Sunday, August 18, 2019

సత్యహరిశ్చంద్రుడు


Image result for raja satya harischandra

భారతీయ పురాణ సాహిత్యంలో ఆదర్శవంతమైన చక్రవర్తిగా మానవాళికంతటికీ మార్గదర్శకుడుగా హరిశ్చంద్రుడు కనిపిస్తాడు. హరిశ్చంద్రుడి కథ మార్కండేయ పురాణంలో వివరంగా ఉంది. త్రిశంకుడి కుమారుడు హరిశ్చంద్రుడు. సూర్యవంశ రాజుల్లో ఇతడు సుప్రసిద్ధుడు.

                           అయోధ్యను రాజధానిగా చేసుకొని పరిపాలిస్తుండేవాడు. ఆయన భార్య పేరు చంద్రమతి. కుమారుడు లోహితాస్యుడు. ఏకపత్నీవ్రతుడుగా, సత్యసంధుడుగా హరిశ్చంద్రుడికి తిరుగులేని పేరుంది. ఒకనాడు దేవేంద్రుడి సభలో జరిగిన ఒక సన్నివేశం హరిశ్చంద్రుడి జీవితాన్ని ఎన్నో పరీక్షలను పెట్టి, ఎన్నెన్నో మలుపులను తిప్పింది. ఇంద్రసభలో సత్యం తప్పక పలికేవారు ఎవరున్నారు? అనే ప్రశ్న ప్రస్తావనకు వచ్చింది. అప్పుడు వెంటనే అక్కడ ఉన్న వశిష్ఠుడు భూలోకంలో హరిశ్చంద్రుడు ఉన్నాడని చెప్పాడు. కానీ అక్కడ ఉన్న వశిష్ఠుడి బద్ధశత్రువు విశ్వామిత్రుడు లేచి హరిశ్చంద్రుడు సత్యవాక్య పరిపాలకుడుకాడు అని, ఆ విషయాన్ని తాను నిరూపిస్తానని హరిశ్చంద్రుడితో ఎలాగైనా అబద్ధం ఆడిస్తానని అన్నాడు. 

                        అలా వశిష్ఠుడికి, విశ్వామిత్రుడికి పట్టుదల పెరిగింది. విశ్వామిత్రుడు తన మాట నెగ్గించుకోవటానికి ఒక రోజున హరిశ్చంద్రుడి దగ్గరకు వచ్చి తాను ఒక యజ్ఞం తలపెట్టానని దానికి ఎంతో ధనం అవసరమవుతుందని ఆ ధనం కావాలని అడిగాడు. అప్పుడు హరిశ్చంద్రుడు ఆ ధనాన్ని తాను ఇస్తానని వాగ్దానం చేశాడు. కానీ విశ్వామిత్రుడు వెంటనే ఆ ధనం తనకు ప్రస్తుతం అవసరం లేదని అవసరం వచ్చినప్పుడ అడుగుతానని చెప్పి వెళ్లిపోయాడు. అలా జరిగిన కొంతకాలానికి హరిశ్చంద్రుడు వేట కోసం అడవికి వెళ్లాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇద్దరు మాతంగ కన్యలను హరిశ్చంద్రుడి దగ్గరకు పంపాడు. ఆ కన్యలు తమ అందచందాలతో, సంగీత నాట్యాలతో హరిశ్చంద్రుడిని ఆకర్షించాలని చూశాడు. హరిశ్చంద్రుడు వారి ఆకర్షణలో పడక వారికి బహుమానాలు ఇచ్చి పంపించాలని అనుకున్నాడు. అయితే ఆ కన్యలిద్దరు తమకు బహుమానాలు అక్కర లేదని తమను వివాహం చేసుకోమని కోరారు. కానీ హరిశ్చంద్రుడు తాను ఏకపత్నీవ్రతుడినని, రెండోసారి పెళ్లిచేసుకోవటం ధర్మం కాదని ఆ కన్యలను పంపించాడు. విశ్వామిత్రుడు ఆ ఇద్దరు కన్యలను వెంటపెట్టుకొని వచ్చి హరిశ్చంద్రుడిని వారి కోరిక తీర్చమన్నాడు. హరిశ్చంద్రుడు అందుకు ఒప్పుకోలేదు. తన రాజ్యాన్నయినా వదులుకుంటానని ఏకపత్నీవ్రతాన్ని విడిచి పెట్టి అధర్మానికి పాల్పడనని చెప్పాడు. వెంటనే విశ్వామిత్రుడు తనకు రాజ్యాన్ని ఇచ్చి వెళ్లిపొమ్మని, లేదా కన్యలను పెళ్లాడమన్నాడు. హరిశ్చంద్రుడు రాజ్యాన్ని విశ్వామిత్రుడికి అప్పగించి కట్టుబట్టలతో నగరం నుంచి బయలుదేరాడు. రాజ్యం సర్వస్వాన్ని కోల్పోయిన హరిశ్చంద్రుడిని విశ్వామిత్రడు నిలదీసి గతంలో తనకు వాగ్దానం చేసిన ధనాన్ని ఇవ్వమని అడిగాడు. ప్రస్తుతం తన దగ్గర ధనం లేదని కొంత సమయమిస్తే ధనాన్ని చెల్లిస్తానని హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడిని వేడుకున్నాడు. అందుకు అంగీకరించి తనకు రావాల్సిన ధనాన్ని వసూలు చేసుకోవటానికి తన శిష్యుడైన నక్షత్రకుడు అనే వాడిని పంపాడు. హరిశ్చంద్రుడి వెనుకనే బయలుదేరిన నక్షత్రకుడు ఆ రాజును ఎన్నెన్నో కష్టాలపాలు చేశాడు. ‘సొమ్ము ఇస్తానని అనలేదు అని’ ఒక్క అబద్ధం చెప్పమని తాను వెంటనే వెళ్లిపోతానన్నాడు. కానీ హరిశ్చంద్రుడు అందుకు ఒప్పుకోక ఎన్నెన్నో కష్టాలనుభవిస్తూ చివరకు కాశీ నగరానికి చేరాడు. అక్కడ కాలకౌశికుడు అనే బ్రాహ్మణుడికి హరిశ్చంద్రుడు తన భార్యను అమ్మి దాంతో వచ్చిన ధనాన్ని నక్షత్రకుడికి ఇచ్చాడు. అయినా ఇంకా విశ్వామిత్రుడి అప్పు ఎంతో మిగిలి ఉంది. అప్పుడు హరిశ్చంద్రుడు వీరబాహుడు అనే ఒక కాటికాపరికి తానే స్వయంగా అమ్ముడు పోయి ఆ ధనాన్ని నక్షత్రకుడికి ఇచ్చాడు. అయినా హరిశ్చంద్రుడి కష్టాలు తీరలేదు. 

హరిశ్చంద్రుడి భార్య అయిన చంద్రమతి కాలకౌశికుడి ఇంట్లో కష్టాలను అనుభవిస్తూ ఉండగా, అడవికి దర్భల కోసం వెళ్లిన ఆమె కుమారుడు లోహితాస్యుడు పాము కరిచి మరణించాడు. తన కుమారుడు మరణించాడని తెలుసుకొని ఆ శవాన్ని అంత్యక్రియలు చేయటానికి శవాన్ని తీసుకొని చంద్రమతి స్మశానికి వెళ్లింది. అక్కడ వీరబాహుడికి సేవకుడిగా, కాటికాపరిగా ఉన్న హరిశ్చంద్రుడు శవాన్ని దహనం చేయనీయలేదు. కాటి సుంకం చెల్లించితీరాలని చంద్రమతిని పట్టుబట్టాడు. తన దగ్గర చిల్లిగవ్వ కూడా ధనం లేదని, కాటి సుంకం కట్టలేనని అంది. అప్పుడు హరిశ్చంద్రుడు అయితే నీ మెడలో ఉన్న మంగళసూత్రాన్ని అమ్మి ఆ డబ్బుతో సుంకాన్ని చెల్లించమని హరిశ్చంద్రుడన్నాడు. ఆ మాటలకు చంద్రమతి ఆశ్చర్యపోయింది. తన మెడలోని మంగళసూత్రం తన భర్తకు తప్ప వేరొకరెవరికీ కనపడదని అది తనకు వరమని కనుక కాటికాపరిగా ఉన్నవ్యక్తి హరిశ్చంద్రుడే అయివుంటాడని అనుకుని అప్పుడు తన విషయాన్నంతా చంద్రమతి హరిశ్చంద్రుడికి చెప్పింది. 

                              విషయం తెలుసుకుని ఎంతో బాధపడిన హరిశ్చంద్రుడు తన విధి నిర్వహణనను మాత్రం అమ్మలేదు. మంగళసూత్రం అమ్మి ధనం తీసుకురమ్మని నగరానికి పంపాడు. అంత రాత్రివేళ చంద్రమతి నగరంలోకి వెళుతుండగా ఇంకొక కష్టం వచ్చి పడింది. కాశీరాజు కుమారుడిని ఎవరో దొంగలు చంపి, అతడి దగ్గర ఉన్న ఆభరణాలను అపహరించి పారిపోతుండగా రాజభటులు ఆ దొంగలను చూసి తరుముకురాసాగారు. ఆ దొంగలు పరుగెత్తుతూ వచ్చి వారికి దారిలో ఎదురైన చంద్రమతి దగ్గర తాము దొంగతనం చేసి తెచ్చిన సొమ్ములు పడవేసి పారిపోయారు. అటుగా వచ్చిన రాజభటులు చంద్రమతే రాకుమారుడిని హత్యచేసి ధన్నాన్ని దొంగిలించిదని భావించి ఆమెను బంధించి రాజు దగ్గరకు తీసుకువెళ్లారు. రాజు ఆమెకు మరణదండన విధించటంతో రాజభటుల ఆమెను కాటికాపరిగా ఉన్న హరిశ్చంద్రుడి దగ్గరకే తీసుకువచ్చి శిక్ష అమలు చేయమన్నారు. ఆమె తన భార్య అని తెలిసినా, నిరపరాధి అని తెలిసినా రాజు ఆజ్ఞను హరిశ్చంద్రుడు అమలుపరిచాడు. అయితే హరిశ్చంద్రుడు ఖడ్గం ఎత్తి చంద్రమతి శిరస్సును తెగవేయబోగానే విచిత్రంగా ఆ ఖడ్గం ఒక పూలదండలాగా మారి చంద్రమతి మెడలో పడింది. వెంటనే దేవతలంతా అక్కడ ప్రత్యక్షమయ్యారు. విశ్వామిత్రుడు, వశిష్ఠుడులాంటి రుషులు అక్కడకు వచ్చి చేరి అబద్ధం ఆడని, ధర్మం తప్పని హరిశ్చంద్రుడిని ఎంతగానో ప్రశంసించారు. విశ్వామిత్రుడు ఓడిపోయానని ఒప్పుకోవటంతో హరిశ్చంద్రుడి మీద దేవతలంతా పుష్పవృష్ఠి కురిపించారు. ఇలా హరిశ్చంద్రుడు సర్వమానవాళికి ఆదర్శ పురుషుడయ్యాడు. సత్య నిరతిని తప్పక సత్యహరిశ్చందృడిగా పేరు పొందాడు.