పరమేశ్వరుడి అనుజ్ఞ మేరకు గౌతమీనది గౌతమ ముని వెంట బయలుదేరింది. ఆ గంగ బ్రహ్మగిరి మీద నుండి పరవళ్ళు తొక్కుతూ ఒక ఉదుంబర వృక్షపు కొమ్మనుండి జాలువారుతూ ప్రవాహ వేగాన్ని పుంజుకుంది. తొలిగా గౌతముడు ఆయన శిష్యులు ఆ గంగలో స్నానం చేసి తమ పాపాలను పోగొట్టుకున్నారు. ఆ ప్రదేశమే ఆనాటి నుండి గంగా ద్వారమని పేరు పొందింది. ఇలా గౌతముడు ఆయన శిష్యులు స్నానాలు చేసిన తర్వాత మాయా గోవును సృష్టించిన బ్రాహ్మణులు కూడా గౌతమిలో స్నానమాడటానికి వచ్చారు. అయితే ఎంతో ఆశ్చర్యంగా ఒక్క క్షణంలో ఆ గంగ వెంటనే అంతర్ధానమయింది. విస్తుపోయిన గౌతముడు గంగాదేవిని పలుమారులు స్తుతించాడు. అయితే అప్పుడు గంగ చేసిన మేలును మరిచి పాపం చేసిన వారిని తాను తాకలేనని పలికింది. అయితే వెంటనే గౌతముడు
‘అపకారిషు యో లోక ఉపకారం కరోతివై!
తేన పూతో భవామ్యత్ర భగవద్వచనం త్విదమ్’
అపకారం చేసిన వారికి కూడా ఉపకారం చెయ్యడమే గొప్పతనంగా పరిగణలో ఉందని కనుక ఈ అపకారులకు ఉపకారం చెయ్యమని వేడుకున్నాడు. గౌతముడు అలా అనేక విధాలుగా మంచి సూక్తులతో గంగాదేవిని శాంతపరిచాడు. అప్పటికీ ఆమె గౌతముడికి అపకార చేసిన వారికి ప్రత్యక్షం కావటానికి ఒప్పుకోక కొన్ని నిబంధనలను పెట్టింది. ముందుగా వారంతా నూట ఒక్కసార్లు బ్రహ్మగిరికి ప్రదక్షిణం చెయ్యాలని ఆ తరువాతనే వారికి తాను ప్రత్యక్షమవుతానని పలికింది. ఆ బ్రాహ్మణులంతా జరిగిన తప్నేమిటో తెలుసుకుని తమను క్షమించమని గంగాదేవిని వేడుకున్నారు. గంగ చెప్పినట్లుగానే గిరి ప్రదక్షిణలు చేశారు. వారు అలా చేసిన తరువాత గంగాదేవి అనుజ్ఞతో గంగ ద్వారానికి కింది భాగంలో గౌతమ ముని ఒక గొయ్యిని తవ్వాడు. దానిపేరే కుశావర్తం. గంగాదేవి ఆ గొయ్యిలోకి ప్రవహించింది. అది ఉత్తమ తీర్థంగా పేరు తెచ్చుకుంది. అలా ఆ కుశావర్తంలో అంతా స్నాన విధులను నిర్వహించి పవిత్రులయ్యారు.
ఈ కథలోనే కల్పభేదంతో మరొక విషయం కూడా కనిపిస్తుంది. గౌతముడు తనను ఇబ్బంది పెట్టిన బ్రాహ్మణులందరినీ గంగను భూమి మీదకు తెచ్చిన తరువాత తాను గోహత్యా పాపం పొగొట్టుకున్న తర్వాత తీవ్రంగా శపించాడు. ఆ శాపం ప్రకారం వారికి వారి సంతతికి కూడా శివభక్తి నశించటం, దరిద్రం ప్రాప్తించటం లాంటివన్నీ సంభవించాయి. వారు చేసేదిలేక కాంచీనగరంలో నివాసమేర్పరచుకుని గౌతముడి శాపాన్ని అనుభవించారుట. కనుక తెలిసి చేసినా తెలియక చేసినా లేక మంచి జరుగుతుందన్న ఆలోచనతో చేసినా కూడా తప్పు తప్పేనని ఆ తప్పునకు తగిన శిక్ష ఎవరైనా అనుభవించి తీరాల్సిందేనని ఈ కథ వివరిస్తోంది.
- శ్రీ యల్లాప్రగడ మల్లికార్జున రావు గారు
- సేకరణ ఈనాడు దినపత్రిక నుంచీ
No comments:
Post a Comment