Tuesday, February 18, 2020

ధర్మవ్యాధుడు - అర్జునకి - అహింస

Image result for ధర్మవ్యాధుడు



అహింసా స్వరూపం ఎలాంటిదో తెలిపే ఈ కథ వరాహ పురాణంలో కన్పిస్తుంది. ఏది హింస, ఏది అహింస అనే విషయం తెలియక చాలామంది సందిగ్ధావస్థలో కొట్టుమిట్టాడుతుంటారు. ఆ సందిగ్ధమే కొన్ని కొన్ని సార్లు మనస్పర్థలను, తగాదాలకు కూడా దారితీస్తూ ఉంటుంది. ఈ కథలో ఇతివృత్తం కూడా ఇటువంటి మనస్పర్థల నేపథ్యంలోనే ఉంది. పూర్వం మిథిల నగరంలో ఒక కిరాత కులంలో ధర్మబుద్ధిగల ధర్మవ్యాధుడు అనేవాడు ఉండేవాడు. ఇలా ధర్మవ్యాధుడు జన్మించటానికి కారణం వసురాజు గతజన్మలో అతడి సేవకుడికిచ్చిన వరమే కారణం.
ధర్మవ్యాధుడు తన కిరాతకుల సంప్రదాయాన్ని అనుసరించి ప్రతిరోజూ వేటకు వెళ్ళి ఒక మృగాన్ని చంపి తీసుకువచ్చి సగం అగ్నికి సమర్పించి మిగిలిన సగం మాంసాన్ని తనకోసం, తన కుటుంబసభ్యుల కోసం, అతిథులకోసం వినియోగిస్తూ ఉండేవాడు. ధర్మవ్యాధుడికి అర్జునకుడు అనే ఒక కుమారుడు, అర్జునకి అనే ఒక కూతురు జన్మించారు. అర్జునకుడు తండ్రికి సహాయకుడిగా ఉంటూ ఉండేవాడు. అర్జునకి కూడా ధర్మబుద్ధితో పెరిగి పెద్దది అయి యుక్తవయస్సుకు వచ్చింది. ఆమెకు వివాహం చెయ్యాలని ధర్మవ్యాధుడు తలపెట్టాడు. ఎంతో సౌందర్యవతి, ధర్మగుణశాలి అయిన అర్జునకికి తగిన వరుడిని వెతుకుతూ ధర్మవ్యాధుడు మాతంగుడు అనే ఒక మునికి తన కుమార్తెకు భర్తగా కాదగిన కుమారుడు ఉన్నాడని తెలుసుకొని ఆయన ఆశ్రమానికి వెళ్లాడు. తాన వచ్చిన పనిని చెప్పి మునికుమారుడు అయిన ప్రసన్నుడికి తన కుమార్తె అయిన అర్జునకికి వివాహం జరిగేలా మాతంగుడిని ఒప్పించాడు. మాతంగుడు కూడా ధర్మవ్యాధుడి గుణశీలాలను, ఆయన కూతురు అయిన అర్జునకి గుణశీలాలను అంతకుముందే తెలసుకొని ఉన్న కారణంగా వెంటనే ప్రసన్నుడిని, అర్జునకికి వివాహం జరిపించాడు.

ధర్మవ్యాధుడు తన కుమార్తెకు తగిన బుద్ధులు అన్నీ చెప్పి అత్తమామలను వినయవిధేయలతో సేవించమని మరీమరీచెప్పి అత్తవారింటికి పంపాడు. అర్జునకి, ప్రసన్నుడి జీవితం సుఖంగా గడుస్తూనే ఉంది. అయితే ఒకరోజున అర్జునకి ఏదో పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు ఆమె అత్తగారు ఒకటికి రెండు సార్లు ఆమెను పిలిచింది. అయినా ఆ మాటలు చెవిన పడకపోవడంతో అర్జునకి పలుకలేదు. వెంటనే కోపంతో అక్కడకు వచ్చిన ఆమె అత్త నిర్ధాక్షిణ్యంగా మూగజీవుల గొంతులు కోస్తూ బతికేవారి కూతురిని తన కోడలుగా చేసుకోవటమే తప్పు అయిందని తాను పిలిచినా రాకపోవడంతో అంత గర్వపడాల్సిన విషయం ఏం ఉందని, అయినా ఇవి ఏవీ ఆలోచించకుండా తన భర్త కోడలిగా తీసుకురావడమే తప్పు అయిందని రకరకాలుగా అనేకరకాలుగా సూటిపోటిమాటలను అని పుట్టింటికి వెళ్ళగొట్టింది. పుట్టింటికివచ్చిన అర్జునకి తండ్రికి తన అత్త పలికిన పలుకులను చెప్పింది.

ధర్మవ్యాధుడు తన ధర్మబుద్ధిని, నడవడిని తన వియ్యపురాలు తెలుసుకోలేకపోయిందని అనుకొని హింసకు అహింసకు బేధం ఏంటో నిజానికి ఎవరు తక్కువగా హింస చేస్తున్నారో వివరించి చెప్పాలని తన కూతురు అత్తగారింటికి వెళ్ళాడు. ధర్మవ్యాధుడికి మాతంగముని ఎదురువచ్చి మర్యాదలు చేశాడు. అప్పుడు ధర్మవ్యాధుడు తాను కేవలం జీవహింసకు తావులేని ఆహారాన్నే స్వీకరిస్తానని చెప్పాడు. మాతంగుడు ఎంతో సంతోషంతో ధర్మవ్యాధుడికి వరి, గోధుమ ఇలాంటి ధాన్యాలతో తయారు అయిన ఆహార పదార్ధాలనే తన భార్యచేత చేయించి పెట్టించాడు. ఆ పదార్ధాలను చూసిన ధర్మవ్యాధుడు ఒక్క ఉదుటన భోజనం ముందునుంచి లేచి బయటకు వచ్చాడు. అప్పుడు మాతంగుడు తాను కూడా బయటకు వచ్చి ఎందుకు ఇలా చేశావని అడిగాడు. ఇంత ఘోరంగా జీవహింసతో కూడుకొని ఉన్న ఆహారాన్ని తనకు పెట్టటమే కాక మళ్ళీ ఎదరు ప్రశ్నించడం ఏమిటని ధర్మవ్యాధుడు మాతంగుడితో అన్నాడు. తాను పెట్టించిన ఆహారం వరి, గోధుమలకు సంబంధించినదే అని జీవహింసకు తావులేదని మాతంగుడు అన్నాడు. అప్పుడు ధర్మవ్యాధుడు తాను రోజుకు కేవలం ఒక జంతువును మాత్రమే వధించి ధర్మబద్ధంగా తన కుటుంబం కోసం ఆహారాన్ని సమకూరుస్తున్నానని అయితే కొన్నివేల వరిమొక్కలను, గోధుమ మొక్కలను కానీ కోసి హింసించి అలా వచ్చిన ధాన్యంతో తనకు ఆహారం పెట్టడం ఏమంత సబబు అని అన్నాడు. మొక్కలు, చెట్లలో కూడా జీవం ఉంటుందనే విషయాన్ని తెలుసుకోలేక ఇంత జీవహింసకు పాల్పడడం మంచిదికాదని చెప్పాడు. ఈ ధర్మసూక్ష్మాన్ని మాతంగుడు, ఆయన భార్య ఇద్దరు విని అర్జునకిని వెళ్ళగొట్టడంలో ఉన్న తప్పు తెలుసుకున్నారు. అయితే ధర్మవ్యాధుడు కూడా తాను మాతంగుడిని కానీ, ఆయన భార్యను కానీ అవమానించాలనే ధోరణిలో భోజనం ముందు నుంచి లేవలేదని కేవలం హింస ఎలాంటిదో తెలియజెప్పటానికే అలా చేశానని అదీగాక ఆ రోజున తన ఇంటిదగ్గర పితృకార్యం ఉన్నందువలన ఆహారం స్వీకరించడంలేదని చెప్పాడు. ఇక నుంచి ఇంతకుముందు తనను జీవహింస పరుడని నిందిచినట్లుగా నిందిచవచ్దని తన కూతురిని సక్రమంగా చూసుకొనమని చెప్పాడు. ఎవరికివారు సాధ్యమైనంత వరకు హింసకు దూరంగా ఉండాలంటే అహింస అవుతుందని వివరించి చెప్పాడు. ఇలా వరాహపురాణంలో కన్పించే అర్జునకి కథ అహింసాతత్వాన్ని నిరూపిస్తుంది.

Monday, February 10, 2020

దక్షిణ గోగ్రహణం

Image result for pandavas agnyathavasam

పాండవులు అజ్ఞాతవాస దీక్షలో ఉన్నప్పుడు వారి అజ్ఞాతాన్ని భంగపరచి పాండవులను ఎలాగైనా మరోమారు అరణ్య, అజ్ఞాతవాసాలకు పంపాలని దుర్యోధనుడు ఎప్పటికప్పుడు తీవ్రంగా ఆలోచిస్తూనే ఉన్నాడు. దుర్యోధనుడి ఆలోచనలకు అనుకూలంగా ఒక సమాచారం అందింది. మత్స్యదేశ రాజైన విరాటరాజు బావమరిది సింహబలుడు (కీచకుడు) మరణించాడని దుర్యోధనుడు తెలుసుకున్నాడు. భూలోకంలో భీమసేనుడు, కీచకుడు, బలరాముడు, శల్యుడు సమాన బలవంతులని దుర్యోధనుడికి తెలుసు. అదీకాక మహాబలశాలి అయిన కీచకుడిని అన్ని అవయవాలు విరిచి ముద్దలాగా చేసి చంపగలిగింది భీముడేనని, భీముడే గంధర్వుడి రూపంలో ఆ పని చేసి ఉంటాడని దుర్యోధనుడు అనుకున్నాడు. అందుకు కారణం కీచకుడికి బలరాముడు, శల్యుడు దూరంగా ఉన్నారు. అదీకాక పాండవులు ఎక్కడ అజ్ఞాతంలో ఉండే అవకాశం ఉందని ఆలోచిస్తుంటే సస్య శ్యామలంగా, సుభిక్షంగా ఉండే ప్రాంతంలోనే పాండవులు ఉండే వీలుందని భీష్మాచార్యుడు చెప్పిన మాటలను బట్టి కూడా పాండవుల ఉనికి దుర్యోధనుడు ­హించాడు. వెంటనే తన మంత్రులు సామంతులతో కొలువు తీరి మత్స్యదేశాన్ని దక్షిణ దిక్కు నుంచి, ఉత్తర దిక్కు నుంచి రెండు వైపులా బంధించగలిగితే విరాటరాజును రక్షించటానికి పాండవులు వచ్చి తీరుతారని అప్పుడు వారి గుట్టు రట్టవుతుందని దుర్యోధనుడు తన వారందరికీ చెప్పాడు. ఈ ఆలోచన బాగుందని, తానందుకు సిద్ధమని అక్కడే ఉన్న త్రిగర్త రాజైన సుశర్మ చెప్పాడు. కీచకుడి అండ చూసుకొని విరాటరాజు తన మీదకు ఎన్నోసార్లు దండెత్తి వచ్చి అవమాన పరిచాడని కీచకుడు మరణించాడు కనుక ఇప్పుడు తాను విరాటుడిని జయించగలనని పలికాడు. దుర్యోధనుడు, కర్ణుడులాంటి వారంతా సుశర్మ ఆలోచనను సమర్ధించి మత్స్యదేశాన్ని దక్షిణ దిక్కు నుంచి సుశర్మ ముట్టడించేలాగా ఆ తరువాత ఉత్తర దిక్కు నుంచి కౌరవ ప్రముఖులు విరాట రాజ్యాన్ని ముట్టడించేలాగా పథకం సిద్ధం చేసుకుని యుద్ధ సన్నాహాలు ప్రారంభించారు. మత్స్యదేశాన్ని దక్షిణ దిక్కు నుంచి తాకుతూ వచ్చి సుశర్మ గోసంపదను తరలించుకు వెళుతున్నాడని విరాటరాజుకు వర్తమానం వచ్చింది. విరాటుడు వెంటనే తన తమ్ముడు శతానీకుడు తదితర వీరులను సిద్ధం చేసి యుద్ధానికి బయలుదేరాడు. గతంలో ఎన్నోసార్లు తన చేతిలో పరాజితుడైనప్పటికీ సుశర్మకు బుద్ధి రాకపోవటం విచిత్రంగా ఉందని విరాటరాజు అనుకున్నాడు. విరాటరాజు చేస్తున్న యుద్ధ సంరంభాన్ని గమనించి కంకుభట్టు రూపంలో ఉన్న ధర్మరాజు విరాటుడి దగ్గరకు వెళ్లి గతంలో తనకు ఒక ముని అనేక దివ్యాస్త్రాలను ప్రసాదించాడని తనకు కొన్ని రథాలను, సైన్యాన్ని సమకూర్చితే యుద్ధ రంగానికి తానూ వచ్చి సహాయపడుతానని చెప్పాడు. తమ కొలువులోనే వంటవాడుగా ఉన్న వలలుడిని కూడా యుద్ధానికి తీసుకువెళ్ల వచ్చని అతడు మల్లయుద్ధంలో ఎంతో నేర్పుకలవాడని చెప్పాడు. అలాగే గోవులను రక్షస్తున్న దామగ్రంధిని, అశ్వశిక్షకుడైన తంత్రీపాలుడు కూడా యద్ధ విద్యలో ఎంతో నిపుణులని వారిని కూడా యద్ధానికి బయలుదేర దీయమని చెప్పాడు. విరాటరాజు కంకుభట్టు మాటలకు సమ్మతించి కంకుభట్టుకు, వలలుడికి, దామగ్రంధికి, తంత్రీపాలుడికి కావాల్సిన ఆయుధాలను, రథాలను ఏర్పాటు చేశాడు. అలా నలుగురు సోదరులు విరాటరాజు వెంట తరలివెళ్లి సుశర్మను ఎదుర్కొన్నారు. సుశర్మకు, విరాటరాజుకు మహాభీకరంగా పోరు జరిగింది. కానీ చివరలో సుశర్మ విరాటరాజును విరథుడిని చేసి తన రథం మీద ఎక్కించుకుని తీసుకువెళ్లసాగాడు. ఆ పరిస్థితిని చూసి విరాటుడి సైన్యమంతా చెల్లా చెదురవుతున్న సమయంలో ధర్మరాజు, భీముడిని పిలిచి పరిస్థితి చేయిదాటి పోయేలా ఉందని అజ్ఞాతవాసంలో తమకు ఆశ్రయాన్నిచ్చి ఆదుకుంటున్న విరాటుడిని రక్షంచటం తమ కర్తవ్యమని చెప్పాడు. భీముడు వెంటనే ఒక పెద్ద చెట్టును పెకలించి సుశర్మ సైన్యాన్ని చెదరగొడతానని బయలుదేరబోతుండగా ధర్మరాజు అలా చేయవద్దని పెద్ద పెద్ద చెట్లను, వృక్షాలను పెకలించి శత్రువులతో పోరాడేది భీముడేనన్న సంగతి కౌరవులు పసిగడితే తమ గుట్టు రట్టవుతుందన్నాడు. అలాకాక శస్త్రాలు, ఆయుధాలతోనే యద్ధం చేయమని చెప్పాడు. వెంటనే భీమసేనుడు అమిత ఉత్సాహంతో విరాటరాజును రథం మీద ఎక్కించుకునివెళుతున్న సుశర్మను వెంబడించాడు. తన అస్త్ర, ఆయుధ, భుజబలాన్నంతా ప్రదర్శించి సుశర్మను నిలువరింప చేశాడు. సుశర్మ రథసారథి, అశ్వాలు పడిపోగా రథచక్ర రక్షకుడైన శోణాశ్యుడు పారిపోయాడు. వెంటనే విరాటుడు కూడా విజృంభించటంతో త్రిగర్త సేనలు చెల్లా చెదురయ్యాయి. భీముడి దెబ్బకు సుశర్మ మూర్ఛపోయాడు. అతనిని రథం మీదకు ఎక్కించుకుని భీముడు తన అన్న దగ్గరకు తీసుకువచ్చి సుశర్మను వధించటానికి అనుమతివ్వమని కోరాడు. అయితే ధర్మరాజు అందుకు అంగీకరించలేదు. సుశర్మకు అప్పుడే మూర్ఛ నుంచి మెలకువ వచ్చింది. భీముడు, ధర్మరాజు పలికిన సూటిపోటీ మాటలతో అతడు అవమాన భారంతో కుంగిపోయాడు. భీముడు, ధర్మరాజు సూచన మేరకు అతడిని విడిచిపెట్టాడు. ఇదంతా చూస్తున్న విరాటరాజుకు ఎంతో ఆశ్చర్యమేసింది. తన ప్రాణాలను, రాజ్యాన్ని రక్షంచినందుకు ఎంతగానో కృతజ్ఞతలు చెప్పి తన రాజ్యంలో ఉన్న ధనాన్ని, చివరకు రాజ్యాన్ని కూడా గ్రహించమని కోరాడు. అయితే ధర్మరాజు తాము ధనాన్ని కోరి యద్ధం చేయలేదని, దైవానుగ్రహం వల్లనే సుశర్మ మీద విజయం లభించిందని, తమకు ఎలాంటి బహుమానాలు అక్కరలేదని చెప్పాడు. కంకుభట్టు ఔదార్యానికి మత్స్యదేశ రాజైన విరాటుడు ఎంతో ముచ్చటపడ్డాడు.

Monday, February 3, 2020

మన్మథుడే ప్రద్యుమ్నుడు

Image result for pradyumna



శివుడు కోపాగ్నికి దగ్ధమైన మన్మథుడు ఆ తరువాత ఏమయ్యాడు? రతీ విలాసానికి కరిగిన దేవతలు ఆమెకు ఎలాంటి వరమిచ్చారు? రతీ మన్మథులు సశరీరులుగా మళ్లీ ఎప్పుడు ఎలా కలుసుకోగలిగారు? అనే విషయాలను భాగవతంలో వ్యాసుడు చెప్పిన ఈ కథ వివరిస్తుంది. మన్మథుడు ప్రద్యుమ్నుడుగా శ్రీకృష్ణుడికి జన్మించటం ఆ ప్రద్యుమ్నుడే కృష్ణుడికి విరోధి, కృష్ణుడు భార్య రుక్మిణికి సోదరుడు అయిన రుక్మి కుమార్తెను వివాహమాడి రెండు కుటుంబాల నడుమ ఉన్న కయ్యాన్ని వియ్యంగా మార్చిన ఉదంతం ఈ కథలోనే కనిపిస్తాయి. ఎన్నెన్నో మెలికలతో ఈ కథ చివరకు సుఖాంతంగా ముగుస్తుంది.


తారకాసురుడిని సంహరించడం కోసం పార్వతికి శివుడికి జన్మించే కుమారుడే తగిన వాడని బ్రహ్మ దేవతలకు చెప్పడంతో దేవతలంతా వెళ్లి తపోనిష్ఠలో ఉన్న పరమేశ్వరుడి మనసు మార్చటానికి మన్మథుడిని ఆశ్రయించారు. మన్మథుడు దైవకార్యం నెరవేర్చటానికి ఉద్యుక్తుడయ్యాడు. కానీ శివుడి ఆగ్రహానికి మాడి మసైపోయాడు. అప్పుడు రతీదేవి విపరీతంగా విలపిస్తుండగా దేవతలామెను ఓదార్చి మన్మథుడు తిరిగి ప్రద్యుమ్నుడు అనే పేరుతో జన్మిస్తాడని చెప్పారు. నారదుడు రతీదేవికి మరింత మనశ్శాంతి కలగటానికి ప్రద్యుమ్నుడి జన్మకు సంబంధించిన విశేషాలను కూడా వివరించాడు. కృష్ణుడికి రుక్మిణిదేవి వల్ల ప్రద్యుమ్నుడు జన్మిస్తాడు. అయితే జన్మించిన కొద్ది రోజుల్లోనే శంబరాసురుడు అనే ఒక అనే ఒక రాక్షసుడు ప్రద్యుమ్నుడిని సంహరించే ప్రయత్నం చేస్తాడు. అందుకే శంబరాసురుడి బారి నుంచి ఆ బాలుడిని రక్షించుకోమని నారదుడు రతీదేవికి చెప్పాడు. అప్పుడామె ఆ దేవముని చెప్పిన మాటలను అనుసరించి మాయావతి అనే పేరుతో శంబరాసురుడి ఇంట్లోనే దాసిగా చేరింది. ఇలా జరిగిన కొంత కాలానికి ద్వారకలో రుక్మిణికి ఒక కుమారుడు జన్మించాడు. అయితే బాలుడు పుట్టిన ఎనిమిదో రోజునే జటాసురుడు అనే రాక్షసుడి కుమారుడైన శంబరాసురుడు ప్రద్యుమ్నుడిని ఎలాగైనా సంహరించాలని అనుకున్నాడు. కృష్ణుడికి జన్మించిన కుమారుడి వల్ల తనకు మరణం ప్రాప్తిస్తుందని తెలుసుకోవటమే అందుకు కారణం. శంబరాసురుడు ఒక కాకి రూపంలో రహస్యంగా పురిటింటిలో ప్రవేశించి ఆ బాలుడిని పట్టుకుని తీసుకువెళ్లి సముద్రంలో పడేశాడు. రుక్మిణి తదితరులంతా ఎంతగానో దుఃఖించారు. అయితే సముద్రంలో పడిన బాలుడిని ఒక పెద్ద చేప మింగింది. ఒక జాలరి వల వేసి పట్టినప్పుడు ఆ చేప అతడికి దొరికింది. చాలా పెద్దదిగానూ, అందంగా, విచిత్రంగా ఉన్న ఆ చేపను తమ రాజైన శంబరాసురుడికి కానుకగా ఆ జాలరి తీసుకువెళ్లి ఇచ్చాడు. శంబరాసురుడి వంట పనివారు ఆ చేపను తరుగుతుండగా దాని కడుపులో నుంచి ఒక చక్కని బాలుడు బయటపడ్డాడు. అందుకు వంట వారు ఆశ్చర్యపోయారు. అక్కడే దాసీ రూపంలో ఉన్న రతీదేవికి ఈ విషయం తెలిసింది. రతీదేవి ఆ బాలుడిని జాగ్రత్తగా కాపాడుతూ శంబరాసురుడి వల్ల ఎటువంటి ప్రమాదం కలుగకుండా చూడసాగింది. శంబరాసురుడు కాకి రూపంలో ప్రద్యుమ్నుడికి చేసిన అపకారం ఆమెకు తెలిసింది. మరింత జాగ్రత్తగా కంటికి రెప్పలా మాయావతి (రతీదేవి) ఆ బాలుడిని పెంచుతూ వచ్చింది. అతడు యుక్త వయస్సుకు వచ్చిన తరువాత ఒక రోజున ఆమె గతాన్నంతా అతడికి వివరించి చెప్పింది. అంతేకాక శంబరాసురుడిని జయించటానికి తనకు తెలిసిన మహామాయ అనే విద్యను అతడికి నేర్పించింది. ప్రద్యుమ్నుడు ఒక రోజున శంబరుడి మీదకు యుద్ధానికి వెళ్లాడు. ఆ ఇద్దరి మధ్య ఘోరంగా యుద్ధం జరిగింది. మహామాయ విద్య సహాయంతో ప్రద్యుమ్నుడు ఆ రాక్షసుడిని సంహరించాడు. ఆ తరువాత రతీదేవితో కలసి ఆకాశ మార్గాన ద్వారకా నగరానికి బయలుదేరి వెళ్లాడు.

శ్రీకృష్ణుడి లాగా రూపురేఖలున్న ప్రద్యుమ్నుడిని చూసి అందరూ కృష్ణుడేమోనని భావించారు. కానీ పక్కన రతీదేవి ఉండటం, కృష్ణుడికి శిరసున నెమలి పింఛం ఉన్నట్లు ప్రద్యమ్నుడికి లేకపోవడం చూసి కృష్ణుడు కాదని పరిచారికలు నిర్ధారించుకున్నారు. రుక్మిణీదేవి తనకు జన్మించి పురిట్లోనే అదృశ్యమైపోయిన తన కుమారుడు బతికి ఉంటే అలాగే ఉండి ఉండేవాడని అనుకుంటుండగానే అక్కడికి నారదుడు వచ్చి విషయమంతా వివరించాడు. అక్కడివారంతా ఎంతో ఆనందించారు. ప్రద్యుమ్నుడు రతీదేవినేకాక రుక్మి కుమార్తె అయిన రుక్మవతిని పెళ్లాడాడు. స్వయంవరంలో ఎందరో రాజులను ఓడించి మరీ ఆమెను చేజిక్కించుకున్నాడు. ఆ వివాహం వల్ల శ్రీకృష్ణుడికి రుక్మిణి సోదరుడైన రుక్మికి ఉన్న విరోధం నశించి వియ్యం కుదిరింది. ప్రద్యుమ్నుడికి రుక్మవతి వల్ల అనిరుద్ధుడు జన్మించాడు.