Monday, April 27, 2020

గోవు వెనక వెళ్ళడమెందుకు ?

Sri Sri Sri Chandrasekharendra Saraswathi.



పరమాచార్య స్వామివారు విజయయాత్రలలో భాగంగా, వివిధ ప్రాంతాలలో నివసిస్తుండేవారు. అలాంటి సమయాలలో కొందరు భక్తులు, తమ ఇళ్ళకు రమ్మనో లేదా అక్కడి దేవాలయాలకు రమ్మనో అభ్యర్తిస్తుంటారు.

భక్తులు రమ్మని ప్రార్తిస్తున్నది దేవాలయానికే అయితే పరమాచార్య స్వామివారు దాదాపుగా వారి అభ్యర్థనను మన్నించి అక్కడకు వెళ్లి, దేవుడి దర్శనం చేసుకుని, దగ్గరలోని ఒక స్థలంలో మకాం చేసి, కొద్దిసేపో లేదంటే ఒకరోజో అక్కడ ఉంది భక్తులకు దర్శనం ఇచ్చి అనుగ్రహిస్తుంటారు. కొన్నిసార్లు ఏదైనా ఉపన్యాసం కాని లేదా సామాన్య విషయాలు చర్చించడం కాని జరుగుతూ ఉంటాయి.

ఒకసారి పరమాచార్య స్వామివారు తమిళనాడు మొత్తం విజయయాత్ర చేస్తున్నారు. యాత్రలో భాగంగా తిరుచిరాపల్లిలో కొన్నిరోజుల పటు మకాం చేశారు. ప్రతిరోజూ స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చేవారు. ఆ భక్తజన సమూహంలో తిరుచ్చిలోని ఒక కళాశాల ప్రధానాచార్యులు కూడా ఉన్నారు. వరుసలో అతని వంతు రాగానే మహాస్వామివారికి నమస్కరించి, ఎన్నోరకాల పళ్ళు పూలు సమర్పించాడు. మహాస్వామివారి దివ్యపాదములు తన కళాశాలను తాకాలని, విద్యార్ధులని అనుగ్రహించాలని ప్రార్థించాడు.

కాని మహాస్వామివారు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. అతని ప్రార్థనకు మౌనమే స్వామివారి సమాధానం అయ్యింది. అతను మాత్రం రోజూ వచ్చి స్వామివారిని అర్థించేవాడు.

చివరగా ఒకరోజు కరుణాసాగరులైన మహాస్వామివారు అతనిపై తమ దయను ప్రసరింపజేశారు. పటికబెల్లం, కుంకుమ ప్రసాదం ఇస్తూ, స్వామివారు అతనితో, “రేపు ఉదయం మీ కళాశాలకు వస్తాను. ఒక ఆవు, దూడతో నీవు నీ భార్య సిద్ధంగా ఉండండి” అని ఆజ్ఞాపించారు.

ఆ భక్తుని సంతోషానికి అవధులు లేవు. “ఖచ్చితంగా అలాగే చేస్తాను పెరియవా” అని మహదానందంతో వెళ్ళిపోయాడు.

చెప్పినట్టుగానే ఉదయం స్వామివారు కళాశాలకు వెళ్ళారు. అతను ఆవు, దూడ, పూర్ణకుంభంతో సహా స్వామివారికోసం ఎదురుచూస్తున్నాడు. మహాస్వామివారి పూర్ణకుంభాన్ని స్వీకరించి, కళాశాల ద్వారం వద్దకు వచ్చి నిలబడ్డారు.

స్వామివారు ఆ భక్తునితో, “నువ్వు ఎక్కడేక్కడైతే నేను రావాలి అనుకుంటున్నావో, అక్కడకు నువ్వు ఆవు, దూడను ముందు తీసుకుని వెళ్ళు, నేను అనుగమిస్తాను” అని తెలిపారు.

స్వామివారి ఆదేశం ప్రకారం అతను భార్యతో కలిసి ఆవు దూడను ముందు తీసుకుని వెళ్తూ ఉంటె స్వామివారు ఆవు వెనుకగా వస్తున్నారు. మొత్తం కలియతిరిగిన తరువాత స్వామివారు ఆ భక్తునితో, “సంతృప్తిగా ఉందా?” అని అడుగగా, అతను తనకు కలిగిన ఆనందాన్ని మాటలలో చెప్పడం కుదరక, కళ్ళ నీరు కారుస్తూ, హృదయం ఉప్పొంగి, తనకు స్వామివారు కలిగించిన అదృష్టానికి, వారి దయకు కృతజ్ఞతగా నేలపై పడి సాష్టాంగ నమస్కారం చేశాడు.

తమ వసతికి తిరిగొచ్చిన స్వామివారు సాయింత్రం భక్తులతో మాట్లాడుతూ, ఉదయం తాము కళాశాలకు వెళ్లోచ్చిన విషయం ప్రస్తావనకు రావడంతో ఒక వ్యక్తి స్వామివారిని, “పెరియవా, కళాశాలో మీరు ఆవు వెనుకగా ఎందుకు వెళ్ళారు?” అని అడిగాడు.

స్వామివారు చిరునవ్వుతూ, “అతను నాపై అత్యంత భక్తిభావం కలవాడు. నేను వస్తే అది కళాశాలకు మంచి అని నమ్మి నన్ను ఆహ్వానించాడు. కాని అది ఆడపిల్లలు చదివే కళాశాల. వారు అన్ని రోజులలోను కళాశాలకు వస్తారు. వారు దూరం ఉండాల్సిన సమయాలలో కూడా కళాశాలకు వస్తారు. అందుకే నేను ఒక ఆలోచన చేశాను. అతని కోరికను తీర్చాలి. నా అనుష్టానం, నియమపాలన కూడా కాపాడబడాలి. దానికి పరిష్కారం ఒక్కటే. మన శాస్త్రాలలో ఉన్నదాని ప్రకారం, ఎటువంటి అశౌచమైనా, ఎటువంటి స్థలమైనా గోవు డెక్కల నుండి వచ్చే ధూళి తగిలితే, ఆ స్థలం పవిత్రమవుతుంది. అందుకే ఆవును ముందు వదిలి నేను దాన్ని అనుసరించాను” అని బదులిచ్చారు.

స్వామివారు చెప్పిన విషయాన్ని విన్నవారందరూ స్థాణువులై నిలబడిపోయారు. ఇంతటి ధర్మసూక్ష్మము ఉంటుందా అని మనం అనుకోవచ్చు. ధర్మాన్ని, ఆశ్రమ నియమ పాలనను ఇంతగా పాటించే జీవితం ఉంటుందా అని మనం అనుకోవచ్చు. ఇలా దయను కూడా ధర్మంతో ముడిపెట్టి పాలించేవారు కంచి పరమాచార్య స్వామివారు కాక ఇంక ఎవరు ఉంటారు?

--- “కడవులిన్ కురల్” - తిరువారూర్ దివాకరన్. ‘కుముదం’ పత్రిక నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

Credit 👇

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Friday, April 24, 2020

ముందు పద్మావతీ కల్యాణం చెయ్యి

Chandrashekarendra Saraswati | MOA

కంచి పరమాచార్య స్వామివారిలో ఉన్న ఒక యోగి లక్షణాలను, అనన్యసామాన్యమైన నిరాడంబరతను కలిపి చూడడం మా అదృష్టం. వారి అవతార రహస్యాన్ని తెలుసుకున్న ఎందఱో భక్తులను స్వామివారు అనుగ్రహించారు.

ఆ ప్రత్యక్ష దైవాన్ని ప్రత్యక్షంగా సేవించి తరించే భాగ్యం పొందినవారిలో శ్రీమఠం బాలు ఒకరు. ప్రతిరోజూ వారి అవతారాన్ని తెలిపే అన్నో సంఘటనలను ప్రత్యక్షంగా చూశాడు. ఈ సంఘటను కూడా అతను చెప్పిన అనుభవాల్లో ఒకటి.
మరవక్కాడు రామస్వామి అనే భక్తునికి నలుగురు కూతుళ్ళు, ఇద్దరు కుమారులు. యుక్తవయస్సులో అతను ఏ విషయంలోనూ ఆసక్తి చూపకుండా, ఊరికే అక్కడా ఇక్కడా తిరుగుతుండడంతో, నెలవారీ ఆదాయం అంటూ ఏమి లేదు. వైదిక కర్మలలో పండితులకు సహాయం చెయ్యడంవల్ల లభించే కొద్ది మొత్తమే అతని కుటుంబానికి ఆసరా.

అతను నివసిస్తున్న గృహం తాతలనాటిది కావడంతో ఇంటికి అద్దె కట్టాల్సిన అవసరం లేదు. గ్రామ శివార్లలో అతనికి ఒక కొబ్బరితోట ఉంది. దాని నుండి వచ్చే ఆదాయమే వారికి తిండి పెడుతోంది.

పెద్దమ్మాయికి ఇరవైరెండేళ్ళు. తరువాతి అమ్మాయికి ఇరవైయ్యేళ్ళు. ఇద్దరి పెళ్ళిళ్ళు ఒకే ముహూర్తంలో జరిపించేస్తే ఖర్చు కొద్దివరకు తగ్గుతుందని అతని ఆలోచన. కాని జరుగుతున్న సంఘటనలు దానికి ఊతమియ్యడంలేదు. పెద్దమ్మాయికి మంచి సంబంధం కుదరడంతో, త్వరగా పెళ్లిచేయ్యాలనే అతను ఇష్టపడడంతో, కొబ్బరితోట అమ్మడానికి నిశ్చయించుకుని ఒకరి వద్ద ధర కూడా నిర్ణయించేశాడు.

కాని అతను చేస్తున్న ఈ పని అన్నగారికి నచ్చలేదు. ఆ కొబ్బరితోట తరతరాలుగా వస్తున్నది కావడంతో, అందులో ఇతనికి భాగం ఉన్నది కాబట్టి, కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ తెచ్చుకున్నాడు. రామస్వామి అయ్యర్ కు ఏమీ పాలుపోలేదు. అసలే ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నాడు. ఎలాగో కుమార్తె పెళ్లి జరిపించాలి అనుకున్నాడు. కాని అతని అన్న కొబ్బరితోట అమ్మకానికి అడ్డుపడ్డాడు. రామస్వామి చాలా చాలా బాధలో ఉన్నాడు.

ఇక తను చేసేదేంలేక కరుణా సముద్రుడైన పరమాచార్య స్వామివద్దకు పరిగెత్తుకుని వచ్చాడు. స్వామివారికి సాష్టాంగం చేసి నిల్చుని, గద్గదమైన స్వరంతో, కళ్ళ నీరు కారుతుండగా మొత్తం విషయం అంతా స్వామివారికి విన్నవించాడు. పరమాచార్య స్వామివారు అయిదు నిముషాల పాటు అతనివైపు చూసి, ఏమీ చెప్పకుండా ప్రసాదం ఇచ్చి పంపేశారు.

పెద్ద దుఃఖభారంతో వచ్చిన ఆ భక్తుడు నిరాశాపడ్డాడు. పరమాచార్య స్వామివారు కనీసం చిన్న మాట సాయంగా బాధపడకు అని కూడా చెప్పకుండా పంపించివేశారు అన్న బాధతో బయటకు వచ్చాడు. అతను బయటకు రాగానే, మహాస్వామివారిని సేవించుకునే అదృష్టం కల్గిన బాలు కనపడ్డాడు. దుఃఖం తన్నుకురావడంతో తన బాధను బాలుకు చెప్పుకున్నాడు. “పరమాచార్య స్వామివారు తలచుకుంటే ఏమైనా చెయ్యగలరు. మా అన్నకు అన్నీ ఉన్నాయి; పెద్ద ఇల్లు, ఆస్తి, ఐశ్వర్యం; ఎప్పుడూ యాత్రలలో ఉంటాడు; నేను ఎప్పుడూ ప్రత్యక్షంగా కలవలేను; నా వల్ల చెయ్యడం కాకపోయినా ఎపుడూ మా న్నాన్నగారి ఆబ్దికానికి కూడా పిలవడు; ఎంతో కష్టపడి నా కుమార్తె పెళ్లి చేద్దామనుకుంటే, ఇలా చేశాడు”

మొత్తం విన్న తరువాత “ఇదంతా ఎందుకు స్వామివారితో చెప్పలేదు?” అని అడిగాడు బాలు. “నేను మొత్తం చెప్పాను, పరమాచార్య స్వామివారు సాంతం విన్నారు. కేవలం విభూతి ప్రసాదం ఇచ్చారు కాని ఏ ‘అనుగ్రహం’ ఇవ్వలేదు” అని బదులిచ్చాడు రామస్వామి.

ఎంతో బాధతో తన గోడు చెప్పుకున్న రామస్వామిని చూసి, పెరియవా ఇలా చెయ్యకుండా ఉండాల్సింది అనుకున్నాడు బాలు. అందరిపై కరుణను ప్రసరించే మహాస్వామి, రామస్వామిని ఇలా వదిలేయరాడు కదా! అందునా పేదవాడైన రామస్వామిపై స్వామివారి కరుణ దయ అపారమైనవి కదా! అని అనుకున్నాడు.

“ఏమి బాధపడవద్దు. నీ సమస్యను స్వామివారికి వదిలి ఏం జరగాలో అది చూడు. ఎలాగో స్వామివారే నిన్ను కాపాడుతారులే” అని అతణ్ణి స్వాంతనపరచి పంపాడు బాలు.

కొన్ని రోజులు గడిచిపోయాయి. ‘ఉపన్యాస చక్రవర్తి’ శ్రీ మార్గబంధు శాస్త్రి పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చారు. అతని ఐశ్వర్యము, యశస్సు అతను ధరించిన తెల్లని పట్టుపంచె, జరి అంచు ఉన్న అంగవస్త్రం, బంగారుతో అల్లిన రుద్రాక్షమాల, నవరత్నాల హారంలో కనపడుతోంది. మహాస్వామివారు గంటల తరబడి వివిధ అంశాలపై వారితో మాట్లాడేవారు. వారు ఎప్పుడు వచ్చినా సాయింత్రాలు ఉపన్యాసం చెప్పమని స్వామివారు అడిగేవారు.

కాని ఈసారి ఎందుకనో ఎప్పటిలాగా లేదు. భార్యతో, ఇద్దరు శిష్యులతో కలిసి, చేతిలో ఉన్న పళ్ళెం నిండా పళ్ళతో వచ్చి నిల్చున్న ఆయన్ని పట్టించుకోకుండా స్వామివారు ఇతరులతో సంభాషిస్తున్నారు. “ఎందుకు ఇవ్వాళ ఇలా జరుగుతోంది. దేశంలోనే ప్రఖ్యాతిచెందిన ఉపన్యాస చక్రవర్తి వేచియున్నాడు; సరే స్వామివారికి చెబుదాం” అనుకుని, గట్టిగా స్వామివారికి వినపడేటట్లు, “మార్గబంధు శాస్త్రి వచ్చారు” అని చెప్పాడు.

స్వామివారి చూపు ఇటువైపు పడ్డట్టుగా అన్పించడంతో, అటువంటి అవకాశం కోసం ఎదురుచూస్తున్న మార్గబంధు శాస్త్రి పళ్ళ తట్టను స్వామివారికి సమర్పించి, “చాలాకాలం తరువాత ఏడెనిమిది రోజులదాకా నాకు ఎటువంటి కార్యక్రమాలు లేవు. అందుకేనే తిరుమలకు వెళ్తున్నాను. ‘శ్రీనివాస కల్యాణం’ చేయించా

లని నా భార్య కోరిక. అందుకనే వెంటనే బయలుదేరాము. పరమాచార్యుల వారి అనుగ్రహంతో మేము ‘శ్రీనివాస కల్యాణం’ చేయించాలని అనుకుంటున్నాము” అని చెప్పాడు.

పరమాచార్య స్వామివారు అతనివైపు చూడనుకూడా లేదు. కనీసం అతని మాటలు కూడా వినలేదు. చుట్టూ ఉన్నవారితో ఎంతో ఉత్సాహంగా మాట్లాడుతున్నారు, కాని దాదాపు అరగంటపాటు మార్గబంధు శాస్త్రితో మాట్లాడలేదు.

స్వామివారికి గుర్తుచేయాలని “శాస్త్రి అక్కడ నిలబడి ఉన్నారు” అని మరలా చెప్పాడు బాలు.

‘పరమాచార్య స్వామివారు నన్ను ఆశీర్వదించి, తిరుమలకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాళ నన్ను ఇలా నిర్లక్ష్యం చేస్తున్నారని’ తలచి, “అవును. పెరియవా నన్ను అనుగ్రహించాలి. ‘శ్రీనివాస కల్యాణం’ చేయించడానికి ఈరోజే తిరుమలకు వెళ్తున్నాను” అని అర్థించాడు.

వెంటనే మహాస్వామివారు లేచి, “ముందు పద్మావతీ  కల్యాణం చెయ్యి” అని చెప్పి లోపలకు వెళ్ళిపోయారు. దీనంతటినీ గమనిస్తున్న అక్కడున్నవారికి ఇది విపరీతంగా తోచింది.

‘శ్రీనివాస కల్యాణం’ అంటే ‘పద్మావతీ  కళ్యాణమే’ కదా! అంటే “తిరుమలలో శ్రీనివాస కల్యాణం చేయించేవారందరూ తిరుచానూరు వెళ్లి పద్మావతీ కల్యాణం చేయించమనా స్వామి వారి ఆదేశం”

దీనికి అర్థమేంటో మార్గబంధు శాస్త్రికి కూడా అర్థం కాలేదు. “ఎందుకు పరమాచార్య స్వామివారు ఇటువంటి ఆదేశాన్ని ఇచ్చి లోపలకు వెళ్ళిపోయారు” అని ఆలోచిస్తూ నిలబడిపోయాడు. కాని వెంటనే దాని అర్థమేంటో, అంతరార్థమేంటో స్వామివారే స్ఫురింపచేశారు.

మరో రెండు నెలలు గడిచిపోయాయి. పరమ సంతోషం నిండిన మొహంతో రామస్వామి అయ్యర్ పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చాడు. తన కుమార్తె పెళ్లి పత్రికను స్వామివారికి సమర్పించడానికి వచ్చాడు ఈసారి.

“అంతా పరమాచార్య స్వామివారి అనుగ్రమ వల్లనే. నా కుమార్తె పెళ్లి ఖర్చు మొత్తం భరించడానికి మా అన్న ఒప్పుకున్నాడు. కేవలం కన్యాదానం చెయ్యడం మాత్రమే నా బాధ్యత అని మిగినదంతా తను చూసుకుంటానని నాతో చెప్పాడు. కొబ్బరితోట పైన వేసిన కోర్టుకేసు కూడా వెనక్కుతీసుకున్నాడు. నా చిన్న కుమారునికి ఉపనయనం చేసి, తన శిష్యునిగా తీసుకుంటానని చెప్పాడు. మా అన్నయ్య ఇలా మారిపోతాడని నా కలలో కూడా అనుకోలేదు. ఇదంతా పరమాచార్య స్వామివారి అనుగ్రహం వల్లనే సాధ్యమయ్యింది” అని చెప్పుకుంటూపోయాడు. కాని పరమాచార్య స్వామివారు ఎలా అనుగ్రహించారో అతనికి తెలియదు.

మహాస్వామివారు చెయ్యెత్తి ఆశీర్వదించి, ప్రసాదం ఇచ్చి పంపారు. రామాస్వామి అయ్యర్ బయటకు రాగానే, మరలా బాలు తారసపడ్డాడు. “రామస్వామి! ఏంటి నీ చేతిలో? పెళ్లి పత్రికా? నీ కుమార్తెదా? నీవద్ద ఒక్క పైసా కూడా లేదని చెప్పావు కదా?” అని అడిగి, రామస్వామి ఇచ్చిన పత్రిక తీసుకున్నాడు.

ఇది ఇలా ఉంది, “. . . . . సౌభాగ్యవతి పద్మావతి, మరవక్కాడు జగదీశ్వర శాస్త్రి మనవరాలు, నా తమ్ముడు చిరంజీవి రామస్వామి పెద్ద కుమార్తె. . .” చివరన ఇట్లు “మీ భవదీయుడు, మార్గబంధు శాస్త్రి”

బాలు ఆశ్చర్యంతో నోట మాటరాక నిశ్చేష్టుడయ్యాడు.

రెండు నెలల క్రితం పరమాచార్య స్వామివారు మార్గబంధు శాస్త్రికి చెప్పినదానికి అర్థం ఇదా! రామస్వామి అన్న ఈయనే అని స్వామివారికి తెలిసి ఉండవచ్చు. కాని రామస్వామి పెద్ద కుమార్తె పేరు పద్మావతి అని ఎలా తెలుసు?

పరమాచార్య స్వామివారికి అంతా తెలుసు అన్న నిజంలో ప్రత్యేకత ఏమి లేదు. ఆ ప్రత్యక్ష దైవానికి అనుగ్రహించడం తప్ప ఇంకేం తెలుసు. ఇటువంటి అనుగ్రహానికి పాత్రులైన ఆ భక్తులు ఎంతటి యశస్సును పొందుతారో మనం ఊహించగలమా?

కరుణాసముద్రుల కరుణ నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది.

--- “శ్రీ శ్రీ శ్రీ మహాపెరియవా మహిమై” పత్రిక నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

t.me/paramacharyavaibhavam

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

Monday, April 20, 2020

యధార్ధ సంఘటన

Birth centenary of 'Father of India's Space programs'! Dr Vikram ...

అది 1970 వ సంవత్సరం. తిరువనంతపురం ( నేటి త్రివేడ్రం) సముద్రపు ఒడ్డున ఒక పెద్దమనిషి భగవద్గీత పఠనములో ఉన్నాడు. అక్కడికి ఒక నాస్తికుడైన ఒక కుర్రవాడు వచ్చి ఆయన పక్కన కూర్చున్నాడు.



ఆ కుర్రాడు ఈ పెద్దమనిషినితో " ఈకాలంలో కూడా ఇలాంటి పుస్తకాలు చదవడం వలన , మీరంతా మూర్ఖులుగా మిగులుతున్నారు. మాకు సిగ్గుగా ఉన్నది" అని రెచ్చగొడుతూ మాట్లాడము మొదలుపెట్టాడు.

పైగా " మీరే కనుక ఇలాంటి పుస్తకాలు చదవకుండా సైన్సు పుస్తకాలు చదువుతూంటే, మనదేశం ఈపాటికి చాలా అభివృద్ధి సాధించి ఉండేది " అని ఆవేశంతో అన్నాడు.

ఆ పెద్దమనిషి ఆ కుర్రవాని పరిచయం అడిగాడు. అప్పుడా కుర్రవాడు " నేనొక కలకత్తానుండి వచ్చిన సైన్స్ పట్టభద్రుడిని. ఇక్కడ భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్లో పనిచేయటానికి వచ్చాను " అని గర్వంగా చెప్పాడు.

" మీరు వెళ్ళి ఈ భగవద్గీత లాంటి పుస్తకాలు చదవకుండా సైన్సు మీద పుస్తకాలు చదవమని, ఇలాంటి పుస్తకాలు చదవడం వలన జీవితంలో సాధించేది ఏదీ ఉండదని " ఓ ఉచిత సలహా కూడా ఇచ్చాడు.

ఆ పెద్దమనిషి నవ్వి, అక్కడనుండి వెళ్ళడానికి ఉపక్రమించాడు. ఆయన అలా లేవగానే నలుగురు రక్షక దళ భటులు ఆయనను చుట్టుముట్టి, ఆయనకు రక్షణగా నిలబడ్డారు. ఆయన కోసం ఒక అధికార ఎర్రబుగ్గ కారు వచ్చింది. ఇదంతా చూసి, ఆ కుర్రవాడు భయపడి, ఆ పెద్దమనిషిని " మీరెవరూ " అనడిగాడు. ఆ పెద్దమనిషి తనపేరు " విక్రం సారాభాయి" చెప్పాడు. అంటే, అప్పటికి ఆ కుర్రవానికి తను పనిచేయబోయే సంస్థకు ఆయన చైర్మన్ అని అర్ధం అయ్యింది.

ఆ సమయానికి భారతదేశంలో 13 రీసెర్చ్ సంస్థలు, విక్రం సారాభాయి పేరుమీద నడుస్తున్నాయి. అణువిజ్జాన పధకాలు రచించే సంస్థకు ఆయన అధిపతి. ఆయనను ప్రధాని ఇందిరాగాంధీ స్వయంగా దానికి నియమించింది.

అప్పుడు ఆ కుర్రవాడు వలవలా ఏడుస్తూ, ఆయన కాళ్ళమీద పడ్డాడు. అప్పుడు కీ.శే. విక్రం సారాభాయి చెప్పిన గొప్ప విషయం ఇది.

" ఈ విశ్వంలో ప్రతి వస్తువు పరమాత్మచే సృష్టించబడినదే. అది పురాణకాలం కావచ్చును. మహాభారత సమయం కావచ్చు. ప్రస్తుత సమయం కావచ్చును. మిత్రమా !! దైవాన్ని ఎప్పుడూ మరువకు. " అని బోధించాడు.

ఇప్పటి నాస్తికులు ప్రతిదీ హేతువాదం , అంటూ డాంబికముగా కరాళ నృత్యాలు చేయవచ్చును. కానీ సైన్సును అభివృద్ది చేసినది మటుకు ఆస్తికులే అని చరిత్ర చెపుతోంది. దైవం నిత్య సత్యం. భగవద్గీత ఒక అమోఘమైన విజ్జాన శాస్త్రము. దానిని ఎవరూ తప్పుబట్టలేరు. దానిలో చెప్పినది ఆచరించి ప్రపంచంలో ఎందరో లాభము పొందుతున్నారు. ప్రపంచములో ఉన్న సమస్యల కన్నిటికీ భగవద్గీతలో పరిష్కారాలున్నాయి.

శ్రీమత్భగవద్గీత సకలశాస్త్ర సారం !
శ్రీ కృష్ణం వందే జగద్గురుం !!

Friday, April 17, 2020

కమలాపండు రసం తాగు

What Life has taught Me : Paramacharya talks about Himself…



1957 అక్టోబరు 10న డిఫెన్స్ అకౌంట్స్ డిపార్టమెంట్ లో అప్పర్ డివిజన్ క్లార్క్ గా చేరడానికి నేను పూణే వెళ్ళాల్సిఉంది. పరమాచార్య స్వామివారు పశ్చిమ మాంబళంలోని రామకృష్ణపురంలో మకాం చేస్తున్నారని అనుకోకుండా నాకు తెలిసింది. అప్పుడు నేను ప్యాంటు చొక్కా వేసుకున్నాను. అవకాశం వాడులుకోరాదని అలాగే వెళ్లి 1957 అక్టోబరు 9న స్వామివారి దర్శనం చేసుకున్నాను. చొక్కా తెసివేసి స్వామివారికి ప్రణమిల్లాను. వారి ఆశీస్సులతో పూణేకు ప్రయాణమయ్యాను. ఇప్పుడు క్లాస్ ఒన్ ఉద్యోగిగా పదవీవిరమణ చేశాను.

1968లో మా చెల్లెలి ఆరోగ్యం క్షీణించి తంజావూరు మెడికల్ హాస్పిటల్ లో తనని చేర్పించాము. తంజావూరు నుండి పూణేకు తిరిగివెళ్తూ పరమాచార్య స్వామివారి దర్శనానికి వెళ్లాను. అప్పుడు స్వామివారు మౌనంలో ఉన్నారు. వారి సేవకుల ద్వారా కొన్ని పళ్ళు సమర్పించి నా చెల్లెలి పరిస్థితిని స్వామివారికి తెలిపాను. మహాస్వామివారు ఒక కమలాపండును తీసుకుని దాన్ని మా చెల్లెలికి ఇమ్మని ఆదేశించారు. నేను పూణేకు వెళ్తున్నానని, తంజావూరుకు వెళ్ళడం లేదని స్వామివారికి చెప్పాను. ఆ కమలాపండును రసం తీసి తన బాగుకోసం నన్ను తాగమని ఆజ్ఞాపించారు. నేను పూణే చేరుకోగానే మా చెల్లెలి ఆరోగ్యం మెరుగై, ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చిందని ఉత్తరం వచ్చింది. ఇది నాకు చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. ఎందుకంటే, నేను తంజావూరు నుండి వచ్చేటప్పుడు తనపై ఆశలు వదులుకోవాలని చెప్పారు అక్కడి వైద్యులు.

1985లో నేను యాభైలోకి అడుగుపెడుతున్నప్పుడు నా భార్య, అత్తగారితో కలిసి పరమాచార్య స్వామి దర్శనానికి వెళ్లాను. నా భార్య తాతగారైన కల్యాణపురం అడ్వకేట్ నవనీతం సారంగపాణి అయ్యంగార్, 1920లలో కుంబకోణం మఠంలో పరమాచార్య స్వామివారికి పెద్ద భక్తులు. నా భార్య వారి పేరు చెప్పగానే, కొద్దిసేపు మౌనం. ఆశ్చర్యకరంగా వెంటనే స్వామివారు తనని పిలిచి, సారంగపాణి అయ్యంగార్ తో జరిగిన ఎన్నో విషయాలను తెలిపి, మా గురించిన విషయాలను అడిగి ఆశీర్వదించారు. పరమాచార్య స్వామివారికి కొన్ని వేలమంది భక్తులు ఉన్నప్పటికీ, యాభై ఏళ్ల తరువాత ఒకరి గురించి ఇంతగా చెబుతున్నారంటే ఇది నిజంగా నమ్మశక్యం కాదు.

--- ఆర్. కృష్ణన్, I.D.A.S(రిటైర్డ్). “kamakoti.org” నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం