Sunday, May 31, 2020

వింధ్యాద్రి గర్వభంగం - అగస్త్య మహాముని

Agastya and Lopamudra. - Mahabharat - A Story Retold | Facebook



                                                 
                     అసూయాపరులకు, గర్వపోతులకు ఎప్పటికైనా గర్వభంగం తప్పదన్న సత్యాన్ని ఈ కథ నిరూపిస్తుంది. స్కాందపురాణంలో ఈ కథ కనిపిస్తుంది.


                   భూమండలం మీద ఉన్న కులపర్వతాలన్నింటికీ హిమవంతుడు రాజు. అలాగే మిగిలిన పర్వతాలలో ఒక్కొక్క పర్వతానికి ఉన్న విశేషాన్ని అనుసరించి సప్తకుల పర్వతాలకు ఒక్కొక్క ప్రత్యేకతను బ్రహ్మ ఏర్పాటు చేశాడు. అవికాక మిగిలిన ఇతర పర్వతాలకు కూడా స్థల ప్రభావాన్ని అనుసరించి ఒక్కొక్క పర్వతానికి ఒక్కొక్క గుర్తింపు ఇచ్చాడు. మిగిలిన పర్వాతాల గొప్పతనాన్ని చూసి వింధ్యపర్వతం మాత్రం నిరంతరం అసూయ పడుతుండేది. తాను కూడా తలచుకుంటే ఎంతో ఎత్తుకు ఎదగగల శక్తి కలిగిన పర్వతాన్నేనని గర్వపడుతుండేది. ఇలా గర్వపడటమే ఆ పర్వతం ఇప్పటికీ అణిగి మణిగి ఉండటానికి కారణమైంది. నిరంతర అసూయాగుణం కలిగిన ఆ వింధ్యపర్వతం ఒక రోజున నారదుడు దోవలో వెళుతుండగా ఆయనకు స్వాగతం పలికి అతిథి పూజలు చేసి సత్కరించి తన గోడంతా వెళ్లబోసుకుంది. మేరు పర్వతం, హిమాలయ పర్వతం, మందర పర్వతం, ఇలాంటి పర్వతాలు ఏవీ తగిన సామర్థ్యం కలిగి ఉండకపోయినా వాటిని అందరూ గౌరవిస్తున్నారని, పూజిస్తున్నారని వాస్తవానికి ఆ పర్వతాలన్నింటికంటే తానే అధిక శక్తి కలిగిన దానినని చెప్పుకుంది. నారదుడు వింధ్యపర్వతం గర్వం చూసి మనసులో నవ్వుకున్నాడు. కానీ కలహాభోజుడు అప్పటికి ఏదో ఒక విధంగా వింధ్యపర్వతం దగ్గర నుంచి బయటపడి వింధ్య పర్వతాన్ని సమర్ధిస్తున్నట్లుగా మిగిలిన పర్వతాలను తక్కువగా చూస్తున్నట్లుగా భావం కలిగేలా పూర్తిగా తన ప్రవర్తనను ప్రకటించకుండా వింధ్యాద్రి నుంచి ముందుకు కదిలాడు. వింధ్యపర్వతం ఆనాటి నుంచి ఎలాగైనా తన గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలని అనుకుంది. వెంటనే ఆకాశం వరకు పెరిగింది.  వింధ్యపర్వతం అలా ఆకాశం వరకు పెరిగే సరికి సూర్యగమనానికి అడ్డంకి ఏర్పడింది. సూర్యుడు పర్వతానికి ఆ వైపు నిలిచిపోయాడు. నక్షత్ర, గ్రహ సంచారాలు కూడా ఆగిపోయాయి. ఇటువైపు, అటువైపు పగలు, రాత్రుల్లో మార్పులు జరగడం లేదు. దాంతో లోకవాసుల జీవితాలన్నీ అయోమయంలో పడ్డాయి.

                                              సూర్యోదయ సూర్యాస్తమయాలు లేక మునులు సంధ్యావందనం, యజ్ఞయాగాలు చేసుకోలేకపోయారు. ఈ విపరీత పరిస్థితి దేవతలను సైతం బాగా కలచివేసింది. దేవతలంతా కలసి బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లి మొర పెట్టుకున్నారు. బ్రహ్మ సమయ స్ఫూర్తితో ఆలోచించి వింధ్యపర్వతం గర్వం అణచటానికి అగస్త్య మహాముని ఒక్కడే తగిన వాడని భావించాడు. గతంలో ఇంద్రపదవి చేపట్టి లోకాలను బాధించిన నహుషుడి గర్వాన్ని అణించింది, సముద్రాల జలాలను ఔపోశన పట్టింది ఆ మునేనని చెప్పి దేవతలందరినీ తీసుకుని అగస్త్య మహాముని ఆశ్రమానికి వెళ్లాడు. ఆయనకు విషయమంతా వివరించి ఎలాగైనా వింధ్యపర్వతం గర్వం అణచి ప్రపంచానికి మేలు చేయమని ప్రార్ధించాడు. అగస్త్యుడు కాశీ మహానగరాన్ని, కాశీ విశ్వేశ్వరుడిని, అన్నపూర్ణను విడిచిపెట్టి వెళ్లడం ఇష్టం లేకపోయినా లోకకల్యాణం కోసం దేవతల కోరికను తీర్చడం కోసం తన భార్య అయిన లోపాముద్రను వెంటపెట్టుకుని బయలుదేరాడు.  వింధ్యపర్వతాన్ని ఆ దంపతులిద్దరూ సమీపించగానే వింధ్యుడు వారికి నమస్కరించి ఎటు వెళుతున్నారని అడిగాడు. అప్పుడు అగస్త్యుడు తాను భార్యా సమేతంగా దక్షిణ భారత యాత్రకు బయలుదేరినట్లు తమకు దోవ ఇస్తే అవతల వైపునకు వెళ్లగలమని చెప్పాడు. వింధ్యుడు అందుకు ఒప్పుకున్నాడు. అయితే అగస్త్యుడు తాను మళ్లీ తిరిగి వచ్చే వరకు అలాగే ఎత్తు తగ్గించుకుని అణిగి మణిగి ఉండాలని వింధ్యుడికి చెప్పాడు. అగస్త్యుడి మాటల్లోని ఆంతర్యాన్ని గమనించలేని వింధ్యపర్వతం ఆకాశానికి పెంచిన తన దేహాన్ని తగ్గించుకుని ముని దంపతులకు దారి ఇచ్చింది. లోపాముద్రతో కలసి ఆ పర్వతాన్ని దాటి ముందుకు వెళ్లాడు. సూర్యచంద్రాదులకు, నక్షత్ర గ్రహాలకు అడ్డు తొలగిపోవడంతో మళ్లీ ప్రపంచమంతా హాయిగా యథావిథిగా గడపగలిగింది.

                  అగస్త్యుడు కాశీ మహానగరం నుంచి అలా దక్షిణ భారతదేశంలో దాక్షారామం, శ్రీశైలం తదితర ప్రాంతాలను సందర్శించి అక్కడే ఉండిపోయి వెనక్కు తిరిగిరాలేదు. దాంతో వింధ్యుడు అలాగే ఉండిపోయాడు. 

Thursday, May 28, 2020

హయగ్రీవావతారం

14 Best Lord Hayagreeva images | Gods, goddesses, Lord vishnu ...



సకల చరాచర సృష్ఠికి కర్త అయిన బ్రహ్మకు శక్తిని ఇచ్చేవి వేదాలే, ఆ వేదాల సంరక్షణలో నిరంతరం మహావిష్ణువు నిమగ్నమై ఉంటాడని, విష్ణుతత్వ మహత్యాన్ని, వేద విజ్ఞాన ఔన్నత్యాన్ని గురించి ఈ కథ తెలియజేస్తుంది.

                      శ్రీ మహావిష్ణువు దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం ఎన్నో విధాలుగా ఎన్నెన్నో సందర్భాల్లో అవతరించాడు. తేజోవంతమైన రూపంతో ఆయన హయగ్రీవావతారం పొంది వేదాలను రక్షించాడు. కేవలం వేదోద్ధరణ లక్ష్యంగా హయగ్రీవావతారం కనిపిస్తుంది. పూర్వం శ్రీ మహావిష్ణువు నాభికమలంలో ఆసీనుడై ఉన్న సృష్ఠికర్త బ్రహ్మ తన పనిలో తాను నిమగ్నమై ఉండగా రజస్తమోగుణాలకు ప్రతీకలుగా ఉన్న మధుకైటభులు అనే ఇద్దరు రాక్షసులు గదలను ధరించి మెల్లగా బ్రహ్మదగ్గరకు చేరి, మనోహర రూపాలతో భాసిల్లుతున్న నాలుగు వేదాలను అపహరించారు.

                                                  బ్రహ్మ చూస్తుండగానే అపహరించిన వేదాలతో ఆ దానవులు సముద్రంలో ప్రవేశించి రసాతలానికి చేరారు. వేదాలను కోల్పోయిన బ్రహ్మ వేదాలే తనకు ఉత్తమ నేత్రాలని, వేదాలే తనకు ఆశ్రయాలని, వేదాలే తనకు ముఖ్య ఉపస్యాలని అవి లేకపోతే తాను సృష్ఠిని చేయడం కుదరదని విచారిస్తూ ఆ ఆపద నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచించసాగాడు. ఆయనకు వెంటనే శ్రీమహావిష్ణువు గుర్తుకు వచ్చి పరిపరివిధాల స్తుతించాడు. బ్రహ్మ ఆవేదనను శ్రీహరి గ్రహించి వేద సంరక్షణ కోసం యోగ రూపంతో ఒక దివ్యశరీరాన్ని పొందాడు. ఆ శరీరం చంద్రుడిలా ప్రకాశించసాగింది. ఆ శరీరమే హయగ్రీవ అవతారం అయింది. నక్షత్రాలతో నిండిన ఆకాశం ఆయన శిరస్సుగా మారింది. సూర్యకిరణ కాంతితో ఆయన కేశాలు మెరవసాగాయి. ఆకాశం పాతాళం రెండు చెవులుగా, భూమి లలాటభాగంగా, గంగా సరస్వతులు పిరుదులుగా, సముద్రాలు కనుబొమ్మలుగా, సూర్యచంద్రులు కన్నులుగా, సంధ్య నాసికగా, ఓంకారమే ఆయనకు అలంకారంగా, విద్యుత్తు నాలుకగా, పితృదేవతలు దంతాలుగా, గోలోకం బ్రహ్మలోకం రెండు పెదవులుగా, తమోమయమైన కాళరాత్రి ఆయనకు మెడభాగంగా అలరారాయి.

                ఈ విధమైన ఒక దివ్యరూపాన్ని ధరించిన శ్రీహరి హయగ్రీవావతారం బ్రహ్మ ముందు నుంచి అంతర్ధానమై రసాతలానికి ప్రవేశించింది. అక్కడ హయగ్రీవుడు ఉదాత్త, అనుదాత్త స్వరయుక్తంగా పెద్దగా సామవేదాన్ని గానం చేయసాగాడు. ఆ మధుర గానవాహిని రసాతలం అంతా మారుమోగింది. ఆ గానరసం రసాతలంలో వేదాలను దొంగిలించి దాక్కున్న రాక్షసుల చెవులకు కూడా సోకింది. ఆ గాన రసవాహినికి ఆ రాక్షసులిద్దరు పరవశించి బ్రహ్మ దగ్గర నుంచి తాము తెచ్చిన వేదాలను ఒక చోట భద్రం చేసి గానం వినిపించిన దిక్కుకు పరుగులు తీశారు. అయితే ఇంతలో హయగ్రీవుడు రాక్షసులు దాచిన వేదాలను తీసుకొని సముద్ర గర్భం నుంచి బయటకు వచ్చి అక్కడ ఈశాన్యభాగంలో హయగ్రీవరూపాన్ని విడిచి తన స్వరూపాన్ని పొందాడు. రాక్షసులు గానం వినిపించిన దిక్కుకు బయలుదేరి వెళ్లి ఎంత వెతికినా, ఎక్కడ వెతికినా ఎవరూ కనిపించలేదు. వెంటనే తమ వేదాలను దాచి ఉంచిన ప్రదేశానికి వెళ్లి చూశారు. అక్కడ వేదాలు కనిపించలేదు.

                                               వెంటనే ఆ ఇద్దరూ రసాతలం నుంచి వెలుపలికి వచ్చి సముద్రంలో దివ్యతేజ కాంతిపుంజంలాగా ఉండి ఆదిశేషుడి మీద యోగ నిద్రాముద్రలో ఉన్న శ్రీమహావిష్ణువును చూశారు. ఆ రాక్షసులు తాము దాచిన వేదాలను అపహరించింది ఆ శ్వేతపురుషుడేనని, తమ దగ్గర నుంచి వేదాలను తెచ్చినది కాక ఏమీ తెలియనట్లు నిద్రిస్తున్నాడని కోపగించుకొని శ్రీమహావిష్ణువు మీదకు యుద్ధానికి వెళ్లారు. అప్పుడు విష్ణువు ఆ రాక్షసులతో యుద్ధం చేసి వారిని సంహరించాడు. ఇలా హయగ్రీవావతారం వేదోద్ధరణ లక్ష్యంగా అవతరించింది.

Saturday, May 23, 2020

నారద తుంబురులు

Tumburu - Wikipedia



భారతీయ పురాణ సాహిత్యంలో తారసపడే ప్రతి కథ, పాత్ర మానవాళికి ఒక మంచి మార్గాన్నో, నడవడికనో నేర్పడానికే అవతరించినట్లు అనిపిస్తూ ఉంటుంది. అందరికీ సుపరిచితమైన నారదుడు వంటి పాత్రల ప్రవర్తన ద్వారా కూడా సందేశం అందుతూ ఉంటుంది. నారదుడు, తుంబురుడు ఇద్దరూ సహాధ్యాయులు (ఒకచోట విద్యనేర్చుకున్నారు), గానవిద్యలో తనను మించిన వారు ఎవరూ ఉండవోరనేది నారదముని పెంచుకున్న భావం. ఆ గర్వఫలమే ‘తాడితన్నే వాడు ఉంటే వాడితల తన్నేవాడు మరొకరు ఎప్పుడూ ఉండే ఉంటాడనే నగ్నసత్యాన్ని చవిచూడాల్సి వచ్చింది నారదుడు. తన గర్వభంగ కథనంతా మణికంఠరుడు అనే ఓ గంధర్వుడికి వివరించి విచారం పొందాడు. నారదుడి నోవేదనంతా ఇలా ఉంది.
వైకుంఠంలో ఒకనాడు శ్రీమహావిష్ణువు నిండుకొలువు తీరి ఉన్నాడు. ఆ కొలువు కూటానికి దేవతలు, మినగణాలు, గంధర్వులు, తదితరులంతా విచ్చేశారు. సభా ప్రాంగణానికి ముందు ఉన్న అందమైన తోట నుంచి లక్ష్మీదేవి నల్లని మబ్బుల మధ్యన మెరుపు తీగలాగా మెరుస్తూ చెలికత్తెలు అటూ ఇటూ నడుస్తుండగా శ్రీమహావిష్ణువు కొలువుతీరిన ప్రదేశానికి బయలుదేరి వస్తోంది. ఆమెను చూడాలనే తపన అక్కడ ఉన్న వారందరిలోనూ బయలుదేరింది. ఈ లోగా విష్వక్సేనుడు తన పరివారంతో అక్కడికి వచ్చాడు. వారంతా చేతిలో బెత్తాలు ధరించి లక్ష్మీదేవి నడిచే దారికి అడ్డంగా ఉన్న వారందరినీ చెదరగొట్టి కకావికలు చేశారు. బ్రహ్మలాంటి దేవతలు కూడా ఆ ధాటికి దూరంగా పారిపోవాల్సి వచ్చింది. ఇంకా నారదుడు వంటి వారి పరిస్థితి చెప్పనవసరం లేదు. అలా లక్ష్మీదేవి కొలువు కూటంలోకి వెళ్లిన వెంటనే ద్వారపాలకులు తలుపులు మూసివేశారు. కొద్దిసేపైన తరువాత లోపలి నుంచి ఎవరో వచ్చి ఓహో తుంబురుడా అంటూ గట్టిగా పిలిచి తుంబురుడిని లోపలకు తీసుకువెళ్లారు. లోపల ఏం జరుగుతుందోనని బయట ఉన్న వారందరికీ ఆతృత హెచ్చింది. కొద్ది సమయం అయిన తరువాత చిరునవ్వులు నవ్వుతూ గంధపు పూతలతో మెడలో దగాదగా మెరిసే పతకంతో సన్మానితుడైన తుంఉబురుడు బయటకు రాగానే అందరూ ఏమిటి విశేషమని అడిగారు. తుంబురుడు సంతోషంతో శ్రీమహాలక్ష్మి చెంత ఉండగా మహావిష్ణువు తన గానాన్ని విని ఆనందించి ఇలా సత్కరించాడని చెప్పాడు. ఆ మాటలు నారదుడి మనసును ఎంతో నొప్పించాయి. అసూయతో అతని హృదయం రగిలిపోయింది. ఇంతకు ముందు ఎక్కడ గానకళను ప్రదర్శించినా తామిద్దరూ కలసి ప్రదర్శించటం అలవాటుగా వస్తోంది. గానకళలో తనకు ఎన్నోమార్లు ప్రశంసలు వచ్చాయి. ఇప్పుడు తుంబురుడు తగుదనమ్మా అంటూ తానొక్కడే వెళ్లి శ్రీహరి ఎదుట గానాన్ని ఆలపించటం అతని హృదయాన్ని భగభగలాడించింది. ఎలాగయినా తుంబురుడిని మించిన గానకళా విద్వాంసుడిగా ఇప్పుడు అందరిచేత మెప్పు పొందాలని అనుకున్నాడు. దీనితోపాటుగా తుంబురుడి గాన విద్యలోని దోషాలను పసిగట్టి వాటిని బయటపెట్టేందుకు స్నేహాన్ని నటిస్తూనే కార్యాన్ని సాధించాలని అనుకున్నాడు. ఒకనాడు తుంఉబురుడి ఇంటికి వెళ్లిన నారదుడికి పాటకు సిద్ధంగా ఉంచిన వీణ కనిపించింది. అక్కడ ఉన్న పరిచారికలను తుంబురుడెక్కడ అని అడుగగా లోపల ఉన్నాడని పిలుచుకొస్తామని వెళ్లారు. ఈలోగా అక్కడ పెట్టి ఉంచిన వీణను నారదుడు తాకాడు. తుంఉబురుడు శ్రుతి చేసి పెట్టిన వీణ అద్భుతమైన రాగాలను ఆలపించింది. శ్రుతి చేసిన వీణే అంత అద్భుతంగా ఆలాపన చేస్తే తుంబురుడు స్వయంగా గానమాలపిస్తే ఇంక ఎంత గొప్పగా ఉంటుందోనని ­హించుకొని సిగ్గుపడి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తరువాత ఎంతో మంది గురువులను అతడు ఆశ్రయించి గానవిద్యలో తనను తుంఉబురుడి కంటే గొప్పవాడిని చేయమని అడిగాడు. వారంతా అది తమకు సాధ్యపడదని చెప్పారు. చివరకు చేసేది లేక శ్రీమహావిష్ణువు గురించి చాలా కాలం తపస్సు చేశాడు. ఆయన ప్రత్యక్షమై నారదుడి కోరిక విని ఈ అవతారంలో అది సాధ్యపడదని తరువాత వచ్చే అవతారంలో వీలు కల్పిస్తానని చెప్పి అంతర్ధానమయ్యాడు. ఇలా తానొక్కడే గానకళలో గొప్పవాడని భావించుకున్న నారదుడు భంగపాటుకు గురై పండితులు ఎప్పుడూ నీటికొద్దీ తామరలాగా ఉంటారని, చెవిటివాడి ముందు శంఖం ­దినట్లుగా తమకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారి ఎదుట తమ విద్యను ప్రదర్శించరని గ్రహించాడు. తుంబురుడు తన సహాధ్యాయి అయినప్పటికీ ఎంతో కృషి చేసి గాన కళాప్రపూర్ణుడు అయ్యాడని, అది తెలియని తాను గానే గొప్ప అనుకుని గర్వపడి చివరకు గర్వభంగపాటుకు గురికావాల్సి వచ్చిందనుకున్నాడు. విద్యావంతులు, గుణవంతులు, వినయ సంపన్నులు సమయాన్ని సందర్భాన్ని పురస్కరించుకుని మాత్రమే తమలోని గొప్పతనాన్ని ప్రదర్శిస్తారని తెలుసుకోలేని వారు నారదుడిలాగే గర్వభంగం పొందాల్సి వస్తుందని ఈ కథ సారాంశం.






మూలం డాక్టర్‌ యల్లాప్రగడ మల్లికార్జునరావు

Wednesday, May 20, 2020

భక్తవత్సలుడు - భక్తవత్సలం

SEVA - The Purpose of Life: MAHAPERIYAVA - THE GREAT SAINT...



1964లో శ్రీమఠం మకాం కరైకుడిలోని శంకర మఠంలో ఉంది. పరమాచార్య స్వామివారి దర్శనంకోసం అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ యం. భక్తవత్సలం విచ్చేశారు. మహాస్వామివారు వారితో, “రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్కోటి అనే క్షేత్రం గురించి విన్నావా? అక్కడున్న వారందరిని వెంటనే వారి సమానుతో పాటుగా అక్కడి నుండి ఖాళీచెయ్యించడానికి నువ్వు ఆదేశాలు జారీ చెయ్యి. నీ ప్రభుత్వ ఆస్తుల్ని కూడా సంరిక్షించుకోవడానికి తగిన ఏర్పాట్లు చేసుకో” అని ఆజ్ఞాపించారు.

ఎందుకు? ఏమిటి? అని భక్తవత్సలం అడగాలి కదా. కాని ఒక్క విషయం కూడా అడగలేదు. ఎందుకంటె ఆ ఆదేశాలు వచ్చినది భూతభవిష్యత్ వర్తమాన కాలాలను ఎరిగిన పరమాచార్య స్వామివారి నోటి నుండి కనుక. కారణం అడగడం వల్ల కొత్తగా వొరిగేది ఏమీ లేదు. ఏదిఏమైనా అది చాలా పెద్ద కారణమే అయ్యి ఉంటుంది.

అవును నిజంగా అది చాలా పెద్ద కారణమే!!

సరిగ్గా స్వామివారు అలా ఖాలీ చెయ్యించమని చెప్పిన ఏడెనిమిది రోజులకే భయంకరమైన వేగం కలిగిన సుడిగాలులు, పెద్ద సముద్రపు అలలతో కూడిన భయంకరమైన తుఫాను వచ్చింది. మొత్తం ధనుష్కోటి నగరం తుఫానులో చిక్కుకొని సముద్రపు నీటీలో మునిగిపోయింది.

ఎవరు భక్తవత్సలుడు కాషాయం కట్టిన వారా? లేక తెల్లని చేనేత దుస్తులు కట్టిన వారా?

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

--- వి.శ్రీనివాసన్, చెన్నై. మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్ 2

Credit 👇

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Monday, May 18, 2020

పదిహేను రోజుల తరువాత

Kanchi Mahaswami Satabdhi Manimantapam




సర్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ గారి కుమారుడు డా. అల్లాడి రామకృష్ణన్ మరియు అతని భార్య శ్రీమతి లలితా రామకృష్ణన్ అమెరికా వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. వెళ్ళేముందు ఒకసారి పరమాచార్య స్వామిని దర్శించి ఆశీర్వాదం తీసుకోవాలని వచ్చారు.

”ఎప్పుడు బయలుదేరాలి?”

“ఈ నెల పన్నెండున స్వామి”

స్వామివారు కొద్దిసేపు మౌనంగా ఉండి తరువాత కాసేపు కళ్ళు మూసుకున్నారు.

”పదిహేను రోజుల తరువాత బయలుదేరొచ్చు కదా!” అని అన్నారు.

హఠాత్తుగా వచ్చిన మహాస్వామివారి ఆజ్ఞ.

స్వామివారికి తెలియపరచకుండా పన్నెండో తేదీనే బయలుదేరవచ్చు. ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలంటే కన్ ఫర్మ్ అయిన టికెట్లను రద్దు చేసుకుని మరలా కొత్తగా రిజర్వ్ చేయించుకోవాలి. మహాస్వామివారు గుర్తుపెట్టుకుని మరీ ఏమి అడగరు కదా!!

కాని మహాస్వామివారు అలా చెప్పిన తరువాత అతనిక వెళ్ళడు. కనుక ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు.

పన్నెండో తేదీన మీనంబాక్కం విమానాశ్రయం నుండి అమెరికాకు వెళ్ళాల్సిన విమానం తన ప్రయాణాన్ని దురదృష్టవశాత్తు ముంబైలోనే ముగించింది.

తరువాత ఆ విమానంలో ఉన్న వందమందీ ఆరోజే మృత్యువాత పడ్డారని తెలిసింది.

రామకృష్ణన్ దంపతులకి రెండు రకాలుగా కన్నీళ్ళు వచ్చాయి. అంతమంది చనిపోయినందుకు బాధతో, వారిని కాపాడినందుకు కృతజ్ఞతతో.

--- వి. శ్రీనివాసన్, చెన్నై. మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 2

Credit 👇

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం