Monday, February 10, 2020

దక్షిణ గోగ్రహణం

Image result for pandavas agnyathavasam

పాండవులు అజ్ఞాతవాస దీక్షలో ఉన్నప్పుడు వారి అజ్ఞాతాన్ని భంగపరచి పాండవులను ఎలాగైనా మరోమారు అరణ్య, అజ్ఞాతవాసాలకు పంపాలని దుర్యోధనుడు ఎప్పటికప్పుడు తీవ్రంగా ఆలోచిస్తూనే ఉన్నాడు. దుర్యోధనుడి ఆలోచనలకు అనుకూలంగా ఒక సమాచారం అందింది. మత్స్యదేశ రాజైన విరాటరాజు బావమరిది సింహబలుడు (కీచకుడు) మరణించాడని దుర్యోధనుడు తెలుసుకున్నాడు. భూలోకంలో భీమసేనుడు, కీచకుడు, బలరాముడు, శల్యుడు సమాన బలవంతులని దుర్యోధనుడికి తెలుసు. అదీకాక మహాబలశాలి అయిన కీచకుడిని అన్ని అవయవాలు విరిచి ముద్దలాగా చేసి చంపగలిగింది భీముడేనని, భీముడే గంధర్వుడి రూపంలో ఆ పని చేసి ఉంటాడని దుర్యోధనుడు అనుకున్నాడు. అందుకు కారణం కీచకుడికి బలరాముడు, శల్యుడు దూరంగా ఉన్నారు. అదీకాక పాండవులు ఎక్కడ అజ్ఞాతంలో ఉండే అవకాశం ఉందని ఆలోచిస్తుంటే సస్య శ్యామలంగా, సుభిక్షంగా ఉండే ప్రాంతంలోనే పాండవులు ఉండే వీలుందని భీష్మాచార్యుడు చెప్పిన మాటలను బట్టి కూడా పాండవుల ఉనికి దుర్యోధనుడు ­హించాడు. వెంటనే తన మంత్రులు సామంతులతో కొలువు తీరి మత్స్యదేశాన్ని దక్షిణ దిక్కు నుంచి, ఉత్తర దిక్కు నుంచి రెండు వైపులా బంధించగలిగితే విరాటరాజును రక్షించటానికి పాండవులు వచ్చి తీరుతారని అప్పుడు వారి గుట్టు రట్టవుతుందని దుర్యోధనుడు తన వారందరికీ చెప్పాడు. ఈ ఆలోచన బాగుందని, తానందుకు సిద్ధమని అక్కడే ఉన్న త్రిగర్త రాజైన సుశర్మ చెప్పాడు. కీచకుడి అండ చూసుకొని విరాటరాజు తన మీదకు ఎన్నోసార్లు దండెత్తి వచ్చి అవమాన పరిచాడని కీచకుడు మరణించాడు కనుక ఇప్పుడు తాను విరాటుడిని జయించగలనని పలికాడు. దుర్యోధనుడు, కర్ణుడులాంటి వారంతా సుశర్మ ఆలోచనను సమర్ధించి మత్స్యదేశాన్ని దక్షిణ దిక్కు నుంచి సుశర్మ ముట్టడించేలాగా ఆ తరువాత ఉత్తర దిక్కు నుంచి కౌరవ ప్రముఖులు విరాట రాజ్యాన్ని ముట్టడించేలాగా పథకం సిద్ధం చేసుకుని యుద్ధ సన్నాహాలు ప్రారంభించారు. మత్స్యదేశాన్ని దక్షిణ దిక్కు నుంచి తాకుతూ వచ్చి సుశర్మ గోసంపదను తరలించుకు వెళుతున్నాడని విరాటరాజుకు వర్తమానం వచ్చింది. విరాటుడు వెంటనే తన తమ్ముడు శతానీకుడు తదితర వీరులను సిద్ధం చేసి యుద్ధానికి బయలుదేరాడు. గతంలో ఎన్నోసార్లు తన చేతిలో పరాజితుడైనప్పటికీ సుశర్మకు బుద్ధి రాకపోవటం విచిత్రంగా ఉందని విరాటరాజు అనుకున్నాడు. విరాటరాజు చేస్తున్న యుద్ధ సంరంభాన్ని గమనించి కంకుభట్టు రూపంలో ఉన్న ధర్మరాజు విరాటుడి దగ్గరకు వెళ్లి గతంలో తనకు ఒక ముని అనేక దివ్యాస్త్రాలను ప్రసాదించాడని తనకు కొన్ని రథాలను, సైన్యాన్ని సమకూర్చితే యుద్ధ రంగానికి తానూ వచ్చి సహాయపడుతానని చెప్పాడు. తమ కొలువులోనే వంటవాడుగా ఉన్న వలలుడిని కూడా యుద్ధానికి తీసుకువెళ్ల వచ్చని అతడు మల్లయుద్ధంలో ఎంతో నేర్పుకలవాడని చెప్పాడు. అలాగే గోవులను రక్షస్తున్న దామగ్రంధిని, అశ్వశిక్షకుడైన తంత్రీపాలుడు కూడా యద్ధ విద్యలో ఎంతో నిపుణులని వారిని కూడా యద్ధానికి బయలుదేర దీయమని చెప్పాడు. విరాటరాజు కంకుభట్టు మాటలకు సమ్మతించి కంకుభట్టుకు, వలలుడికి, దామగ్రంధికి, తంత్రీపాలుడికి కావాల్సిన ఆయుధాలను, రథాలను ఏర్పాటు చేశాడు. అలా నలుగురు సోదరులు విరాటరాజు వెంట తరలివెళ్లి సుశర్మను ఎదుర్కొన్నారు. సుశర్మకు, విరాటరాజుకు మహాభీకరంగా పోరు జరిగింది. కానీ చివరలో సుశర్మ విరాటరాజును విరథుడిని చేసి తన రథం మీద ఎక్కించుకుని తీసుకువెళ్లసాగాడు. ఆ పరిస్థితిని చూసి విరాటుడి సైన్యమంతా చెల్లా చెదురవుతున్న సమయంలో ధర్మరాజు, భీముడిని పిలిచి పరిస్థితి చేయిదాటి పోయేలా ఉందని అజ్ఞాతవాసంలో తమకు ఆశ్రయాన్నిచ్చి ఆదుకుంటున్న విరాటుడిని రక్షంచటం తమ కర్తవ్యమని చెప్పాడు. భీముడు వెంటనే ఒక పెద్ద చెట్టును పెకలించి సుశర్మ సైన్యాన్ని చెదరగొడతానని బయలుదేరబోతుండగా ధర్మరాజు అలా చేయవద్దని పెద్ద పెద్ద చెట్లను, వృక్షాలను పెకలించి శత్రువులతో పోరాడేది భీముడేనన్న సంగతి కౌరవులు పసిగడితే తమ గుట్టు రట్టవుతుందన్నాడు. అలాకాక శస్త్రాలు, ఆయుధాలతోనే యద్ధం చేయమని చెప్పాడు. వెంటనే భీమసేనుడు అమిత ఉత్సాహంతో విరాటరాజును రథం మీద ఎక్కించుకునివెళుతున్న సుశర్మను వెంబడించాడు. తన అస్త్ర, ఆయుధ, భుజబలాన్నంతా ప్రదర్శించి సుశర్మను నిలువరింప చేశాడు. సుశర్మ రథసారథి, అశ్వాలు పడిపోగా రథచక్ర రక్షకుడైన శోణాశ్యుడు పారిపోయాడు. వెంటనే విరాటుడు కూడా విజృంభించటంతో త్రిగర్త సేనలు చెల్లా చెదురయ్యాయి. భీముడి దెబ్బకు సుశర్మ మూర్ఛపోయాడు. అతనిని రథం మీదకు ఎక్కించుకుని భీముడు తన అన్న దగ్గరకు తీసుకువచ్చి సుశర్మను వధించటానికి అనుమతివ్వమని కోరాడు. అయితే ధర్మరాజు అందుకు అంగీకరించలేదు. సుశర్మకు అప్పుడే మూర్ఛ నుంచి మెలకువ వచ్చింది. భీముడు, ధర్మరాజు పలికిన సూటిపోటీ మాటలతో అతడు అవమాన భారంతో కుంగిపోయాడు. భీముడు, ధర్మరాజు సూచన మేరకు అతడిని విడిచిపెట్టాడు. ఇదంతా చూస్తున్న విరాటరాజుకు ఎంతో ఆశ్చర్యమేసింది. తన ప్రాణాలను, రాజ్యాన్ని రక్షంచినందుకు ఎంతగానో కృతజ్ఞతలు చెప్పి తన రాజ్యంలో ఉన్న ధనాన్ని, చివరకు రాజ్యాన్ని కూడా గ్రహించమని కోరాడు. అయితే ధర్మరాజు తాము ధనాన్ని కోరి యద్ధం చేయలేదని, దైవానుగ్రహం వల్లనే సుశర్మ మీద విజయం లభించిందని, తమకు ఎలాంటి బహుమానాలు అక్కరలేదని చెప్పాడు. కంకుభట్టు ఔదార్యానికి మత్స్యదేశ రాజైన విరాటుడు ఎంతో ముచ్చటపడ్డాడు.