Friday, April 17, 2020

కమలాపండు రసం తాగు

What Life has taught Me : Paramacharya talks about Himself…



1957 అక్టోబరు 10న డిఫెన్స్ అకౌంట్స్ డిపార్టమెంట్ లో అప్పర్ డివిజన్ క్లార్క్ గా చేరడానికి నేను పూణే వెళ్ళాల్సిఉంది. పరమాచార్య స్వామివారు పశ్చిమ మాంబళంలోని రామకృష్ణపురంలో మకాం చేస్తున్నారని అనుకోకుండా నాకు తెలిసింది. అప్పుడు నేను ప్యాంటు చొక్కా వేసుకున్నాను. అవకాశం వాడులుకోరాదని అలాగే వెళ్లి 1957 అక్టోబరు 9న స్వామివారి దర్శనం చేసుకున్నాను. చొక్కా తెసివేసి స్వామివారికి ప్రణమిల్లాను. వారి ఆశీస్సులతో పూణేకు ప్రయాణమయ్యాను. ఇప్పుడు క్లాస్ ఒన్ ఉద్యోగిగా పదవీవిరమణ చేశాను.

1968లో మా చెల్లెలి ఆరోగ్యం క్షీణించి తంజావూరు మెడికల్ హాస్పిటల్ లో తనని చేర్పించాము. తంజావూరు నుండి పూణేకు తిరిగివెళ్తూ పరమాచార్య స్వామివారి దర్శనానికి వెళ్లాను. అప్పుడు స్వామివారు మౌనంలో ఉన్నారు. వారి సేవకుల ద్వారా కొన్ని పళ్ళు సమర్పించి నా చెల్లెలి పరిస్థితిని స్వామివారికి తెలిపాను. మహాస్వామివారు ఒక కమలాపండును తీసుకుని దాన్ని మా చెల్లెలికి ఇమ్మని ఆదేశించారు. నేను పూణేకు వెళ్తున్నానని, తంజావూరుకు వెళ్ళడం లేదని స్వామివారికి చెప్పాను. ఆ కమలాపండును రసం తీసి తన బాగుకోసం నన్ను తాగమని ఆజ్ఞాపించారు. నేను పూణే చేరుకోగానే మా చెల్లెలి ఆరోగ్యం మెరుగై, ఆసుపత్రి నుండి ఇంటికి వచ్చిందని ఉత్తరం వచ్చింది. ఇది నాకు చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. ఎందుకంటే, నేను తంజావూరు నుండి వచ్చేటప్పుడు తనపై ఆశలు వదులుకోవాలని చెప్పారు అక్కడి వైద్యులు.

1985లో నేను యాభైలోకి అడుగుపెడుతున్నప్పుడు నా భార్య, అత్తగారితో కలిసి పరమాచార్య స్వామి దర్శనానికి వెళ్లాను. నా భార్య తాతగారైన కల్యాణపురం అడ్వకేట్ నవనీతం సారంగపాణి అయ్యంగార్, 1920లలో కుంబకోణం మఠంలో పరమాచార్య స్వామివారికి పెద్ద భక్తులు. నా భార్య వారి పేరు చెప్పగానే, కొద్దిసేపు మౌనం. ఆశ్చర్యకరంగా వెంటనే స్వామివారు తనని పిలిచి, సారంగపాణి అయ్యంగార్ తో జరిగిన ఎన్నో విషయాలను తెలిపి, మా గురించిన విషయాలను అడిగి ఆశీర్వదించారు. పరమాచార్య స్వామివారికి కొన్ని వేలమంది భక్తులు ఉన్నప్పటికీ, యాభై ఏళ్ల తరువాత ఒకరి గురించి ఇంతగా చెబుతున్నారంటే ఇది నిజంగా నమ్మశక్యం కాదు.

--- ఆర్. కృష్ణన్, I.D.A.S(రిటైర్డ్). “kamakoti.org” నుండి

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం