Monday, November 14, 2016

శ్రీశైలే మల్లికార్జునం

Image result for srisaila mallikarjuna
శ్రీశైల మల్లికార్జునుడు



అందరికీ నమస్కారం


ఈ రోజు రెండవ జ్యోతిర్లింగమూర్తి ఐన శ్రీశైలమల్లికార్జునస్వామి గురించి తెలుసుకుందాము. శ్రీశైల క్షేత్రం చాలా విశిష్టమైనది కారణం జ్యోతిర్లింగక్షేత్రమవ్వడంతోపాటూ ఇది శక్తిపీఠం కూడా. ఇలా జ్యోతిర్లింగమూర్తి శక్తిపీఠంతో కలిసి ఉన్న క్షేత్రాలు మూడే మూడు. విశ్వేశ్వర విశాలాక్షులు వారణాశిలో, మహాకాళేశ్వరమహాకాళికలు ఉజ్జైనిలో మళ్ళీ భ్రరమరాంభామల్లికార్జునులు శ్రీశైలంలో. అందుకే ఇది దక్షిణకైలాసమని అని కూడా అంటారు. శ్రీశైలప్రాంతం భూమికి నాభి భాగమని చెబుతారు, భౌగోళికంగానే కాదు పారమర్ధికంగానూ ఈ శైవక్షేత్రానిది కీలకమైన స్థానం కాశీ మకుటాయమానమైతే శ్రీశైలాం హృదయసమానమైనది. ఆలాంటి శ్రీశైలక్షేత్రం గురించి ఎంత క్లుప్తంగా చెప్పాలన్న ఒక్క టపా చాలదు. ప్రస్తుత విషయం తాత్విక పరిశీలన కనుక కేవలం దానినే ప్రస్తావించుకొందాం. ఈ క్షేత్రానికి అనేక స్థలపురాణగాధలున్నాయి, వాటిలో కొన్ని వ్యత్యాసాలున్నప్పటికీ అన్నిటిలోనూ కనిపిచ్చే కధమాత్రం ఒకటుంది. పూర్వం శిలాదుడనే మహర్షి పరమేశ్వరుడి గురించి ఘోరతపస్సు చేసి పుతృలను వరంగా అడుగగా నందీశ్వరుడు, పర్వతుడు అనే ఇద్దరిని శివుడు ప్రసాదించాడు. నందీశ్వరుడు స్వామికి వాహనంకాగా పర్వతుడు తండ్రిలాగా మరల తపస్సు చేసి శివసాక్షాత్కారం పొందాడు. శివుడు మెచ్చి సాయుజ్యముక్తిని అనుగ్రహించాడు. అదిపొందినా పర్వతుడు మరొక వరాన్ని కోరాడు అదేమిటంటే తనకే కాదు లోకంలో అందరూ ముక్తిని పొందాలి, అందరూ తరించాలి అని. అందుకని తను శైల రూపధారియై ఉండగా స్వామి తన పై కొలువై ఉండి భక్తులను అనుగ్రహించాలని. ఈ మాటకు పరమశివుడు పరవశించిపోయాడు. అతిప్రసన్నుడై కేవలం తనుమాత్రమే కాదు ముక్కోటి దేవతలూ, సకల ఓషధులూ, సకల తీర్ధాలు కూడా తనపై ఉంటారని వరమిచ్చాడు. ఆవిధంగా జ్యోతిర్లింగ ఆవిర్భావం జరిగిందని స్కాందపురాణంలో ఉంది. సహజంగా ప్రకృతి మాతృత్వ సున్నితత్వం కలది కనుక పుష్పంతో పురుషుడిని తుమ్మెదతో పోల్చటం పరిపాటి. కానీ ఇక్కడ స్వామి పుష్ప రూపమైతే అమ్మవారు తుమ్మెద రూపంలో విరాజిల్లడం చాలా గమ్మత్తైన విషయం. మా నాన్నగారు ఇక్కడ ఉద్యోగం చెయ్యడం వల్ల రెండు పర్యాయాలు సందర్శించే భాయం కలిగింది. ఆలయప్రాంగణం చుట్టూ నాగమల్లి వృక్షాలు తుమ్మెదల ఝుంకారాలూ చూడచ్చు, వినచ్చు.

ఇక తాత్విక విషయాలకొస్తే..

"శ్రీ" అన్న పదానికి లక్ష్మి అని లోకప్రసిద్ధం. కానీ చాలా మంది అనుకునేది లక్ష్మి సిరిసంపదలకు అధిష్టాన దేవత అని. నిజానికి ఈశ్వరుడే అసలైన శాస్వత ఐశ్వర్యాలనిస్తాడు. "ఈశ్వరస్య భావం ఐశ్వర్యం" అని అమరకోశం వ్యాక్ష్యానించింది. ఈశ్వరుడు నాకున్నాడన్న భావనొక్కటే ఐశ్వర్యం మిగిలినవేవీ కావు. మరి లక్ష్మో? లక్ష్మి అర్ధాన్ని ఇస్తుంది. చతుర్విదపురుషార్ధాలో  "అర్ధం" ఇచ్చేది ఆవిడ. ఉదాహరణకి కిమర్ధం ? అంటే దేనికోసం అని అర్ధం. అర్ధం అంటే ప్రయోజనం అన్నమాట. సర్వకామన సఫలీకృతార్ధం అంటే కోరికలన్నీ ఈడేరడం అందు"కోసం" అనే కదా. అదీ ప్రయోజనమే. జీవనయానంలో ప్రయోజనలాననిచ్చి ధర్మమికంగా కామనలు తీర్చుకొని మోక్షగాములవ్వడానికి సహాయపడుతుంది. అర్ధ కామాలు అసలు ప్రయోజనం కానే కావు. కానీ అసలు లక్ష్మి దేనినిస్తుంది, లేక లక్ష్మిని మనం ఏమి అడగాలి అంటే. భక్తికి అధిష్టాన దేవత ఆవిడే కనుక భక్తినే మనం అడగలసి ఉంటుంది. తను ఆసీనురాలైన కమలం ఎలా సూర్యుడిని చూసి విచ్చుకొంటుందో, మన మనస్సుకూడా ఆ స్వయంప్రకాశమైన పరమాత్మ ప్రకాశాన్ని గుర్తించి అలా విచ్చుకొనేలా చేస్తుంది. అందుకే "కమలాసనస్థితా లక్ష్మీ:". శ్రీ అంటే మరి భక్తే కనుక శ్రీకారం చుట్టడమంటే ఏ విష్యాన్ని ప్రారంభించే ముందైనా దాని యందు శ్రద్ధాభక్తులను అలవరచుకోడమే ఔతుంది. ఇక "శ్రీశైలం" అంటే కొండంత భక్తి అని తర్జుమా ఔతుంది. 

భక్తికి రాశీభూతమే ఆ పర్వతుడు. పర్వతుడిది లోకహితం కోరే పరిపక్వమైన భక్తే కాకపోతే తంకు ముక్తినిచ్చాకా కూడా ఇంక అడదగాడిని వేరు వరమేముంటుంది ? ఈ పరిపక్వతే పరమేశ్వరుడి ప్రీతినిస్తుంది.తత్ ఫలితంగా తనే కాదు కైసాలమే కదలివచ్చింది.

సాధకుడి హృదయకమలం బాగా విరిసి భక్తి అనే తేనె స్రవిస్తుంటే గండుతుమ్మెదలు రాకుండా ఉంటాయా ? అదే భ్రమరాంబికా అవతార విశేషం.

"శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే" శిఖరమనగా కొన, చివర, పతాకస్థాయి. శ్రీశైలమే రాశీభూతమైన భక్తి కనుక భక్తిలో పతాకస్థాయిని సాధకుడు చూస్తే ఇక మళ్ళీ జన్మంటూ ఉండదు. నిజమైన భక్తి పర్వతుడిలా వర్ణ, వర్గ, జాతి, మత, తర, తమ, లింగ, వయోభేదాలకతీతంగా అందరినీ ఒక్కటిగా చూసే స్థితినిస్తుంది. అదే కైవల్యము. భగవాన్ రమణులు కూడా ఆయనకు అన్న పానాదుల్లో ఏమాత్రం ఇతరులకన్నా ప్రాతినిధ్యమిచ్చినా కోపగించుకొనే వారు. ఆయనతో సహా అందరినీ ఒకే రీతిలో చూడాలని చెప్పేవారుట. అదే శ్రీశైల శిఖరం.

ఓం నమశ్శివాయ: