Friday, August 14, 2020

భాగవతంలో వానరం

 Hindu Blog - The Story of Balarama and Monkey Dvividha... | Facebook

రామాయణంలో వానర సేనా వాహని శ్రీరామచంద్రుడికి సహాయం చేసి రామ కార్యాన్ని నెరవేర్చింది. భారతంలో భీమసేనుడు సౌగంధికా పుష్పాన్ని తెచ్చే సందర్భంలో ఆంజనేయుడు భీముడికి ప్రత్యక్షమై ఆ తర్వాత అర్జునుడి రథానికి ‘జెండాపై కపిరాజు’గా నిలిచాడు. ఇలా రామాయణ, భారతాల్లో వానర ప్రస్తావన కనిపిస్తుంది. కానీ భాగవతంలో దైవానికి సహాయకారిగా కాక అపకారిగా పరిణమించబోయి ప్రాణాలను కోల్పోయిన మరో వానరం కథ ఉంది. భాగవత మహాపురాణంలో బలరాముడి బలపరాక్రమాల విజృంభణను వివరించే కథలలో ఇది ప్రధానమైనది.

శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించి లోక కళ్యాణ కారకుడయ్యాడు. నరకాసురుడి స్నేహితులకు, బంధువర్గానికి మాత్రం ఇది ప్రాణాంతకంగా పగను రగిల్చిన సంఘటనగానే గుర్తుండిపోయింది. నరకుడి స్నేహితులలో ప్రధానుడు, మహాబలశాలి అయిన వానరుడు ఒకడుండేవాడు. అతడి పేరు ద్వివిదుడు. వాడు చాలా గర్విష్టి. శరీరబలంలో తనను మించినవాడు ఇంకొకడు ఎవడూ లేదన్నది వాడి భావన. తన స్నేహితుడైన నరకుడ్ని చంపినందుకు కృష్ణుడి మీద పగతీర్చుకోవాలని అనుకుని ద్వారకా నగరంలో ఒక రోజున ప్రవేశించాడు. పల్లెలను తగలబెట్టడం, నదులన్నింటినీ ఇంకిపోయేలా చెయ్యటం, పశువుల మందలను నాశనం చెయ్యటం, అగడ్తలను పూడ్చివేయటం ఇలా ఎన్నెన్నో అకృత్యాలు అక్కడ చేయసాగాడు. వాడి చేష్టలు సామాన్య ప్రజలకు కూడా అతి భయంకరంగా మారాయి. చేతికి దొరికిన మనుషులందరినీ చావబాది కాళ్ళూ చేతులు కట్టివేసి గుహలలో తోసి పెద్దపెద్ద బండరాళ్ళు అడ్డుపెడుతూ ఉండేవాడు. ఇలా శ్రీకృష్ణుడు పరిపాలిస్తున్న ప్రాంతమంతా వాడి చేష్టలకు అల్లకల్లోలమయింది. ఒకరోజున వనంలో తన స్త్రీజన పరివారంతో విలాసంగా కాలం గడుపుతున్న బలరాముడి దగ్గరకు ద్వివిదుడు వచ్చాడు. తన కోతి చేష్టలతో ఎన్నెన్నో రకాలుగా అక్కడ ఉన్నవారిని ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. కోతి చేష్టలు మరీ విపరీతం కావడంతో బలరాముడు తనకు సమీపంలో ఉన్న ఒక పెద్దరాయిని తీసి ద్వివిదుడి మీదకు విసిరికొట్టాడు. అయితే వాడు ఆ రాయి దెబ్బను తప్పించుకోవటమే కాక బలరాముడి పక్కనే ఉన్న మద్యంతో నిండివున్న భాండాన్ని తీసుకుని చెట్టుమీదకు ఎగిరి కూర్చుని దాన్ని నేలమీదకు విసిరికొట్టాడు. బలరాముడికి ఎంతో ప్రియమైన మద్యం నేలపాలయింది. అంతలోనే ఆ వానరుడు అక్కడ ఉన్న స్త్రీజనం చీరలను చింపటం, మెడలో హారాలను తెంచటం లాంటి పనులను చేసి బలరాముడి కోపం ప్రజ్వరిల్లేలా ఎన్నెన్నో కోతి చేష్టలను ప్రదర్శించాడు. ఇక బలరాముడు ఆగలేక తన ఆయుధాలైన నాగలి, రోకలిని చేతపట్టుకుని ఆ కోతి వెంటపడ్డాడు. ఆ దెబ్బతో ద్వివిదుడికి మరింత కోపం వచ్చి అక్కడ ఉన్న ఒక చెట్టును ­డపెరికి బలరాముడి మీదకు విసిరాడు. బలరాముడు దెబ్బతిన్న రేచులాగా ఒక్క ఉదుటున లేచి తన చేతిలో ఉన్న రోకలిని గిరగిరాతిప్పి ఆ వానరుడి మీదకు విసిరాడు. ఆ దెబ్బతో వాడు కిందపడి మూర్ఛిల్లాడు. మరికొద్దిసేపటికి తెప్పరిల్లుకున్న వాడు మరొక చెట్టును పీకి బలరాముడి మీదకు విసిరాడు. అయితే బలరాముడు దాన్ని తన నాగిలిని అడ్డంపెట్టి ముక్కలు ముక్కలు చేశాడు. వానరుడు విసురుతున్న రాళ్ళన్నీ బలరాముడి రోకలి దెబ్బలకు నుగ్గునుగ్గు అయ్యాయి. ఇలా కొద్దిసేపు గడిచిన తర్వాత బలరాముడు ముందుకు ఉరికి బిగించిన తన పిడికిలితో ఆ వానరుడి మెడమీద ఒక్క పోటు పొడిచాడు. ఆ దెబ్బతో వాడి ప్రాణాలు గాలిలో కలిశాయి. రైవతక పర్వత ప్రాంతమంతా వాడు పెట్టిన చావుకేకకు దద్దరిల్లింది. ఇలా భాగవతంలో శ్రీకృష్ణుడి అన్న బలరాముడి చేతిలో ద్వివిదుడు అనే దుష్టబుద్ధిగల వానరుడు హతుడయ్యాడు.