Wednesday, June 12, 2019

నారాయణుడు ఉన్న చోట

Related image

గొప్ప నీతిశాస్త్రంగా, పూజనీయ గ్రంథంగా ఉన్న మహాభారత కథలో అక్కడక్కడా కొన్ని సందేహాలు పాఠకులకు తలెత్తుతుంటాయి. ఇది ధర్మమా? అధర్మమా? అని తేల్చుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి వాటిలో కౌరవ పాండవులకు గురుపుత్రుడైన అశ్వత్థామ ప్రయోగించిన దివ్య అస్త్రాలన్నీ నిర్వీర్యం కావడం ఆశ్చర్యంగా కనిపిస్తుంది. తన అస్త్రాలు విశ్వాన్ని మొత్తాన్ని జయించగలవనే నమ్మకంతో ఉన్న అశ్వత్థామ అవి దేనికీ పనికి రాకుండా పోవడంతో తీవ్రంగా కలత చెందుతాడు. యుద్ధం చేస్తున్నప్పుడు ఎవరో ఒక మహాపురుషుడు ఒక శూలాన్ని పట్టుకొని తన ముందు నిలబడి శత్రుసంహారం చేయడం అర్జునుడికి కనిపిస్తుంటుంది. అశ్వత్థామ, అర్జునులకు ఇవి తీరని సందేహాలుగా మిగులుతాయి. ఈ సందేహాలను వ్యాసభగవానుడు నివృత్తి చేసి వారి మనస్సులను సమాధాన పరిచి మళ్లీ కార్యోన్ముఖులను చేస్తాడు. అందుకే ద్రోణపర్వం చివర్లో వ్యాసుడు ముందుగా అశ్వత్థామకు సాక్షాత్కరిస్తాడు.
అందరికీ గురువు, ఎదురులేని శక్తికలిగిన తన తండ్రిని రణరంగంలో దృష్టద్యుమ్నుడు చాలా నీచంగా సంహరించడం అశ్వత్థామకు విపరీతమైన ఆగ్రహాన్ని కలిగించింది. వెంటనే తన దగ్గర ఉన్న నారాయణాస్త్రంతో శత్రుసంహారం చేస్తానని దుర్యోధనుడికి అశ్వత్థామ ధైర్యం చెబుతాడు. ఆ అస్త్రం ఎంతో శక్తిమంతమైందని, తన తండ్రి నారాయణుడిని ఆరాధించి ఆ అస్త్రాన్ని పొంది తనకు ఇచ్చినట్లు చెప్పాడు. ఆ దివ్యాస్త్రంతో ఎలాంటి వారినైనా సంహరించగలనని, తన తండ్రిని చంపిన శత్రువుల మీద పగతీర్చుకుంటానన్నాడు. అశ్వత్థామ పలికిన ఆ ధైర్యపు వచనాలతో కౌరవసేనలో మళ్లీ ఉత్సాహం కలిగింది. అశ్వత్థామ నారాయణాస్త్రాన్ని ప్రయోగించాడు. యుద్ధరంగంలో కలకలం మొదలైంది. వాసుదేవుడు చిద్విలాసం చిందించాడు. అర్జునుడు బ్రహ్మ సృష్ఠించి ఇచ్చిన మహాస్త్రాన్ని ప్రయోగించాడు. అది అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రాన్ని క్షీణింపచేసింది. అశ్వత్థామకు ఏమీ అర్ధంకాక అస్త్రాలను విడిచి పెట్టి అయోమయంగా ఎటో వెళ్లిపోయాడు. అలా వెళుతున్న అశ్వత్థామకు వ్యాసుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు అశ్వత్థామ తన మనస్సులో ఉన్న వ్యథనంతా వెళ్లగక్కాడు. ఎంతో గొప్ప దివ్యాస్త్రాలనుకున్న తన అస్త్రాలన్నీ ఏ కారణంతోనో పనికిరాకుండా పోయాయని, తన శత్రువులైన కృష్ణార్జునులను ఏమీ చేయలేకపోవడం తనకెంతో వ్యథ కలిగిస్తోందన్నాడు. అప్పుడు వ్యాసుడు చిరునవ్వుతో కృష్ణుడు సామాన్యుడు కాడు. సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువేనని చెప్పాడు. లోకాలన్నింటినీ రక్షించాలనే అతడు కృష్ణుడుగా జన్మించాడు. ఈ కృష్ణుడే పురాణ మునుల్లో ప్రసిద్ధులైన నరనారాయణుల్లో నారాయణుడు. శక్తి కోసం హిమాలయ పర్వతాల మీద కఠోరంగా తపస్సు చేసిన నారాయణుడికి పరమశివుడు ప్రమథగణాలతో సహా ప్రత్యక్షమయ్యాడు. తనకు వరాలు ప్రసాదించమని శివుడిని ఆయన కోరుకున్నాడు.
                                లోక సంరక్షణ కోసం దేవతలు, గంధర్వులు తదితరులలో జన్మించి దుష్టులను సంహరించమని శివుడు నారాయణుడికి చెప్పాడు. నారాయణుడు యుద్ధంలో నిలబడినప్పుడు ఏ అస్త్రశస్త్రాలు పని చేయకుండా గొప్ప శక్తిని పరమేశ్వరుడు నారాయణుడికి ఇచ్చాడు. నరనారాయణులలో నరుడు అర్జునుడుగా జన్మించాడు. పరమేశ్వర శక్తితో ఉన్న కృష్ణుడు ఉండడం వల్లనే నీ దివ్యాస్త్రాలు ప్రభావం చూప లేక పోయాయని వివరించాడు. వ్యాసుడి బోధతో అసలు విషయాన్ని గ్రహించిన అశ్వత్థామ మనసులోనే పరమేశ్వరుడిని స్తుతించి శ్రీకృష్ణుడికి నమస్కరించి మనశ్శాంతిని పొందాడు.
ఆ తరువాత వ్యాసుడు అర్జునుడి దగ్గరకు వెళ్లాడు. అర్జునుడు ఆయనను సాదరంగా ఆహ్వానించి పూజించి సత్కరించాడు. అనంతరం తన మనస్సులో ఒక సందేహం ఉందని దాన్ని తీర్చమని వేడుకున్నాడు. తాను యుద్ధం చేస్తున్నప్పుడు ఎవరో ఒక దివ్య పురుషుడు గొప్ప ప్రకాశవంతమైన శరీరంతో వెలుగుతూ తన ముందు నిలబడి చేతిలో ఉన్న శూలంతో తాను చంపాలనుకున్న శత్రువులందిరినీ సంహరిస్తూ కనిపిస్తున్నాడు. నేను కేవలం ఆయన వెనుక నిలబడి శత్రువుల మీదకు బాణాలు వేస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఆ దివ్యపురుషుడు ఎవరై ఉంటారో చెప్పమన్నాడు. అప్పుడు వ్యాసమహర్షి సమాధానం చెబుతూ అర్జునుడికి దివ్యతేజోరాశిగా కనిపించిన వ్యక్తి సాక్షాత్తు పరమశివుడు. పాశుపతంలాంటి అస్త్రాలను ప్రసాదించింది కూడా ఆయనే. ధర్మరక్షణ కోసం సాక్షాత్తు ఆ రుద్రుడే యుద్ధరంగంలో కృష్ణార్జునులకు అండగా నిలిచాడని వివరించి అంతర్ధానమయ్యాడు.

- శ్రీ యల్లాప్రగడ మల్లికార్జున రావు గారు
- సేకరణ ఈనాడు దినపత్రిక నుంచీ

No comments:

Post a Comment