Wednesday, August 19, 2020

సాల్వ వధ

 Ancient Aircraft (Vimana) and Parachute by King Salwa in Bhagavata ...


 ఈ కథ మహాభారతం అరణ్యపర్వం ప్రథమాశ్వాసంలో ఉంది. అన్ని కథల కన్నా ఈ కథకు ఒక ప్రత్యేకత ఉంది. దుర్యోధనుడు నిండుసభలో ద్రౌపదిని, పాండవులను అవమానించటం, అంతకంటే ముందు పాండవులు, కౌరవులు జూదం ఆడటం, ఆ జూదంలో అన్యాయంగా కౌరవులు పాండవులను ఓడించి ద్రౌపది వస్త్రాపహరణం, పాండవుల అరణ్యవాసం ఇలాంటి దుష్కృత్యాలు ఎన్నెన్నో సంభవించాయి. అయితే పాండవుల పక్షపాతిగా నిరంతరం వారిని వెన్నంటి ఉన్న శ్రీకృష్ణుడు పాండవులను జూదం ఆడకుండా ఎందుకు నివారించలేకపోయాడు అనే ప్రశ్నకు శ్రీకృష్ణుడే సమాధానం చెప్పిన సందర్భం ఈ కథలో ఉంది.

జూదంలో ఓడిపోయి అరణ్యాల పాలైన పాండవులు కామ్యకవనానికి చేరుకున్నారు. అక్కడకి శ్రీకృష్ణుడు వచ్చి పాండవుల యోగక్షేమాలను విచారించాడు. తాను సాల్వుడు అనే శిశుపాలుడి సోదరుడితో పదినెలల పాటు యుద్ధం చేస్తున్న కారణంగా తనకు పాండవులు జూదానికి వెళ్ళిన సంగతికానీ మరి ఏ ఇతర విషయాలు కానీ తెలియలేదని, సాల్వుడిని సంహరించిన తర్వాత యుధానుడు తనకు ఈ విషయమంతా చెప్పాడని వెంటనే తనకు పాండవులను చూడాలనిపించి కామ్యకవనానికి వచ్చానని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు.

శ్రీకృష్ణుడు చెప్పిన మాటలను విని ఎంతో ఆశ్చర్యానికి లోనైన ధర్మరాజు తనకు సాల్వవధ ఇతివృత్తాన్ని వివరించి చెప్పమన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ యుద్ధానికి సంబంధించిన పూర్వాపరాలన్నింటినీ ధర్మరాజుకు వివరిస్తూ శిశుపాలుడి తమ్ముడైన సాల్వుడు తాను శిశుపాలుడిని సంహరించినందుకు తనమీద ఎంతో క్రోధాన్ని పెంచుకున్నాడని కృష్ణుడు చెప్పాడు. సాల్వుడికి సౌంభకం అనే కామగమనం గల ఒక నగరం ఉండేదని ఆ నగరంతో సహా సాల్వుడు ఎదురువచ్చి ద్వారకా నగర పరిసరాలలో శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని కృష్ణుడిని సంహరిస్తానని పెద్దపెద్దగా కేకలు పెడుతుండగా యాదవ కుమారులు సాల్వుడి మీదకు దండెత్తి వెళ్ళారు. వారిలో చారుధేష్ణుడు, ప్రద్యుమ్నుడు, సాంబుడు తదితరులను సాల్వుడి సేనాపతి అయిన క్షేమవృద్ధి ఎదిరించాడు. సాంబుడు వాడిని తన బాణపు దెబ్బలతో ఏడిపించాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక క్షేమవృద్ధి పారిపోగా వేగవంతుడు అనే మరొకడు వచ్చి సాంబుడి మీద విరుచుకుపడ్డాడు. అప్పుడు చారుదేష్ణుడు వేగవంతుడిని ఎదిరించి వధించాడు. ఆ తర్వాత విలంత్యుడు అనే వాడిని కూడా చారుదేష్ణుడు వధించటంతో సాల్వుడు ఉగ్రుడై తన మహాసేనతో అక్కడికి వచ్చాడు. అప్పుడు ప్రద్యుమ్నుడికి సాల్వుడికి ఘోరయుద్ధం జరిగింది. ప్రద్యుమ్నుడు దివ్యాస్త్రంతో వాడిని సంహరించబోగా నారదుడు తదితర మునులు అక్కడికి వచ్చి తొందర పడవద్దని సాల్వుడి మరణం శ్రీకృష్ణుడి చేతిలోనే ఉందని చెప్పటంతో ప్రద్యుమ్నుడు వాడిని వదిలివేశాడు. యాదవ కుమారులను సాల్వుడు ఇలా ఎదురిస్తూ ద్వారకానగరాన్ని ముట్టడిస్తున్నాడన్న సంగతి ధర్మరాజు చేస్తున్న రాజసూయయాగంలో ఉన్న శ్రీకృష్ణుడికి తెలిసింది. యాగం పరిసమాప్తి అయిన తర్వాత సాల్వుడి వధకు కృష్ణుడు పూనుకున్నాడు. అంతేగాక వాడిని సంహరించి కానీ ద్వారకలో అడుగుపెట్టనని కృష్ణుడు శపథం చేసి తన పాంచజన్యాన్ని పూరించి శిశుపాలుడి తమ్ముడైన సాల్వుడు ఉన్న మూర్తికావత దేశం మీదకు అసంఖ్యాక చతురంగ బలాలతో వెళ్ళాడు. అయితే సాల్వుడు తన కామగమనం గల నగరం సౌంభకంతో సహా సముద్రకుక్షి దేశానికి వెళ్ళాడు. కృష్ణుడు కూడా అక్కడికే వెళ్ళి వారితో ఘోరయుద్ధానికి తలపడ్డాడు. సాల్వుడు తన సౌంభకాన్ని ఎక్కి శ్రీకృష్ణుడితో ఎన్నోరకాలుగా మాయాయుద్ధం చేశాడు. కృష్ణుడి మీద శిలావర్షాన్ని కురిపిస్తుండటంతో కృష్ణుడు తన వజ్రబాణాల చేత ఆ శిలావర్షాన్ని నిరోధించాడు. వాడు తన నగరంతో సహా ఆకాశంలో మాయమై దొంగచాటుగా యుద్ధం చేస్తుండటంతో చివరకు ఇక సహించలేక కృష్ణుడు తన చక్రాయుధాన్ని వాడిమీదకు సంధించాడు. అది ఆకాశంలో ఉన్న సౌంభకంలోని సాల్వుడిని సంహరించింది. వెంటనే సౌంభక నగరంతో సహా సాల్వుడు నేలకూలాడు.

* * *

పదినెలల పాటు శ్రీకృష్ణుడు తాను ఇలా ఘోరాతి ఘోరంగా సాల్వుడితో యుద్ధం చేసి వాడిని సంహరించి కానీ ద్వారకకు చేరుకోలేదని ఈ కారణంగానే పాండవుల విషయాలు ఏవీ తనకు తెలియకుండా పోయాయని చెప్పాడు. ఆ తర్వాత కృష్ణుడు పాండవులందరికీ ధైర్యవచనాలు చెప్పి తన చెల్లెలైన సుభద్రను, మేనల్లుడైన అభిమన్యుడిని రధం మీద ఎక్కించుకొని ద్వారకా నగరానికి తీసుకువెళ్ళాడు. అలాగే ద్రౌపది సోదరుడైన దృష్టద్యుమ్నుడు ద్రౌపదికి పాండవుల అయిదుగురి వల్ల కలిగిన ఉపపాండవులను తీసుకొని ద్రుపది నగరానికి వెళ్ళిపోయాడు. ఈ కారంణంగానే మిగిలిన అరణ్య, అజ్ఞాతవాస సమయాలలో సభద్ర, అభిమన్యుడు, ఉపపాండవుల ప్రస్తావన మనకు కనిపించదు.

Friday, August 14, 2020

భాగవతంలో వానరం

 Hindu Blog - The Story of Balarama and Monkey Dvividha... | Facebook

రామాయణంలో వానర సేనా వాహని శ్రీరామచంద్రుడికి సహాయం చేసి రామ కార్యాన్ని నెరవేర్చింది. భారతంలో భీమసేనుడు సౌగంధికా పుష్పాన్ని తెచ్చే సందర్భంలో ఆంజనేయుడు భీముడికి ప్రత్యక్షమై ఆ తర్వాత అర్జునుడి రథానికి ‘జెండాపై కపిరాజు’గా నిలిచాడు. ఇలా రామాయణ, భారతాల్లో వానర ప్రస్తావన కనిపిస్తుంది. కానీ భాగవతంలో దైవానికి సహాయకారిగా కాక అపకారిగా పరిణమించబోయి ప్రాణాలను కోల్పోయిన మరో వానరం కథ ఉంది. భాగవత మహాపురాణంలో బలరాముడి బలపరాక్రమాల విజృంభణను వివరించే కథలలో ఇది ప్రధానమైనది.

శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించి లోక కళ్యాణ కారకుడయ్యాడు. నరకాసురుడి స్నేహితులకు, బంధువర్గానికి మాత్రం ఇది ప్రాణాంతకంగా పగను రగిల్చిన సంఘటనగానే గుర్తుండిపోయింది. నరకుడి స్నేహితులలో ప్రధానుడు, మహాబలశాలి అయిన వానరుడు ఒకడుండేవాడు. అతడి పేరు ద్వివిదుడు. వాడు చాలా గర్విష్టి. శరీరబలంలో తనను మించినవాడు ఇంకొకడు ఎవడూ లేదన్నది వాడి భావన. తన స్నేహితుడైన నరకుడ్ని చంపినందుకు కృష్ణుడి మీద పగతీర్చుకోవాలని అనుకుని ద్వారకా నగరంలో ఒక రోజున ప్రవేశించాడు. పల్లెలను తగలబెట్టడం, నదులన్నింటినీ ఇంకిపోయేలా చెయ్యటం, పశువుల మందలను నాశనం చెయ్యటం, అగడ్తలను పూడ్చివేయటం ఇలా ఎన్నెన్నో అకృత్యాలు అక్కడ చేయసాగాడు. వాడి చేష్టలు సామాన్య ప్రజలకు కూడా అతి భయంకరంగా మారాయి. చేతికి దొరికిన మనుషులందరినీ చావబాది కాళ్ళూ చేతులు కట్టివేసి గుహలలో తోసి పెద్దపెద్ద బండరాళ్ళు అడ్డుపెడుతూ ఉండేవాడు. ఇలా శ్రీకృష్ణుడు పరిపాలిస్తున్న ప్రాంతమంతా వాడి చేష్టలకు అల్లకల్లోలమయింది. ఒకరోజున వనంలో తన స్త్రీజన పరివారంతో విలాసంగా కాలం గడుపుతున్న బలరాముడి దగ్గరకు ద్వివిదుడు వచ్చాడు. తన కోతి చేష్టలతో ఎన్నెన్నో రకాలుగా అక్కడ ఉన్నవారిని ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. కోతి చేష్టలు మరీ విపరీతం కావడంతో బలరాముడు తనకు సమీపంలో ఉన్న ఒక పెద్దరాయిని తీసి ద్వివిదుడి మీదకు విసిరికొట్టాడు. అయితే వాడు ఆ రాయి దెబ్బను తప్పించుకోవటమే కాక బలరాముడి పక్కనే ఉన్న మద్యంతో నిండివున్న భాండాన్ని తీసుకుని చెట్టుమీదకు ఎగిరి కూర్చుని దాన్ని నేలమీదకు విసిరికొట్టాడు. బలరాముడికి ఎంతో ప్రియమైన మద్యం నేలపాలయింది. అంతలోనే ఆ వానరుడు అక్కడ ఉన్న స్త్రీజనం చీరలను చింపటం, మెడలో హారాలను తెంచటం లాంటి పనులను చేసి బలరాముడి కోపం ప్రజ్వరిల్లేలా ఎన్నెన్నో కోతి చేష్టలను ప్రదర్శించాడు. ఇక బలరాముడు ఆగలేక తన ఆయుధాలైన నాగలి, రోకలిని చేతపట్టుకుని ఆ కోతి వెంటపడ్డాడు. ఆ దెబ్బతో ద్వివిదుడికి మరింత కోపం వచ్చి అక్కడ ఉన్న ఒక చెట్టును ­డపెరికి బలరాముడి మీదకు విసిరాడు. బలరాముడు దెబ్బతిన్న రేచులాగా ఒక్క ఉదుటున లేచి తన చేతిలో ఉన్న రోకలిని గిరగిరాతిప్పి ఆ వానరుడి మీదకు విసిరాడు. ఆ దెబ్బతో వాడు కిందపడి మూర్ఛిల్లాడు. మరికొద్దిసేపటికి తెప్పరిల్లుకున్న వాడు మరొక చెట్టును పీకి బలరాముడి మీదకు విసిరాడు. అయితే బలరాముడు దాన్ని తన నాగిలిని అడ్డంపెట్టి ముక్కలు ముక్కలు చేశాడు. వానరుడు విసురుతున్న రాళ్ళన్నీ బలరాముడి రోకలి దెబ్బలకు నుగ్గునుగ్గు అయ్యాయి. ఇలా కొద్దిసేపు గడిచిన తర్వాత బలరాముడు ముందుకు ఉరికి బిగించిన తన పిడికిలితో ఆ వానరుడి మెడమీద ఒక్క పోటు పొడిచాడు. ఆ దెబ్బతో వాడి ప్రాణాలు గాలిలో కలిశాయి. రైవతక పర్వత ప్రాంతమంతా వాడు పెట్టిన చావుకేకకు దద్దరిల్లింది. ఇలా భాగవతంలో శ్రీకృష్ణుడి అన్న బలరాముడి చేతిలో ద్వివిదుడు అనే దుష్టబుద్ధిగల వానరుడు హతుడయ్యాడు.