Monday, November 12, 2018

గుడి వ్యవహారం - గబ్బిల జన్మ

Image result for kanchi periyava




శ్రీ జగదీశ భట్ గారి జీవితంలో జరిగిన ఈ సంఘటన వల్ల శ్రీ శ్రీ శ్రీ చన్ద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు సర్వాంతర్యామి అని, ఈనాటికి భక్తులను కరుణిస్తున్నారని రూఢీగా అవగతమవుతుంది.

ఉత్తర చిదంబరంగా పేరుగాంచిన సతారాలోని నటరాజ స్వామి దేవాలయం స్వామివారి ఆదేశం ప్రకారం నిర్మించబడింది. ఆలయం పూర్తవడానికి ముందే, శ్రీ జగదీశ భట్ గారిని దేవాలయ వ్యవహారాలు చూసుకోవల్సిందిగా ఆజ్ఞాపించారు.

పరమాచార్య స్వామివారి ఆదేశానుసారం శ్రీ జగదీశ భట్ కూడా సతారా వెళ్లి, అత్యంత భక్తి శ్రద్ధలతో ఆలయ వ్యవహారాలు చూసుకుంటూ ఉండేవారు. కాని అతను అక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇక వాటిని తట్టుకోలేక కంచీపురానికి తిరిగొచ్చాడు. పరమాచార్య స్వామివారు విచారించగా తనకు కల్గిన ఇబ్బందులను ఏకరువుపెట్టాడు.

కాని కరుణామూర్తులైన స్వామివారు అతని ఇబ్బందులను విని, పరిపూర్ణమైన ఆశీస్సులను అందించి, సతారాకు తిరిగివెళ్ళమని ఆదేశించారు. జగదీశ భట్ తో మాట్లాడుతూ, “శ్రీ ఏకాంబరేశ్వర దేవాలయంలో తలక్రిందులుగా వేలాడుతున్న గబ్బిలాలను చూశావా?” అని అడిగారు. గబ్బిలాలకు నోరు, మలమూత్ర ద్వారములు రెండూ ఒక్కటే అని చెప్పారు. తినడానికి, విసర్జించడానికి కూడా ఒక్కటే వాడుతాయి. ఎవరైనా దేవాలయ నిధులు, ధనము తస్కరించడానికి ప్రయత్నిస్తే, మరుసటి జన్మలో గబ్బిలంగా జన్మిస్తాడు అని శాస్త్రవచనం. స్వామివారు ఇదంతా చెప్పగానే, దేవాలయ ద్రవ్య విషయంలో అతను మరింత శ్రద్ధ కనబరుస్తూ, ఇది తనకు హెచ్చరికగా భావించాడు.

స్వామివారే స్వయంగా అతణ్ణి ఉత్సాహపరచడంతో కొత్త శక్తి వచ్చినట్లై దేవాలయాన్ని చూసుకునే బాధ్యతను తీసుకుని, చాలా సంవత్సరాల పాటు తన కర్తవ్యాన్ని నిర్వహించారు. కాని, ఎదో కారణాల వల్ల మొత్తం దేవాలి బాధ్యత, అర్చక బాధ్యత మొత్తం జగదీశ భట్ గారి పైనే పడ్డాయి. చివరకు మొత్తం వ్యవహారాలు చూసుకోవడం తలకు మించిన భారం అయిపొయింది. అటువంటి సమయంలో పరమాచార్య స్వామివారు తనకు ఇలా ఇబ్బంది కలగాజేస్తున్నారని చాలా నిరాశకు గురయ్యాడు.

ఆరాత్రి జగదీశ భట్ కు నిద్రపట్టడం లేదు. తెల్లవారుఝామున పరమాచార్య స్వామివారు కనపడ్డారు. వారు రెండుచేతులను పైకెత్తి సంపూర్ణ ఆశీస్సులను అందిస్తున్నట్టుగా కల వచ్చింది. “నువ్వు ఏమి భయపడకు. అంతా నేను చూసుకుంటాను” అని పరమాచార్య స్వామివారు ధైర్యం ఇచ్చినట్టుగా అనిపించింది. కనుల నీరు కారుతుండగా వెంటనే నిద్రనుండి మేల్కొన్నారు.

అది కేవలం కల లాగా అనిపించడం లేదు. స్వయంగా పరమాచార్య స్వామివారే వచ్చి ఆశీర్వాదించినట్టుగా ఉంది. ఆరోజు తనకి నూతనోత్సాహం కలిగింది. అన్ని పనులనూ ఎంతో ఉత్సాహంగా చేసుకున్నారు. ఒత్తిడి అసలు లేదు. ఇదంతా కేవలం పరమాచార్య ఆశీస్సులవల్లే అని అతనికి తెలుసు.

మరుసటిరోజు మరొక్క ఆశ్చర్యం జరిగింది. ఒక యువకుడు దేవాలయానికి వచ్చి అతని ముందు నిలబడ్డాడు. ఇంతకుముందు అతను భట్ కు సహాయకునిగా ఉండేవాడు. కాని ఏవో కారణాల వల్ల వెళ్ళిపోయాడు. ఎన్నో చోట్ల ప్రయత్నించి, చివరకు ఇక్కడే తనకు అనుగుణంగా ఉందని తిరిగొచ్చాడు. ఇక ఎప్పటికి ఈ దేవాలయాన్ని విడవకూదడనే దృఢ నిశ్చయంతో వచ్చాడు. అది కూడా మహాస్వామివారి కరుణయే అని జగదీశ భట్ గారికి అవగతమైంది.

బ్రహ్మజ్ఞానుల ఆశీస్సులు వారు భౌతికంగా మనవద్ద లేకపోయినా అవి తప్పాక జరిగి తీరుతాయని జగదీశ భట్ గారి జీవితంలో జరిగిన ఈ సంఘటన వల్ల అర్థమవుతుంది.

--- “శ్రీ పెరియవ మహిమై” పత్రిక నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Tuesday, November 6, 2018

వేదాధ్యయనం - విదేశీయానం



పరమేశ్వరుడంతటి దయాళువు, శుక మహర్షి అంతటి ఉన్నతులు అయిన మన మహాస్వామి మనందరినీ ఆదరించి ఆశీర్వదిస్తున్నారు.

1968లో కుంబకోణం శ్రీ రంగరాజచారి పరమాచార్య స్వామియొక్క పరిపూర్ణ కటాక్షంలో మునిగిపోయారు. 1971లో ఋగ్వేద అధ్యయనం పూర్తైన తరువాత, జీవనాధారం కోసం వైదిక వృత్తి చేపట్టాలని భావిస్తే, అందుకు పరమాచార్య స్వామివారు తమ అంగీకారాన్ని తెలపలేదు.

“నీ వేద విద్యార్జనకు నేను తగిన ఏర్పాట్లు చేస్తాను. నీ విద్యార్జన కొనసాగించు” అని స్వామివారు తెలిపారు. ప్రతి నేలా రెండు వందల రూపాయలు రంగరాజచారి కుటుంబానికి అందేట్టు, స్వంతంగా వండుకోవడానికి కావాల్సిన సంభారాలు కూడా ఏర్పాటు చేశారు. రంగరాజచారి గారిది పెద్ద కుటుంబం. కేవలం పరమాచార్య స్వామివారి ఆశీస్సులతోనే అందరి ఆడపిల్లల పెళ్ళిళ్ళు జరిగాయి.

మహాస్వామివారు పండరీపురంలో మకాం చేస్తున్నప్పుడు, రంగరాజచారి స్వామివారిని దర్శించుకుని సాష్టాంగం చేసి నమస్కరించారు. అప్పుడు మహాస్వామివారు, “నువ్వు నాకు సాష్టాంగం చెయ్యొచ్చా?” అని అడిగారు.

“మా సంప్రదాయం ప్రకారం, యజ్ఞోపవీతము, శిఖ లేని సన్యాసిని చూస్తే స్నానం చెయ్యాలి” అని రంగరాజచారి బదులిచ్చాడు.

“అలా అయితే, మరి నా ముందర ఎందుకు సాష్టాంగం చేశావు?”

“ఈ స్వరూపము విష్ణు స్వరూపమే అని నాకు అనిపించింది” అని భక్తితో బదులిచ్చాడు. ఈ శీవైష్ణవ భక్తశిఖామణి జీవితంలో పరమాచార్య స్వామి అనుగ్రహంతో ఒక అద్భుతం జరిగింది. రంగరాజచారిది పేద కుటుంబం. వారి ఆదాయంతో సభ్యులందరినీ చూసుకోవడం కూడా వీలు కాని పరిస్థితి. ఆడపిల్లల పెళ్ళిళ్ళకు డబ్బు కూడా అవసరం. ఇటువంటి స్థితిలో వారికి ఒక మంచి అవకాశం వచ్చింది. 1978లో వేద విద్యాభ్యాసం ముగియగానే, వారిని జర్మని రమ్మని కొందరు ఆహ్వానించారు. అంతటి కటిక దారిద్య్రాన్ని అనుభవిస్తున్న సమయంలో జర్మని అవకాశాన్ని, నేలకు మూడువేల రూపాయల సంపాదనని ఎలా కాదనగలరు. ఈ డబ్బుతో పాటు మూడేళ్ళ తరువాత మూడు లక్షల రూపాయలు అందుతుంది. కనుక రంగరాజచారి ఈ అవకాశాన్ని ఒప్పుకోవడంలో ఆశ్చర్యం ఏమి లేదు.

ఈ అవకాశాన్ని ఇచ్చినతనికి అన్ని ఏర్పాట్లు చూసుకోమని చెప్పాడు. ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లలో మునిగిపోయాడు. అదే సంవత్సరం అక్టోబరు 31న బోంబే నుండి బయలుదేరడానికి నిర్ణయించుకున్నాడు. ఇంత జరిగినా ఈ విషయాలేవీ ఇతరులకు తెలియనివ్వలేదు. అక్టోబరు 27న తన తండ్రికి విషయం తెలపడానికి గ్రామానికి వెళ్ళాడు.

“పరమాచార్య స్వామివారి అనుమతి తీసుకున్నావా?” అని అడిగారు అతని నాన్న. “లేదు, నాకు తెలిసి వారు అనుమతి ఇవ్వరు. స్వామివారు అనుమతించకపోతే, ఇంత డబ్బులు వచ్చే ఈ ప్రతిపాదనని నేను కాదనలేను. వెళ్ళడానికి నేనే నిర్ణయించుకున్నాను. మనకు డబ్బు అవసరం చాలా ఉంది. నాకు ఇంకొక మార్గం కనపడడం లేదు” అని చెప్పాడు.

ఆరాత్రికి తన ఊళ్లోనే ఉండిపోయాడు. రాత్రి మూడు గంటలప్పుడు, నిద్ర రాక మంచంపై అటు ఇటు దొర్లుతున్నాడు. అప్పుడు కళ్ళముందు మహాస్వామివారు ఉన్నట్టుగా లీలగా కనపడుతోంది. దగ్గరకు వచ్చి తనని తాకినట్టుగా తనకు అనుభూతి కలిగింది. తన తల్లి అడిగినట్టుగానే, “వెళ్ళడానికే నిర్నయించుకున్నావా?” అని అడిగినట్టు అనిపించింది. అది కలో, నిజమో అర్థం కావడంలేదు. ఆలస్యం చేయకుండా మరుసటిరోజే పరమాచార్య స్వామివద్దకు వెళ్లి అనుమతి పొందాలని భావించాడు.

అప్పుడు పరమాచార్య స్వామివారు కర్ణాటక రాష్ట్రం, బాదామి దగ్గరలోని బనశంకరి అనే చోట మకాం చేస్తున్నారు. అక్కడకు చేరుకోగానే స్వామివారి దర్శనానికి ముందు, స్నానం చేస్తున్నాడు. అప్పుడు పరమాచార్య స్వామివారి సహాయకులొకరు వచ్చి, “వచ్చి దర్శనం చేసుకోమని పరమాచార్య ఆదేశించారు” అని చెప్పాడు.

తను వస్తున్న విషయం కాని, వచ్చిన కారణం కాని ఎవరికీ తెలియదు. కాని మహాస్వామివారు కబురుచేయడంతో ఆశ్చర్యపోయాడు. అదే ఆశ్చర్యంతో వెళ్లి స్వామివారి ముందు నిలబడ్డాడు.

“ఎప్పుడు బయలుదేరుతున్నావు?” అని అడిగారు స్వామివారు.

“స్వామివారు ఎప్పుడు అనుమతిస్తే అప్పుడు” అని బడులిచ్చాడు స్వామివారు తన తిరుగు ప్రయాణం గురించి అడుగుతున్నరేమో అనుకుని.

“నీవున్నచోటికి తెరిగివెళ్ళే విషయం గురించి నేను అడగడం లేదు. విదేశాలకు వెళ్ళడానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నావు కదా! దాని గురించి ఎప్పుడు అని అడుగుతున్నా”

ఆ మాటలు విని నిశ్చేష్టుడయ్యాడు. ఇంకా ఆ విస్మయం నుండి తేరుకునే లోపే, పరమాచార్య స్వామివారు ఇంకొక విషయం తెలిపారు.

“నువ్వు ఇక్కడకు రావడానికి కారణమేంటో చెప్పనా? మొన్న నేను వచ్చి నిన్ను అడిగాను, “వెళ్ళడానికే నిశ్చయించుకున్నావా?” అని. అందుకే వెళ్లబోయేముందు ఇక్కడకు వచ్చావు. అంతేనా?” అని అన్నారు.

ఆరోజు జరిగినది కల కాదని, నిజంగా స్వామివారే వచ్చి ఆశీర్వదించారని తెలుసుకున్న తరువాత రంగరాజచారి భావోద్వేగానికి గురయ్యాడు.

“నీ మంచి నడతను కొనసాగించు . . . డబ్బు అవసరం లేదు . . . మంచి నడవడిక ముఖ్యం” అని చెప్పి, తమ దివ్య పాదచారణాలను ఆ భక్తుని తలపై ఉంచి కరుణతో ఆశీర్వదించారు.

ఇది అద్భుతం కదా! ఒక సాంప్రదాయస్తుణ్ణి విదేశాలకు వెళ్ళకుండా ఆపారు స్వామివారు. ధర్మం యొక్క సాకార రూపమైన మన స్వామివారు తన భక్తులను ధర్మ మార్గంలో పయనించడానికి అనుకూలంగా అనుగ్రహాన్ని ప్రసరిస్తారు.

--- “శ్రీ పెరియవ మహిమై” పత్రిక నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Monday, November 5, 2018

మహాస్వామి వారి ఘటం





పరమాచార్య స్వామి వారికి పరమ భక్తుడైనందువల్ల తన కీర్తి ప్రతిష్టలు అంతా స్వామి వారి అనుగ్రహంగానే పరిగణిస్తారు. “నాతో వారి ఉనికి, వారు నా వెంటే ఉన్నారన్న విషయం నాకు ఎన్నో సార్లు ఋజువు అయ్యింది” అని అంటారు ప్రముఖ ఘటం విద్వాంసులు విక్కు వినాయకరం.

ఒకసారి వినాయకరం, ఎల్. శంకర్ మరియ జాకిర్ హుస్సేన్ లతో కలిసి ఒక కచేరి కోసం ఏథెన్స్ వెళ్ళారు. కచేరి రోజుకు కొన్ని రోజులముందు అకస్మాత్తుగా వారి ఘటం పగిలిపోయింది. చెన్నైలో ఉన్న వారి భార్యకు ఏడుస్తూ “తెచ్చుకున్న ఘటం పగిలిపోయింది. ఇక్కడ నాకు ఇక పని లేదు. నేను తిరిగి వచ్చేస్తాను” అని చెప్పారు. వారి భార్య ఒక రోజు వేచి ఉండమని చెప్పి వారి పరిస్థితిని ఆచార్యుల వారికి చెప్పడానికి కంచికి వెళ్ళారు. పరమాచార్య స్వామి వారు ఆవిడ గోడు విని ఏమి పలుకక మిన్నకుండిపోయారు. ఆవిడ చాలా బాధపడి కన్నీరు కారుస్తూ తిరిగి వెళ్ళి పోతున్నప్పుడు మహాస్వామి వారు మౌనంగా ఒక కొబ్బరికాయను ఇచ్చి పంపారు.

మరోవైపు జాకిర్ హుస్సేన్ ఏథెన్స్ మొత్తం వెతికి చివరగా అమెరికా హౌస్ లో ప్రదర్శనకు ఉంచిన ఒక ఘటం చూసారు. కాని దాన్ని అతను ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే అది ఇచ్చిన వ్యక్తి దాన్ని ఎవరికి ఇవ్వకూడదు అమ్మకూడదు అని చెప్పారు. అది తనకి ఎవరు ఇచ్చారు అని అడుగగా అందరూ అతను “వినాయకరం” అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. “ఆ ఘటం నీకు ఇచ్చినవారికే ఇప్పుడు దాని అవసరం వచ్చింది” అని జాకిర్ గారు చెపారు. అప్పుడు అతను వినాయకరం గారి వద్ద నుండి “ఈ ఘటం నాకు చాలా ఉపయోగపడింది” అని ఒక లేఖని కూరుతూ ఆ ఘటాన్ని ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఇంకా ఆశ్చర్యపోవల్సిన విషయం ఏమిటంటే వినాకరం కచేరిలో వాయించడానికి సరిపడా శృతి ఆ ఘటానికుంది.

మరొక్కసారి అమెరికా వెళ్తూ జర్మనీలో విమానం తప్పినందువల్ల సరదాగా ఒక సంగీత వాద్య పరికరాలు అమ్మే దుకాణానికి వెళ్ళారు. వారి వినాయకరం అని తెలుసుకుని ఆ దుకాణదారుడు వారికి ఒక ఘటాన్ని చూపించి దాని నాణ్యత తెలుపమన్నారు. అది ఒక జర్మనీ వనిత తయారుచేసినది. దాని శృతి శబ్ధ స్వరం అచ్చంగా భారతదేశంలో తయారు చేసినదానివలే ఉన్నదని చెప్పారు.

సంతోషంతో ఆ యజమాని, వారు వద్దని వారిస్తున్నా దాన్ని వారికి బహూకరించాడు. వారు అమెరికా వెళ్ళిన తరువాత చూస్తే తెచ్చుకున్న ఘటం పగిలిపోయి ఉంది. వారికి బహూకరించిన ఘటాన్నే వారు కచేరీలో వాడారు. ఆ ఘటం శృతి జి (5 కట్తై) అది కచేరి యొక్క ఆధార శృతి సి (1 కట్తై)కి సరిగ్గా సరిపోయింది. దాన్ని పరమాచార్య స్వామి వారి ఘటంగా భావించి వారి పూజామందిరంలో ఉంచుకున్నారు వినాయకరం గారు.

--- పద్మశ్రీ టి.హెచ్. వినాయకరం, చెన్నై - శక్తివికటన్ ప్రచురణ

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

https://t.me/paramacharyavaibhavam

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Monday, October 29, 2018

క్యాన్సర్ వ్యాధి – కనకల్ చికిత్స



దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటన. ఎచంకుడి గణేశ అయ్యర్ పరమాచార్య స్వామి వారికి పరమ భక్తుడు.

వారి భార్య కడుపులో క్యాన్సర్ కారణంగా చాలా బాధ పడేవారు. ఆపరేషన్ చేయించుకోవాలని, లేదంటే ఈ వ్యాధితో బ్రతకడం చాలా కష్టం అని చెప్పేవారు వైద్యులు.

గణేశ అయ్యర్ మహాస్వామి వారి దర్శనానికి వచ్చి వారితో తన బాధను విన్నవించుకున్నారు.

మహాస్వామి వారు అతనితో "ఆపరేషన్ చేయవలసిన అవసరం లేదు. తిరుతురైపూంది సమీపములో తిరునెల్లిక్కావల్ అనే రైల్వేస్టేషన్ ఉంది. ఆ స్టేషనులో దిగి అక్కడి నుండి పడమర వైపు ఒక కిలోమీటర్ వెళ్తే ఒక నీటి కాలువ వస్తుంది. ఆ కాలువ ఒడ్డున ఒక పెద్ద చెట్టు ఉంది. దాని పేరు "కనకల్" (తమిళంలో). ఆ చెట్టు ఆకుల యొక్క కాడలను స్వీకరిస్తే కాన్సర్ నయం అవుతుంది” అని చెప్పారు.

పరమాచార్య వారి సలహా ప్రకారం తన భార్య చేత ఆ చెట్టు ఆకుల కాడలు తినిపించారు. ఆశ్చర్యముగా కొన్ని రోజులలో ఆమె పొట్టలో ఉన్న క్యాన్సర్ వ్యాధి తగ్గుముఖం పట్టి, కేవలం కొద్ది రోజులలలోనే పూర్తి ఆరోగ్యవంతురాలు అయ్యింది.

ఎప్పుడూ స్వామి వారిని ధ్యానించే ఆవిడ 80 సంవత్సరాలు పైగా జీవించారు. అంతే కాకుండా మహాస్వామి వారు బృందావన ప్రవేశం ముందు జరిగిన వారి కనకాభిషేకం చూసి ధన్యులు అయ్యారు.

--- శ్రీమఠం బాలు మామ, మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్ 2

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Monday, October 22, 2018

చెన్నై - కంచి




ఒక ఆటోమొబైల్ ఇంజనీర్ తన జీవితంలో జరిగిన అనుభవాన్ని ఇలా పంచుకున్నాడు..

నేను చెన్నైలోని ఒక ప్రైవేటు కంపెనీలో ఆటోమొబైల్ ఇంజనీర్ గా పని చేస్తున్నాను. ఈ సంఘటన 2005లో నేను కుంబకోణం నుండి చెన్నైకు తిరుగుప్రయాణం చేస్తున్నప్పుడు జరిగింది. నేను నా కుటుంబంతో సహా వేసవి సెలవుల కొసం అక్కడికి వెళ్ళాము. మా బంధువుల ఇళ్ళకు వెళ్ళాము మరియు కుంబకోణంలో ఉన్న అన్ని దేవాలయాలను సందర్శించడం కూడా మా ప్రణాళికలో భాగమే.

మా తిరుగు ప్రయాణం కోసం మే 24వ తేది ఉదయం 8 గంటలకు టికెట్స్ బుక్ చేసుకున్నాము. తమిళనాడులో ఉన్న పుణ్యక్షేత్రాలను సందర్శించడం చాలా సంతోషం కలిగించే విషయం. తమిళనాడులో ఆలయ నగరముగా పేరుగాంచిన కుంబకోణంలోని దేవాలయాలు దర్శించడం నా చిరకాల వాంఛ.

మేము కుంబేశ్వర ఆలయం, సారంగపాణి ఆలయం మరియు శ్రీ ఒప్పిలిఅప్పన్ ఆలయాలు దర్శించాము. ఈ యాత్రలో చివరిగా కంచి మఠంను దర్శించటం మా ప్రణాలిక. మఠంలో ఉండగా నేను పొందిన అనుభూతి అనిర్వచనీయమైనది. మేము అక్కడ ఉండగా పరమాచార్య స్వామి వారి గురించి మఠం ధర్మకర్తలతో కొద్దిగా మాట్లాడాము. దాంతో నాకు వారి గురించి తెలుసుకోవాలని ఉత్సాహము మరియు ఆసక్తి కలిగి కొన్ని పుస్తకాలు తీసుకొన్నాను. తిరుగుప్రయాణంలో చదువుటకు నిశ్చయించుకున్నాను.

ఆ రోజు రాత్రి నా కలలో మహాస్వామి వారు స్వప్న దర్శనమిచ్చారు. వారు నాతో "నా వద్దకు రండి" అని చెప్పారు. నేను మధ్యలోనే నిద్రలేచి సమయము చుస్తే ఉదయం 4 గంటలు. ఆ తరువాత నేను నిద్రపోలేదు స్వామి వారు నిద్రలో చెప్పిన దానిగురించే ఆలోచిస్తున్నాను. సుమారు ఉదయం 5:30 అప్పుడు నేను నా పిల్లలను భార్యను నిద్ర లేపి, సామాను సర్దుకొని తయారు అవ్వమన్నాను. ఎనిమిది గంటలకు మా తిరుగు ప్రయాణం కాబట్టి. అందరం అల్పాహారం ముగించుకొని మా అమ్మ, నాన్న మరియు బంధువులందరికి విడ్కోలు పలికి కారులో బస్సు ప్రాంగణానికి బయలుదేరాము.

కారులో కూర్చున్న తరువాత నా భార్యతో, చెన్నైకి వెళ్ళేముందు కంచి వెళ్ళి కామకోటి మఠాన్ని దర్శించాలని ఉంది అని చెప్పాను. మరునిమిషములో మా ప్రణాలికను మార్చుకుని కంచి వెళ్ళాలని నిర్ణయించుకున్నాము. ఉదయం 7:30 ప్రాంతములో టికెట్ కౌంటరుకి వచ్చి కాంచీపురం వెళ్ళడానికి బస్సుల గురించి అడుగగా, 8:30కి ఉంది అని చెప్పారు.

మేము చెన్నైకి పోయే బస్సు టికెట్స్ రద్దు చేసుకోవడం కుదరలేదు. కాంచీపురం బస్సు రావడంతో వెళ్ళి కంచి కామకోటి మఠంను సందర్శించాము. అక్కడకు వెళ్లగానే నా మనస్సుకు ఏదో తెలియని పులకరింతకలిగింది. అక్కడ చాలా ఆహ్లాదంగా ప్రశాంతంగా అనిపించింది. ఒక గంటసేపు అక్కడ ఉండి మేము చెన్నైకి తిరుగు ప్రయాణం అయ్యాము.

మేము ఇంటికి వెళ్ళాక T.V చూస్తే ఒక వార్తవిని చాలా ఆర్చర్యానికి లోనయ్యాము. మేము చెన్నై రావడానికి టికెట్స్ తీసుకున్న బస్సుకి ప్రమాదం జరిగి, దానిలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. ఇది చాలా విషాదకరమైన సంఘటన.

కానీ నాకు ఇప్పటికి అర్థం కాని విషయం “హఠాత్తుగా ఎందుకు మా ప్రణాళిక మార్చుకున్నాము?” అని. ఆనాటినుండి నేను మహాస్వామి వారికి లొంగిపొయాను. నా జీవితాన్ని వారి పాదపద్మముల సేవకు అంకితం చెసాను. ఈరోజు వరకు లేవగానే నేను చేసే మొదటి పని పరమాచార్య స్వామి వారి పాద పద్మములు చూసి నమస్కరించడం.

--- మూలం : స్వస్తిక్ టివి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

https://t.me/paramacharyavaibhavam

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Monday, October 15, 2018

మహాస్వామి - మట్టి వైద్యం



ఒకసారి ఒక భక్తుడు పరమాచార్య స్వామి వద్దకు వచ్చి తన బంధువు ఒకరు ఆసుపత్రిలో కోమాలో ఉన్నాడని, వైద్యులు ఇక ఏమీ చెయ్యలేమని తేల్చేశారని బావురుమన్నాడు. తమ అసలు స్వరూపం ఎంటో తెలియడానికి ఇష్టపడని మహాస్వామి వారు తేనంబాక్కం దేవాలయానికి వెళ్ళమన్నారు.

“తేనంబాక్కం దేవాలయానికి వెళ్లి, విభూతి ప్రసాదాన్ని తీసుకుని మరలా ఇక్కడకు రా” అని ఆదేశించారు. అతను ఆలయానికి వెళ్ళగా, అప్పటికే ఆలయం తలుపులు వేసి ఉండటంతో, విభూది ప్రసాదం ఇవ్వడానికి అర్చకులు ఎవ్వరూ లేకపోవడంతో అతను నిరాశ పడ్డాడు. దిగాలుగా తిరిగొచ్చి నిలబడ్డాడు.

“సరే! చుట్టూ ఉన్న ప్రాకారంలో ఎవరైనా భక్తులు ఉంచిన విభూతి గాని, కుంకుమ గాని తీసుకుని రా” అని చెప్పారు స్వామివారు. ఆ భక్తుడు మరలా దేవాలయానికి వెళ్ళాడు కాని, ప్రకారం మొత్తం చూసినా ఎక్కడా ప్రసాదం కనపడలేదు ఆరోజు. ఇదే ఆశ్చర్యకరమైన విషయం అనుకుంటే, పరమాచార్య స్వామివారు మాకు కలిగించబోయే ఆశ్చర్యం ఇంకా పెద్దది.

ఆ భక్తుడు మరలా తిరిగిరావడంతో, “సరే వదిలేయ్. వెళ్లి ఆ దేవాలయ ప్రాకారం నుండి మట్టిని తీసుకుని రా” అని ఆదేశించారు. అతను మట్టిని తెచ్చి మహాస్వామివారి ముందు ఉంచాడు. ఇప్పుడు స్వామివారి అద్వితీయ శక్తులు బహిర్గతం అయ్యాయి.

శ్రీవారు ఆ మట్టిని దగ్గరకు తీసుకుని, మహిమాన్వితమైన వారి చేతివేళ్ళతో తాకుతూ ఆ మట్టికి మహత్వాన్ని ఇచ్చారు. కొద్దిసేపటి తరువాత దాన్ని బాలు మామకు ఇచ్చి, “వెళ్ళు. వెళ్లి దీన్ని అతనికి (రోగికి) ఇవ్వు” అని ఆదేశించారు.

స్వామివారి ఆదేశానుసారం బాలు మామ ఆసుపత్రికి బయలుదేరారు. కాని ఐసియులో కోమాలో ఉన్న రోగి వద్దకు తనను వదులుతారా, అతని వద్ద ఈ ఇసుకను ఉంచడానికి ఒప్పుకుంటారా అన్న ప్రశ్నలతో ఆసుపత్రికి చేరుకున్నారు. కాని అక్కడకు చేరుకున్న తరువాత ఏ సమస్య లేకుండా లోపలకు వెళ్ళగలిగారు. లోపలి గదిలోకి వెళ్లి ఆ రోగి దగ్గరకు వెళ్ళగానే, ఈ అద్భుతం జరిగింది. లోపలకు వెళ్ళగానే, అతని వద్దకు వెళ్లి అతనికి దగ్గరగా ఆ మట్టిని ఉంచి రావాలని బాలు మామ ఆలోచన. కాని అక్కడ జరిగింది వేరు.

బాలు మామ లోపలికి వెళ్ళగానే, కోమాలో ఉన్న రోగి కొద్దిగా కదలికలను చూపించాడు. పరమాచార్య స్వామివారి ప్రసాదం అడుగుతున్నట్టుగా హఠాత్తుగా చేతులను బయటపెట్టాడు. అ స్థితి చూస్తే అతనే లేచి “అది పరమాచార్య స్వామి ప్రసాదమా? దయచేసి ఇవ్వండి” అని అడుగుతాడేమో అనుకున్నారు బాలు మామ.

బాలు మామకు చాలా ఆశ్చర్యం వేసింది. పరమాచార్య స్వామివారి అనుగ్రహం వల్ల ఇలాంటి అద్భుతాల జరుగుతాయని తనకు తెలుసు కాబట్టి కొద్దిసేపటి తరువాత తేరుకున్నారు. ప్రసాదాన్ని ఇచ్చి తిరిగొచ్చారు. మొత్తం జరిగిన విషయం మహాస్వామివారికి తెలిపారు. తమ శక్తిని తెలపడానికి ఇష్టపడని స్వామివారు, “సరే! మరో రెండు మూడు రోజులు ఆసుపత్రికి వెళ్లి, అతనికి ప్రసాదం ఇచ్చి రా” అని ఆదేశించారు.

స్వామివారి ఆజ్ఞానుసారం బాలు మామ మూడు రోజులపాటు ఆసుపత్రికి వెళ్లి, అతనికి ప్రాసాదం ఇచ్చారు. అక్కడి డాక్టర్లందరూ ఆశ్చర్యానికి లోనయ్యేటట్టుగా, ఆ రోగి కోమా నుండి బయటపడి మామూలు మనిషి అయ్యాడు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

పరమాచార్య స్వామివారి వైభవాన్ని, మహిమలను వర్ణించడం ఎవ్వరి తరమూ కాదు.

--- ‘శ్రీ పెరియవ మహిమై’ పత్రిక నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

https://t.me/paramacharyavaibhavam

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Saturday, October 13, 2018

వినాయకుడు - విరుగుడు



నేను ఒకసారి కంచి మఠం వెళ్ళినప్పుడు ఒక అర్చకులు నాకు ఈ కింది విషయం చెప్పారు.

దాదాపు 45 సంవత్సరాల కిందట పరమాచార్య స్వామి వారు తిరుచిరాపల్లికి దగ్గర్లోని ఒక పల్లెటూరిలో మకాం చేస్తున్నారు. ఒకరోజు వారు చంద్రమౌళీశ్వర పూజకు ఉపక్రమిస్తూ, మఠం మేనేజరుతో “ఇంక కొద్దిసేపట్లో అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయ అర్చకులు ఇక్కడికి వస్తారు. వారికి భోజనాలు పెట్టించి, 2 గంటలకు నా వద్దకు తీసుకుని రా” అని చెప్పారు.

అక్కడే నిలబడి ఉన్న ఒక శిష్యుడితో, “మఠం స్థపతితో చెప్పి రెండు అడుగుల వినాయకుని విగ్రహం తయారు చెయ్యమని చెప్పు” అని ఆజ్ఞాపించారు.

మహాస్వామి వారి ఆజ్ఞ ప్రకారం మేనేజరు అర్చకులను మఠం సంప్రదాయం ప్రకారం స్వాగతించి, మద్యాహ్న సమయం కావడం వల్ల వారికి భోజన సదుపాయం ఏర్పాటు చేసి వారి భోజనం తరువాత స్వామి వారి వద్దకు తీసుకుని వెళ్ళాడు.

పరమాచార్య స్వామి వారు అందరినీ పేరుపేరునా వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ప్రధాన అర్చకులు పరమాచార్యస్వామి వారితో, “పెరియవ రోజూ ఉదయం అర్చకులు ఎవరైతే అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయ గర్భగృహం తలుపులు తీసి లోపలికి వెళ్తున్నారో, ఆ వెళ్ళినవారు వెంటనే కళ్ళు తిరిగి పడిపోతున్నారు. మళ్ళా పది నిముషములు ఉపచారము చేసిన తరువాతనే స్వస్థత పొందుతున్నారు. కావున మిగిలిన అర్చకులు ఎవరూ లోపలికి వెళ్ళడానికి సాహసించడం లేదు” అని తమ బాధను చెప్పుకున్నారు.

వెంటనే మహాస్వామి వారు వారితో, “రేపు నేనే స్వయంగా దేవాలయానికి వస్తాను. నేను వచ్చిన తరువాతనే మీరు ఆలయ తలుపులు తెరవండి” అని చెప్పి వారికి ప్రసాదాన్ని ఇచ్చి పంపించారు.

మరుసటి రోజు తెల్లవారుఝామున 5:30 గంటలకు పరమాచార్య స్వామి వారు అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయానికి వచ్చారు. ఒక అర్చకుడు అమ్మవారి గర్భగృహం తలుపులు తెరిచాడు. వెంటనే కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. పది నిముషముల తరువాత లేచి తన పనులకు వెళ్ళిపోయాడు. అది చూసి మహాస్వామి వారు కొద్దిసేపు ధ్యానంలోకి వెళ్ళారు. తరువాత ఆలయ ప్రధాన అర్చకుణ్ణి పిలిచి, “రేపటినుండి అతణ్ణి గర్భగృహం పక్క ద్వారం నుండి లోపలికి వెళ్ళమని చెప్పండి” అని ఎల్ల వెళ్ళాలో చెప్పి, తలుపులు తీసిన రెండు నిముషముల తరువాత లోపలికి వెళ్ళండి అని చెప్పారు.

సాయంత్రం స్థపతి వినాయకుని విగ్రహం తీసుకుని పరమాచార్య స్వామి వారి వద్దకు వచ్చాడు. స్వామి వారు ఒక మంటప నిర్మాణం చేసి, దాని పైన ఈ వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించమని చెప్పారు. అది ఎలా ఉండాలి అంటే “అమ్మవారి దృష్టి కాంతి, వినాకుడి దృష్టి కాంతి సమాంతరంగా ఒకటికొకటి కలవాలి” అలా నిర్మాణం చెయ్యవలసిందని చెప్పారు. స్వామి వారు చెప్పినట్టుగానే ఆలయంలో వినాయకుణ్ణి వారి అమ్మగారైన అఖిలాండేశ్వరి ఎదురుగా ప్రతిష్టించారు. ఆగమోక్తంగా ప్రతిష్ట పూజలు నిర్వహించారు. అప్పటి నుండి అర్చకులకు కళ్ళుతిరిగి పడిపోవడం జరుగలేదు.

ఇప్పటికీ, అష్టమూర్తి క్షేత్రములలో ఒకటైన, జల లింగ క్షేత్రమైన జంబుకేశ్వరం(తిరువణైకావల్) లోని అఖిలాండేశ్వరి అమ్మవారి ఆలయానికి ఎదురుగా వినాయకుడు ఉంటాడు. తల్లి తొలి చూపు తన తొలి బిడ్దడిపై ప్రసరించేట్టుగా పరమాచార్య స్వామి వారు సుముఖుడైన వినాయకుని ప్రతిష్ట చేయించారు.

[సాక్షాత్ పరమశివ అవతారులైన ఆదిశంకరాచార్యుల వారు, రాబోవు కాలాములలో ప్రజలు అనుష్టానము లేక, తపశ్శక్తి లేక దేవతా మూర్తుల ఎదురుగుండా నిలబడలేరని గ్రహించి, ఎక్కువగా ఉన్న తేజస్సును లెక్కకట్టి దాన్ని శ్రీచక్రంలోకి తీసి అక్కడే శ్రీచక్ర ప్రతిష్ట చేసారు. జంబుకేశ్వరం జల క్షేత్రం కావటం చేత అమ్మవారి సువర్ణ తాటంకాలలో శ్రీచక్రం వేసి అమ్మవారికి ధరింపచేసారు]

--- ఎ. త్యాగరాజన్, చెన్నై - శక్తి వికటన్ ప్రచురణ

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Friday, October 5, 2018

వేద స్వరం - శిక్ష




మహా పెరియవర్ సాక్షాత్ పరమాత్మ స్వరూపులు, శివావతారులు. ఈ శతాబ్ధపు ఆది శంకరాచార్యులు. అప్పుడు స్వామి వారు కుంబకోణంలోని కంచి మఠంలో మకాం చేస్తున్నారు. వ్యాస పూర్ణిమ చాలా ఘనంగా జరిగింది. చంద్రమౌళీశ్వర పూజ పూర్తి అయిన తరువాత భక్తులందరూ పరమాచార్య స్వామి స్వహస్తాలతో ఇచ్చే అభిషేక తీర్థం కోసం ఆత్రుతగా వచ్చారు. వరుసగా నిలబడి వస్తున్న వాళ్ళలో ఒక భక్తుణ్ణి మహాస్వామి వారు తలెత్తి చూసారు.

వారు అతనితో, ”రేపు తెల్లవారుఝామున జరిగే వేదపారాయణానికి రా” అని అన్నారు. మహాస్వామి వారి ఆజ్ఞకి తిరుగేముంది?

స్వామి వారి ఆదేశం మేరకు మరుసటిరోజు ఉదయాన్నే వచ్చి, వేదపారాయణంలో పాల్గొన్నాడు. పారాయణం జరుగుతూ ఉండగా ఆశ్చర్యకరంగా మహాస్వామి వారు వచ్చారు. వారు చాలా అరుదుగా వస్తారు.

నిన్న తాము రమ్మన్న భక్తుడు చాలా శ్రద్ధగా భక్తితో వేదాలను ఆమ్నాయం చెయ్యడం గమనించారు. వేదపారాయణం తరువాత అందరికి తీర్థప్రసాదాలు ఇచ్చు సమయంలో అతన్ని పిలిచి కొద్దిసేపు వేచియుండమన్నారు.

ఆ భక్తుడు భయంతో మనసులో నేను వేదమంత్రాలు సరిగ్గా ఉచ్ఛరింలేదేమో అందుకే మహాస్వామి వారు ఉండమన్నారు అని అనుకున్నాడు. కొద్దిసేపటి తరువాత, మహాస్వామి వారు ఆజ్ఞాపించారు అని ఒక వైద్యుడు వచ్చి, అతన్ని పూర్తిగా పరీక్ష చేసారు. తరువాత అతని వైద్యశాలకు తీసుకుని వెళ్ళీ ఇంకొన్ని పరీక్షలు చేసిన తరువాత ఆ భక్తుడికి హృదయ సంబధమైన జబ్బు ఉందని తెలుసుకున్నారు.

పరమాచార్య స్వామి వారి ఆదేశానుసారం ఆ వైద్యుడు, ఏ శస్తచికిత్స అవసరం లేకుండానే ఆ భక్తుని జబ్బు నివారించాడు.

పది రోజుల తరువాత ఆ భక్తుడు మహాస్వామి వారి దర్శనానికి వచ్చాడు. అతని మనస్సులో ఉన్న ప్రశ్నలకు సమాధానంగా మహాస్వామి వారు అతనితో,



“నువ్వు వేదం చాలా శ్రద్ధతో పఠిస్తున్నావు కాని, మంత్రాలను ఉచ్ఛరిస్తున్నప్పుడు నీకుగల శ్వాస సంబంధమైన రుగ్మత చేత, చాలా ఇబ్బందిగా పలకడం వల్ల అక్కడక్కడ స్వరం తప్పుతున్నది. నేను దాన్ని గుర్తించి బహుశా నీకు ఊపిరితిత్తులు లేక గొంతు సమస్య ఏదో ఉన్నదని గ్రహించి వైద్యుణ్ణి రప్పించాను” అని అన్నారు.

తరువాత “కొద్దిసేపు వేదం పారాయణం చెయ్యి” అని ఆజ్ఞాపించారు.
అతను స్వరం తప్పకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా వేదం చెప్పాడు. మహాస్వామి వారు చాలా సంతోషించి అతణ్ణి ఆశీర్వదించారు.అలా ఆ భక్తుడికి ముందు జరగబోయే ఉపద్రవాన్ని మహాస్వామి వారు తప్పించారు.

ఎప్పుడైతే మనం భక్తితో పరమాత్ముణ్ణి ప్రార్థించి, సేవిస్తామో మనకు రాబోయే బాధలు కష్టాలు మన దరిచేరకనే కరిగిపోతాయి.

--- రా. వెంకటసామి, శక్తి వికటన్ ప్రచురణ

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Monday, September 24, 2018

రావి చెట్టు - ప్రదక్షిణం


పరమాచార్య స్వామి వారు తమని తాము సాధారణ సన్యాసిగా చెప్పుకున్నా కొన్ని సంఘటనలు వారి నిజరూపాన్ని వారి అపార శక్తిని తెలియపరుస్తాయి. అలాంటి ఒక సంఘటన నా జీవితంలో జరిగింది.

అప్పుడు పరమాచార్య స్వామి వారు తిరువనైక్కావల్ లో మకాం చేసారు. నేను నా భర్త మహాస్వామి వారిని దర్శించుకుని తిరిగి తంజావూరు వెళ్ళిపోవాలి. మరుసటి రోజు సోమవార అమావాస్య. మేమిద్దరమూ తంజావూరులో రావి చెట్టుకు ప్రదక్షిణ చేయాలి.

మహాస్వామి వారు అక్కడకు వచ్చిన అందరితోను మాట్లాడి వారికి ప్రసాదం ఇచ్చి పంపిస్తున్నారు. మా విన్నపం విని కూడా మా మాటలు విన్నట్టు ఉన్నారు. మేము వరుసలో వచ్చినప్పుడు మా ముందువరకు అందరికి ప్రసాదం ఇచ్చి మా వంతు వచ్చిన వెంటనే లేచి లోపలికి వెళ్ళిపోయేవారు – వారు పదే పదే ఇలాగే చేస్తుండేవారు.

మేము తంజావూరు వెళ్ళే ఆలోచన విరమించుకుని రాత్రికి అక్కడే ఉండిపోయాము. నాకు మహాస్వామి వారిపై చాలా కోపంగా ఉన్నింది.

మరుసటి రోజు ఉదయం విశ్వరూపం తరువాత, వారి గంట జపం మొదలుపెట్టేముందు మేనేజరు వారితో “ముప్పవు గంట తరువాత నేను జపంలో ఉండగానే పల్లకిని కొల్లిదం నది ఒడ్డుకు చేర్చుటకు ఏర్పాట్లు చెయ్యమని” చెప్పారు. వారు పల్లకిలోపల కూర్చుని తలుపులు వేసుకున్నారు.

రావి చెట్టుకు ఎలాగు ప్రదక్షిణలు చేయలేమని తెలుసుకుని, కనీసం మహస్వామి వారి చుట్టూ తిరుగుదామని అనుకున్నాము. మేనా చుట్టూ ప్రదక్షిణలు చెయ్యడం మొదలుపెట్టాము. అది పూర్తి అయినతరువాత పల్లకి బయలుదేరింది. మేము కూడా దాని వెంట వెళ్ళి కొల్లిదం చేరుకుని అక్కడే స్నానాదులు ముగించాము.

పరమాచార్య స్వామి వారు తమ అనుష్టానానికి కూర్చుంటూ నన్ను పిలిచి ”ఎన్ని ప్రదక్షిణలు చేసావు?” అని అడిగారు. “తొంబై ప్రదక్షిణలు” అని చెప్పాను. కాని నేను ప్రదక్షిణలు చేసినట్టు మహాస్వామి వారు చూసే అవకాశమే లేదు. మిగిలిన ప్రదక్షిణములు కూడా పూర్తి చెయ్యమని చెప్పారు.

నేను మిగిలిన ప్రదక్షిణలు పూర్తి చేసిన తరువాత నన్ను అడిగారు, “ఏ శ్లోకం పఠిస్తూ ప్రదక్షిణలు చేసావు?”

“గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః అని మననం చేస్తూ ప్రదక్షిణ చేసాను” అని చెప్పాను.

“రావి చెట్టు ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ శ్లోకం పఠిస్తావు?” అని అడిగారు.

”మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపాయ అగ్రతో శివరూపాయ వృక్షరాజాయతే నమో నమః” అని అన్నాను.

వెంటనే మహాస్వామి వారు “మరింకేంటి ఇక్కడా త్రిమూర్తియే అక్కడా త్రిమూర్తియే. సరిపోయింది కదా!” అని అన్నారు.

ఈ మాటలు చెప్పి నన్ను ఆశీర్వదించి ప్రసాదం ఇచ్చారు. అప్పటినుండి ప్రతి సోమవార అమావాస్య నాడు పరమాచార్య స్వామి వారికి ప్రదక్షిణ చెయ్యాలని నియమం పెట్టుకున్నాను.

--- జయలక్ష్మీ అమ్మాళ్, పొల్లాచి. మహాపెరియావళ్ – దరిశన అనుభవంగళ్ 4

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

https://t.me/paramacharyavaibhavam

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Monday, September 17, 2018

ఆయుర్వేద వైద్యం - బొమ్మల కొలువు



అది మహారాష్ట్రలోని సతారాలో ఉత్తర శ్రీ నటరాజ స్వామి వారి దేవాలయం కడుతున్నప్పటి రోజులు. మహాస్వామి వారు అక్కడే ఉంటూ అన్నీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పరమాచార్య స్వామి వారి దర్శనానికి భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు.

ఒకనాటి ఆదివారం మద్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో 30 సంవత్సరముల వయస్సుగల ఒక యువకుడు మహాస్వామి వారికి సాష్టాంగం నమస్కారం చేసి నుంచున్నాడు. అతని కళ్ళల్లో కన్నీటి ధారను మహాస్వామి వారు చూసి ప్రేమతో “ఏమప్పా! ఎవరు నీవు? ఎక్కడనుండి వచ్చావు? నీ కళ్ళల్లో ఆ తడి ఎందుకు?” అని అడిగారు. అతను ఏమి సమాధానం చెప్పకుండానే పెద్దగా ఏడ్వటం మొదలుపెట్టాడు. చుట్టూ ఉన్న వారు అతన్ని ఊరడించి మహాస్వామి వారిముందు కూర్చోపెట్టారు.

”ఎక్కడినుండి వచ్చావు అప్పా?” మహాస్వామి అడిగారు. ”పాలక్కాడ్ కేరళ”

వెంటనే మహాస్వామి వారు “పాలక్కాడ్ నుండి ప్రయాసపడి ఇక్కడిదాకా వచ్చావా?” అని అడిగారు. ”అవును పెరియావ మీకొసం అక్కడినుండి వచ్చాను”

“సరే. నీ పేరు ఏంటి?”

“హరిహర సుబ్రమణియన్”

“భేష్! చాలా మంచి పేరు. మీ తండ్రి గారు ఏం చేస్తుంటారు?” అని అడిగారు. ”మా తండ్రి గారు ఇప్పుడు శరీరంతో లేరు. వారు పాలక్కాడ్ లో ఆయుర్వేద వైద్యుడు. వారి పేరు డా. హరిహర నారాయణన్”

అతను ముగించక ముందే మహాస్వామి వారు కుతూహలంతో ”ఓ నువ్వు పాలక్కాడ్ ఆయుర్వేద వైద్యులు హరిహర నారాయణన్ కుమారుడవా. మంచిది! సరే చెప్పు. అలా అయితే నువ్వు డా. హరిహర రాఘవన్ గారి మనవడివి కదూ! వారందరూ ఆయుర్వేద వైద్యంలో మంచి పేరు సంపాయించారు” అని చెప్తూ వచ్చిన అతణ్ణి పరిశీలనగా చూస్తూ కనుబొమ్మలు పైకెత్తారు.

”అవును పెరియావ” సమాధానమిచ్చాడు ఆ యువకుడు.

మహాస్వామి వారు నవ్వుతూ “భేశ్! ఉన్నతమైన వైద్య వంశం మీది. అది సరే నువ్వు నీ పేరు ముందు డాక్టర్ అని పెట్టుకోలేదా?” అని అన్నారు.

”నేను అది చెదవలేదు పెరియావ. మా తండ్రి గారు నన్ను ఆ మార్గంలో పెంచలేదు” కొంచం నిర్లక్ష్యంగా అన్నాడు. ”నువ్వు అలా చెప్పరాదు. మీ తండ్రిగారు చెప్పించలేదా లేదా నీకే దానిపైన శ్రద్ధ లేదా?”

అతను ఏమి చెప్పలేదు. “అంతటి మహా వైద్యుల వంశంలో పుట్టి నువ్వు నేర్చుకునే భాగ్యం పోగొట్టుకున్నావు. సరే ఎంతదాకా చదువుకున్నావు?” అడిగారు మహాస్వామి వారు. ”తొమ్మిది దాకా పెరియావ”

“ఏం మరి చదువుకోవాలని అనిపించలేదా?”

“ఏమో నాకు అప్పుడు అనిపించలేదు. కాని ఇప్పుడు చింతిస్తున్నాను.”

“నీకు వివాహం అయ్యిందా?”

“అయ్యింది పెరియావ. మాకు ఏడు సంవత్సరముల కూతురు ఉంది”

“సరే. ఇప్పుడు ఏమి చేస్తున్నావు?”

అతని కళ్ళల్లో నుండి నీరు జారసాగింది. “నాకు మంచి చదువు లేకపోవడం వల్ల మంచి ఉద్యోగం లభించలేదు పెరియావ. నేను ఒక రైస్ మిల్లులో సూపర్వైజర్ గా పనిచేస్తున్నాను. నా జీతం ఏడు వందల రూపాయలు. దాంతోనే మా కుటుంబం గడుస్తోంది.”

“ఓహో అలాగా? సరే నీకు మీ పూర్వీకులు స్వంత ఇల్లు వదిలివెళ్ళారా?”

అతను కళ్ళు తుడుచుకుంటూ “మా తాత గారు ఒక ఇంటిని కట్టించారు. నేను ఇక్కడకి రావటం ఆ ఇంటి గురించే పెరియావ. చాలా ఏళ్ళ క్రితం మా అత్తయ్య (నాన్న గారి చెల్లెలు) భర్త చనిపోవడంతో తన ఇద్దరు కూతుళ్లను తీసుకుని పాలక్కాడ్ వచ్చింది. నవరాత్రులప్పుడు మా నాన్న గారు మేము ఉన్న ఇంటిని 25వేల రూపాయలకు తకట్టుపెట్టారు. మా అత్తగారి పిల్లల పెళ్ళిళ్ళు చేసారు. తరువాత మా నాన్న మా అత్త ఇద్దరూ కాలం చేసారు.”

“పెరియావ నా బాధ ఏంటంటే నవరాత్రి సమయంలో లక్ష్మీకారకం అయిన ఇంటిని తాకట్టు పెట్టి పోయారు. ఇప్పుడు ఆ అప్పు 45వేల రూపాయలు అయ్యింది. ఇక ఇల్లు నా నుండి వెళ్ళీపోతుంది” పరమాచార్యస్వామి వారు ధ్యానంలోకి వెళ్ళారు. కొద్దిసేపటి తరువాత చిరువవ్వుతో “సరే ప్రతి నవరాత్రికి నువ్వు ఇంట్లో బొమ్మల కొలువు పెద్తున్నావు కదూ?”

“లేదు పెరియావ. మా తండ్రి గారు ఉన్నప్పుడు పెట్టేవారం. వారు వెళ్ళీపోయిన తరువాత నేను పెట్టడంలేదు.”

మహాస్వామి వారు అడ్డుపడుతూ “పూర్వీకుల గురించి నువ్వు అలా మాట్లాడకూడదు. వారు చాలా గొప్పవారు. నాకు తెలుసు. వారు చాలా మంచి పనులు చేసి వెళ్ళిపోయారు. నువ్వు మనసులో ఏదో పెట్టుకుని తరతరాలుగా వస్తున్న ఆచారాలను వదలరాదు. మరొక్క వారంలో నవరాత్రి మొదలు అవుతుంది. పాలక్కాడ్ లోని మీ ఇంటిలో బొమ్మలు కొలువు పెట్టి దేవిని ఆరాధించు. నీ కష్టాలు తీరి ఊరట లభిస్తుంది.” అని చెప్పి అతనికి ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించి పంపించారు.

ఇరవై రోజులు గడిచాయి. ఆ రోజు ఆదివారం. సతారా లో మహాస్వామి దర్శనార్థం చాలా మంది భక్తులు వచ్చారు. శ్రీ మఠం పరిచారకుడు ఒకరు ఆ భక్తుల మధ్యలో త్రోవ చేసుకుంటూ ఒక 60 65 సంవత్సరముల వయస్సు ఉన్న ఒక పెద్దాయనను తీసుకుని వచ్చారు. వారు కాషాయ వస్త్రములు ధరించి మెడలో ఎన్నో తుళసి రుద్రాక్ష మాలలు ధరించి ఉన్నారు. వారు మహాస్వామి వారికి సాష్టాంగం చేసి హిందీలో మాట్లాడారు. పరమాచార్య స్వామి వారు కూడా అతనితో హిందీలో మాట్లాడి తమ ఎదురుగా ఉన్న వేదిక పైన కూర్చోమన్నారు.

కొద్దిసేపటి తరువాత పాలక్కాడ్ హరిహర సుబ్రమణియన్ వచ్చి మహాస్వామి వారికి నమస్కరించాడు. అతని చేతిలో చిన్న ట్రంకు పెట్టె ఉంది. మహాస్వామి వారు అతణ్ణి అతని చేతిలోని ట్రంకు పెట్టెని చూసారు. ఆ యువకుడు ఆ డబ్బా తెరిచి అందులో ఉన్న పట్టు బట్టలో చుట్టబడియున్న కొన్ని తాళపత్రాలను బయటకు తీసాడు. మహాస్వామి వారు ఏమి తెలియనట్టు ఏంటవి? అన్నాట్టుగా చూసారు.

అతను అమాయకంగా “మీరు ఈ సంవత్సరం నుండి బొమ్మల కొలువు పెట్టమని నాకు అనుజ్ఞ ఇచ్చారు. నేను బొమ్మల కోసం వెతికితే నాకు ఈ డబ్బా దొరికింది. నేను ఎప్పుడూ దీన్ని చూడలేదు. నేను తెరచి చూసి అందులో ఉన్న భాష అర్థం కాక ఇక్కడకి తెచ్చాను.”

మహాస్వామి వారు నవ్వుతూ తమ ఎదురుగా కూర్చొని ఉన్న ఆ కాషాయ వస్త్రధారిని చూసి హిందీలో “కొద్దిసేపటి ముందు నువ్వు నన్ను అడిగిన ఆ అపూర్వ వస్తువు వచ్చింది. వచ్చి చూడు” అని అన్నారు. అతను కింద కూర్చుని ఆ తాళ పత్రాలను నిశితంగా పరిశీలించసాగాడు. అతని మొహం ఆనందమయమైంది. వాటిని ఎత్తుకుని తలపై ఉంచుకొని ఆనందంతో గట్టిగా “ఓ పరమ ఆచార్య పురుషా! ఈ అపూర్వ అయుర్వేద గ్రంథం కోసం ఎన్నో ఏళ్ళుగా వెతుకుతున్నాను. నువ్వు ప్రత్యక్ష దైవానివి. అరగంటలో నేను అడిగినదాన్ని నాకు ప్రసాదించావు. నేను ధన్యుణ్ణి.” అని పరమాచార్య స్వామి వారికి సాష్టాంగ నమస్కారం చేసాడు.

హరిహర సుబ్రమణియన్ ఏమి అర్థం కాక నిలుచుండిపోయాడు. మహాస్వామి వారు దగ్గరకు పిలిచి “ఇతను పండరీపురం నుండి వచ్చిన ఆయుర్వేద సిద్ధాంతి. అరగంట క్రితం తను ఒక అపూర్వ గ్రంథం కోసం వెతుకుతున్నానని నాతో చెప్పాడు. నా మనస్సుకు ఏదో తోచినట్టయ్యి కొద్దిసేపు వేచియుండమని చెప్పాను. తరువాత నువ్వు ఈ ట్రంకు పెట్టెతో వచ్చావు. వారికి ఇవి ఉపయోగపడతాయి. నీ తండ్రిని తాతని తలచుకొని నీ చేతులతో వాటిని ఆయనకు ఇవ్వు” అని ఆజ్ఞాపించారు.

ఆ యువకుడు వారు చెప్పినట్టే చేసాడు. వాటిని తీసుకుంటున్నప్పుడు ఆ పెద్దమనిషి కళ్ళలో ఆనందభాష్పాలు కారాయి. అతను ఆ యువకుడితో “నీ వల్ల నాకు అపూర్వ గ్రంథము దొరికింది. దానికి వెల నేను కట్టలేను. అలాగని ఈ అపూర్వ సంపదని ఉచితముగా తీసుకోలేను” అని ఒక పళ్ళెంలో యాభైవేల రూపాయలు, పళ్ళు ఉంచి వినయంగా ఇచ్చాడు. ఆ యువకుడు మహాస్వామి వారి వంక చూసాడు. వారు చిరునవ్వుతో తీసుకుమ్మన్నారు. వణుకుతున్న చేతులతో అతను దాన్ని అందుకున్నాడు.

మహాస్వామి వారు దగ్గరకు పిలిచి “నువ్వు నీ పూర్వీకుల గురించి తప్పు గా మాట్లాడినప్పుడు నేను నీకు ఏమి చెప్పానో గుర్తుందా? వారు చాలా గొప్పవారు. చాలా మంచి పనులు చేసారు. చూసావా బొమ్మల కొలువు పెట్టమన్నందుకు నీకు ఇది దొరికింది. ఇంటి అప్పు 45వేలు అన్నావుగా! చంద్రమౌళీశ్వరుడు నిన్ను అనుగ్రహించాడు. పాలక్కాడ్ కి తిరిగి వెళ్ళు. డబ్బు జాగ్రత్త” అని చెప్పి అశీర్వదించి పంపించారు.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

https://t.me/paramacharyavaibhavam

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Monday, September 10, 2018

ఇంటి దైవాన్ని మరచిపోతే?


ఒక భక్తుడు కంచి మఠంలోనికి ప్రవేశిస్తూ, తూలుతూ తడబడతూ క్రింద పడిపోబోయాడు. అతని అవస్థ చూసి అక్కడ ఉన్న వారు పట్టుకున్నారు. అయినా అతను నోట్లో నుండి రక్తం కక్కుకున్నాడు. అక్కడున్నవారు భయపడిపోయారు. అక్కడ రేగిన కలకలం పరమాచార్య స్వామి వారి చెవులను చేరింది.

వారు ఒక పరిచారికుని వంక చూసి “ఎందుకు అంత అలజడి అక్కడ?” అని అడిగారు.

మఠం మేనేజరు మహాస్వామి వారితో “ఎవరో భక్తుడు రక్తం కక్కుకున్నాడు” అని చెప్పాడు.

మహాస్వామి వారు మేనేజరుతో “అతనిదేవూరు? ఇప్పుడు ఎక్కడినుండి వస్తున్నాడు” కనుక్కోమన్నారు.

ఆ భక్తుడు తిరుచ్చి దగ్గర్లోని ఒక పల్లెటూరినుండి వచ్చాడు. చిదంబరంలోని నటరాజ స్వామి వారిని దర్శించుకుని కాంచీపురానికి వచ్చాడు. మహాస్వామి వారు ఆ పెద్దమనిషిని దగ్గర్లోని డాక్టరు దగ్గరకు తీసుకువెళ్ళమని చెప్పారు. రక్తం కక్కున్నాడు అని విన్న వెంటనే డాక్టరుగారు హెమొరేజ్ (రక్తస్రావం) వాల్ల ఇలా జరిగి ఉండొచ్చు అనుకున్నారు. హాస్పిటల్ లో చేర్పించమని సలహా ఇచ్చారు.

ఈ విషయాన్ని మహాస్వామి వారికి చేరవేసారు.

”ఇది హెమొరేజ్ కాదు. మీ నాన్నమ్మను అడిగితే అది వేడి చేయడం వల్ల అలా జరిగింది అని చెబుతారు. ఇంకొందరు దృష్టిదోషం వల్ల అలా జరిగింది అని చెబుతారు. నాకు తెలిసి ఈ పెద్దమనిషి వారి ఇంటి దైవం తిరువాచూర్ మదుర కాళి అమ్మన్. ఇప్పుడు వీరికి కాని వీళ్ల ఇంట్లో వాళ్ళకి ఇంటి దైవం విషయం గుర్తులేదు. కాని ఇప్పుడు వీరు అమ్మవారిని భక్తితో కొలవడం లేదు. కంచి కాళికాదేవికి పూజ చేసి ఇతనికి ప్రసాదం ఇవ్వండి. ఇతను చిదబరంలోని థిల్లై కాళి అమ్మవారిని దర్శించుకోకుండా ఇక్కడికి వచ్చాడు. అది తప్పు కదా? అంతే కాకుండా కాళి దేవి వారి ఇంటి ఆరాధ్యదైవం. మరి అటువంటప్పుడు కాళి దేవిని భక్తితో కొలవాలి కదా? సరే”

“అతనికి ఆరోగ్యం బాగుపడిన వెంటనే చిదంబరం వెళ్ళి థిల్లై కాళి అమ్మవారిని దర్శించుకోవాలి. వైద్యులు చెప్పినట్టు ఇతను అధిక రక్త పోటుతో బాధపడుతున్నాడు. అందుకే రక్తం కక్కున్నాడు. కావున అతని తిండిలో సాధ్యమైనంతవరకు ఉప్పు తగ్గించాలి.” ఇలా మహాస్వామి వారు చాలా సూచనలు చేసారు.

కాంచీపురం కాళి అమ్మవారి దేవస్థానం నుండి కుంకుమ తెచ్చి ఆ పెద్దమనిషి నుదుటిపైన రాసారు. అతన్ని శ్రీమఠం లోని హాల్లో పడుకోబెట్టారు. పరమాచార్య స్వామి వారు చెప్పినట్టు తరచుగా అతనికి చల్లటి నీటిని కొంచం కొంచం తాగడానికి ఇచ్చారు. రాత్రి అతను హాయిగా నిద్రపోయాడు. మరుసటి ఉదయం అతను మామూలుగా సంభాషించాడు. రాత్రి విశ్రాంతి వల్ల అతను కొంచం ఉత్సాహంగా కనపడ్డాడు. ఆయన మహాస్వామి వారి వద్ద ప్రసాదం తీసుకుని మేనేజరు గారికి ధన్యవాదాలు తెలిపి వెళ్ళిపోయాడు.

ఇంటికి వెళ్ళిన తరువాత తనకు ఎటువంటి ఆరోగ్య సమస్య లేదని అతను మేనేజరు గారికి ఉత్తరం రాసాడు. ఇంకా

“నేను ఇక ఎప్పుడూ మా ఇంటి దైవాన్ని మరచిపోను. కాని నాకు ఈనాటికి అర్థం కాని విషయం ఏంటంటే మహాస్వామి వారికి ఎలా తెలుసు నేను చిదంబరంలో థిల్లై కాళి అమ్మవారిని దర్శించుకోలేదని?” అది మనకి కూడా అంతుచిక్కని విషయం.

మన ఇంటి దైవం తరతరాలుగా మన చేత పూజింపబడుతూ మనల్ని రక్షిస్తున్న దైవం. కొత్త కొత్త దేవుళ్ళ మోజులో పడి ఇంటి దైవాన్ని ఎన్నటికి మరువరాదు. తల్లితండ్రులు కూడబెట్టిన ఆస్తులు కావాలి. కాని వారు అర్చించిన దైవం మాత్రం వద్దా?

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

https://t.me/paramacharyavaibhavam

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Sunday, September 9, 2018

25 ఏళ్ళు - 7 ఏళ్ళు


నేను ఒకసారి మహాస్వామి వారి దర్శనంకోసం కర్ణాటక రాష్ట్రం లోని వాసనగెరె వెళ్ళాను. స్వామి వారు సండూరు మహారాజు గారికి చెందిన గనుల ప్రాంతములో పర్యటిస్తున్నారు. కొంతమంది భక్తులతో కలిసి స్వామి వారు ఒక జమఖానం పై కూర్చున్నారు. ‘వేద రక్షా నిధి ట్రస్ట్’ కు చెందిన అన్నాదురై అయ్యంగార్ మరియు కొంతమంది వారి వేదపాఠశాల విద్యార్థులతో పాటు అక్కడ కూర్చున్నారు. అప్పుడు సమయం రాత్రి 10:30 గంటలు.

సండూరు మహారాజు, మహారాణి, వారి కుమారుడు కూడా అక్కడ ఉన్నారు. అతను యు.స్ లోని యేల్ విశ్వవిద్యాలయంలో గణిత శాఖలో రీడర్ గా పనిచేస్తున్నాడు. అతను గణితంలో పి. హెచ్.డి పట్టా పొందాడు. వారి తల్లితండ్రులు స్వామి వారి ముందు వినయంగా నిలుచున్నారు. కాని ఇతను మాత్రం చాలా మమూలుగా ఉన్నాడు. పరమాచార్య స్వామి వారు రాజుగారు మరియు రాణిగార్లతో కాసేపు కన్నడం లో మాట్లాడి కొద్దిసేపటి తరువాత వాళ్ళ అబ్బాయి వంక తిరిగి అడిగారు.

“నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు? ఏమి చేస్తున్నావు”

“నేను యేల్ విశ్వవిద్యాలయంలో గణిత శాఖలో రీడర్ గా పనిచేస్తున్నా ను” అని బదులిచ్చాడు. ”నువ్వు ఏమి చదువుకున్నావు? గణితంలో ఏ శాఖలో నువ్వు పి. హెచ్.డి పట్టా పొందావు?” అని అడిగారు. పరమాచార్య స్వామి వారికి అర్థం అవదు అని సంకోచిస్తూ అతను కొద్దిసేపు వారి ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. అతని తండ్రి చెప్పమని అదేశించాడు. ”క్వాంటమ్ థియరీ” అని నిర్లక్ష్యంగా అన్నాడు. మహాస్వామి వారు మట్టిలో ఒక +ve సంజ్ఞను వేసి దాని చుట్టూ ఒక వృత్తం వేసారు. అలాగే –ve సంజ్ఞను వేసి ఒక వృత్తం వేసారు. వాటిని రెండూ చూపిస్తూ అతన్ని అడిగారు. ”నీ పి.హెచ్.డిలో క్వాంటమ్ థియరీ థీసిస్ కోసం నువ్వు సానుకూల విధానాన్ని(Positive Approach) అవలంబించావా లేదా ప్రతికూల విధానాన్ని(Negative Approach) అవలంభించావా?”

అంతదాకా చికాకుగా ప్రవర్తిస్తున్న వాళ్ల అబ్బాయి ఈ ప్రశ్న విని కొద్దిగా ఆశ్చర్యపోయి కంగారుతో మాటలు తడబడగా పరమాచార్య స్వామి వారిపై గౌరవంతో బదులిచ్చాడు. ”సానుకూల విధానాన్ని అవలంబించాను.”

“ప్రతికూల విధానాన్ని ఎందుకు తీసుకోలేదు? అది తరువాత చేద్దాం అనుకున్నావా?”

”అది సాధ్యపడదు. చాలా కష్టం”

మహాస్వామి వారు అన్నాదురై అయ్యంగార్ వైపు చూసి “అది కష్టం అని అతను అంటున్నాడు. మీ వేద పాఠశాల పిల్లలతో ఋగ్వేదము నుండి ఈ పన్నాన్ని ఆమ్నాయం చెయ్యమని చెప్పండి” అని మొదటి రెండు పదాలను అందించారు.

ఆ విద్యార్థులు దాన్ని ఐదు నిముషముల సేపు వల్లించారు. తరువాత ఆ అబ్బాయి వంక తిరిగి, ”నువ్వు 24 లేదా 25 వ సంవత్సరములో నీ పట్తా పొందావు కదూ.” అని అన్నారు

“అవును నా 25వ సంవత్సరములో” అని బదులిచ్చాడు. ”ఋగ్వేదం లోనిది ఇప్పుడు నువ్వు విన్నది. అది సానుకూల విధానానం, ప్రతికూల విధానాం రెండింటి గురించి చెప్తుంది.” అని అన్నారు. వారి మాటలకు ఆ అబ్బాయి విస్తుపోయి, మళ్ళీ ఒక సారి చెప్పమని ఆ విద్యార్థులను కోరాడు. ”నువ్వు ఇప్పుడు ఏమి అలోచిస్తున్నావో నాకు తెలుసు. 25సంవత్సరాల లక్షలు లక్షలు ఖర్చుపెట్టి చదువుకొని తెలుసుకున్నది కేవలం 7 ఏళ్ళు వేదం చెదువుకొని ఉంటే తెలుసుకుని ఉండేవాడిని కదా!” అని గట్టిగా నవ్వారు.

--- తిరువణ్ణామలై గౌరీశంకర్ మామ

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

https://t.me/paramacharyavaibhavam

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Saturday, September 8, 2018

పరమాచార్య స్వామి – ఉప్పు వ్యాపారి



అనుకోకుండా నాకు ఒక పెద్ద దుఃఖం, భరింపరాని శోకం కలిగింది. నాలుగు నెలల దాకా మహాస్వామి వారిని దర్శించుకోవడానికి కూడా వెళ్ళలేదు. మహాస్వామి వారు నాకోసం కబురు పంపారు. ఇద్దరు లేదా ముగ్గురు పెద్ద అధికారులు వచ్చి నన్ను వారి వద్దకు తీసుకుని వెళ్ళారు.

అప్పుడు రాత్రి పది గంటలు. . . . కటిక చీకటి. . . . కేవలం ఒక మట్టి ప్రమిద మాత్రమే వెలుగుతోంది.

”...నిపుణౌ”, మహాస్వామి వారు మెల్లిగా చెప్పారు, “చెప్పు”.

”తవ హి చరణావేవ నిపుణౌ . . . సౌందర్యలహరి లోని నాలుగవ శ్లోకం
త్వదన్యః పాణిభ్యాం. . . ”

పరమాచార్య స్వామి వారు చిన్నగా అన్నారు, “అందరికీ ఆ అమ్మే ఆశ్రయం. ఎవరెవరికి ఏమి ఎప్పుడు ఎలా ఇవ్వాలో ఆమెకి తెలుసు.”

అంతా నిశ్శబ్ధం.... ”సాంబమూర్తి నీకు సంత అంటే ఏంటో తెలుసా?”

“తెలుసు పెరియావ. చాలామంది వర్తకులు సరుకులు తెచ్చి అమ్ముతూ ఉంటారు. వారంలో ఒక రోజు ప్రతి గ్రామంలో సంత జరుగుతుంది. వారు ఈరోజు ఇక్కడ రేపు అక్కడ అని ప్రయాణిస్తూంటారు.”

“నీవు ఉప్పు వ్యాపారి గురించి ఎప్పుడైనా విన్నావా?”

“అవును. వారు సంతలో ఉప్పు అమ్ముకుని జీవిస్తూ ఉంటారు. వారికి అదే జీవనాధారం.”

“అవును. అటువంటి ఒక ఉప్పు వ్యాపారి కామాక్షి అమ్మకి పరమ భక్తుడు. ఒకసారి అతను ఒక ఊరిలో సంత ముగించుకుని మరొక ఊరికి వెళ్తుండగా మార్గమధ్యంలో ఒక అడవి గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమంది దొంగలు ఇతన్ని చూసారు. గాడిద పైన ఉప్పు మూటలు తీసుకువెళ్తున్న అతన్ని చూసి “రేయ్ రేపు సంతలో ఇతను ఈ ఉప్పునంతా అమ్మి డబ్బులతో మళ్ళా ఇదే మార్గంలో వెళ్తాడు. అప్పుడు మనం ఇతని ధనాన్ని దొంగిలించాలి.” వారు ఒక పథకం వేసారు. ఇంకా, వాళ్ళు పేల్చే మందుగుండు సామాగ్రి గురించి నీకు తెలుసా?”

“దేవాలయాలలో ఉత్సవాల సమయంలో పేలుడు పదార్థాలతో మందుగుండు సామాగ్రి తయారుచేస్తారు. గొట్టాలలో గట్టిగా కుక్కి ఒక వత్తి పెడతారు. ఆ వత్తి చివరకు అగ్ని తగిలితే అది చిన్నగా వెళ్ళి మందుగుండును తాకి పెద్దగా శబ్దము చేస్తూ పేలుతుంది.”

“అవును. ఆ దొంగల పథకము కూడా అదే. ఒక మందుగుండు పేలిస్తే ఆ గాడిద కంగారులో అటు ఇటు పరిగెడుతుంది. ఆ ఉప్పు వ్యాపారి భయతో అరుస్తూ గగ్గోలు పెడతాడు. అప్పుడు అతని దట్టీ నుండి డబ్బు తస్కరించవచ్చు.”

“ఆ రోజు సంతలో ఉప్పు వ్యాపారి తన దగ్గర ఉన్న ఉప్పును అమ్మడానికి కుప్పలుగా పోసాడు. కాని ఆరోజు బాగా వర్శం పడి ఉప్పు మొత్తం కరిగిపోయింది. అతనికి ఆరోజు వ్యాపారం లో నష్టము మనస్సుకు కష్టము కలిగింది. బుద్దికి తోచినట్టుగా మనస్సుకు వచ్చినట్టుగా కామాక్షిని తిట్టడం మొదలుపెట్టాడు. అతని కోపం ఏంటంటే డబ్బులేకుండా ఇంటికి వెళ్ళాలి అని. ఇంటికి వెనుతిరిగి నడక మొదలుపెట్టాడు. అడవి మార్గంలోకి ప్రవేశించగానే దొంగలు అతన్ని చూసి మందుగుండు పేల్చడానికి సిద్ధపడ్డారు. వత్తి గుండా మంట లోపలికి వెళ్ళి మందుగుండు సామాగ్రిని చేరింది కాని పేలలేదు. వారు దానికి కారణం వెతకగా ఆ మందుగుండు బాగా తడిసిపోయింది పొద్దున్న పడిన వర్షానికి. వాళ్ళు ఉప్పు వ్యాపారితో ఇలా అన్నారు. “దేవుడు నిన్ను కాపాడాడు. నీకోసమే ఈరోజు వర్షం పడినట్టుంది. పో ఇంటికి పోయి దేవున్ని ప్రార్థించు”

ఆ ఉప్పు వ్యాపారి నిశ్చేష్టుడయ్యాడు. “అమ్మ నాకు ద్రోహం చేసింది అనుకున్నాను. కాని అది తప్పు. ఆమె నన్ను కాపాడింది. అమ్మా కామాక్షి నన్ను క్షమించు. నాకు ఎప్పుడు ఎక్కడ ఏమి ఇవ్వాలో నీకు బాగా తెలుసు. నా అజ్ఞానాన్ని మన్నించు తల్లీ. వర్షం రాకపోయి ఉంటే నేను ఉప్పు మొత్తం అమ్మి డబ్బుతో వస్తుండేవాడిని. డబ్బు తీసుకోవడంతో పాటు ఈ దొంగలు నన్ను కొట్టేవారు. నన్ను కాపాడినందుకు నీకు కృతజ్ఞతలు.“

కావున మనకి ఏమి లభించినా అది అమ్మ అనుగ్రహమే. మిగిలినది దేనికోసమూ ఆశించకుండా పరులకు మంచి చెయ్యడమే.

మహాస్వామి వారు చిన్న గొంతుకతో, తీరికగా చెప్పిన ఈ దీర్ఘ ఉపన్యాసం ముగిసే నాటికి రాత్రి 2:30 అయ్యింది.

అప్పుడు నేను “నా తల పైన ఉన్న వెయ్యి టన్నుల బరువు తీసేసినట్టు అయ్యింది” అని అన్నాను.

పరమాచార్య స్వామి వారు సంతతో మొదలుపెట్టి కామాక్షి అమ్మతో ముగించారు. అది నా మనస్థితి కోసం చెప్పబడినా ఇది అందరికీ వర్తిస్తుంది. ఎందుకంటే అందరూ ఇటువంటి స్థితిలో ఉన్నవారమే కదా!

తరువాత మహాస్వామి వారు ”క్రమం తప్పకుండా ప్రతిరోజూ రామాయణం చదువు. నీ మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది.” అని అన్నారు

ఈనాటికి నాకు రామాయణ పారాయణ - మనస్సుకు ప్రశాంతత ఒకేసారి వస్తుంది.

--- బ్రహ్మశ్రీ రామకృష్ణ దీక్షితర్, శ్రీమఠం విద్వాన్. మహాపెరియావళ్ దరిశన అనుభవంగళ్-1

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Friday, September 7, 2018

జీవన్ముక్తుల జీవకారుణ్యం



అది 1983 ఏప్రియల్ చైత్ర పౌర్ణమి. పరమాచార్య స్వామివారు ఆంధ్రదేశంలోని మహబూబ్ నగర్ జిల్లాలోని సరిహద్దు గ్రామమైన కొడంగల్ కు వచ్చారు. పర్ణశాలగా మార్చిన ఒక పశువుల కొట్టంలో వారి మకాం. మరుసటి రోజు నేను నా స్నేహితుడు విశ్వరూప దర్శనం చేసుకుని, స్వామివారి తెల్లవారు చేసే జపం అప్పుడు దాదాపు రెండు గంటల పాటు వారి వద్దనే కూర్చునే అదృష్టాన్ని పొందాము.

స్వామివారు జపం పూర్తిచేసేటప్పటికి దర్శనం కోసమని కొంతమంది భక్తులు వచ్చారు. మహాస్వామివారు వారితో మాట్లాడుతూ, తాము ఉంటున్న స్థలం యజమాని గురించి అడిగారు. ఆ సమూహం నుండి ఆ స్థలం యజమాని బంధువు ఒకరు ముందుకు వచ్చి, స్వామివారు అడిగిన విషయాలను తెలిపాడు. వారి కుటుంబం, వృత్తి, వారికున్న భూమి, గోసంపద మొదలైన విషయాలను అడిగి తెలుసుకున్నారు.

ఇది విన్నవారెవరికైనా వారిని గూర్చి మహాస్వామివారు అడిగి తెలుసుకుంటున్నారు అనే అనుకుంటారు. కాని అలా అడగడంలో ఆంతర్యం కేవలం తెలుసుకోవడం కోసం మాత్రమే కాదని తరువాత అర్థమయ్యింది. మరి ఇప్పుడు గోవుల్ని, గేదెలని ఎక్కడ ఉంచారు అని అడిగారు స్వామివారు. వాటిని ఆరుబయట కట్టేశారు అని తెలుసుకుని, ఈ ఎండలో రోజంతా అవి అక్కడే ఉంటాయా అని అడిగారు. వాటి నివాసాన్ని తను ఆక్రమించుకున్నానని స్వామివారి తలంపు కావచ్చు. వెంటనే మఠానికి సంబంధించిన కొన్ని వస్తువులను తీయించి, వాటిని లోపల ఉంచమని ఆదేశించారు.

ఆ మూగజీవులపై స్వామివారికున్న ప్రేమ అపారమైనది. ఆ పశువుల కొట్టంలో ఉండవలసిన హక్కు వాటిదే కాని తనది కాదని వాటికి చల్లని నీడను ఏర్పరిచారు మహాస్వామివారు.



Courtesy --- కంచి పెరివ ఫోరం.

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

https://t.me/paramacharyavaibhavam

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం