Saturday, June 15, 2019

సుద్యుమ్నుడు - ఇళ



Image result for sudyumna

సంసార జీవితంలో భార్యా, భర్త, ఇద్దరూ ఒక మాట మీదనే నిలబడి ఒక బాటలోనే నడవాలని అలా కాని పక్షంలో భవిష్యత్తు విచిత్రమైన మార్పులు పొందుతూ ఉంటుందని అవి వారి సంతానాన్ని ఇబ్బందులకు గురిచేస్తాయనే విషయాన్ని సుద్యుమ్నుడి కథ తెలుపుతుంది. అలాగే భారతం కేవలం పురాణ గ్రంథమే కాదని అందులో ఈనాడు వైద్య, శాస్త్ర సాంకేతిక రంగాలలో మనకు కనిపిస్తున్న ఎన్నో అద్భుతాలు ఆనాటి వారు ­హ మాత్రంగానయినా ఆలోచించగలిగారనే విషయాన్ని మహాభారతంలోని కథ, సాహిత్యం వివరిస్తోంది. వైవశ్యత మనువు భార్య శ్రద్ధాదేవి, వైవశ్యత మనువు తన భార్యతో కలిసి పుత్రకామేష్టియాగం ప్రారంభించాడు. శ్రద్ధాదేవికి తనకు కూతురు జన్మిస్తే బాగుండుననే అభిప్రాయం కలిగింది. ఒక రోజున ఆమె యాగం చేస్తున్న హోత వద్దకు వెళ్ళి నమస్కరించి తనకు కూతురు కలిగేలా యాగం చేయమని ప్రార్థించింది. ప్రార్థనను మన్నించి హోమం చేశారు. పుత్రకామేష్టి పూర్తయిన తర్వాత శ్రద్ధాదేవికి కూతురు జన్మించింది. 

                           ఆ శిశువుకు ‘ఇళ’ అని పేరు పెట్టారు. కానీ వైవశ్యత మనువు యజ్ఞ బ్రహ్మ వశిష్టుడి వద్దకు వెళ్ళి పుత్రుడికి బదులుగా పుత్రిక జన్మించిందని తన కోరిక ఎందుకు భగ్నమైందని అడిగాడు. వశిష్టుడు దివ్యదృష్టితో జరిగినదంతా తెలిసికొని తన శక్తితో ఇళను బాలుడిగా మార్చాడు. ఆ బాలుడికి సుద్యుమ్నుడు అని పేరు పెట్టారు. సుద్యుమ్నుడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఒకనాడతడు తన మంత్రిగణంతో వేటకు వెళ్ళి చాలాసేపు సింహాలను, పులులను వేటాడి అలసి ఆ సమీపంలో ఉన్న ఒక కొలనులో ఉన్న నీటిని తాగారు. వెంటనే సుద్యుమ్నుడు, అతడి పరివారం గుర్రాలతో సహా ఆడవారిగా మారిపోయారు. దానికి కారణం పూర్వం ఆ ప్రాంతంలో పురుష సంచారాన్ని నిషేధిస్తూ పార్వతి కోరిక మేరకు పరమేశ్వరుడు శాపం ఇవ్వడమే. సుద్యుమ్నుడు అతడి పరివారం స్త్రీలుగా మారడంతో తిరిగి తమ రాజ్యానికి వెళ్ళలేక అక్కడక్కడ తిరగడం ప్రారంభించారు. ఒకనాడు అక్కడికి సమీపంలో ఉన్న బుధుడి ఆశ్రమానికి వెళ్ళడం తటస్థించింది. బుధుడి కొడుకైన చంద్రుడు రాజస్త్రీగా ఉన్న సుద్యుమ్నుడి (ఇళ) మీద మనసు పడ్డాడు. వారిద్దరి సమాగ ఫలితంగా కొన్నాళ్ళకు వారికి పురూరవుడు జన్మించాడు. కొంత కాలం గడిచిన తరువాత సుద్యుమ్నుడు తనకు బాల్యంలో ఆడరూపు పోగొట్టి మగరూపు తెప్పించిన వశిష్టుని తలుచుకున్నాడు. 

                    వశిష్టుడు అక్కడికి వచ్చి విషయం తెలుసుకున్నాడు. తన శిష్యుడు ప్రస్తుతం ఉన్న ఆడ రూపును పోగొట్టి మగ రూపును ప్రసాదించమన్న కోరికను తీర్చలేక శివుడిని గురించి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై పార్వతికి ఇచ్చిన మాటను తోసివేయక వశిష్టుని కోరికను కాదనలేక ఉభయ తారకంగా ఉండే విధంగా ఒక మాసం మగవాడుగా, ఒక మాసం ఆడదిగా సుద్యుమ్నుడు ఉండే విధంగా అనుగ్రహించి అంతర్థానమయ్యాడు. సుద్యుమ్నుడు అప్పటికి ఆనందించి తిరిగి రాజ్యానికి వెళ్ళి పురుష రూపంగా ఉన్నప్పుడు మాత్రమే రాజ్య పరిపాలన చేయడం ప్రారంభించాడు. ఆ కాలంలో సుద్యుమ్నునకు.. ఉత్కళుడు, గయుడు, విమలుడు అను ముగ్గురు కుమారులు కలిగారు. వారు ఉత్తరరాజ్య భాగాలకు రాజులయ్యారు.  తమ రాజు కొన్ని మాసాలు మాత్రమే పరిపాలన చేస్తుండడం ప్రజలకు వింత అనిపించి ఆనోటా ఆ నోటా అసలు విషయం తెలుసుకున్నారు. ఈ లోగా సుద్యుమ్నుడి కొడుకు పురూరవుడు పెరిగి పెద్దవాడయ్యాడు. సుద్యుమ్నుడు ప్రజలు తనను గురించి అనుకునే పలు రకాల మాటలు వినలేక సుద్యుమ్నునకు ఈ జీవితమంటే రోత పుట్టింది. అతను తన పుత్రుడు పురూరవునకు ప్రతిష్ఠానపుర రాజ్య సింహాసనం  అప్పగించి తపోవనాలకు వెళ్లిపోయాడు.  సుద్యుమ్నుడి తల్లిదండ్రులు ఏకాభిప్రాయం కలిగి ఉండకపోవడం ఈ కథలోని ఇన్ని మార్పులకు, సుద్యుమ్నుడి మనోవేదనకు కారణమైంది.




- శ్రీ యల్లాప్రగడ మల్లికార్జున రావు గారు
- సేకరణ ఈనాడు దినపత్రిక నుంచీ

No comments:

Post a Comment