Sunday, September 9, 2018

25 ఏళ్ళు - 7 ఏళ్ళు


నేను ఒకసారి మహాస్వామి వారి దర్శనంకోసం కర్ణాటక రాష్ట్రం లోని వాసనగెరె వెళ్ళాను. స్వామి వారు సండూరు మహారాజు గారికి చెందిన గనుల ప్రాంతములో పర్యటిస్తున్నారు. కొంతమంది భక్తులతో కలిసి స్వామి వారు ఒక జమఖానం పై కూర్చున్నారు. ‘వేద రక్షా నిధి ట్రస్ట్’ కు చెందిన అన్నాదురై అయ్యంగార్ మరియు కొంతమంది వారి వేదపాఠశాల విద్యార్థులతో పాటు అక్కడ కూర్చున్నారు. అప్పుడు సమయం రాత్రి 10:30 గంటలు.

సండూరు మహారాజు, మహారాణి, వారి కుమారుడు కూడా అక్కడ ఉన్నారు. అతను యు.స్ లోని యేల్ విశ్వవిద్యాలయంలో గణిత శాఖలో రీడర్ గా పనిచేస్తున్నాడు. అతను గణితంలో పి. హెచ్.డి పట్టా పొందాడు. వారి తల్లితండ్రులు స్వామి వారి ముందు వినయంగా నిలుచున్నారు. కాని ఇతను మాత్రం చాలా మమూలుగా ఉన్నాడు. పరమాచార్య స్వామి వారు రాజుగారు మరియు రాణిగార్లతో కాసేపు కన్నడం లో మాట్లాడి కొద్దిసేపటి తరువాత వాళ్ళ అబ్బాయి వంక తిరిగి అడిగారు.

“నువ్వు ఎక్కడ నివసిస్తున్నావు? ఏమి చేస్తున్నావు”

“నేను యేల్ విశ్వవిద్యాలయంలో గణిత శాఖలో రీడర్ గా పనిచేస్తున్నా ను” అని బదులిచ్చాడు. ”నువ్వు ఏమి చదువుకున్నావు? గణితంలో ఏ శాఖలో నువ్వు పి. హెచ్.డి పట్టా పొందావు?” అని అడిగారు. పరమాచార్య స్వామి వారికి అర్థం అవదు అని సంకోచిస్తూ అతను కొద్దిసేపు వారి ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. అతని తండ్రి చెప్పమని అదేశించాడు. ”క్వాంటమ్ థియరీ” అని నిర్లక్ష్యంగా అన్నాడు. మహాస్వామి వారు మట్టిలో ఒక +ve సంజ్ఞను వేసి దాని చుట్టూ ఒక వృత్తం వేసారు. అలాగే –ve సంజ్ఞను వేసి ఒక వృత్తం వేసారు. వాటిని రెండూ చూపిస్తూ అతన్ని అడిగారు. ”నీ పి.హెచ్.డిలో క్వాంటమ్ థియరీ థీసిస్ కోసం నువ్వు సానుకూల విధానాన్ని(Positive Approach) అవలంబించావా లేదా ప్రతికూల విధానాన్ని(Negative Approach) అవలంభించావా?”

అంతదాకా చికాకుగా ప్రవర్తిస్తున్న వాళ్ల అబ్బాయి ఈ ప్రశ్న విని కొద్దిగా ఆశ్చర్యపోయి కంగారుతో మాటలు తడబడగా పరమాచార్య స్వామి వారిపై గౌరవంతో బదులిచ్చాడు. ”సానుకూల విధానాన్ని అవలంబించాను.”

“ప్రతికూల విధానాన్ని ఎందుకు తీసుకోలేదు? అది తరువాత చేద్దాం అనుకున్నావా?”

”అది సాధ్యపడదు. చాలా కష్టం”

మహాస్వామి వారు అన్నాదురై అయ్యంగార్ వైపు చూసి “అది కష్టం అని అతను అంటున్నాడు. మీ వేద పాఠశాల పిల్లలతో ఋగ్వేదము నుండి ఈ పన్నాన్ని ఆమ్నాయం చెయ్యమని చెప్పండి” అని మొదటి రెండు పదాలను అందించారు.

ఆ విద్యార్థులు దాన్ని ఐదు నిముషముల సేపు వల్లించారు. తరువాత ఆ అబ్బాయి వంక తిరిగి, ”నువ్వు 24 లేదా 25 వ సంవత్సరములో నీ పట్తా పొందావు కదూ.” అని అన్నారు

“అవును నా 25వ సంవత్సరములో” అని బదులిచ్చాడు. ”ఋగ్వేదం లోనిది ఇప్పుడు నువ్వు విన్నది. అది సానుకూల విధానానం, ప్రతికూల విధానాం రెండింటి గురించి చెప్తుంది.” అని అన్నారు. వారి మాటలకు ఆ అబ్బాయి విస్తుపోయి, మళ్ళీ ఒక సారి చెప్పమని ఆ విద్యార్థులను కోరాడు. ”నువ్వు ఇప్పుడు ఏమి అలోచిస్తున్నావో నాకు తెలుసు. 25సంవత్సరాల లక్షలు లక్షలు ఖర్చుపెట్టి చదువుకొని తెలుసుకున్నది కేవలం 7 ఏళ్ళు వేదం చెదువుకొని ఉంటే తెలుసుకుని ఉండేవాడిని కదా!” అని గట్టిగా నవ్వారు.

--- తిరువణ్ణామలై గౌరీశంకర్ మామ

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

https://t.me/paramacharyavaibhavam

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం