Tuesday, November 6, 2018

వేదాధ్యయనం - విదేశీయానం



పరమేశ్వరుడంతటి దయాళువు, శుక మహర్షి అంతటి ఉన్నతులు అయిన మన మహాస్వామి మనందరినీ ఆదరించి ఆశీర్వదిస్తున్నారు.

1968లో కుంబకోణం శ్రీ రంగరాజచారి పరమాచార్య స్వామియొక్క పరిపూర్ణ కటాక్షంలో మునిగిపోయారు. 1971లో ఋగ్వేద అధ్యయనం పూర్తైన తరువాత, జీవనాధారం కోసం వైదిక వృత్తి చేపట్టాలని భావిస్తే, అందుకు పరమాచార్య స్వామివారు తమ అంగీకారాన్ని తెలపలేదు.

“నీ వేద విద్యార్జనకు నేను తగిన ఏర్పాట్లు చేస్తాను. నీ విద్యార్జన కొనసాగించు” అని స్వామివారు తెలిపారు. ప్రతి నేలా రెండు వందల రూపాయలు రంగరాజచారి కుటుంబానికి అందేట్టు, స్వంతంగా వండుకోవడానికి కావాల్సిన సంభారాలు కూడా ఏర్పాటు చేశారు. రంగరాజచారి గారిది పెద్ద కుటుంబం. కేవలం పరమాచార్య స్వామివారి ఆశీస్సులతోనే అందరి ఆడపిల్లల పెళ్ళిళ్ళు జరిగాయి.

మహాస్వామివారు పండరీపురంలో మకాం చేస్తున్నప్పుడు, రంగరాజచారి స్వామివారిని దర్శించుకుని సాష్టాంగం చేసి నమస్కరించారు. అప్పుడు మహాస్వామివారు, “నువ్వు నాకు సాష్టాంగం చెయ్యొచ్చా?” అని అడిగారు.

“మా సంప్రదాయం ప్రకారం, యజ్ఞోపవీతము, శిఖ లేని సన్యాసిని చూస్తే స్నానం చెయ్యాలి” అని రంగరాజచారి బదులిచ్చాడు.

“అలా అయితే, మరి నా ముందర ఎందుకు సాష్టాంగం చేశావు?”

“ఈ స్వరూపము విష్ణు స్వరూపమే అని నాకు అనిపించింది” అని భక్తితో బదులిచ్చాడు. ఈ శీవైష్ణవ భక్తశిఖామణి జీవితంలో పరమాచార్య స్వామి అనుగ్రహంతో ఒక అద్భుతం జరిగింది. రంగరాజచారిది పేద కుటుంబం. వారి ఆదాయంతో సభ్యులందరినీ చూసుకోవడం కూడా వీలు కాని పరిస్థితి. ఆడపిల్లల పెళ్ళిళ్ళకు డబ్బు కూడా అవసరం. ఇటువంటి స్థితిలో వారికి ఒక మంచి అవకాశం వచ్చింది. 1978లో వేద విద్యాభ్యాసం ముగియగానే, వారిని జర్మని రమ్మని కొందరు ఆహ్వానించారు. అంతటి కటిక దారిద్య్రాన్ని అనుభవిస్తున్న సమయంలో జర్మని అవకాశాన్ని, నేలకు మూడువేల రూపాయల సంపాదనని ఎలా కాదనగలరు. ఈ డబ్బుతో పాటు మూడేళ్ళ తరువాత మూడు లక్షల రూపాయలు అందుతుంది. కనుక రంగరాజచారి ఈ అవకాశాన్ని ఒప్పుకోవడంలో ఆశ్చర్యం ఏమి లేదు.

ఈ అవకాశాన్ని ఇచ్చినతనికి అన్ని ఏర్పాట్లు చూసుకోమని చెప్పాడు. ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లలో మునిగిపోయాడు. అదే సంవత్సరం అక్టోబరు 31న బోంబే నుండి బయలుదేరడానికి నిర్ణయించుకున్నాడు. ఇంత జరిగినా ఈ విషయాలేవీ ఇతరులకు తెలియనివ్వలేదు. అక్టోబరు 27న తన తండ్రికి విషయం తెలపడానికి గ్రామానికి వెళ్ళాడు.

“పరమాచార్య స్వామివారి అనుమతి తీసుకున్నావా?” అని అడిగారు అతని నాన్న. “లేదు, నాకు తెలిసి వారు అనుమతి ఇవ్వరు. స్వామివారు అనుమతించకపోతే, ఇంత డబ్బులు వచ్చే ఈ ప్రతిపాదనని నేను కాదనలేను. వెళ్ళడానికి నేనే నిర్ణయించుకున్నాను. మనకు డబ్బు అవసరం చాలా ఉంది. నాకు ఇంకొక మార్గం కనపడడం లేదు” అని చెప్పాడు.

ఆరాత్రికి తన ఊళ్లోనే ఉండిపోయాడు. రాత్రి మూడు గంటలప్పుడు, నిద్ర రాక మంచంపై అటు ఇటు దొర్లుతున్నాడు. అప్పుడు కళ్ళముందు మహాస్వామివారు ఉన్నట్టుగా లీలగా కనపడుతోంది. దగ్గరకు వచ్చి తనని తాకినట్టుగా తనకు అనుభూతి కలిగింది. తన తల్లి అడిగినట్టుగానే, “వెళ్ళడానికే నిర్నయించుకున్నావా?” అని అడిగినట్టు అనిపించింది. అది కలో, నిజమో అర్థం కావడంలేదు. ఆలస్యం చేయకుండా మరుసటిరోజే పరమాచార్య స్వామివద్దకు వెళ్లి అనుమతి పొందాలని భావించాడు.

అప్పుడు పరమాచార్య స్వామివారు కర్ణాటక రాష్ట్రం, బాదామి దగ్గరలోని బనశంకరి అనే చోట మకాం చేస్తున్నారు. అక్కడకు చేరుకోగానే స్వామివారి దర్శనానికి ముందు, స్నానం చేస్తున్నాడు. అప్పుడు పరమాచార్య స్వామివారి సహాయకులొకరు వచ్చి, “వచ్చి దర్శనం చేసుకోమని పరమాచార్య ఆదేశించారు” అని చెప్పాడు.

తను వస్తున్న విషయం కాని, వచ్చిన కారణం కాని ఎవరికీ తెలియదు. కాని మహాస్వామివారు కబురుచేయడంతో ఆశ్చర్యపోయాడు. అదే ఆశ్చర్యంతో వెళ్లి స్వామివారి ముందు నిలబడ్డాడు.

“ఎప్పుడు బయలుదేరుతున్నావు?” అని అడిగారు స్వామివారు.

“స్వామివారు ఎప్పుడు అనుమతిస్తే అప్పుడు” అని బడులిచ్చాడు స్వామివారు తన తిరుగు ప్రయాణం గురించి అడుగుతున్నరేమో అనుకుని.

“నీవున్నచోటికి తెరిగివెళ్ళే విషయం గురించి నేను అడగడం లేదు. విదేశాలకు వెళ్ళడానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నావు కదా! దాని గురించి ఎప్పుడు అని అడుగుతున్నా”

ఆ మాటలు విని నిశ్చేష్టుడయ్యాడు. ఇంకా ఆ విస్మయం నుండి తేరుకునే లోపే, పరమాచార్య స్వామివారు ఇంకొక విషయం తెలిపారు.

“నువ్వు ఇక్కడకు రావడానికి కారణమేంటో చెప్పనా? మొన్న నేను వచ్చి నిన్ను అడిగాను, “వెళ్ళడానికే నిశ్చయించుకున్నావా?” అని. అందుకే వెళ్లబోయేముందు ఇక్కడకు వచ్చావు. అంతేనా?” అని అన్నారు.

ఆరోజు జరిగినది కల కాదని, నిజంగా స్వామివారే వచ్చి ఆశీర్వదించారని తెలుసుకున్న తరువాత రంగరాజచారి భావోద్వేగానికి గురయ్యాడు.

“నీ మంచి నడతను కొనసాగించు . . . డబ్బు అవసరం లేదు . . . మంచి నడవడిక ముఖ్యం” అని చెప్పి, తమ దివ్య పాదచారణాలను ఆ భక్తుని తలపై ఉంచి కరుణతో ఆశీర్వదించారు.

ఇది అద్భుతం కదా! ఒక సాంప్రదాయస్తుణ్ణి విదేశాలకు వెళ్ళకుండా ఆపారు స్వామివారు. ధర్మం యొక్క సాకార రూపమైన మన స్వామివారు తన భక్తులను ధర్మ మార్గంలో పయనించడానికి అనుకూలంగా అనుగ్రహాన్ని ప్రసరిస్తారు.

--- “శ్రీ పెరియవ మహిమై” పత్రిక నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం