Tuesday, June 3, 2014

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం

(అగస్త్యులవారూ లోపాముద్రా దేవీ)

పూర్వం అగస్త్య మహాముని బ్రహ్మచారిగా ఉంటూ తప్పస్సు చేసుకొంటూ కాలం గడుపుతున్నాడు. అందువల్ల ఆయనకు ధర్మబద్ధంగా సంతానయోగం లేకుండా పోయింది. ఇది చూసి వారి పితృదేవతలు చాలా బాధపడ్డారు. ఎలాగైనా అగస్త్యుడు పెళ్ళిచేసుకొని సంతానాన్ని పొందితే గానీ వారికి ఉత్తమలోకాలు ప్రాప్తించవని తలచి ఒక రోజు అగస్త్యుడికి తలకిందులుగా వేళ్ళాడుతూ దర్శనమిచ్చారు. అప్పుడు వారిని చూసి అగస్త్యుడు " ఎవరు మీరు ? ఎందుకిలా తలక్రిందులుగా వేళాడుతున్నారు ?" అని ప్రశ్నించాడు. అందుకు బదులుగా వారు "మేము నీ పితరులము నీవు వివాహం చేసుకోనందున మాకు ఉత్తమలోకాలు లేక ఇలా ఉండవలసి వచ్చిందని" చెప్పారు. ఎంతో బాధపడిన అగస్త్యుడు వెంఠనే తగిన జీవితభాగస్వామి కోసం అన్వేషణ మొదలుపెట్టాడు. 

ఆయనకి కొంతకాలానికి విదర్భరాజు కూతురైన లోపాముద్ర తగిన కన్యగా తోచింది. వెంఠనే విదర్భరాజుని  తన కూతురునిచ్చి పెళ్ళిచేయమన్నాడు. అందుకు ఆ రాజు సంతోషించి ఆనందంగా పెళ్ళిచేసాడు

అగస్త్యుడు లోపాముద్రతో సహా తన ఆశ్రమంలో నివసిస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలానికి తనకు సంతానం పొందాలని కోరిక కలిగి అదే భార్యతో చెప్పాడు. లోపాముద్ర రాచకన్యే ఐనా పెళ్ళయ్యాకా నారవస్త్రాలతో ఉంటూ పతిసేవలో నిరాడంబరంగా జీవించసాగేది. అగస్త్యుడు తన కోరిక చెప్పగానే తనకి ఈ ఆశ్రమంలో కూడా సకలసౌకర్యాలూ కలిగేలా చేసి అలాగే సంతానాన్నీ పొందవచ్చునని చెప్పింది. తన తపశ్శక్తితో ధనాన్నిపొందడం సరికాదనుకొన్నాడు అగస్త్యుడు.ధర్మబద్ధంగా ఎవరినైనా అడిగి పొందాలని భావించి సమీప రాజ్యాలకు రాజులైన వారిలో ఎవరి దగ్గర మిగులుధనం ఉంటే వారిని మాత్రమే అడగాలని నిర్ణయించుకొన్నాడు.  వెంఠనే శృతర్వుడు అనే రాజు దగ్గరికెళ్ళి అడిగాడు. ఆ రాజు లెక్కించి మిగులు ధనం లేదని చెప్పాడు. శృతర్వుడిని కూడా వెంటపెట్టుకొని బ్రద్నశ్వుడు అనే రాజు దగ్గరికెళ్ళాడు. అతనూ ధనాగారం లెక్కచూసి మిగులుధనం లేదని చెప్పడంతో శృతర్వుడినీ,బ్రద్నశ్వుడినీ వెంటపెట్టుకొని త్రసదస్యుడనే రాజు దగ్గరికెళ్ళాడు. ఆ రాజు దగ్గరా మిగులు ధనం లేకపోడంతో శృతర్వుడూ, బ్రద్నశ్వుడూ,త్రసదస్యుడినీ తనతో తీసుకొని ఇల్వలుడనే దానవ రాజు దగ్గరికెళ్ళాడు. 

ఆ దానవరాజుకి వాతాపి అనే సోదరుడుండే వాడు. వారిద్దరికీ ఓ వరం ఉంది. అదేంటంటే వాతాపి ప్రాకామ్య విద్య వల్ల అనుకొన్న రూపాన్ని పొందేవాడు. వాతాపిని మేకగా చేసి అతిధులకు వండి పెట్టి తిరిగి ఇల్వలుడు పిలవగానే  తాను యధా రూపం పొంది రాక్షసుడిగా రూపుదాల్చగలడు. ఈ వరగర్వంతో ఇద్దరూ ఆహార ధానం చేసినట్టే చేసి అకారణంగా ఎంతో మంది  ప్రాణాలూ, ధనాన్నీ హరించారు. ముందుగా వాతాపి మేక రూపం దాలుస్తాడు, ఆ మేకను చంపి కూరగా వండి ఆ వండిన కూరని అతిధులుగా వచ్చిన వారికి వడ్డిస్తారు. వాళ్ళు భోజనం చేసాకా ఇల్వలుడు " వాతాపీ బయటకు రా" అని పిలవగానే వాతాపి వారి కడుపును చీల్చుకొంటూ బయటికొచ్చేవాడు. ఈ విధంగా అనేకుల ప్రాణాలు బలిగొనారిద్దరు రాక్షసులూ.

శృతర్వుడూ, బ్రద్నశ్వుడూ,త్రసదస్యుడినీ తనతో తీసుకొని వచ్చిన అగస్త్యుడిని చూసి వారిద్దరూ ఇదే పన్నాగం పన్నుదామనుకొన్నారు. వాతాపి ఒక మామిడి పండు రూపంగా మారిపోయాడు. భోజనానంతరం  వడ్డించిన మామిడిపండు వాతాపే అని తపోమహిమతో  గ్రహించాడు అగస్త్యుడు. 

   తాను మామిడి పండును తిన్న వెంఠనే " జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం" అనుకో గానే తన కడుపులోని రాక్షసుడైన వాతాపి సుజీర్ణమైపోయాడు. ఇల్వలుడు ఎంత పిలిచినా వాతాపి బయటకి రాలేదు. ఇంకెక్కడి వాతాపి ? జీర్ణమైపోయాడని అగస్త్యులవారు చెప్పగానే భయబ్రాంతులకి లోనై అగస్త్యులవారి కాళ్ళ మీద పడ్డాడు. అగస్త్యుడు వచ్చిన పనిని నివేదించగగా లోభత్వం చేత మిగులు ధనం లేదని అగస్త్యుడికి  అబద్ధం చెప్పాడు. దివ్యదృష్టితో ఉన్న ధనాన్ని లెక్క కట్టి చెప్పిన అగస్త్యుడి మహిమకి అచ్చెరువొంది,  ఐనా బుద్ధి మార్చుకోక, వారికి ఎంత ధనాన్ని ఇద్దామని తాను మనసులో అనుకొంటున్నాడో ఆ మొత్తాన్ని సరిగ్గా చెబితే అప్పుడే ఇస్తానన్నాడు. ఇల్వలుడి మనసులో ఉన్న మొత్తాన్ని మళ్ళీ సరిగ్గా చెప్పాడు అగస్త్యుడు. అప్పుడు బుద్ధి తెచ్చుకొని ఆ మొత్తం ధనాన్ని అగస్త్యుడికే కాక కూడా వచ్చిన రాజులకీ ఇచ్చి పంపించాడు ఇల్వలుడు.

ఈ రోజుల్లోనూ చిన్న పిల్లలకు అజీర్తి చేస్తే పెద్దవాళ్ళు కడుపుమీద నూనెను మర్దనా చేస్తూ "జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం.." అనటం కనిపిస్తుంది. ఈ ఆచారానికి వెనుక గల కధ ఇదే !