Tuesday, June 4, 2019

చిన్నపిల్లలు తప్పు చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత పెద్దలదే

చిన్నపిల్లలు తప్పు చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత పెద్దలదేనని, ఆ బాధ్యతను మరచినపుడు చిన్నపిల్లలు చేసిన తప్పు వల్ల కలిగే ఫలితానిన పెద్దలు అనుభవించాల్సి వస్తుందని జనమేజయుడి జీవితంలో జరిగిన సంఘటన వివరిస్తుంది.





భారతీయ సంప్రదాయ సాహిత్యంలో శ్రవ్యకావ్యాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది. ఒకరు చెపుతుంటే మరొకరు వినే కావ్యాలను శ్రవ్య కావ్యాలంటారు. సంప్రదాయ కావ్యాలైన రామాయణ, భారత, భాగవతాలకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క వక్త, శ్రోత ఉన్నారు. పంచమ వేదంగా ప్రసిద్ధిచెందిన మహాభారతానికి వైశంపాయనుడు వక్తగా, జనమేజయుడు శ్రోతగా ఉన్నారు. పాండవమధ్యముడైన అర్జునుడికి మునిమనుమడు జనమేజయుడు. సుభద్రా, అర్జునులకు అభిమన్యుడు జన్మించాడు. అభిమన్యుడికి, ఉత్తరకు కొడుకుగా పరీక్షిత్తు జన్మించాడు. పరీక్షిత్తుకు, మాద్రవతికి జన్మించినవాడే మహాభారత శ్రోత అయిన జనమేజయుడు. జనమేజయుడు కురుక్షేత్రంలో దీర్ఘ సత్రయాగం చేస్తున్న సమయంలో ఒకనాడు ‘సరమ’ అనే ఒక కుక్క తన కొడుకు ‘పారమేయుడు’ను వెంట పెట్టుకొని దేవలోకం నుండి అక్కడికి వచ్చింది. పారమేయుడిని చూసిన జనమేజయుడి సోదరులు శ్రుతసేనుడు, భీమసేనుడు, ఉగ్రసేనుడనే ముగ్గురు చిన్నపిల్లల చేష్టలుగా దానిని హింసించారు. 

అది వెంటనే వెళ్ళి తనకు జరిగిన అవమానాన్ని తల్లి సరమతో చెప్పింది. సరమ, రాజైన జనమేజయుడి దగ్గరకు వెళ్ళి ఓ రాజా నీ సోదరులు నిష్కారణంగా నా కొడుకుని బాధించారు. రాజు సోదరులైనంత మాత్రాన ఇలా అమాయకులను బాధించటం న్యాయం కాదు కదా. దీనికి ప్రతిగా సాధు ప్రాణులకు బాధను కలిగించిన పాపానికి మీకు తగిన భయకారణమన కష్టాలు కలుగును కాక అని పలికి అంతర్ధానమైపోయింది. సరమ మాటలను విన్న జనమేజయ మహారాజుకు ముందు ఆశ్చర్యం కలిగింది. కానీ ఆ తరువాత దాని శాపం నుంచి విముక్తి పొందటానికి తన పురోహితుల సలహాను తీసికొని దీర్ఘ సత్రయాగం అయిపోయిన తర్వాత శుత్రశ్రవణుడు అనే ముని వద్దకు వెళ్ళి ఆయనను ప్రార్ధించి తపో నిష్టాపరుడైన ఆయన కుమారుడు సోమశ్రవణుడుని తన పురోహితునిగా పంపమని అతనిచేత యజ్ఞయాగాలను చేయించి తన సోదరులు చేసిన అపరాధానికి, శాంతిని కలిగించుకున్నాడు. సోమశ్రవణుడిని చేరటానికి జనమేజయ మహారాజు ఎన్నెన్నో కష్టాలను అనుభవిస్తూ ముని ఆశ్రమాలను వెదకవలసి వచ్చింది. పిల్లలు తప్పు దోవలో నడిస్తే దీని ఫలితాన్ని పెద్దలు అనుభవించవలసి వస్తుందని జనమేజయుడి కథ వివరిస్తోంది.











- శ్రీ యల్లాప్రగడ మల్లికార్జున రావు గారు

- సేకరణ ఈనాడు దినపత్రిక నుంచీ