్యోతిర్లింగ క్షేత్రం, అందుచేత మహా విశేషమైనటువంటిది. ఉజ్జయిని నగరం యుగపురుషుడైన విక్రమార్కచక్రవర్తి రాజధాని.  విక్రమార్కుడి ఆస్థానంలోనివాడూ ఆయనకు ఆప్తమితృడూ ఐన కాళిదాసుని కరుణించి కటాక్షించిన కాళికా అమ్మవారు ఈ క్షేత్రంలోని అమ్మవారే. కాళికా వరప్రసాది కనుకనే 'కాళి 'దాసు ఐనాడు. ఇక స్థలపురాణంలోకెళితే పూర్వం ఉజ్జయినికి దగ్గరలో 'రత్నమాలా' అనే పర్వతం ఉండేది దానిపై 'దూషణుడు' అనే రాక్షసుడు ఉండేవాడు. బ్రహ్మ ఇచ్చిన వరముచే గర్వితుడై బుధజనపీడాపరుడై, లోకకంటకుడై ప్రవర్తించేవాడు. అదే కాలంలో ఉజ్జయినిలో 'వేదప్రియుడు' అనే బ్రాహ్మణుడు ఉండేవాడు.  ఆయన యఙ్ఞయాగాది కర్మలను ఆచరించేవాడు, విశేషించి శివభక్తుడు. ఆయనకు నలుగురు కుమారులు. వేదప్రియుడు ఆయన నలుగురు కుమారులూ పరమశివభక్తులు. దూషణుడు అతని రాక్షస పరివారం ఉజ్జయిని మీద ఒకసారి విరుచుకుపడ్డారు. ప్రజలను భయభ్రాంతులని చేస్తూ ఇల్లు ఇల్లూ నాశనం చేయసాగారు. యఙ్ఞ యాగాది క్రతువులను నాశనం చేయసాగారు. వేదప్రియుడి ఇంట్లో వేదప్రియుడు తన నలుగురుకుమారులతో పార్ధివ శివలింగానికి పూజ చేస్తున్నాడు. రాక్షసుడు పెద్దగా అరుస్తూ ఇంటప్రవేశించి నాశనం చేస్తున్నా పూర్తి ఏకాగ్ర చిత్తంతో వారు పూజలోనే నిమగ్నమై ఉన్నారు. దూషణుడు వేదప్రియుడిని చంపబోయాడు. ఈ చర్య పార్ధివలింగమూర్తి ఐన పరమేశ్వరుడికి తీవ్ర కోపం తెప్పించింది. ఆయన క్షణంలో ప్రళయరుద్రుడయ్యాడు. లింగం నుంచీ ఒక్క హుంకారం చేశాడు ఆ వేడి నిష్వాశకు రాక్షసుడితో సహా రాక్షససేన మొత్తం మరణించారు. ఆ మహారౌద్రమూర్తి వేదప్రియుడి అచంచల భక్తికీ, అతని కుమారుల భక్తికీ ప్రసన్నుడై ఏదైనా వరంకోరుకోమన్నాడు. అందుకు వెదప్రియుడు తనని కాచిన స్వామి లోకులందరినీ కటాక్షిస్తూ అక్కడే ఉండమని కోరుకోగా స్వామి వెలిసారని స్థలపురాణం.

ఇక తాత్వికంగా స్థలపురాణాన్ని పరిశీలిస్తే..

కేవలం ఉజ్జయిని మహాకాళేశ్వరుడినీ అన్న దృష్టితో కన్నా నిన్న మొన్నటి సోమనాధ శ్రీశైల క్షేత్రాల పరంపరలోఅందుకు కొనసాగింపుగా కధని పరిశీలిస్తే చక్కగా అన్వయమౌతుంది.  మనస్సు, దాని స్వభావం, నిగ్రహం అన్నిటా సమభావం అలవరచుకోడం ఆధ్యాత్మిక సాధనలో తొలి అడుగైతే. ఆ మనస్సులో భక్తిని పెంచి భక్తితత్వంలో పరాకాష్టకు చేరుకోడం రెండవ మెట్టు. ఇహ అలా సాధన సాగుతుంటే ఈ రోజు స్థలపురాణం తాత్వికంగా సందర్భోచితంగా ఉంటుంది. రాక్షసుడి పేరు 'దూషణుడు ' అంటే దూషణ భావం అన్నమాట. రాక్షససేనంతా తదనుబందమైన ఈర్ష్యాది చెడుభావనలే. మనస్సునిండా భక్తి వెల్లివిసిరిన సాధకుడి చేష్టితాలన్నీ 'వేదప్రియం'గానే ఉంటాయి. ఇక్కడ వేదప్రియుడు నిత్యం యఙ్ఞాదిక్రతువులను ఆచరించడం అంటే వేదోక్త కర్మలను ఆచరించడమే. వేదప్రియుడి కుమారులంటే భక్తి ఫలితంగా కలిగే ఇతర ఫలాలు. ఙ్ఞాన, వైరాగ్యాలు తదితరమైనవి. ఆ ఫలాలు వేదప్రియుడికి కుమారులు శివపూజలో తోడైనట్టు సాధకుడికి ఆధ్యాత్మిక పురోగతిలో ఉపకరిస్తాయి. అటువంటి భక్తుడికి అవరోధంగా ఏ 'దూషణుడు' అడ్డు తగిలినా ఆ పరమాత్మే ఆ అవరోధాలన్నిటినీ తొలగించి రక్షిస్తాడన్న సందేశం మనకు భరోసానిస్తుంది. సాధకుడికి ఈ భరోసా ముఖ్యం. కారణం మనస్సుకు సంశయం ఒక సహజమైన బలహీనత.  అది సహజంగా సంశయాత్మకమైన మనస్సులో అపనమ్మకాలను మాయంచేసి భక్తిని మరింత దృఢభక్తిగా చేస్తుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా మరేం పర్లేదు నేనే నీకు మోక్షం కూడా ఇస్తా అంటూ "సర్వ ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణంవ్రజ అహం త్వం సర్వపాపేభ్యో మోక్షయైష్యామి మా సుచ:" అని భరోసా ఇచ్చాడు.


ఓం నమశ్శివాయ

Monday, November 14, 2016

శ్రీశైలే మల్లికార్జునం

Image result for srisaila mallikarjuna
శ్రీశైల మల్లికార్జునుడు



అందరికీ నమస్కారం


ఈ రోజు రెండవ జ్యోతిర్లింగమూర్తి ఐన శ్రీశైలమల్లికార్జునస్వామి గురించి తెలుసుకుందాము. శ్రీశైల క్షేత్రం చాలా విశిష్టమైనది కారణం జ్యోతిర్లింగక్షేత్రమవ్వడంతోపాటూ ఇది శక్తిపీఠం కూడా. ఇలా జ్యోతిర్లింగమూర్తి శక్తిపీఠంతో కలిసి ఉన్న క్షేత్రాలు మూడే మూడు. విశ్వేశ్వర విశాలాక్షులు వారణాశిలో, మహాకాళేశ్వరమహాకాళికలు ఉజ్జైనిలో మళ్ళీ భ్రరమరాంభామల్లికార్జునులు శ్రీశైలంలో. అందుకే ఇది దక్షిణకైలాసమని అని కూడా అంటారు. శ్రీశైలప్రాంతం భూమికి నాభి భాగమని చెబుతారు, భౌగోళికంగానే కాదు పారమర్ధికంగానూ ఈ శైవక్షేత్రానిది కీలకమైన స్థానం కాశీ మకుటాయమానమైతే శ్రీశైలాం హృదయసమానమైనది. ఆలాంటి శ్రీశైలక్షేత్రం గురించి ఎంత క్లుప్తంగా చెప్పాలన్న ఒక్క టపా చాలదు. ప్రస్తుత విషయం తాత్విక పరిశీలన కనుక కేవలం దానినే ప్రస్తావించుకొందాం. ఈ క్షేత్రానికి అనేక స్థలపురాణగాధలున్నాయి, వాటిలో కొన్ని వ్యత్యాసాలున్నప్పటికీ అన్నిటిలోనూ కనిపిచ్చే కధమాత్రం ఒకటుంది. పూర్వం శిలాదుడనే మహర్షి పరమేశ్వరుడి గురించి ఘోరతపస్సు చేసి పుతృలను వరంగా అడుగగా నందీశ్వరుడు, పర్వతుడు అనే ఇద్దరిని శివుడు ప్రసాదించాడు. నందీశ్వరుడు స్వామికి వాహనంకాగా పర్వతుడు తండ్రిలాగా మరల తపస్సు చేసి శివసాక్షాత్కారం పొందాడు. శివుడు మెచ్చి సాయుజ్యముక్తిని అనుగ్రహించాడు. అదిపొందినా పర్వతుడు మరొక వరాన్ని కోరాడు అదేమిటంటే తనకే కాదు లోకంలో అందరూ ముక్తిని పొందాలి, అందరూ తరించాలి అని. అందుకని తను శైల రూపధారియై ఉండగా స్వామి తన పై కొలువై ఉండి భక్తులను అనుగ్రహించాలని. ఈ మాటకు పరమశివుడు పరవశించిపోయాడు. అతిప్రసన్నుడై కేవలం తనుమాత్రమే కాదు ముక్కోటి దేవతలూ, సకల ఓషధులూ, సకల తీర్ధాలు కూడా తనపై ఉంటారని వరమిచ్చాడు. ఆవిధంగా జ్యోతిర్లింగ ఆవిర్భావం జరిగిందని స్కాందపురాణంలో ఉంది. సహజంగా ప్రకృతి మాతృత్వ సున్నితత్వం కలది కనుక పుష్పంతో పురుషుడిని తుమ్మెదతో పోల్చటం పరిపాటి. కానీ ఇక్కడ స్వామి పుష్ప రూపమైతే అమ్మవారు తుమ్మెద రూపంలో విరాజిల్లడం చాలా గమ్మత్తైన విషయం. మా నాన్నగారు ఇక్కడ ఉద్యోగం చెయ్యడం వల్ల రెండు పర్యాయాలు సందర్శించే భాయం కలిగింది. ఆలయప్రాంగణం చుట్టూ నాగమల్లి వృక్షాలు తుమ్మెదల ఝుంకారాలూ చూడచ్చు, వినచ్చు.

ఇక తాత్విక విషయాలకొస్తే..

"శ్రీ" అన్న పదానికి లక్ష్మి అని లోకప్రసిద్ధం. కానీ చాలా మంది అనుకునేది లక్ష్మి సిరిసంపదలకు అధిష్టాన దేవత అని. నిజానికి ఈశ్వరుడే అసలైన శాస్వత ఐశ్వర్యాలనిస్తాడు. "ఈశ్వరస్య భావం ఐశ్వర్యం" అని అమరకోశం వ్యాక్ష్యానించింది. ఈశ్వరుడు నాకున్నాడన్న భావనొక్కటే ఐశ్వర్యం మిగిలినవేవీ కావు. మరి లక్ష్మో? లక్ష్మి అర్ధాన్ని ఇస్తుంది. చతుర్విదపురుషార్ధాలో  "అర్ధం" ఇచ్చేది ఆవిడ. ఉదాహరణకి కిమర్ధం ? అంటే దేనికోసం అని అర్ధం. అర్ధం అంటే ప్రయోజనం అన్నమాట. సర్వకామన సఫలీకృతార్ధం అంటే కోరికలన్నీ ఈడేరడం అందు"కోసం" అనే కదా. అదీ ప్రయోజనమే. జీవనయానంలో ప్రయోజనలాననిచ్చి ధర్మమికంగా కామనలు తీర్చుకొని మోక్షగాములవ్వడానికి సహాయపడుతుంది. అర్ధ కామాలు అసలు ప్రయోజనం కానే కావు. కానీ అసలు లక్ష్మి దేనినిస్తుంది, లేక లక్ష్మిని మనం ఏమి అడగాలి అంటే. భక్తికి అధిష్టాన దేవత ఆవిడే కనుక భక్తినే మనం అడగలసి ఉంటుంది. తను ఆసీనురాలైన కమలం ఎలా సూర్యుడిని చూసి విచ్చుకొంటుందో, మన మనస్సుకూడా ఆ స్వయంప్రకాశమైన పరమాత్మ ప్రకాశాన్ని గుర్తించి అలా విచ్చుకొనేలా చేస్తుంది. అందుకే "కమలాసనస్థితా లక్ష్మీ:". శ్రీ అంటే మరి భక్తే కనుక శ్రీకారం చుట్టడమంటే ఏ విష్యాన్ని ప్రారంభించే ముందైనా దాని యందు శ్రద్ధాభక్తులను అలవరచుకోడమే ఔతుంది. ఇక "శ్రీశైలం" అంటే కొండంత భక్తి అని తర్జుమా ఔతుంది. 

భక్తికి రాశీభూతమే ఆ పర్వతుడు. పర్వతుడిది లోకహితం కోరే పరిపక్వమైన భక్తే కాకపోతే తంకు ముక్తినిచ్చాకా కూడా ఇంక అడదగాడిని వేరు వరమేముంటుంది ? ఈ పరిపక్వతే పరమేశ్వరుడి ప్రీతినిస్తుంది.తత్ ఫలితంగా తనే కాదు కైసాలమే కదలివచ్చింది.

సాధకుడి హృదయకమలం బాగా విరిసి భక్తి అనే తేనె స్రవిస్తుంటే గండుతుమ్మెదలు రాకుండా ఉంటాయా ? అదే భ్రమరాంబికా అవతార విశేషం.

"శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే" శిఖరమనగా కొన, చివర, పతాకస్థాయి. శ్రీశైలమే రాశీభూతమైన భక్తి కనుక భక్తిలో పతాకస్థాయిని సాధకుడు చూస్తే ఇక మళ్ళీ జన్మంటూ ఉండదు. నిజమైన భక్తి పర్వతుడిలా వర్ణ, వర్గ, జాతి, మత, తర, తమ, లింగ, వయోభేదాలకతీతంగా అందరినీ ఒక్కటిగా చూసే స్థితినిస్తుంది. అదే కైవల్యము. భగవాన్ రమణులు కూడా ఆయనకు అన్న పానాదుల్లో ఏమాత్రం ఇతరులకన్నా ప్రాతినిధ్యమిచ్చినా కోపగించుకొనే వారు. ఆయనతో సహా అందరినీ ఒకే రీతిలో చూడాలని చెప్పేవారుట. అదే శ్రీశైల శిఖరం.

ఓం నమశ్శివాయ:


Monday, October 31, 2016

సౌరాష్ట్రే సోమనాధంచ..

జ్యోతిర్లింగాల ప్రస్థావన పొడిగిస్తూ ఈ రోజు సోమనాధేశ్వరుడి గురించి కొన్ని తాత్విక విష్యాలని పంచుకొంటాను. ఈ స్థలపురాణంలో ఎన్నో వైద్య, జ్యోతిష్య, ఖగోళ శాస్త్ర రహస్యాలు దాగున్నాయని మనకి తెలుస్తుంది. ఇక కధలోకి వెళితే..

అత్రి మహర్షికీ  అనసూయామాతలు దత్తాత్రేయుడు, దూర్వాసాడు వంటి మహనీయులనని పుతృలుగా పొందిన పుణ్యదంపతులు. వారి సంతానంగా చంద్రుడు పుట్టాడు. ఆయనకే ఆత్రేయుడు, శశి, ఇందు, సోమ మొదల్గు పేర్లు ఉన్నాయి. చంద్రుడు తండ్రి ఐన అత్రిమహాముని దగ్గర సకల శాస్త్రాలు నేర్చి, తదుపరి బృహస్పతి దగ్గర వేదవేదాంగాలూ నేర్చాడు. దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ వచ్చిన చంద్రుడు అసమాన సౌందర్యశీలి, పరాక్రమశీలి, అమిత తేజో సంపన్నుడు. చంద్రుడు తదనంతరం రాజసూయ, అశ్వమేధ యాగాలను జరిపి సకలదేవతలనూ సంతృప్తి పరచాడు. ఎంతో సంతసించిన బ్రహ్మ గారు గ్రహత్వాన్ని అనుగ్రహించి, సకల ఓషధులకు, జలవనరులకూ, వృక్షలకూ, అడవులకూ అధిష్టాన దేవతవగా ఉండమని దీవించాడు. అంతటి యోగ్యుడైన చక్కని వరుడు కనుకనే దక్షప్రజాపతి ఆయన 27 మంది కుమార్తెలను చంద్రుడికిచ్చి వివాహం చేసాడు. చంద్రుడు మొదట్లో తన భార్యలందరితో సఖ్యతతోనే ఉన్నా కాలక్రమేణా రోహిణి పట్ల అమితమైన ఇష్టంతో తక్కినవారిని అశ్రద్ధ చేయనారంభించాడు. రోహిణి కూడా ఈ ప్రవర్తనను వారించకపోగా తన అపురూప లావణ్య సౌందర్యాల వల్లనే తనస్వామి తనను వీడడంలేదనీ గర్వంతో ఉండి చంద్రుడిని వారించలేదు. విషయం ప్రజాపతికి తెలిసి ఒక సారి చంద్రుడిని మందలించినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు.

కాలక్రమేణా రోహిణి క్షణం కూడా విడువలేని స్థితికి వచ్చాడు చంద్రుడు. ఈ సారి దక్షుడికి తక్కిన కుమార్తెలంతా దీనంగా మొరపెట్టుకొని ఫిర్యాదు చేసారు. ప్రజాపతి ఆగ్రహోదగృడయ్యి చంద్రుడిని "క్షయ" వ్యాధి పీడితుడవ్వమని శంపించాడు. చేసిన తప్పు అప్పుడు కానీ చంద్రుడికి తెలియలేదు. రోహిణి కూడా ఇది విని తను వారించనందుకూ, పతికి కలిగిన శాపానికీ పొరలి పొరలి ఏడ్చింది. చివరకు ఎంతో మధనపడ్డాకా  లొకాంలో గల ఓషధులూ, నదులూ సముద్రాలూ క్షయించిపోతే స్రుష్టికే  వినాశం కనుక బ్రహ్మ గారు దయతలచి ప్రభాస తీర్ధంలో పరమేశ్వరుడి కోసం తపస్సు చెయ్యమని తరుణోపాయం చెప్పారు. తపస్సు చేసిన చంద్రుడికి శివుడు ప్రత్యక్షమయ్యి చేసిన అపరాధానికి ప్రజాపతి శాపం అనివార్యమని, బ్రహ్మ అంతటి వాడు కనుక ఆయన మీద గౌరవంతో దానికి ఉపసమ్హరించలేననీ చెప్పాడు. కానీ చంద్రుడు తపస్సుకు మెచ్చిన శివుడు ఇక నుంచి అందరి పట్ల సమభావంతో మసలుకోవాలని చెప్పి అమృతత్వం ఇచ్చి, క్ష్యయచే ఒక పక్షం పీడించబడ్డా మిగతా పక్షం పూర్ణత్వం సంతరించుకొంటావని చెప్పి అనుగ్రహించాడు. 


ఇక తాత్విక విష్యాలకొస్తే ... 

మహా అందగాడు చంద్రుడు. చంద్రుడు అంటే మనస్సే కనుక అది సహజంగా అందం కలిగి ఉంటుంది. పసిపిల్లలని చూడండీ ఏ కల్లాకపటం లేని ఆ స్వచ్చమైన మనస్సే చందృడు. దాని అందం ముందు ఏదైనా దిగదుడుపే!

చంద్రుడు జ్యోతిష శాస్త్రంలో మనస్సుకు కారకుడు. చంద్రబలం పుష్కలంగా ఉంటే చెక్కుచెదరి మనోనిబ్బరం అలవడుతుంది. మన మనస్సు నిత్య చంచలం. అందుకే చంద్రుడికి చెంగు చెంగున గెంతే జింకలు పూంచిన వెండి రధం వాహనం. వెండి రజో గుణాన్ని కలగజేస్తుంది. రజస్సే కోరికలకు మూలం. వృషభ రాశిలో కృత్తిక నాల్గవ పాదంలో రోహిణి నక్షత్రంలో చందృడు ఉచ్చ స్థితిని పొందుతాడని మనం జ్యోతిష్యంలో చూస్తాం. రోహిణికి రోహణ శక్తి ఉంది. అది అందంతో సమ్మోహన పరిచే శక్తి ,చెప్పనలవి కాని  ఆనందాన్నిస్తుంది. రోహిణిలో పుట్టిన కృష్ణుడే అందుకు ఉదాహరణ. ఇది లాలస స్వభావాన్నీ కలిగిస్తుంది అందుకే ఆయనకు 16000 గోపికలు ప్రియురాళ్ళయ్యారు. మనస్సుచూరగొనే ఏ వస్తువుకైనా రోహిణి ఒక ప్రతీకగా చెప్పుకోవచ్చు. 

క్షయ శాపం కృష్ణ శుక్ల పక్షాలు ఏర్పడడం ఇక్కడి ఖగోళ  రహస్యం. మతి స్థిమితం లేనివాళ్ళకి, దీర్ఘరోగాలవారికీ, క్షయరోగులకూ సోమనాధ దర్శనం అమోఘమైన ఫలితాలనిస్తుంది.

జీవితం అంటే కష్టం సుఖం, మంచీ చెడూ, అన్నీ ఉంటాయి మనస్సు మాత్రం ఎప్పుడూ సుఖాన్నే, అందమైనవాటినే కోరుకొంటుంది అది దాని లక్షణం. మన: కారకుడైన చంద్రుడు రోహిణిని కోరుకొన్నట్టు. ఇలా మనోహర విషయాలను అలవాటుపడి, విషయలాలసత్వం అలవడితే మన భాద్యతని మనం విస్మరిస్తాం (చంద్రుడు భర్తగా భాద్యత విస్మరించినట్టే ) పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి అని కూడా చూసాం.

ఇక ప్రజాపతి శాపం "క్షయ". చంద్రుడు క్షీణించడం అంటే క్షీణించడం మన మనస్సు తగ్గడమే. అంటే మోజుతీరిపోవడం లాంటిది. ఏ కొత్త వస్తువైనా మనకు మొదటలో ఎంత నచ్చినా పాతపడ్డకా మనసులో ఆసక్తి తగ్గిపోతుంది కదా ? అలాగన్నమాట !.

క్షయే కలగకపోతే ఇంక ముందుకు కదలదు మనస్సు. అందుకే క్షయా ఉండాలి, వృద్ధీ కలగాలి అని పరమేశ్వరుడు ఆశీర్వదించాడు. ప్రపంచంలో అన్నిట్లో తానుండి ఆసక్తిని పెంచి మనస్సులో ఆసాక్తిని వృద్ది చేసేదీ ఆయనే, ఆసక్తి క్షయించి వైరాగ్యాన్నిచ్చి రక్షించేదీ ఆయనే.  చేసిన తప్పుకి పశ్చాత్తాప పడ్డ చంద్రుడిని కరుణించి నెత్తిన పెట్టుకొన్న ఆ సోమనాధుడు, మనందరికీ నిశ్చలమైన మనస్సునిచ్చి వ్యామోహ వైరాగ్య ప్రభావాలని అధిగమిస్తూ జీవనయానం చెయ్యడానికి ఊతంగా నిలిస్తాడనడంలో సందేహం లేదు.


ఓం నమ:శివాయ  

ప్రభాస తీర్ధంలోని సోమనాధేశ్వరుడు


Wednesday, April 27, 2016

తిలోత్తమ జననం

(పారిస్ లో గల గుయిమెట్ మ్యూజియంలో గల సుందోపసుందుల వృత్తాంతం తెలిపే శిల్పం)

ఎంతటి అన్నదమ్ములైనా, ఒకే తల్లిదండ్రులకి పుట్టినా జీవితంలో ఎప్పుడైనా ఒక సమయంలో మనస్పర్ధలూ, ఈర్ష్యాద్వేషాలూ రావచ్చు. అలా రాకుండా ఉండాలంటే తగిన విధంగా ధర్మ మార్గంలో ప్రవర్తించాలి అని సందేశం ఇచ్చే కధ మనకు మహాభారతంలో కనిపిస్తుంది.

ద్రౌపది స్వయంవరం తరువాత పాండవులు కుంతితో కలిసి హస్తినకు వచ్చారు. దృతరాష్టృడిచ్చిన  అర్ధ రాజ్యాంలో ఖాండవ ప్రస్థంలో ఇంద్ర ప్రస్థానపురాన్ని ఏర్పర్చుకొని పాండవులు రాజ్యమేలుతుండగా ఒక సారి అక్కడికి నారదుడు వచ్చాడు. ధర్మరాజు చేసిన అతిధి పూజలను అందుకొన్నాకా ద్రౌపది లేని సమయం చూసి పాండవులకి ఒక కధను చెప్పాడు.

పూర్వం నికుంభుడనే రాక్షసుడికి సుందుడు ఉపసుందుడు అనే ఇద్దరు కుమారులు జన్మించారు. ఇద్దరూ ఒకరిపట్ల ఒకరు అమితమైన ప్రేమానురాగాలు కలిగి ఉండేవారు. రాక్షసులైనా బ్రహ్మను గురించి కఠోర తపస్సు చేయతలపెట్టి వింధ్యపర్వతాలకు వెళ్ళారు. ఆ సోదరుల తపోదీక్షకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. కామరూపం, కామగమనం, అమరత్వం, సకలమాయలూ మొదలైన వరాలని వారు కోరుకొన్నారు. పుట్టిన ప్రాణి గిట్టక మానదు కావున అమరత్వం ఇవ్వడం కుదరదని చతుర్ముఖుడు చెప్పాడు. వారిరివురకీ ఒకరి పట్ల ఒకరికి అమితమైన ప్రేమాభిమానాలున్నాయి కనుక ఇద్దరూ ఒక వరం అడిగారు. ఇతరులెవ్వరి వలనా మరణం లేకుండే స్థితి కోరుకొన్నారు.. వారికి బ్రహ్మ ఇచ్చిన శక్తుల వల్ల పులులూ, ఏనుగుల రూపాలు ధరించి మునుల ఆశ్రమాలను దాడి చేసి చిందరవందర చేయసాగారు. వరగర్వంతో సాధుజనులకి కంటకంగా మారి చెలరేగసాగారు. ఋషులంతా బ్రహ్మ దగ్గరకు వెళ్ళి తమ బాధలు మొరపెట్టుకొన్నారు. ఇతరులెవ్వరి వలనా మరణం లేకుండా వరం కోరుకొన్నారు కానీ వారిలో ఒకరి వలన ఇంకొకరికి మరణం కలుగకుండ వరం కోరుకోలేదన్న సూక్ష్మన్ని గ్రహించి వెంఠనే విశ్వకర్మను పిలిపించి సృష్టిలోకెల్ల అత్యంత సౌందర్య రాశి ఐన కన్యను సృష్టించమని ఆఙ్ఞాపించాడు. అందుకుగాను సృష్టిలో అన్ని వస్తువులలోంచీ నువ్వు గింజంత ప్రమాణంలో అందాన్ని స్వీకరించి ఆ సౌందర్యరాశిలో పొందుపరచాలని సూచించాడు. అలా విశ్వజనితమైన సౌందర్యపు 'రాశి' జీవంపొందింది. ఆమెకు బ్రహ్మ తిలోత్తమ (తిల ప్రమాణంలో అన్నిటి అందం పొందింది కనుక) అని పేరుపెట్టాడు. తిలోత్తమ వెంఠనే బ్రహ్మకూ విశ్వకర్మకూ నమస్కరించి కర్త్వ్యోన్ముఖురాలయ్యింది. మద్యం మత్తులో మదిరాక్షులనడుమ భోగాలనుభవిస్తున్న సుందోపసుందుల ముందు నిలచి వయ్యారాలను ఒలకబోసింది. ఆ ఇద్దరినీ అమితంగా ఆకట్టుకొంది. వారిద్దరూ ఆమెకోసం పోటీ పడసాగారు. అప్పుడు తిలోత్తమ ఆ ఇద్దరిలో ఎవరు బలాఢ్యుడో అతనికే తను సొంతమౌతానని చెప్పింది. ఆత్మీయానుబధంతో ఉన్న సోదరులు కాస్తా ఒకరి మీదకు ఒకరు కాలు దువ్వుకొన్నారు. భీకరమైన పోరు సలిపి ఇద్దరూ మరణించారు.

ఆత్మీయులైన సోదరులే ఐనా స్త్రీ విషయంలో ఇలా తగవులు రావచ్చు కనుక పాండవులు ద్రౌపది విషయంలో అలా ప్రవర్తించకూడదని హితవు పలికాడు నారదుడు. అప్పుడు నారదుడి సమక్షంలోనే ధర్మరాజు తన సోదరులతో కలిసి ద్రౌపది తో ఒక్కొక్కరూ ఒక సంవత్సరం భర్తగా ఉండేలా ఆ సమయంలో వేరెవరైనా ఈ కట్టుబాటు దాటితే ఒక సంవత్సరం తీర్ధయాత్రలకు వెళ్ళి వచ్చేలా ఏర్పాటు చేసాడు.

స్వస్తి